ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దిగుమతుల మతలబు

ABN, First Publish Date - 2023-03-31T01:02:52+05:30

రష్యాలోని అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు రోస్‌నెఫ్ట్‌తో భారతదేశ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ ఒప్పందం కుదర్చుకుంది. ఎంతచమురును ఎంత రేటుకు ఈ ప్రభుత్వరంగ సంస్థ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

రష్యాలోని అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు రోస్‌నెఫ్ట్‌తో భారతదేశ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ ఒప్పందం కుదర్చుకుంది. ఎంతచమురును ఎంత రేటుకు ఈ ప్రభుత్వరంగ సంస్థ పొందబోతున్నదో తెలియదు కానీ, మనకు మరింత చవుకైన చమురు లభిస్తోందని మీడియా అంటోంది. ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో, పాశ్చాత్యదేశాలు విధించిన ఆంక్షల కారణంగా భారతదేశం కారుచవుకగా రష్యా చమురు పొందుతున్న విషయం తెలిసిందే. ఏడాదికాలంలోనే దిగుమతులు పాతికరెట్లు పెరిగినట్టు రష్యా డిప్యూటీ ప్రధాని మంగళవారం ప్రకటించారు కూడా. ఇంధన రంగంలో ఉభయదేశాల మధ్యా హెచ్చిన సహకారానికీ, భవిష్యత్తులో మరింత సాన్నిహిత్యానికీ ఈ ఒప్పందం నిలువెత్తు నిదర్శనమని మన ఇంధనమంత్రి కూడా సంతోషిస్తున్నారు.

ఆంక్షల కారణంగా ఆర్థిక కష్టాల్లోకి జారిన రష్యాను భారతదేశం ఆదుకుంది. తన ఆర్థికావసరాల రీత్యా రష్యా క్రూడ్‌ ధర పలుదఫాలుగా తగ్గించడంతోపాటు, ఇతరత్రా విషయాల్లో కూడా మనకు చాలా మినహాయింపులు ఇచ్చింది. పాశ్చాత్యదేశాలు మనను నిలదీసినప్పుడు విదేశాంగమంత్రి జయశంకర్‌ వంటివారు ఏ దేశమేగినా భూమిభారతిని పొగుడుతూ, తమ ప్రజల ప్రయోజనాలను పరిరక్షించడమే ధ్యేయమనేవారు. కష్టకాలంలో భారతదేశాన్ని రష్యా చవుక చమురు ఆదుకుంటూ ఉంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నాయని పాశ్చాత్యదేశాలను నిలదీసేవారు. దేశంలో ఇంధనధరలు అదుపుతప్పకుండా ఉండేందుకే ఈ కొనుగోళ్ళు అని కొందరు ఆర్థికవేత్తలు సమర్థించేవారు. పాశ్చాత్యదేశాలు భారతదేశం మీద చర్యలు తీసుకోకపోవడం మోదీ ప్రపంచవ్యాప్త పలుకుబడికీ, అమెరికా మెడలు వంచగలిగే సమర్థతకు నిదర్శమని బీజేపీ నాయకులు చెప్పుకున్నారు. ఔను కాబోలని ప్రజలు అనుకున్నారు. కానీ, దేశంలో చమురు ధరలు ఏ మాత్రం తగ్గలేదు. రష్యా చవుకచమురుతో ఇక్కడి వినియోగదారులకు ఒరిగిందేమిటో పాలకులూ చెప్పలేదు. కానీ, ఆ ముడిచమురులో అత్యధికభాగం మన రిలయెన్స్‌, పుతిన్‌ ఆశీస్సులున్నాయంటున్న నయారా దక్కించుకున్నాయని అనంతరకాలంలో తేలింది. చవుకైన రష్యన్‌ ముడిచమురును దిగుమతి చేసుకొని, శుద్ధిచేసి, తిరిగి యూరోపియన్‌ మార్కెట్లకు సరఫరా చేయడం ద్వారా ఈ ప్రైవేటు రిఫైనరీలు భారీగా లాభాలు కూడబెట్టుకుంటే, దేశ ప్రజల ఇంధన అవసరాలను తీర్చే ప్రభుత్వరంగ ఆయిల్‌ కంపెనీలకు ఈ విన్యాసంలో చోటు లేకపోయింది. రష్యా నుంచి భారతదేశం దిగుమతిచేసుకుంటున్న చమురులో గరిష్టభాగం ప్రైవేటురంగానికి చెందిన రిలయెన్స్‌, నయారా ఎనర్జీ దక్కించుకుంటున్నాయని వెర్టెక్స్‌ అనే ఎనర్జీ ఇంటలిజెన్స్‌ సంస్థ ఇటీవల కూడా ప్రకటించింది. గత ఏడాది మార్చి వరకూ రోజుకు 68వేల బ్యారెల్స్‌ చమురు మాత్రమే దిగుమతి చేసుకొన్న భారతదేశం ఈ ఏడాది జనవరి నాటికి 13 లక్షల బ్యారెల్స్‌ దిగుమతి చేసుకొనే స్థాయికి ఎదిగిదంటే, యుద్ధం అందించిన అవకాశాన్ని భారతదేశం పూర్తిస్థాయిలో అందిపుచ్చుకొన్నదని అర్థం.

ఇంధన భద్రత, ప్రజాశ్రేయస్సు, దేశ సార్వభౌమత్వం ఇత్యాది పదాలు మన నాయకులు ప్రయోగిస్తున్నప్పుడల్లా ఎంతో ముచ్చట కలుగుతుంది. కానీ, అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు ఎంత పడిపోయినా, అధిక ధరలతో ప్రజలు ఎంతగా వేగుతున్నా మన పాలకులకు మనసు కరగదు. అంతర్జాతీయ మార్కెట్‌ ధరలతో ఇక్కడి రేట్లను ముడిపెట్టినవారు అవి తగ్గినప్పుడు ఇక్కడి రేట్లను సవరించకపోగా, రాష్ట్రాలకు వాటా ఇవ్వనక్కరలేని రహస్య సుంకాలతో లక్షలకోట్లు వెనకేసుకోవడానికి అలవాటు పడ్డారు. ప్రతిపక్షాలు పోరగాపోరగా తాము పెంచిన మొత్తంలోనే కాస్తంత కోతబెట్టి ప్రజలకు మేలు చేశామని చెప్పుకోవడం తప్ప జరిగిందేమీ లేదు. కేంద్రం, రాష్ట్రాలు పోటీపడి మరీ చమురునుంచి కాసులు దండుకుంటూ ఉంటే, పెట్రోల్‌ ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలంటే రాష్ట్రాలూ సరేననాలి అంటూ కేంద్రం దీర్ఘాలు తీస్తోంది. చివరకు యుద్ధం నుంచి ప్రవహిస్తున్న చవుకచమురు కూడా సామాన్యులకు కాదనీ, యుద్ధంతో పుతిన్‌ అనుకూల కులీనులతో పాటు మన కుబేరులూ ఎంతో బాగుపడుతున్నారని తేలిపోయింది. చమురు పొందుతున్నందుకు పాశ్చాత్యదేశాలు, చమురు ఆదాయంతో మరింతకాలం యుద్ధం చేయగలుగుతున్నందుకు రష్యా పాలకులు, మధ్యలో దానిని విదేశాలకు అమ్ముతున్నందుకు మన ఏలికలు సంతోషంగా ఉన్నారు. తమకు దక్కిందేమీ లేదని వాపోతున్న ప్రజలకు ఈ కొత్త ఒప్పందంతోనైనా కాస్తంత లబ్ధిచేకూరితే మంచిది.

Updated Date - 2023-03-31T01:02:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising