ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గగనయానానికి తొలి అడుగు

ABN, First Publish Date - 2023-10-25T02:16:01+05:30

రోదసిలోకి వ్యోమగాములను పంపేందుకు ఉద్దేశించిన గగన్‌యాన్‌ ప్రాజెక్టులో ఇస్రో శాస్త్రవేత్తలు తొలిపరీక్షను అధిగమించారు. గగన్‌యాన్‌ సన్నాహకాల్లో భాగంగా అత్యంత కీలకమైన ‘టెస్ట్‌వెహికల్‌ అబార్ట్‌ మిషన్‌ (టీవీ–డీ1)’...

రోదసిలోకి వ్యోమగాములను పంపేందుకు ఉద్దేశించిన గగన్‌యాన్‌ ప్రాజెక్టులో ఇస్రో శాస్త్రవేత్తలు తొలిపరీక్షను అధిగమించారు. గగన్‌యాన్‌ సన్నాహకాల్లో భాగంగా అత్యంత కీలకమైన ‘టెస్ట్‌వెహికల్‌ అబార్ట్‌ మిషన్‌ (టీవీ–డీ1)’ ప్రయోగం ఫలించింది. శ్రీహరికోటనుంచి శనివారం సింగిల్‌ స్టేజ్‌ లిక్విడ్‌ రాకెట్‌ నింగిలోకి దూసుకుపోయిన తరువాత, క్రూ మాడ్యుల్‌ సురక్షితంగా రాకెట్‌నుంచి విడివడి సముద్ర ఉపరితలంమీద వాలింది. రెండేళ్లలో జరగబోయే మానవసహిత అంతరిక్ష యానంలో, ఈ మానవరహిత క్రూ ఎస్కేప్‌ సిస్టమ్‌ (సీఈసీ) పరీక్ష విజయవంతం కావడం కీలకమైన ముందడుగు.

భవిష్యత్తులో అసలు ప్రయోగం చేపట్టినప్పుడు, అనూహ్యమైన అవాంతరాలు ఏర్పడితే వ్యోమగాములను భద్రంగా దించేందుకు ఉద్దేశించిన ప్రక్రియ ఇది. రాకెట్‌ సుమారు 12కిలోమీటర్ల ఎత్తుకు చేరిన తరువాత, అత్యయిక స్థితి (అబార్ట్‌) సిమ్యులేషన్‌కు లోబడి క్రూ మాడ్యుల్‌తో కూడిన సీఈఎస్‌ సురక్షితంగా వేరుపడింది. ఆ తరువాత మాడ్యుల్‌ బంగాళాఖాతంలో పడుతున్న ప్రక్రియ అంతా సున్నితంగా జరిగేందుకు రెండు డ్రోగ్‌ పారాచూట్లు, ఒక భారీ పారాచూట్‌ తోడ్పడ్డాయి. సముద్రజలాల్లో ప్రత్యేక లాంచీల్లో వేచివున్న నౌకాసిబ్బంది క్రూ మాడ్యుల్‌ను సురక్షితంగా ఒడ్డుకుచేర్చారు. సెన్సార్ల ద్వారా ఇప్పుడు సేకరించిన డేటా అంతా మిగతా పరీక్షలు, ప్రయోగాలకు ఎంతో ఉపకరిస్తుంది. ఇప్పుడు ఉపయోగించిన పారాచూట్లను సైతం 16సార్లు పరీక్షించారట. ఇస్రో అభివృద్ధిచేసిన ఘనఇంధన మోటార్లు ఎంతో చక్కని పనితనాన్ని ప్రదర్శిస్తూ రాకెట్‌ అగ్రభాగాన ఉన్న క్రూ ఎస్కేప్‌ వ్యవస్థ మెరుపువేగంతో విడివడేందుకు తోడ్పడ్డాయి. మానవసహిత అంతరిక్ష యానానికి తాను సిద్ధంగా ఉన్నట్టు నిర్థారించుకొనేవరకూ ఇటువంటివే మరిన్ని ప్రయోగాలు ఇస్రో చేపట్టబోతున్నది. ఉదయం 8గంటలకు జరగాల్సిన ఈ ప్రయోగం మొదట వాతావరణం కారణంగా, ఆ తరువాత రాకెట్‌ ఇగ్నిషన్‌ వ్యవస్థలో తలెత్తిన సమస్యవల్లా రెండుగంటల పాటు ఆలస్యమైంది. కేవలం ఎనిమిది సెకన్లముందు ప్రయోగం ఆగిపోయి, అది నిరవధికంగా వాయిదాపడుతుందని అనుకుంటున్న తరుణంలో, శాస్త్రవేత్తలు వేగంగా సమస్యను గుర్తించి, పరిష్కరించడం విశేషం.

12,400 కోట్ల రూపాయల అంచనాతో 2009లో అనుకున్న ఈ ప్రాజెక్టును, 2018లో కేంద్రమంత్రివర్గం సుమారు 9వేల కోట్ల రూపాయల కేటాయింపుతో ఆమోదించింది. సార్వత్రక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, 2018 స్వాతంత్ర్యదినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ 2022లోనే మానవ సహిత అంతరిక్షయానమంటూ ఎర్రకోటనుంచి ప్రకటించారు కూడా. కరోనా మహమ్మారి వల్ల కొంత ఆటంకం ఏర్పడిన మాట అటుంచితే, వ్యోమగాముల భద్రత, సురక్షిత ప్రయాణానికి సంబంధించిన ఇటువంటి కీలక ప్రక్రియల్లో రాటుదేలితే తప్ప ముందుకు సాగలేం. ఇప్పుడు వివిధ ప్రయోగాలు, పరీక్షల అనంతరం తొలి మానవయానం 2025లోనే సాధ్యపడవచ్చునని అంచనా.

ముగ్గురు వ్యోమగాములను 400కిలోమీటర్ల ఎత్తులోని అంతరిక్ష కక్ష్యలోకి పంపి, వారిని క్షేమంగా వెనక్కుతీసుకురావడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. అంగారక యాత్రకంటే, ఇటీవల విజయవంతమైన చంద్రయానం కంటే ఇది ఖరీదైనదే కాక, క్లిష్టతరమైనది కూడా. వ్యోమగాములకోసం భూవాతావరణంతో కూడిన ప్రత్యేక మాడ్యూల్‌ తయారుచేసి, అందులో వారిని భద్రంగా అంతరిక్షంలోకి పంపడం, తిరిగి తేవడం చిన్న విషయమేమీ కాదు. ఈ గగనయానానికి చంద్రయానం మరింత చోదక శక్తినిచ్చింది. చంద్రయానానికి వాడిన బాహుబలి రాకెట్‌ను మరింత ఆధునికీకరించి ఉపయోగించబోతున్నారు. అత్యంత తక్కువ ఖర్చుతో అద్భుత ప్రయోగాలు చేసి విజయం సాధిస్తున్న ఇస్రోను గడువులతో పరుగులుతీయించడం సరికాదు. గతవారం గగనయానం ప్రాజెక్టు సమీక్షలో భాగంగా, 2035నాటికి ప్రత్యేక స్పేస్‌ స్టేషన్‌, 2040నాటికి చంద్రుడిమీద కాలూనడం వంటి లక్ష్యాలు కొన్ని నరేంద్రమోదీ ప్రకటించారు. బడ్జెట్‌లో కోతలు లేకుండా, ఇస్రో కోరుతున్నంత మొత్తం కేటాయించినా కూడా ఈ గడువులోగా వాటిని సుసాధ్యం చేయడం కష్టమైన పనే. 2004లో ఇస్రో విధాన కమిటీ ప్రతిపాదించిన గగనయానం ఇప్పటికీ పరీక్షల దశలో ఉన్నస్థితిలో, ఇటువంటివే మరిన్ని మానవరహిత పరీక్షలు చక్కగా నిర్వహించి, గగనయానాన్ని సాధ్యమైనంత వేగంగా విజయవంతం చేయాలని ఇస్రోను కోరడం సముచితం.

Updated Date - 2023-10-25T02:16:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising