ఇమ్రాన్ చివరి ఇన్నింగ్స్
ABN, First Publish Date - 2023-05-11T01:33:29+05:30
సైన్యంతో ప్రత్యక్షయుద్ధానికి దిగిన పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఇప్పుడు అన్నిదారులూ మూసుకుపోయినట్టు కనిపిస్తున్నది....
సైన్యంతో ప్రత్యక్షయుద్ధానికి దిగిన పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఇప్పుడు అన్నిదారులూ మూసుకుపోయినట్టు కనిపిస్తున్నది. ఆయన అరెస్టయిన తీరు చూసి, సుదీర్ఘకాలం జైల్లోనే మగ్గుతూ, ఎన్నికల్లో పోటీచేయడానికి వీల్లేనిస్థితిలో ఆయన రాజకీయజీవితం ముగిసిపోవచ్చునని కొందరు అంటున్నారు. గిట్టనివారిని గుట్టుగా మాయం చేసే శక్తి పాక్ మిలటరీకి ఉన్నది కనుక, ఇమ్రాన్ ఖాన్ పేరు వినిపించకుండా, రూపం కనిపించకుండా పోవచ్చునని మరికొందరు అంచనావేస్తున్నారు.
ఇమ్రాన్ విషయంలో ఏం చేయాలన్న నిర్ణయంలో షరీఫ్ ప్రభుత్వం పాత్ర నిమిత్తమాత్రం. సర్వసత్తాక సైన్యం, న్యాయస్థానాలు ఆయన భవిష్యత్తు నిర్ణయించబోతున్నాయి. ఓ కేసు విచారణలో భాగంగా ఇస్లామాబాద్ కోర్టుకు హాజరైనప్పుడు పారామిలటరీ రేంజర్లు న్యాయస్థానం కిటికీ అద్దాలు పగలకొట్టి మరీ లోపలకు చొరబడి, మాజీ ప్రధాని కాలర్ పట్టుకొని బయటకు ఈడ్చుకొని పోవడం బహుశా పాకిస్థాన్‌లో మాత్రమే సాధ్యం. తన హత్యకు సైన్యం కుట్రపన్నుతున్నదని ఇమ్రాన్ ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నారు, ఆడియోలూ వీడియోలు విడుదలచేస్తూనే ఉన్నారు. గతంలో తనపై జరిగిన దాడి వెనుక కూడా ఐఎస్‌ఐ ఉన్నదని ఆరోపించిన ఆయన, ఆ సంస్థ ఉన్నతాధికారి ఒకరు తనహత్యకు ప్లాన్‌వేశారని అరెస్టు ముందురోజే ప్రకటించారు కూడా. ఆయన మీద దేశం నలుమూలలా దాదాపు నూటయాభై కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఏ కేసు సందర్భంలో కోర్టుకు వచ్చారు, ఏ కేసులో అరెస్టయ్యారు అన్నకంటే, ఇల్లుదాటి బయట అడుగుపెడితే ఏదో ఒక కేసు పేరిట ఆయనను పట్టుకుపోయి జైల్లో పడేసే పరిస్థితి ఉన్నమాట నిజం. ఇన్ని కేసులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పుడు నిత్యం వేలాదిమంది పార్టీ కార్యకర్తల పహారామధ్య, లాహోర్ కోటలో దాక్కొనివుండటం అసాధ్యం. ఏదో ఒక దశలో ఏదో ఒక కోర్టుకు రాకతప్పదు. న్యాయస్థానాల్లో తనకు న్యాయం జరగకపోవచ్చునని, అక్కడనుంచి కూడా తాను మాయం కావచ్చునని ఆయనకు తెలియనిదేమీ కాదు.
ఇలా ఎలా అరెస్టుచేస్తారు, ఏ కేసులో చేశారు అని ఆదిలో న్యాయమూర్తులు ఆగ్రహించారు. తరువాత ఆయన అరెస్టు సరైనదేనని, నేషనల్ ఎకౌంటబిలిటీ బ్యూరో చట్టబద్ధంగానే వ్యవహరించిందని ధ్రువీకరించారు. ప్రధాని హోదాలో స్వీకరించిన ఖరీదైన బహుమతుల విషయంలో ఆయన అవినీతికి పాల్పడ్డారంటూ నమోదైన ‘తోషాఖానా’ కేసు కూడా ఆఖరిదశకు చేరుకుంది. కేసులు ఎంతకాలం సాగితే, ఇమ్రాన్ అంత బలపడతారు కనుక, ఏవో కేసుల్లో ప్రక్రియ వేగంగా ముగిసి ఆయన జైలుకుపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఆయన అరెస్టు సందర్భంగా రేగిన హింస, ప్రధానంగా సైనికస్థావరాలపై ఆయన పార్టీ కార్యకర్తలు దాడులకు దిగడం, నిషేధిత ప్రాంతాల్లోకి కూడా చొరబడి మిలటరీ ఆస్తులను, ఒక యుద్ధవిమానాన్ని సైతం తగులబెట్టడం తీవ్రమైనవి. ఈ పరిణామాలను సైన్యం ఊహించలేదని అనుకోనక్కరలేదు. హింసను కట్టడిచేసే పేరిట దేశం మొత్తాన్ని తన అధీనంలోకి తెచ్చుకొనే దిశగా అది అడుగులు వేస్తుంది.
సత్వర సార్వత్రక ఎన్నికలకోసం ఇమ్రాన్ చేసిన పోరాటం ఫలించలేదు. తన పార్టీ అధికారంలో ఉన్న ప్రావిన్సుల్లో రాజీనామాలు చేయించి తిరిగి ఎన్నికలు జరిపించాల్సిన అవసరాన్ని తెలివిగా సృష్టించినప్పటికీ, కొన్ని ప్రావిన్సుల్లో మే 15లోగా ఎన్నికలు జరగాలని న్యాయస్థానాలు తీర్పు చెప్పినప్పటికీ ప్రభుత్వం కదల్లేదు. ఇమ్రాన్ విషయంలో సైన్యం తన దూకుడు పెంచిందని ప్రస్తుత పరిణామాలు తెలియచేస్తున్నాయి. సైన్యాన్ని ప్రధాన శత్రువుగా ప్రకటించి, ప్రజలను సైతం దానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టి ఇమ్రాన్ పొరపాటు చేశారనీ, గతంలో తాను అధికారంలోకి రావడానికి, తరువాత కోల్పోవడానికి కారణమైన సైన్యం ఇప్పటికీ అంతేబలంగా ఉన్నదన్న విషయాన్ని ఆయన గుర్తించలేదనీ కొందరివాదన. కానీ, ఇమ్రాన్ దెబ్బతో పాకిస్థాన్ చరిత్రలో సైన్యం తొలిసారిగా ఆత్మరక్షణలో పడి ఆయనతో ఎలా వ్యవహరించాలో తెలియనిస్థితికి జారుకున్న మాట నిజం. సైన్యంతో రాజీపడినంత మాత్రాన ప్రయోజనం లేదని, తిరిగి అధికారంలోకి రావాలంటే దానితో తీవ్రంగా పోరాడక తప్పదని ఇమ్రాన్ నమ్మకం. అధికారం కోల్పోయినప్పటినుంచీ దానితో చేస్తున్న యుద్ధం ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. ఆయన నమ్మకమే గెలుస్తుందో, సైన్యానిదే పైచేయి అవుతుందో చూడాలి.
Updated Date - 2023-05-11T01:33:29+05:30 IST