‘వచాతి’లో గెలిచిన న్యాయం
ABN, First Publish Date - 2023-10-03T02:52:49+05:30
తమిళనాడులో మూడుదశాబ్దాల క్రితంనాటి ఒక మారణకాండ విషయంలో మద్రాస్ హైకోర్టు శుక్రవారం వెలువరించిన తీర్పు ప్రశంసనీయమైనది. ధర్మపురిజిల్లాలోని దట్టమైన అటవీప్రాంతంలో...
తమిళనాడులో మూడుదశాబ్దాల క్రితంనాటి ఒక మారణకాండ విషయంలో మద్రాస్ హైకోర్టు శుక్రవారం వెలువరించిన తీర్పు ప్రశంసనీయమైనది. ధర్మపురిజిల్లాలోని దట్టమైన అటవీప్రాంతంలో ఆదివాసీ గ్రామమైన వచాతి మీద 1992 జూన్20న పోలీసులు, రెవిన్యూ, అటవీ సిబ్బంది మూకుమ్మడిగా విరుచుకుపడి మూడురోజులపాటు సాగించిన అకృత్యాలపై సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. 269మంది అధికారులను వరుస ప్రభుత్వాలు కాపాడుకొస్తుంటే, 655మంది ఆదివాసులు తమ నిరంతర న్యాయ పోరాటంతో సాధించిన విజయం ఇది. ఒకకేసులో అత్యధికమందికి శిక్షపడటం దేశచరిత్రలో ఇదే తొలిసారి కావచ్చు.
చందనం దొంగ వీరప్పన్‌కు సహకరిస్తున్నారన్న ఆరోపణలపై ఈ గ్రామంపై అధికారులు దాడిచేశారు. వీరప్పన్ ఆచూకీని కనిపెట్టే పేరిట పిల్లలు, మహిళలు, వృద్ధులను చావచితక్కొట్టారు, రెండువందల ఇళ్ళను నేలమట్టం చేశారు. గ్రామస్థులంతా తాగే నీటిలో విషం కలిపారు. ఈ బీభత్సంతో ఆగకుండా ఒక మైనర్ బాలికతో సహా 18మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారు. చివరకు ఎర్రచందనం దుంగలు దొరికాయంటూ వారిపై కేసులు పెట్టారు. పలురకాలుగా హింసించి దుంగల ముందు నిలబెట్టి ఫోటోలు తీసి స్మగ్లింగ్ కేసులో ఇరికించారన్నది ఆదివాసుల వాదన. బెయిల్‌మీద బయటకు వచ్చిన తరువాత కూడా అధికారులు తమపై మళ్ళీ విరుచుకుపడతారన్న భయంతో వారు నెలలతరబడి అడవుల్లో దాక్కోవలసి వచ్చింది.
అధికారుల అకృత్యాలపై కేసు నమోదుచేయడానికి పోలీసులు నిరాకరించడంతో బాధితుల పక్షాన హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. తమ అధికారుల దుర్మార్గాన్ని కప్పిపుచ్చేందుకు పాలకులు ప్రయత్నించడం అటుంచితే, ఇటువంటి హీనమైన కార్యానికి ప్రభుత్వాధికారులు ఒడిగట్టరంటూ హైకోర్టు ఆ పిల్‌ను తిరస్కరించడం విచిత్రం. చివరకు సుప్రీంకోర్టు ఆదేశం మేరకు 1995లో సీబీఐ దర్యాప్తునకు హైకోర్టు ఈ కేసును అప్పగించింది. 1996లో సీబీఐ చార్జిషీటు దాఖలు చేసినా, ధర్మపురి సెషన్స్ కోర్టులో పదిహేనేళ్ళపాటు అది ప్రభుత్వాధినేతల చలువవల్ల ముందుకు కదలలేదు. ఎట్టకేలకు, ట్రయల్‌కోర్టు 2011లో అప్పటికే మరణించిన 54మంది పోను, జీవించి ఉన్న మిగతా 215మందికి శిక్షలు వేసినా, ఈ అధికారులంతా మద్రాస్ హైకోర్టునుంచి స్టే తెచ్చుకోగలిగారు. వీరిలో కొందరికి ఏడాదినుంచి పదేళ్ళ జైలు పడినప్పటికీ, అత్యధికులు హైకోర్టు స్టే కారణంగా బెయిల్ మీద బయటకు రాగలిగారు, చక్కగా ఉద్యోగాలు పూర్తిచేసుకొని సర్వీస్ బెనిఫిట్స్ అందుకొని మరీ రిటైరయ్యారు.
దర్యాప్తు, విచారణ ప్రక్రియలు ఇలా నత్తనడకన సాగి, ఎట్టకేలకు ట్రయల్‌కోర్టు తీర్పుకూడా ఆలస్యంగా వెలువడితే, హైకోర్టు అప్పట్లో ఏ ప్రాతిపదికన ఆ తీర్పును నిలుపుదలచేసిందో తెలియదు. చివరకు ఈ దారుణకాండ జరిగిన ముప్పయ్యేళ్ళకు, అన్ని క్రిమినల్ అప్పీళ్ళను హైకోర్టు కొట్టివేస్తూ, పన్నెండేళ్ళనాటి సెషన్స్ కోర్టు తీర్పును ఎత్తిబట్టడంతో ఇప్పుడు అది కొలిక్కివచ్చింది. మొన్న మార్చిలో వాచాతి గ్రామాన్ని జస్టిస్ వేల్మురుగన్ స్వయంగా సందర్శించి, అప్పటి ఘటనకు సంబంధించి కొన్ని విషయాలు ఆదివాసులనుంచి ప్రత్యక్షంగా తెలుసుకున్నప్పుడే ఈ తీర్పు విషయంలో ఆదివాసుల్లో ఆశలు రేకెత్తాయి. జరిగిన ఘోరంమీద ప్రాసిక్యూషన్ ఆధారాలు, బాధితుల వాదన ఏకరీతిన విశ్వసనీయంగా ఉన్నాయని ఆయన తేల్చారు. మిగతా శిక్షాకాలం పూర్తిచేసుకొనే నిమిత్తం నిందితులను వెంటనే కస్టడీలోకి తీసుకోవాల్సిందిగా సెషన్స్‌కోర్టును ఆదేశించారు. బాధితులకు నష్టపరిహారంగా ఇవ్వాల్సిన పదిలక్షల రూపాయల్లో సగభాగం నిందితులనుంచి రికవరీ చేయాల్సిందిగా ఆదేశించారు. బాధితులకు, వారి కుటుంబాలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఈ ఘటన కారణంగా జీవితాలన్నీ తలకిందులైన వచాతీ గ్రామ ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకొని తనకు నివేదించాలని ఆదేశించారు. ఒక ఘోరాన్ని కప్పిపుచ్చి, నిందితులను కాపాడుకొచ్చినందుకు అప్పటి జిల్లా కలెక్టర్, ఎస్పీ, జిల్లా అటవీశాఖ అధికారిపై కఠినచర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. అధికారంలో ఉన్నవారు బలహీనుల విషయంలో ఎంత అమానుషంగా, అన్యాయంగా వ్యవహరిస్తారో ఈ కేసు తెలియచెబుతోంది. పాలకులు ఇప్పటికైనా వచాతి ఆదివాసుల సంక్షేమం విషయంలో హైకోర్టు తీర్పును సంపూర్ణంగా అమలు చేసి, మూడుదశాబ్దాలుగా వారికి జరుగుతున్న అన్యాయాన్ని కాస్తంతైనా సరిదిద్దడం అవసరం.
Updated Date - 2023-10-03T02:52:49+05:30 IST