ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కడుతున్నది కూలుతోంది!

ABN, First Publish Date - 2023-08-17T03:20:42+05:30

ఇళ్ళుపేకమేడల్లాగా కూలిపోతున్నాయి, పగుళ్ళు తీసిన ఇళ్ళనుంచి ప్రజలను ఖాళీచేయించేలోగానే కొండచరియలు వాటిని క్షణాల్లో నామరూపాలు లేకుండా చేస్తున్నాయి...

ఇళ్ళుపేకమేడల్లాగా కూలిపోతున్నాయి, పగుళ్ళు తీసిన ఇళ్ళనుంచి ప్రజలను ఖాళీచేయించేలోగానే కొండచరియలు వాటిని క్షణాల్లో నామరూపాలు లేకుండా చేస్తున్నాయి. చల్లని, చక్కని రాష్ట్రం హిమాచల్‌ వరుస బీభత్సాలను చవిచూస్తోంది. జూలైలో జలప్రళయాన్ని ఎదుర్కొన్న ఈ రాష్ట్రం ఇంకా తేరుకోకముందే మరోసారి భీకరవరదల్లో మునిగితేలుతోంది. వందలమంది ప్రాణాలు బలితీసుకోవడంతో పాటు, వేలాది కోట్ల నష్టాన్ని మిగిల్చింది. సమస్త వ్యవస్థలూ దెబ్బతిని రాష్ట్రం యావత్తూ కుప్పకూలిపోయింది. పదివేల కోట్లమేరకు నష్టం వాటిల్లిందని, చేపట్టిన అభివృద్ధి అంతా నాశనమైందనీ, పునర్నిర్మాణానికి కనీసం ఏడాది పడుతుందనీ అంటున్నారు హిమాచల్‌ ముఖ్యమంత్రి.

కొండచరియలు విరిగిపడటం, చిక్కుకున్నవారిని రక్షించే ప్రయత్నం సాగుతూండగానే, మళ్ళీ విరిగిపడుతూండటం, వరదల్లో కొట్టుకుపోతున్నవారిని రక్షించేందుకు నిరంతరం శ్రమిస్తూండటం హిమాచల్‌ విపత్తు ఏ స్థాయిలో ఉన్నదో తెలియచేస్తున్నాయి. స్వల్పవ్యవధిలోనే 170సార్లు కుంభవృష్టి సంభవించి, కొండచరియలు విరిగిపడుతూంటే తట్టుకోవడం ఎవరి తరమూ కాదు. ఒక్కసారిగా డ్యాములన్నీ నిండిపోయి, సమీప ప్రాంతాల ప్రజలను హెచ్చరించేలోగానే నీటిని వదిలేయాల్సిన రావడం ఊహకు అందని దుస్థితి. అనూహ్యమైన స్థాయిలో వర్షాలు కురవడం ఈ విపత్తుకు కారణమన్నమాట నిజం. ప్రకృతి విపత్తులు చెప్పాపెట్టకుండానే వస్తాయని, అవి ఎక్కడైనా ఎప్పుడైనా సంభవించవచ్చునని, వాటిని ఎదుర్కోవడం కష్టమన్నదీ నిజమే. కానీ, ఇంతటి ఆర్థిక, ప్రాణనష్టానికి ప్రకృతిని మాత్రమే తప్పుబట్టి, మానవ తప్పిదాన్ని ఉపేక్షించడం మనకు మనం ద్రోహం చేసుకోవడమే.


‘అభివృద్ధి’కి కూడా హద్దు ఉండాలి. మరీముఖ్యంగా హిమాలయాల ఒడిలో సేదతీరే రాష్ట్రాల విషయంలో ఆ స్పృహ మరింత ఉండాలి. మెగా ప్రాజెక్టులను పాలకులు తమ అద్భుతపాలనకు చిహ్నంగా, దేశానికి గర్వకారణంగా చెప్పుకుంటున్నారు, దేశ ఆర్థికశక్తికి నిదర్శనంగా చూపుతున్నారు. సున్నితమైన హిమాలయ ప్రాంతాల్లో చేపట్టే భారీ ప్రాజెక్టులు పునాదులను కదిలిస్తున్నాయి. భారీ యంత్రాలతో కొండలను కోసేయడం, మట్టిని తవ్వేయడం, కట్టడాలు మిగల్చిన వ్యర్థాన్నంతా చెరువుల్లో ముంచేయడం వంటివి విపత్తు తీవ్రత హెచ్చడానికి ప్రధాన కారణాలు. జాతీయ రహదారులు కొట్టుకుపోవడం, సగానికి సగం కొండ జారిపోవడం వంటివి కేవలం భారీ వర్షాలతో జరిగిపోయేవికావు.

ఇప్పుడు అష్టకష్టాలు పడుతున్న హిమాచల్‌, ఉత్తరాఖండ్‌ వంటి రాష్ట్రాలకు అధిక ఆదాయం పర్యాటకంతోనే. కరోనా అనంతరకాలంలో గాడినపడుతున్న ఆ పర్యాటకం కాస్తా ఇటువంటి విపత్తులు తరచుగా సంభవిస్తే తిరిగి తరిగిపోవడం ఖాయం. భారీ ప్రాజెక్టులతో పాటు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కూడా ఇక్కడ తనవంతు నష్టాన్ని కలిగిస్తున్నది. కరోనా దెబ్బకు వ్యక్తిగతంగానూ, ప్రభుత్వపరంగానూ వచ్చిపడిన నష్టాన్ని పూడ్చుకొనే క్రమంలో నాయకులు అనుమతిస్తున్న అడ్డగోలు నిర్మాణాలతో ఇప్పటికే ప్రధాన నగరాల రూపురేఖలు మారిపోయాయి. శిమ్లా, కసౌలీ వంటి సున్నిత ప్రాంతాల్లో సైతం భారీ రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు వందలాది ఎకరాల్లో విల్లాలు, ఆకాశహార్మ్యాల నిర్మాణాన్ని చేపట్టడానికి పాలకులు అన్ని నిబంధనలనూ గాలికొదిలేశారు. నివాసయోగ్యమైన భూములే కాదు, రియల్‌ ఎస్టేట్‌ దెబ్బకు నీటిమార్గాలు కూడా మాయమైపోతున్నాయి. ఈ చల్లని ప్రాంతాల్లో తమకో వేసవి విడిది ఉండాలని కోరుకుంటున్న ధనికులంతా ఈ వరుస ప్రకృతి విపత్తులను చూసి వెనక్కుతగ్గడం, ఇప్పటివరకూ ప్రకృతికీ, స్థానిక సామాన్యులకు చేకూరిన నష్టం పూడ్చలేనిదిగా మిగలడం ఖాయం. పర్యాటకంతో ముడిపడిన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన పేరిట సాగుతున్న నిర్మాణాలకు పరిమితి ఉండాలి. అవి స్థానిక పంటలను, ఉత్పత్తులను, బతుకుదెరువును నాశనం చేయకూడదు. హిమాలయ రాష్ట్రాలకు సంబంధించి ఒక సున్నితమైన, సమష్టి విధానం అవసరం. నిపుణుల కమిటీలంటూ ఎన్నో ఏర్పడి, ఎన్నెన్ని సూచనలు చేసినా, శాస్త్రవేత్తలు, పర్యావరణ వేత్తలు, పౌరసమాజం ఎంత మొత్తుకున్నా పాలకులు కనికరించడం లేదు. వేలకోట్ల ప్రజాధనాన్ని కుమ్మరించి నిర్మిస్తున్న నాలుగువరుసల మనాలీ హైవేలో నలభైశాతం కేవలం రెండురోజుల్లో నాశనమైన దృశ్యం చూసిన తరువాతైనా పాలకులకు కనువిప్పు కలిగితే సంతోషం.

Updated Date - 2023-08-17T03:20:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising