అంతా మాయ!
ABN, First Publish Date - 2023-04-21T01:09:36+05:30
‘ఈరోజు బిల్కిస్, రేపు మరొకరు. దేశంలోని నా సోదరీమణులకు ఏం జరుగుతోందోనని భయంగా ఉంది’ అంటూ నాలుగురోజుల క్రితం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జోసెఫ్ బిల్కిస్ బానో కేసులో...
‘ఈరోజు బిల్కిస్, రేపు మరొకరు. దేశంలోని నా సోదరీమణులకు ఏం జరుగుతోందోనని భయంగా ఉంది’ అంటూ నాలుగురోజుల క్రితం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జోసెఫ్ బిల్కిస్ బానో కేసులో వ్యాఖ్యానించారు. గోధ్రా అనంతర మారణకాండలో అత్యాచారానికి గురైన ఆమె చేసిన సుదీర్ఘ న్యాయపోరాటంవల్ల నిందితులకు శిక్షపడితే, గుజరాత్ ప్రభుత్వం వారికి రెమిషన్ ఇచ్చి ముందుగానే విడుదల చేయడంపైన సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా తీవ్రవ్యాఖ్యలు చేసింది. గర్భవతిని గ్యాంగ్ రేప్ చేసి, ఆమె బంధువులను ఊచకోతకోసిన కేసు భయంకరమైనదనీ, దానిని సాధారణ హత్యకేసుతో పోల్చలేమని, పదకొండుమంది నిందితులకు రెమిషన్ ఇవ్వాలని ఏ ప్రాతిపదికన నిర్ణయించారో తెలియచెప్పే పత్రాలు సమర్పించవలసిందేనని ధర్మాసనం గుజరాత్ ప్రభుత్వాన్ని నిలదీసింది. శిక్ష ఉపశమనానికి సంబంధించిన విధాన పత్రాలు కోర్టుకు ఇవ్వకూడదని నిర్ణయించుకున్న గుజరాత్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ, తీరును తప్పుబడుతూ, కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని హెచ్చరిస్తూ దారికి తెచ్చేందుకు సుప్రీంకోర్టు చేస్తున్న ప్రయత్నం న్యాయంమీద నమ్మకాన్ని పెంచే రీతిలో ఉంది. జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే క్రమంలో నిందితులకు శిక్షవేస్తే, పాలకులు అడ్డుతోవలో దానిని వమ్ముచేస్తే, తిరిగి న్యాయం చేయడానికి సర్వోన్నత న్యాయస్థానం సంకల్పించినందుకు చాలామంది సంతోషిస్తున్నారు. కానీ, గోధ్రా మారణకాండకు సంబంధించిన మరో కేసులో గురువారం అలహాబాద్ కోర్టు ఒకటి ఇచ్చిన తీర్పు న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని వమ్ముచేసేవిధంగా ఉన్నందుకు బాధపడుతున్నారు.
అరవైమంది కరసేవకులతో అయోధ్యనుంచి తిరిగివస్తున్న సబర్మతీ ఎక్స్‌ప్రెస్ దహనం ఘటన మర్నాడు, గుజరాత్‌లో జరిగిన ప్రధానమైన తొమ్మిది ఊచకోత ఘటనల్లో నరోదాగామ్ ఒకటి. ముస్లింలు ఉన్న ఈ ప్రాంతం మీద విరుచుకుపడి, వారి ఇళ్ళను తగులపెట్టినందున పదకొండుమంది ఇక్కడ సజీవదహనమైనారు. ఈ ఘటన జరిగిన రెండుదశాబ్దాల తరువాత, గురువారం అలహాబాద్ ప్రత్యేక న్యాయస్థానం తన తీర్పులో అరవైఏడుమంది నిందితులూ అమాయకులేనని ప్రకటించింది. న్యాయస్థానం నిర్దోషులుగా తేల్చినవారిలో నరేంద్రమోదీ మంత్రివర్గంలో స్త్రీశిశుసంక్షేమశాఖ నిర్వహించిన మాయా కొద్నానీ, బజ్‌రంగ్‌దళ్ నాయకుడు బాబూ బజ్రంగీ, విశ్వహిందూపరిషత్ నేత జయదీప్ పటేల్ కూడా ఉన్నారు. ఈ రెండుదశాబ్దాల కాలంలో ఈ కేసు పలురీతుల్లో బలహీనపడింది. నిందితుల్లో 17మంది మరణించారు. ఆరుగురు న్యాయమూర్తులు మారారు. ఒకాయనను బదిలీచేశారు. కేసు విచారణ తిరిగి మొదలైంది. మాయా కొద్నానీ రక్తక్షేత్రంలో ఉంటూ, మూకలను రెచ్చగొట్టారన్నది అభియోగం కనుక, ఆమె అక్కడలేరని చెప్పేందుకు అమిత్ షా స్వయంగా కోర్టుకు వచ్చారు.
గృహదహనాలు, సజీవదహనాలు, దాడులతో వందలాదిమంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయేట్టు చేసిన ఈ దారుణఘటనకు కారకులు ఎవరూ లేరని కోర్టు ఇప్పుడు తేల్చేసింది. ఇక్కడకు మూడుకిలోమీటర్ల దూరంలో ఇంతకంటే మరింత ఘోరకలి జరిగి, వందమంది ముస్లింలు ఊచకోతకు గురైన నరోదాపాటియా కేసులో 2012లో ట్రయల్ కోర్టు కొద్నానీ, బజ్రంగీలకు జీవితఖైదు విధిస్తే, ఈ కోర్టు ‘కింగ్‌పిన్’గా అభివర్ణించిన ఆమెను తరువాత గుజరాత్ హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. 2019లో బజ్రంగీ బెయిల్ మీద బయటకు వచ్చేశారు. నరోదా పాటియా ప్రాంతంలో ఇంకా భయంకరమైన అల్లర్లు జరుగుతున్నందునే, నరోదాగావ్‌లో ప్రజలను కాపాడలేకపోయామని పోలీసులు చెప్పారట. కానీ, బీజేపీ, విహెచ్‌పి, బజ్రంగ్‌దళ్ నాయకులు కార్యక్షేత్రంలో నిలిచి మారణకాండను ప్రోత్సహిస్తుంటే, పోలీసులు ఉద్దేశపూర్వకంగా ముస్లింలను వారికిబలిపెట్టారని నానావతి కమిషన్ వ్యాఖ్యలు తెలియచెబుతాయి.
సుప్రీంకోర్టు పర్యవేక్షణలో, దాని ఆదేశాలమేరకు ఏర్పడిన సిట్, అనేకమంది బాధితుల ఆవేదనలు విని, వందలాదిమంది ప్రత్యక్షసాక్షుల అభిప్రాయాలు సేకరించిన కేసు ఇది. అతివేగంగా దర్యాప్తు సాగాలన్న సర్వోన్నత న్యాయస్థానం అభీష్ఠానికి భిన్నంగా, పదమూడేళ్ళక్రితం ఆరంభమై ఇప్పుడు నిందితులంతా అమాయకులేనన్న తీర్పుతో ముగిసింది. ఊచకోతల తరువాత కూడా ఎన్నికల్లో ఘనవిజయాలు సాధించి, కొంతకాలం పాటు పదోన్నతులు పొందిన కొద్నానీ రాజకీయ పునరాగమనానికి ఇక ఏ అడ్డంకీ ఉండకపోవచ్చు. బిల్కిస్‌కు న్యాయం చేయాలనుకుంటున్న సర్వోన్నతన్యాయస్థానం, తన పర్యవేక్షణలో నడస్తున్న ఇటువంటి కేసుల్లో న్యాయం జరుగుతోందో లేదో గమనిస్తే బాగుండును.
Updated Date - 2023-04-21T01:09:36+05:30 IST