ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఇమ్రాన్‌ క్లీన్‌బౌల్డ్‌?

ABN, First Publish Date - 2023-08-09T02:49:01+05:30

మూడునెలల్లో రెండోసారి అరెస్టయిన పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ రాజకీయ భవిష్యత్తు ముగిసిపోయినట్టేనా, ఉన్నతన్యాయస్థానాలు అడ్డుపడి ఎన్నికల్లో...

మూడునెలల్లో రెండోసారి అరెస్టయిన పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ రాజకీయ భవిష్యత్తు ముగిసిపోయినట్టేనా, ఉన్నతన్యాయస్థానాలు అడ్డుపడి ఎన్నికల్లో పోటీకి వీలుకల్పిస్తాయా? తోషాఖానా కేసులో ఇటీవల అరెస్టయిన ఇమ్రాన్‌ ఖాన్‌ నేరగాళ్ళకు, తీవ్రవాదులకు నిలయమైన అత్తోక్‌ జైలులో బందీగా ఉన్నారు. జైలు పరిస్థితులు భయంకరంగా ఉన్నాయని, అక్కడ ఆయన హత్యకు గురయ్యే అవకాశాలున్నాయని ఆయన తరఫు న్యాయవాదులు న్యాయస్థానాల్లో వాదిస్తున్నారు. ఈ కేసులో ట్రయల్‌ కోర్టు ఎంతో ముందుచూపుతో ఇమ్రాన్‌కు మూడేళ్ళగరిష్ఠ శిక్ష విధించినందున ఆయన రాబోయే ఎన్నికలతో సహా, ఐదేళ్ళపాటు ఎన్నికల్లో పాల్గొనడానికి అనర్హుడైపోయారు. చివరకు తన పార్టీ తెహ్రీక్‌ ఎ ఇన్సాఫ్‌ (పీటీఐ)కు అధినేతగా ఉండటానికి కూడా పనికిరాకుండా పోయారు. దిగువకోర్టు తీర్పును కొట్టివేయాలంటూ ఆయన న్యాయవాదులు హైకోర్టులోనూ, సుప్రీంకోర్టులోనూ చేస్తున్న న్యాయపోరాటాలు ఒకవేళ విజయవంతమైనా, దాదాపు నూటయాభై కేసులతో ఇమ్రాన్‌ఖాన్‌ను పూర్తిగా చుట్టుముట్టిన ప్రస్తుత పాలకులు, పరోక్షంగా కథంతా నడిపిస్తున్న సైన్యమూ తమ నిరంతర కృషిని కొనసాగిస్తూనే ఉంటాయి.

మాజీ ప్రధానులు అరెస్టులు కావడం, జైళ్ళలో మగ్గడం పాకిస్థాన్‌లో అనాదిగా సాగుతున్నదే. సైన్యం ఆశీస్సులు ఎవరికి ఉన్నాయో సామాన్యులకు సైతం సులభంగా అర్థమయ్యే రాజకీయ క్రీడ అక్కడ దశాబ్దాలుగా సాగుతోంది. హత్యానేరంమీద జుల్ఫికర్‌ అలీ భుట్టోను జనరల్‌ జియా ఉల్‌ హఖ్‌, అవినీతి ఆరోపణలమీద బెనజీర్‌ భుట్టోను నవాజ్‌షరీఫ్‌, నవాజ్‌ షరీఫ్‌ను ఇమ్రాన్‌ఖాన్‌, ఇమ్రాన్‌ఖాన్‌ను ఇప్పుడు తమ్ముడు షరీఫ్‌ జైలుపాలు చేయడం... ఇలా నేతల ఖైదుకథ పెద్దదే. సైన్యం అనుగ్రహం కోల్పోతే జైలుకు పోవడమో, విదేశాలు పట్టిపోవడమో అటుంచితే, బతికిబట్టకట్టడమూ కష్టమే. ఇప్పుడు జైల్లో మగ్గుతున్న ఇమ్రాన్‌ఖాన్‌ మాత్రం తక్కువ తిన్నారా? ఇమ్రాన్‌ పిటిషన్‌ ఆధారంగానే 2017లో సుప్రీంకోర్టు నవాజ్‌ షరీఫ్‌మీద అనర్హత వేటువేసింది. దానితోపాటు అనేక కేసులు చుట్టుముట్టి 2018 ఎన్నికలకు కొద్దివారాల ముందు ఆయన జైలుకు పోయారు. ఇమ్రాన్‌కు సైన్యం ఆశీస్సులు బలంగా ఉన్నాయన్న సందేశం అందడంతో, షరీఫ్‌ పార్టీకి చెందిన ప్రముఖ నాయకులంతా ఇమ్రాన్‌ పార్టీలో చేరిపోయారు. జైలులో నవాజ్‌ షరీఫ్‌ను చిత్రహింసలు పెట్టడం, అంతిమఘడియల్లో ఉన్న భార్యతో కనీసం ఫోన్‌లో కూడా మాట్లాడనివ్వకపోవడం, షెహబాజ్‌ షరీఫ్‌ సహా చాలామంది నాయకులను అరెస్టులు చేయించడం ఇత్యాది ఘనమైన గతం ఉన్న ఇమ్రాన్‌మీద నవాజ్‌షరీఫ్‌ లండన్‌లో కూర్చొని పాతకక్షలన్నీ వరుసగా తీర్చుకుంటున్నారు. షరీఫ్‌లూ, భుట్టోలూ చేతులు కలిపి అవిశ్వాసతీర్మానంతో ఇమ్రాన్‌ను దించేశారు. ఆర్మీచీఫ్‌గా జనరల్‌ బాజ్వా స్థానంలో అస్మదీయ ఆసీఫ్‌ మునీర్‌ను ప్రతిష్ఠించి, కేసులు, అరెస్టులు, జైలు నిర్బంధంతో అంతకంతా తిరిగి ఇమ్రాన్‌కు అప్పగిస్తున్నారు.


నవంబరులో సార్వత్రక ఎన్నికలు జరుగుతాయని అంటున్న తరుణంలో, అంతలోగా ఇమ్రాన్‌కు గరిష్ఠశిక్షవేయించి, ఎన్నికల్లో పాల్గొనడానికి అనర్హుడిని చేయించి, జైలుకు పంపడంలో షరీఫ్‌ సోదరులు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ (పీఎంఎల్‌–ఎన్‌) గెలిస్తే నవాజ్‌ షరీఫ్‌ నాలుగోసారి దేశప్రధాని అవుతారని, ఇమ్రాన్‌ తలతిక్క విదేశాంగవిధానంతో దూరమైన సౌదీ, టర్కీ వంటి దేశాల అండదండలతో పాకిస్థాన్‌ను అద్భుతంగా పాలిస్తారని షెహబాజ్‌ ఎన్నికల సభల్లో చెబుతున్నారు. నేడు చట్టసభల రద్దుతో, తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుతో, సార్వత్రక ఎన్నికలదిశగా పాకిస్థాన్‌ ప్రయాణం ఆరంభం కాబోతున్నప్పటికీ, ఎన్నికలు కచ్చితంగా నవంబరులోనే జరుగుతాయని చెప్పడానికి లేదు. ఎన్నికల ప్రచారానికి పెద్ద షరీఫే సారథ్యం వహిస్తారని నవాజ్‌ పార్టీ నాయకులంతా అంటున్న నేపథ్యంలో, న్యాయపరమైన అడ్డకులు తొలగి, ఆయన లండన్‌లో విమానం ఎక్కేవరకూ అధికారపక్షం ఎన్నికల ప్రక్రియను సాగదీసేందుకు ప్రయత్నించవచ్చు. ఇప్పుడు తోషాఖానా కేసులో ఒకవేళ ఉన్నత న్యాయస్థానాలు అడ్డుపడి, ఇమ్రాన్‌ను ఒడ్డునపడేసినా, ఎన్నికలు ముగిసేవరకూ ఆయన జైలుదాటకుండా చూడటానికి మిగతా కేసులు అనేకం ఉన్నాయి, మే 9నాటి ఘటనలకు సంబంధించి మిలటరీ కోర్టులూ ఉన్నాయి. పాలకులు ప్రతీకారేచ్ఛతో రగిలిపోతూంటే, రాజ్యాంగం నిర్వీర్యమైపోయి, వ్యవస్థలన్నీ కుప్పకూలిన దుస్థితిని పాకిస్థాన్‌ ఎదుర్కొంటోంది.

Updated Date - 2023-08-09T02:49:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising