గణాంకాలపై గుర్రు
ABN, First Publish Date - 2023-08-01T03:41:06+05:30
కేంద్రఆరోగ్యమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఉంటూ, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలు నిర్వహించే ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ (ఐఐపిఎస్) డైరక్టర్ కెఎస్ జేమ్స్‌ను కేంద్ర ప్రభుత్వం...
కేంద్రఆరోగ్యమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఉంటూ, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలు నిర్వహించే ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ (ఐఐపిఎస్) డైరక్టర్ కెఎస్ జేమ్స్‌ను కేంద్ర ప్రభుత్వం ఇటీవల సస్పెండ్ చేసింది. కొన్నిరంగాల్లో ప్రభుత్వ పనితీరు ఏ మాత్రం బాగులేదని ఈ సంస్థ విడుదల చేసిన సర్వే నిర్థారించడంతో ప్రభుత్వానికి ఆయన మీద ఆగ్రహం కలిగిందని విమర్శలు వస్తున్నాయి. సస్పెన్షన్ వార్త మీద శాస్త్రవేత్తలు, విపక్షాలు మండిపడటంతో, మర్నాడు ప్రభుత్వం ఒక ప్రెస్ నోట్ విడుదలచేసింది. నిధులు, నియామకాలు, రిజర్వేషన్లు ఇత్యాది విషయాల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ జేమ్స్‌పై ఆరోపణలు వెల్లువెత్తడంతో శాఖాపరంగా అంతర్గత దర్యాప్తు జరిపామని, అందులో కొన్ని ప్రాథమికంగా సరైనవి కావడంతో పూర్తిస్థాయి దర్యాప్తులో నిజం నిగ్గుతేలేవరకూ ఆయనను సస్పెన్షన్‌లో పెట్టామన్నది దాని సారాంశం.
కొన్ని ఉపరితల ప్రస్తావనలు తప్ప ఆయనపై వచ్చిన ఫిర్యాదులు ఎటువంటివో, అవి ఏమిటో, అందినది ఎప్పుడో ఈ ప్రకటనలో లేదు. ఆయనపై పాలకులు కక్షకట్టివున్నందున, ఫిర్యాదులు రావడం, అంతర్గత విచారణ జరపడం వంటివి జరిగినా, కమిటీ ఆయనకు క్లీన్‌చిట్ ఇచ్చిందని, కొన్ని ఆరోపణల్లో నిజం ఉన్నదన్న వాదన శుద్ధ అబద్ధమని విపక్షనేతలు, సంస్థకు చెందిన మిగతావారు అంటున్నారు. జేమ్స్ ఏలుబడిలో ఎన్ని నియామకాలు జరిగాయో తెలియదు కానీ, కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి, ఇద్దరు అదనపు కార్యదర్శులు సభ్యులుగా ఉన్న 12మంది కమిటీ ఆధ్వర్యంలో జరిగిన నియామకాలకు ఆయన ఒక్కరినే బాధ్యుడిని చేయడం విచిత్రం.
జాతీయ సర్వే–5లోని పలు రకాల డేటా ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టినందునే జేమ్స్‌ను సస్పెండ్ చేశారని మీడియా విశ్లేషిస్తోంది. ప్రధానంగా, స్వచ్ఛభారత్ మిషన్‌లో భాగంగా దేశం బహిరంగ మలవిసర్జన (ఓడీఎఫ్)నుంచి పూర్తిగా విముక్తమైందని, 60కోట్లమంది ఆ అలవాటుకు దూరమైనారని దానిని ప్రారంభించి ఐదేళ్ళయిన సందర్భంలో 2019 అక్టోబర్ 2న ప్రధాని నరేంద్రమోదీ ఉద్ఘాటించిన నేపథ్యంలో, దేశంలో ఇప్పటికీ దాదాపు ఐదోవంతు కుటుంబాలు మరుగుదొడ్లు లేని కారణంగా ఆరుబయటకే పోతున్నారని ఈ సర్వే నిర్థారించింది. కార్యక్షేత్రంలో స్వచ్ఛభారత్ విఫలమైందన్న ఈ డేటాతో పాటుగా, మోదీ ప్రభుత్వం ఎంతో ఘనంగా చెప్పుకొనే ఉజ్వల్ యోజన గుట్టును కూడా ఇది వమ్ముచేసింది. గ్రామీణ మహిళలకు సబ్సిడీపై వంటగ్యాస్ అందిస్తున్నందున వారికి కన్నీళ్ళు తప్పాయని పాలకులు చెబుతున్న స్థితిలో, 57శాతం ఇళ్ళకు వంటగ్యాస్ సౌకర్యం అందుబాటులేదని సర్వే తేల్చింది. అలాగే, ఆరునెలల నుంచి ఐదుసంవత్సరాల లోపు వయసున్న పిల్లల్లో రక్తహీనత గత సర్వేల్లో కంటే అధికంగా ఉన్నట్టు సర్వే–5లో తేలింది. ‘పోషణ్ అభియాన్’ అంటూ మోదీ ప్రభుత్వం ప్రత్యేక పథకాలు ఆరంభించిన తరువాత కూడా అందుకు భిన్నంగా దేశంలో రక్తహీనత పతాకస్థాయిలో ఉన్నదంటూ ఈ సర్వే చెప్పడం పాలకులకు నచ్చలేదు. ఫిబ్రవరిలో జరిగిన ఐఐపిఎస్ కౌన్సిల్ సమావేశంలో రక్తహీనతకు సంబంధించి సంస్థ ఇచ్చిన డేటా విషయంలో జేమ్స్‌ను ఉద్దేశించి కేంద్ర ఆరోగ్యమంత్రి మాండవీయ తీవ్ర వ్యాఖ్యలు చేశారని, ఇది పశ్చిమదేశాల కుట్రలో భాగమేనా అంటూ ప్రశ్నించారని కొన్ని పత్రికలు రాశాయి. జులై 1నుంచి ఆరంభం కావాల్సిన సర్వే–6లో రక్తహీనతకు సంబంధించిన వివరాలు లేకుండా చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
‘డేటా’ విషయంలో మోదీ ప్రభుత్వం అనాదిగా వ్యవహరిస్తున్న తీరును బట్టి జేమ్స్ సస్పెన్షన్ విషయంలో విపక్షాల విమర్శలను కొట్టిపారేయలేం. వినిమయం, వ్యయం ఇత్యాది అధ్యయనాలను మోదీ ప్రభుత్వం తన మొదటి విడత పాలనాకాలంలోనే వద్దనుకుంది. 2019 జనవరిలో దేశంలో నిరుద్యోగితను నిర్థారించే డేటాను విడుదల చేయకుండా, సార్వత్రక ఎన్నికలు ముగిసేవరకూ దానిని దాచివుంచింది. ప్రభుత్వ చర్యను నిరసిస్తూ నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్‌కు చెందిన పలువురు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. జేమ్స్ ఆధ్వర్యంలో ఐఐపిఎస్ ఎంతో చురుకుగా పనిచేస్తూ, డేటా సేకరణ, విశ్లేషణల్లో కొత్త విధానాలు ప్రవేశపెట్టిందని పలువురు ప్రజారోగ్యరంగ నిపుణులు ప్రశంసిస్తున్న తరుణంలో ఆయన సస్పెన్షన్ అనుమానాలు రేకెత్తించడం సహజం.
Updated Date - 2023-08-01T03:41:06+05:30 IST