చిప్పుల చిక్కులు
ABN, First Publish Date - 2023-07-14T02:58:28+05:30
భారతదేశంలో సెమీకండక్టర్ల తయారీకి పదినెలలక్రితం చేయీచేయీ కలిపి సిద్ధపడిన రెండు కంపెనీలు ఇప్పుడు హఠాత్తుగా దూరమైపోతున్నట్టుగా చేసిన ప్రకటన చిప్ తయారీలో...
భారతదేశంలో సెమీకండక్టర్ల తయారీకి పదినెలలక్రితం చేయీచేయీ కలిపి సిద్ధపడిన రెండు కంపెనీలు ఇప్పుడు హఠాత్తుగా దూరమైపోతున్నట్టుగా చేసిన ప్రకటన చిప్ తయారీలో మన ‘ఆత్మనిర్భరత’ కు ఎదురుదెబ్బ అని కొందరు అంటున్నారు. ఆదిలోనే ఇలాంటి ఆటంకం రావడం మంచిదేనని, దారి మార్చుకోవడానికి ఈ విడాకులు ఉపకరిస్తాయని మరికొందరు హితవు చెబుతున్నారు. చిప్ తయారీకి తైవాన్ పెట్టింది పేరు. ఆ దేశానికి చెందిన ఫాక్స్‌కాన్ మన వేదాంతతో కలిసి మోదీ కలలను నిజం చేయడానికి సిద్ధపడటం సహజంగానే స్వాగతించవలసిన పరిణామం. గుజరాత్ ప్రభుత్వంతో సుమారు 20 బిలియన్ డాలర్ల విలువైన సెమీకండక్టర్ల తయారీ కేంద్రం ఏర్పాటుకు ఈ విదేశీ, స్వదేశీ దిగ్గజాలు సిద్ధపడటంతో, అన్నీ మోదీ రాష్ట్రానికేనా అంటూ విమర్శలు కూడా వచ్చాయి. కరోనా కష్టకాలంలో చిప్ సరఫరా వ్యవస్థ దెబ్బతినడంతో తీవ్ర సమస్యలు ఎదుర్కొన్న అనుభవం ఉన్నది కనుక ఎక్కడైతేనేమి అడుగుముందుకు పడుతున్నది కదా అని సర్దిచెప్పుకోవడమూ జరిగింది. ఈ రెండు సంస్థలూ విడిపోయినంతమాత్రాన నష్టమేమీ లేదన్న ప్రభుత్వ వివరణను పూర్తిగా నమ్మలేకపోయినా, మరో భాగస్వామితో చేయికలిపి భారత్‌లో తయారీకి తాను సిద్ధంగానే ఉన్నానని ఫాక్స్‌కాన్ చేసిన ప్రకటన ఊరటనిస్తోంది.
ఈ రెండు సంస్థలు వేరుపడిపోవడానికి ఏవో కారణాలు ఉండవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద ఒప్పందం కనుక, గత ఏడాది సెప్టెంబరులో దీనిని ప్రకటించినప్పటినుంచీ ఉత్పత్తి ఎప్పుడన్న ప్రశ్నలూ అదిగో ఇదిగో అన్న సమాధానాలూ వినబడ్డాయి. లక్ష ఉద్యోగాలు వస్తాయని గుజరాత్ ముఖ్యమంత్రి ప్రకటించిన తరువాత ఎదురుచూపులు, ఆశలు సహజం. ఇప్పుడది కాదని తేలిపోయినప్పుడు హేళనలు, విమర్శలూ తప్పవు. ‘వైబ్రంట్ గుజరాత్ సదస్సులో ఒప్పందాలన్నీ ఇలాగే ఉంటాయి, గుజరాత్ మోడల్ అంటే ఇదే’ అని కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేష్ దెప్పిపొడుస్తున్నారు. విడిపోయినంతమాత్రాన పడిపోయినట్టు కాదనీ, రెండు కంపెనీలు వేరువేరుగా పనిచేసుకుంటాయని ఐటీ మంత్రి చెప్పడంతో పాటు, కాంగ్రెస్ చేతగాని తనం వల్లనే చిప్పుల విషయంలో మనం ఇలా చిప్పపట్టుకోవలసి వస్తున్నదనీ, చైనా దూసుకుపోయిందనీ విమర్శలు చేశారు. రెండు ప్రైవేటు కంపెనీలు ఎందుకు కలుస్తాయో, ఎందుకు విడిపోతాయో గమనించడం ప్రభుత్వం పనికాదన్న ఆశ్చర్యకరమైన వ్యాఖ్య కూడా ఒకటి చేశారు. అవి కలిసినప్పుడు చెప్పిన గొప్పలు విడిపోయినప్పుడు విస్మరించడం ఆరోగ్యానికి మంచిదే.
ఈ రంగంలో అనుభవం ఉన్న ఒక విదేశీసంస్థ, ఒక పెద్ద స్వదేశీసంస్థనుంచి తప్పుకోవడం కచ్చితంగా ‘భారత్ సెమీకండక్టర్ మిషన్’కు ఎదురుదెబ్బ. చిప్ తయారీ అనుభవం లేని మనదేశంలో, ఈ రంగంలో ప్రవేశించేందుకు ఉత్సాహపడుతున్న అతికొద్దికంపెనీల్లో చాలావాటికి అనుభవం లేకపోవడం మరో వాస్తవం. అమెరికాకు చెందిన ప్రముఖ చిప్ తయారీ సంస్థ మైక్రోన్ విషయంలో ఆసక్తి హెచ్చడానికి ఇది కూడా ఓ కారణం. గత నెలలో భారతప్రధాని అమెరికాలో పర్యటించినప్పుడు భారత్‌లో 6800కోట్ల పెట్టుబడులు పెట్టడానికి మైక్రోన్ సిద్ధపడింది. అయితే, అది చిప్ టెస్టింగ్, ప్యాకేజింగ్ మాత్రమే కానీ, ఉత్పత్తి కోసం కాదు. ‘వచ్చే ఏడాది డిసెంబరు నాటికి మేడిన్ ఇండియా చిప్’ అని పాలకులు దీనిని గొప్పగా చెబుతూంటే, అది మేకింగ్ కాదు, కేవలం ప్యాకింగ్ అని ఇప్పటికే విమర్శలు ఆరంభమైనాయి. కేంద్రప్రభుత్వం 50శాతం సబ్సిడీ, రాష్ట్ర ప్రభుత్వం భూమి, ఇతర రూపాల్లో ఇచ్చే సబ్సిడీలు మొత్తం ప్రాజెక్టు విలువలో 70శాతం వరకూ ఉన్నాయి. ఇలా మూడోవంతు పెట్టుబడితో 22వేల కోట్ల ప్రాజెక్టుకు మొత్తం అధిపతిగా అవతరిస్తున్న మైక్రోన్ మనదేశంలో చేయబోతున్నది టెస్టింగ్, ప్యాకింగ్ మాత్రమే. ఇతర దేశాల్లో తయారైన చిప్‌ల నాణ్యతను పరీక్షించడం, ప్యాక్ చేయడమన్నది చిప్ సాంకేతికతలో చిట్టచివరి దశ మాత్రమే. అంటే, చిప్ తయారీలో అమెరికా, చైనా, కొరియా, తైవాన్ వంటి దేశాలతో పోటీపడకుండా ఇప్పటికే ప్యాకేజింగ్ విషయంలో ముందజంలో ఉన్న మలేషియా వంటి దేశాలను అనుసరించడమే. ఇప్పుడు ఫాక్స్‌కాన్‌తో వేదాంత వేరుపడటం వెనుక మైక్రోన్‌తో చేయికలిపే ఆలోచన ఉన్నదన్న వార్తలు నిజమైన పక్షంలో, జైరామ్ రమేష్ వంటివారు మళ్ళీ తమ బుర్రకు పదునుపెట్టకతప్పదు.
Updated Date - 2023-07-14T02:58:28+05:30 IST