గొగోయ్ హెచ్చరిక!
ABN, First Publish Date - 2023-08-10T03:21:51+05:30
రాజ్యసభకు అధికారపక్షం నామినేట్ చేసిన మూడున్నరేళ్ళ తరువాత, మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ తొలిసారిగా మొన్న సోమవారం నోరువిప్పారు. మాట్లాడిన సందర్భం కూడా...
రాజ్యసభకు అధికారపక్షం నామినేట్ చేసిన మూడున్నరేళ్ళ తరువాత, మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ తొలిసారిగా మొన్న సోమవారం నోరువిప్పారు. మాట్లాడిన సందర్భం కూడా సరైనది, సముచితమైనది. ఢిల్లీ సర్వీసుల బిల్లు రాజ్యాంగపరమైన పలు మౌలిక అంశాలను సవాలు చేస్తున్నది కనుక, ఫెడరల్ వ్యవస్థను దెబ్బతీయడం, పార్లమెంటు తన మందబలంతో సుప్రీంకోర్టు తీర్పును వమ్ముచేయడం ఇత్యాదివి ఇందులో ఉన్నాయి కనుక, ఈ న్యాయకోవిదుడి వ్యాఖ్యలకు ఎంతో విలువ గౌరవం ఉంటాయి. విపక్షనాయకుల ప్రసంగాలకు అడ్డుతగులుతూ, ప్రతీమాటనీ, సౌజ్ఞనీ రచ్చచేస్తూ పార్టీ పెద్దల మెప్పుకోలు కోసం వెంపర్లాడాల్సిన అవసరం ఒక స్వతంత్ర సభ్యుడిగా ఆయనకు లేదు. రాజ్యాంగం లోతుపాతులు తెలిసినవాడు, చట్టాన్నీ న్యాయాన్నీ కాచివడబోసినవాడు కనుక ఆయన పలుకులు చర్చను పరిపుష్టం చేసి, ఈ సందర్భంలోనే కాక, భవిష్యత్తుకు దిక్సూచిగా నిలుస్తాయని దేశం ఆశించడం సహజం. కానీ, ఢిల్లీ సర్వీసుల బిల్లును సమర్థించడంలో భాగంగా ఈ మాజీ ప్రధాన న్యాయమూర్తి రాజ్యాంగ పునాదులనే ప్రశ్నించడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
బిల్లులో మంచిని ఎంచుతూ మాట్లాడితే అభ్యంతరం లేదు కానీ, గొగోయ్ పూర్తిగా అధికారపక్ష వైఖరి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. తదనుగుణంగా తాను ఒక మాజీ ప్రధాన న్యాయమూర్తినన్న విషయాన్ని కూడా పక్కనబెట్టి రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతం మీదే ఎదురుదాడికి దిగారు. ‘ఈ చట్టం రాజ్యాంగ మౌలిక స్వభావానికి విఘాతం కలిగిస్తున్నదా? ఈ మౌలిక నిర్మాణం విషయంలో నేనోమాట చెప్పదల్చుకున్నాను. కేశవానందభారతి కేసుపైన టిఆర్ అంధ్యరుజిన (మాజీ సొలిసిటర్ జనరల్) రాసిన ఓ పుస్తకాన్ని చదివాను. నా అభిప్రాయం ప్రకారం, రాజ్యాంగ మౌలిక స్వరూపం అంశం చర్చించాల్సిన, న్యాయశాస్త్రపరంగా తీవ్రంగా చర్చించాల్సిన విషయం. ఇంతకంటే ఏమీ చెప్పను’ అన్నారాయన. ఆ పుస్తకాన్ని గోగోయ్ న్యాయమూర్తిగా ఉండగా చదివారో, రాజ్యసభలో రాజకీయాశ్రయం పొందాక అవసరార్థం తిరగేశారో తెలియదు కానీ, గొగోయ్ వ్యాఖ్య పూర్తిగా అధికారపక్ష నేతల మనోవాంఛలకు అనుగుణమైనదే. రాజ్యాంగ మౌలిక స్వరూప స్వభావాలను సవాలు చేస్తూ, ఆ సిద్ధాంతానికి ఔచిత్యమూ చట్టబద్ధతా లేదని వాదిస్తున్న పాలకపక్ష నేతల జాబితాలో ఈ మాజీ ప్రధాన న్యాయమూర్తి వచ్చిచేరారు.
కొలీజియం వ్యవస్థమీద సుప్రీంకోర్టుతో యుద్ధం చేసిన మాజీ కేంద్ర న్యాయశాఖామంత్రి కిరణ్‌రిజిజు కొన్ని సన్నాయి నొక్కులు నొక్కితే, ఆ తరువాత ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కర్ ఈ వివాదాన్ని పతాకస్థాయికి తీసుకుపోయిన విషయం తెలిసిందే. నేషనల్ జుడీషియల్ ఆపాయింట్స్‌మెంట్ కమిషన్ (ఎన్జేఏసీ)ని సుప్రీంకోర్టు కొట్టేస్తే పార్లమెంటు సభ్యులు కిక్కురుమనలేదనీ, రాజ్యాంగంలో మార్పుచేర్పులు చేసే అధికారం ప్రజలు ఎన్నుకున్న పార్లమెంటుకు ఉన్నదనీ, ఆ నిర్ణయాలను సమీక్షించే అధికారం వేరెవ్వరికీ (సుప్రీంకోర్టు) లేదని ఆయన చాలా వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటుకు ఈ దుస్థితి 1973 నాటి కేశవానందభారతి కేసుతో వచ్చిపడిందంటూ ఆ కేసును విమర్శించిన తొలి ఉపరాష్ట్రపతిగా ఘనతకెక్కారు. కేశవానందభారతి కేసులో రాజ్యాంగమౌలిక స్వరూపాన్ని, అది ప్రజలకు దఖలుపరిచిన ప్రాథమికహక్కులను ఎవరూ మార్చలేరనీ, తాను వాటి రక్షణకు కట్టుబడిఉన్నానని సుప్రీంకోర్టు ప్రకటించింది. రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలైన ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సమాఖ్యవ్యవస్థ ఇత్యాదివి మార్చివేసే అధికారం పార్లమెంటుకు లేదని 13మంది సభ్యులతో కూడిన రాజ్యాంగధర్మాసనం వెలువరించిన తీర్పు ఆధారంగానే రాష్ట్రాల హక్కులు నిలబడ్డాయి, ప్రజాస్వామ్యం బతికిబట్టకడుతోంది. సమాఖ్య సిద్ధాంతానికి, రాజ్యాంగ స్ఫూర్తికి ఢిల్లీ సర్వీసుల బిల్లు విఘాతం కలిగిస్తుందని విపక్షాలు వాదిస్తున్నందున, ఆ పునాదినే చర్చపేరిట పెకిలించివేసేందుకు గొగోయ్ ద్వారా అధికారపక్షం నుంచి మరో ప్రయత్నం మొదలైంది. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టులో వాదోపవాదాలు జరుగుతున్న సందర్భంలో, గోగోయ్ వ్యాఖ్యలను కపిల్ సిబాల్ మంగళవారం జస్టిస్ చంద్రచూడ్ దృష్టికి తీసుకువచ్చారు. వాటిని గొగోయ్ వ్యక్తిగత అభిప్రాయాలుగా సీజేఐ తీసిపారేశారు. కానీ, రాజ్యాంగనిర్వచనంలోనూ, ఆచరణలోనూ దిశానిర్దేశం చేసే ‘ధ్రువనక్షత్రం’గా చంద్రచూడ్ అభివర్ణించిన ఈ మౌలిక సిద్ధాంతానికి ఎసరు పెట్టే పని వేగం పుంజుకున్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది.
Updated Date - 2023-08-10T03:21:51+05:30 IST