నాలుగు మాటల కోసం..!
ABN, First Publish Date - 2023-07-27T02:24:24+05:30
మణిపూర్ మారణకాండమీద పార్లమెంటులో ప్రధాని నోరువిప్పాలంటూ పట్టుబడుతున్న విపక్ష కూటమి ‘ఇండియా’ మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి సిద్ధపడింది...
మణిపూర్ మారణకాండమీద పార్లమెంటులో ప్రధాని నోరువిప్పాలంటూ పట్టుబడుతున్న విపక్ష కూటమి ‘ఇండియా’ మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి సిద్ధపడింది. అవసరమైన యాభైమంది ఎంపీల మద్దతు ఉండటంతో తేదీ, సమయం ప్రకటిస్తానని స్పీకర్ హామీ ఇచ్చారు. ‘ఇండియా’లోని 26 పార్టీలతో సోమవారం నుంచే కాంగ్రెస్ ఈ దిశగా ప్రయత్నాలు ఆరంభించి, ఏకాభిప్రాయం సాధించిన నేపథ్యంలో, బుధవారం అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ కుమారుడు గౌరవ్ గొగోయ్ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. లోక్ సభలో అధికార, విపక్షసభ్యుల బలాబలాల్లో హస్తిమశకాంతరం ఉన్నది కనుక అవిశ్వాసం నెగ్గుతుందన్న భ్రమలు ఎవరికీ లేవు. అది చిత్తుగా ఓడిపోవడం ఖాయం. కానీ, మణిపూర్ మండిపోతున్నా నెలల తరబడి నోరువిప్పకుండా, సభలో ఆ ఊసెత్తకుండా, చివరకు పార్లమెంటు వెలుపల నాలుగు తడిలేని మాటలు మాట్లాడిన ప్రధానితో నిండు సభలో ఇలాగైనా జవాబు చెప్పించాలన్నది విపక్షాల ప్రయత్నం. మోదీ ‘మన్‌కీ బాత్’ ఏమిటి, అది విపక్షాలకు, మరీ ముఖ్యంగా మణిపూర్ వాసులకు కనీసం ఇప్పటికైనా కాస్తంత ఓదార్పునీ, ఆశ్వాసననీ ఇస్తుందా అన్నది వేరే విషయం.
‘ఇది బలాబలాలకు సంబంధించిన విషయం కాదు, యావత్ ఈశాన్యం మనుగడకు, మిగతా భారతదేశ భద్రతకు సంబంధించినది. మణిపూర్ చిచ్చు పొరుగురాష్ట్రాలకూ వ్యాపిస్తున్నది. అసోం ప్రజలు మిజోలను బెదిరిస్తున్నారు, మణిపూర్‌కు చెందినవారిని మిజోరంలో పొమ్మంటున్నారు. నిమ్మకునీరెత్తినట్టు ఉన్న ప్రభుత్వాన్ని జవాబుదారీ చేయకపోతే దేశానికే ప్రమాదం’ అన్నది గౌరవ్ గొగోయ్ వాదన. తమను పాలకులతో పాటు మిగతాదేశమూ వదిలేసిందన్న నిరాశనూ, అధైర్యాన్ని తొలగించి, మణిపూర్ వాసులకు ‘ఇండియా’ అండగా ఉన్నదన్న భరోసా ఇవ్వడానికే ఈ చర్య అంటున్నాయి విపక్షాలు. ‘ఇండియా’ బలం ఆధారంగా చూసినా, ఒకవేళ అది మరికొన్ని పార్టీలను కూడగట్టగలుగుతుందని అనుకున్నా అవిశ్వాసం ఓడిపోక తప్పదు. పైగా, ఓటమి తరువాత అధికారపక్షం విపక్షపార్టీలను మరింత గర్వంతో, అహంతో బేఖాతరు చేసే ప్రమాదమూ ఉంది. రాహుల్ గాంధీ లేకుండా జరుగుతున్న ఈ చర్చలో విపక్షం నుంచి సమర్థవంతంగా, సాధికారికంగా మాట్లాడగలిగేవారు ఎవరన్నదీ సమస్య తీవ్రత ప్రజల్లోకి ఇంకే విషయంలో ముఖ్యమైనదే.
ఓటమి ఇలా ఖాయమైనప్పటికీ, ఇటీవలే కూటమి కట్టిన ‘ఇండియా’కు తీర్మానంపై చర్చ తాము ఒక్కటేనని చెప్పుకొనేందుకు ఉపకరించవచ్చు. మణిపూర్‌తో పాటు అవి దేశసమస్యలు చాలా ప్రస్తావించవచ్చు. ఎదురుగా కనిపిస్తున్న బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్‌ను చూపుతూ రెజర్లకు జరిగిన అన్యాయాన్నీ, పాలకపక్షం మహిళావ్యతిరేకతను దునుమాడవచ్చు. కేంద్రంలోని అధికారపక్షానికి వ్యతిరేకమని అంటూనే అది తెచ్చిన బిల్లులను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సమర్థిస్తున్న మిగతా పార్టీల గుట్టు సార్వత్రక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మందుగానే రట్టు చేయవచ్చు.
ఒక రాష్ట్రం తగలబడుతున్నప్పుడు దేశప్రధాని నోరువిప్పని సందర్భం దేశచరిత్రలో ఇదే తొలిసారి కావచ్చు. కేవలం ఆయనతో మాట్లాడించడానికి ఒక అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాల్సి రావడమూ ఎప్పుడూ లేనిదే. ఓ చిన్న విడియోక్లిప్‌తో మణిపూర్‌లో జరుగుతున్నదేమిటో దేశానికి తెలియవచ్చిన తరువాత కానీ, ఆయన నోరువిప్పలేదు. అది కూడా సభ వెలుపల, మిగతారాష్ట్రాలను కూడా జోడిస్తూ ఓ బీజేపీ నాయకుడిలాగానే మాట్లాడారు. ‘ఇండియా’ పేరు పెట్టుకున్నందుకు, మణిపూర్ గురించి మాట్లాడమంటున్నందుకు విపక్షాలు ఆయనకు తీవ్రవాద సంస్థల్లాగా కనిపిస్తున్నాయి. ఆయన పార్లమెంటు ముందు మోకరిల్లుతారు. కొత్త భవనం కట్టి, అందులో సెంగోల్ ప్రతిష్ఠించి ధర్మబద్ధపాలన గురించి ఉపన్యసిస్తారు. కానీ, తమ ఏలుబడిలో ఉన్న ఒక రాష్ట్రంలో సాగుతున్న విధ్వంసం గురించి సభలో మాట్లాడితే ఆయన ఇమేజ్ దెబ్బతింటుంది. కనుక, పాలకపక్షం పలు నిబంధనలతోనూ, మిగతా రాష్ట్రాల్లో మహిళలపై జరుగుతున్న హింసను కూడా కలపాలన్న వాదనతోనూ చర్చను అడ్డుకుంటున్నది. ఆ చర్చలో ప్రధాని కాక, హోంమంత్రి పాల్గొంటారంటూ తమ డబుల్ ఇంజన్ సర్కార్ వైఫల్యం దేశ అత్యున్నత చర్చావేదిక మీదకు రాకుండా జాగ్రత్తపడుతోంది.
ఈ నేపథ్యంలో, ఈ తీర్మానం ద్వారా లోక్‌సభ నాయకుడి నుంచి ‘ఇండియా’ జవాబుదారీతనాన్ని సాధించే ప్రయత్నం చేస్తున్నది. సంఖ్యాబలం ఎంత ఉన్నా, ఎన్ని పర్యాయాలు అధికారంలో కొనసాగినా, ప్రజలకు, ప్రతిపక్షాలకు అధికారపక్షం జవాబుదారీగా ఉండాల్సిందే. పాలకుల వైఖరులు, విధానాలు దేశానికి కీడుచేస్తున్నప్పుడు, వారిని నిలదీసే ప్రయత్నం సాగవలసిందే.
Updated Date - 2023-07-27T02:24:24+05:30 IST