దౌత్య పరీక్ష!
ABN, First Publish Date - 2023-10-31T02:53:41+05:30
ఖతార్‌లో ఉరిశిక్షపడిన ఎనిమిదిమంది నావికాదళ మాజీ అధికారులను రక్షించుకొనేందుకు భారతదేశం అన్ని ప్రయత్నాలూ చేస్తుందని కేంద్ర విదేశాంగమంత్రి జైశంకర్ ప్రకటించారు...
ఖతార్‌లో ఉరిశిక్షపడిన ఎనిమిదిమంది నావికాదళ మాజీ అధికారులను రక్షించుకొనేందుకు భారతదేశం అన్ని ప్రయత్నాలూ చేస్తుందని కేంద్ర విదేశాంగమంత్రి జైశంకర్ ప్రకటించారు. సోమవారం తనను కలసిన బాధిత కుటుంబీకులకు ప్రభుత్వం ఈ అంశానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని, వారి విడుదలకు కృషిచేస్తుందని హామీ ఇచ్చినట్టు ట్విటర్ వేదికగా మంత్రి చేసిన ఈ ప్రకటన, సదరు కుటుంబాలవారికి ఎంతో ధైర్యాన్నిస్తుంది. ఏడాదికాలంగా జైల్లో ఉంటూ, ఇప్పుడు హఠాత్తుగా ఉరిశిక్షపడిన ఈ అధికారులకు న్యాయం దక్కేట్టుగా చేసి, అవసరమైన పక్షంలో ఉన్నతస్థాయి జోక్యంతో మరణం అంచునుంచి బయటపడవేయడం భారతదేశానికి కత్తిమీద సామే.
ఖతార్‌కు మనకు మధ్య అనాదిగా ఉన్న సత్సంబంధాలు, ఆర్థికలావాదేవీల నేపథ్యంలో, మిగతా రోజుల్లో అయితే, ఈ కేసు విషయంలో భారతదేశం ప్రయత్నాలు చేయడం మరింత సులభయ్యేదేమో. ఇప్పుడు ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంతో మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మారిన తరువాత, భారతదేశ ప్రయత్నాలపై వీటి ప్రభావం కూడా ఎంతోకొంత ఉండవచ్చును. ఆదినుంచీ ఈ కేసు గోప్యంగానే ఉంటూ వచ్చింది. దోహాలో ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న ఈ మాజీ సైనికాధిరులంతా ఇటలీనుంచి ఖతార్ సమకూర్చుకున్న ఒక జలాంతర్గామిపై ఆ దేశ సైనికసిబ్బందికి శిక్షణనిస్తున్న దశలో అరెస్టయ్యారు. ఈ జలాంతర్గామికి సంబంధించిన కీలకమైన వివరాలు ఇజ్రాయెల్‌కు చేరవేశారన్నది ఆరోపణ. భారతదేశంలో నావికాదళంలో ఎంతో అంకింతభావంతో పనిచేసి అత్యున్నతస్థానాలకు ఎదిగి మంచిపేరు సంపాదించుకున్న వీరు ఇలా ఓ గల్ఫ్‌దేశంలో గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కోవాల్సి రావడం, మరణశిక్షకు గురికావడం ప్రభుత్వాన్నే కాదు, ప్రజలను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది. పైగా, అల్‌దహ్రా గ్లోబల్ సంస్థ యజమానులను కూడా అరెస్టు చేసిన ఖతార్ అధికారులు ఆ తరువాత వారిని మాత్రం వదిలివేయడం మరింత ఆశ్చర్యం కలిగించే విషయం. ఖతార్ ప్రాథమిక కోర్టులో పలు విడతల్లో ఈ ఎనిమిదిమంది భారతీయులపై విచారణ జరిగిందని అంటున్నారు తప్ప, ఆరోపణలు ఏమిటో, ఈ ప్రక్రియలో వారికి తగిన న్యాయసాయం అందిందో లేదో తెలియదు. గత తొమ్మిదినెలలుగా ఖతార్ కానీ, భారతదేశం కానీ ఈ కేసు వివరాలను బయటకు చెప్పకపోవడంతో దీనిచుట్టూ ఊహాగానాలే ఎక్కువగా సాగాయి.
ఉరిశిక్షపడిన అధికారులకు పై కోర్టులు రెండింటిలో అప్పీలు చేసుకోగలిగే అవకాశం ఇంకా ఉంది. ఈ ప్రక్రియ సానుకూల ఫలితాన్ని ఇవ్వనిపక్షంలో ఖతార్ ఎమీర్‌ను వారు ఆశ్రయించవచ్చు. క్షమాభిక్ష లేదా, ఉరిశిక్షను యావజ్జీవంగా మార్చగలిగే అధికారం ఆయనకు ఉన్నందున ఒకవేళ న్యాయప్రక్రియలో విఫలం చెందినప్పటికీ, ఉన్నతస్థాయి దౌత్యప్రయత్నాల ద్వారా ఈ అధికారులను భారతదేశం కాపాడవచ్చునని అంటున్నారు. ఈద్, ఖాతార్ జాతీయ దినోత్సవమైన డిసెంబరు 18 సందర్భాల్లో మాత్రమే ఈ క్షమాభిక్ష ఉంటుంది. అందువల్ల, ఖతార్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ న్యాయప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు, ఉన్నతస్థాయి దౌత్యయత్నాలతో మరోపక్క క్షమాభిక్షను కూడా సాధించే ఆలోచనలో భారత్ ఉన్నట్టు చెబుతున్నారు. ప్రస్తుతం మరణశిక్షపడిన ఈ అధికారులు పై కోర్టుల్లో నిర్దోషులుగా తేలితే అంతకంటే సంతోషించాల్సిదేమీ లేదు. ఒకవేళ యావజ్జీవంగా మారినా, 2015లో ఇరుదేశాల మధ్యా కుదిరిన ఒప్పందం ప్రకారం మిగతాశిక్షాకాలాన్ని భారతదేశంలో పూర్తిచేసుకొనేందుకు వీలుగా వారిని స్వదేశం తీసుకురావచ్చు. మరణశిక్ష ఏ దశలోనైనా యావజ్జీవంగా మారినప్పుడు మాత్రమే ఇది సాధ్యపడుతుంది. ఖతార్‌కు మనకు బలమైన ఆర్థిక, వాణిజ్య సంబంధాలున్నాయి. భారతదేశానికి అవసరమైన సహజవాయువులో నలభైశాతం దానినుంచే దిగుమతి అవుతున్నది. వేలాది భారతీయ కంపెనీలు అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తుంటే, దాదాపు ఏడులక్షలమంది అక్కడ విభిన్నరంగాల్లో పనిచేస్తూ ఖతార్ ఆర్థికవ్యవస్థకు వెన్నుదన్నుగా ఉన్నారు. ఆ దేశం సైతం ఇక్కడ వివిధరంగాల్లో, ఫండ్లలో పెట్టుబడులు పెట్టింది. వివిధ సందర్భాల్లో తన మత, రాజకీయ, భౌగోళిక ప్రయోజనాల రీత్యా ఖతార్ వైఖరి మనను ఇబ్బంది పెట్టినప్పటికీ, ద్వైపాక్షిక సంబంధాలు దానితో మెరుగ్గానే ఉన్నాయి. గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) తనను వెలివేసినప్పుడు ఆహారం సహా అనేక ఉత్పత్తులను విమానాల్లో తరలించి ఆదుకున్న భారతదేశాన్ని ఈ కష్టకాలంలో ఒడ్డునపడవేసేందుకు ఆ దేశం ఎంతమాత్రం సందేహించకూడదు.
Updated Date - 2023-10-31T02:53:41+05:30 IST