కర్ణాటక సందడి
ABN, First Publish Date - 2023-06-08T00:33:58+05:30
పోయిన నెలలో ప్రభుత్వం మారిన తరువాత కూడా కర్ణాటక ఇంకా జాతీయస్థాయి ప్రధాన వార్తలలోనే కొనసాగుతున్నది. ఎన్నికల సందర్భంగా చేసిన సంక్షేమ వాగ్దానాలను నెరవేర్చడం, మంత్రివర్గం కూర్పు వంటి...
పోయిన నెలలో ప్రభుత్వం మారిన తరువాత కూడా కర్ణాటక ఇంకా జాతీయస్థాయి ప్రధాన వార్తలలోనే కొనసాగుతున్నది. ఎన్నికల సందర్భంగా చేసిన సంక్షేమ వాగ్దానాలను నెరవేర్చడం, మంత్రివర్గం కూర్పు వంటి అంశాలు కొంతకాలం వరకే ఆసక్తిని కలిగిస్తాయి. బిజెపి పాలనలో కర్ణాటకలో వచ్చిన సామాజిక మార్పులను, ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన మార్పులను సమీక్షించి సరిదిద్దే కార్యక్రమాన్ని సిద్దరామయ్య నాయకత్వంలోని ప్రభుత్వం చురుకుగా చేపట్టింది. కర్ణాటకలో హిందూ వ్యతిరేక ప్రభుత్వం వచ్చిందని సామాజిక మాధ్యమాలలో గగ్గోలు మొదలయింది కూడా.
విధానాలలో, సిద్ధాంతాలలో తేడా ఉన్నదని భావిస్తూ, వాటి ప్రాతిపదికల మీదనే ఎన్నికల పోరాటం చేసిన పార్టీ, తాను అధికారంలోకి వచ్చాక, తన భావాలకు అనుగుణమైన పాలనను చేపట్టడం సహజం. విధాన సౌధలో బిజెపి సభ్యుల స్థానంలో తమ సభ్యులను కూర్చోబెట్టడం కాదు, బిజెపి తన హయాంలో చేపట్టిన, అనుసరించిన పద్ధతులను, విధానాలను సమీక్షించినప్పుడే అధికారమార్పిడికి అసలైన సార్థకత. బ్రిటిష్ వారు వెళ్లిపోయిన తరువాత కూడా స్వతంత్ర భారత ప్రభుత్వం వలసప్రభువులలాగానే ఆలోచించిందా? కాంగ్రెస్‌ను ఓడించిన డిఎంకె ప్రభుత్వం తన విధానాలను అమలులోకి తేలేదా? తెలుగుదేశం ప్రభుత్వం కాంగ్రెస్ పాలనలోని అనేక అంశాలను తారుమారు చేయలేదా? అంతెందుకు, ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రాకపోయినా, పక్కదారులలో బెంగళూరు గద్దెనెక్కినా, ఎడ్యూరప్ప, బొమ్మై ప్రభుత్వాలు కాంగ్రెస్‌కు భిన్నమైన విధానాలను అనుసరించి, కర్ణాటక భావ వాతావరణాన్నే మార్చే ప్రయత్నం చేశారు కదా? కర్ణాటక ప్రజలు స్పష్టమైన విజయాన్ని ఇచ్చి ఓడించిన విధానాలను ఆధిపత్యం నుంచి, అమలు నుంచి తొలగించడం తరువాతి ప్రభుత్వం బాధ్యత కూడా.
కర్ణాటక చారిత్రకంగా కూడా సంఘ సంస్కరణకు, చురుకైన భావ సంచలనాలకు వేదికగా ఉంటూ వచ్చింది. ఆధునిక కర్ణాటక కూడా ప్రగతిశీల, ఉదార భావాలకు, ప్రయోగశీల, ప్రయోజనవాద కళారంగాలకు పుట్టినిల్లుగా ఉంటూ వచ్చింది. అనేక మంది రచయితలు, నటులు, ప్రయోక్తలు, దర్శకులు కర్ణాటక సృజనాత్మక రంగంలో అద్భుతాలు సాధించి ఎన్నెన్నో గౌరవాలు పొందారు. కర్ణాటక సమాజం అనేక మతాలకు సామరస్య జీవ నానికి నెలవుగా ఉంటూ వచ్చేది. అటువంటి రాష్ట్ర వాతావరణం, గత పదేళ్ల కాలంలో, ముఖ్యంగా గత ఐదేళ్ల కాలంలో ఎక్కువగా కలుషితమైపోయింది. మైనారిటీల సంస్కృతిని, జీవనోపాధులను లక్ష్యంగా పెట్టుకుని అల్లరిమూకలు ఆందోళనలు చేయడం, అందుకు అనుగుణంగా ప్రభుత్వంలోని వారు కూడా వ్యవహరించడం పెరిగిపోయింది. ప్రజలలో విభజనను పెంచే విధంగా ప్రభుత్వపెద్దలు, అధికారపార్టీ ప్రముఖులే మాట్లాడుతుంటే ఆ హద్దు మీరిన అరాచకంలో సామాన్యులు హతాశులై మిగిలిపోయారు. మత విభజనకు తోడు, చెప్పలేనంత అవినీతి.
గోవధను నిషేధించాలన్న డిమాండ్ శతాబ్దాల కాలం నాటిది. ఆధునిక కాలంలో కూడా దాని మీద ఎంతో చర్చ జరిగింది. ఏకాభిప్రాయం లేకుండా, నిషేధాలు విధించడాన్ని గాంధీజీ కూడా సమ్మతించలేదు. అయితే, గోసంరక్షణ పరిధిలోకి వచ్చే పశువుల గురించిన అస్పష్టత కూడా కొనసాగుతూ వస్తోంది. ఎడ్లు, లేగలు, దున్నలు, బర్రెలు వంటివి కూడా గోవుల కిందికి వస్తాయా అన్నది ప్రశ్న. వ్యవసాయ రంగంలో పశువుల వాడకం తగ్గుతూ వస్తున్న క్రమంలో, రైతుల ఆదాయాలు దిగజారుతున్నప్పుడు, పశుపోషణ మునుపటి మాదిరిగా గిట్టుబాటుగా ఉండడం లేదు. పశువులను సంతలో పెట్టేది రైతులే. పనికి వచ్చే పశువులు తిరిగి పనిలోకి వెడతాయి. శక్తి ఉడిగినవి కబేళాలకు వెడతాయి. ఇది అందరికీ తెలిసిందే. కబేళాలు, మాంస విక్రయ వ్యాపారాలు చేసేవారు మైనారిటీ మతస్థులు కాబట్టి, వారి జీవనోపాధిని ప్రభావితం చేయాలనే ఉద్దేశంతో, గోరక్షణ పరిధిని అస్పష్టంగా నిర్వచిస్తూ కర్ణాటకలో మూడేళ్ల కిందట గోవధ నిషేధ చట్టం తెచ్చారు. దానితో లక్షలాది మంది మాంస వృత్తి వారు దెబ్బతినిపోయారు. వారు కొనడాలు అమ్మడాలు చేయనందువల్ల, అమ్ముకోవలసిన రైతులు పశు విక్రయాలు చేయలేకపోతున్నారు. గత ప్రభుత్వ చర్య ఒకరిని బాధించడానికి నిర్ణయం తీసుకుంటే, అది అనేక మందిని దెబ్బతీసింది. ఇటీవలి ఎన్నికల ఓటమిలో ఈ అంశం ఎంతో ప్రభావం వేసింది. గోవధ నిషేధ చట్టంలో స్పష్టత కోసం సమీక్షిస్తామని ముఖ్యమంత్రి అంటున్నారు. గేదెలను చంపడం తప్పు కానప్పుడు, ఆవును చంపితే ఏమిటి, అని ఒక మంత్రి ప్రశ్నించడం చర్చ కోసమే తప్ప, అదే ప్రభుత్వ విధానం కాదు. బిజెపి ప్రభుత్వాలలో కూడా అధికప్రసంగం చేసే మంత్రులూ నాయకులూ ఉన్న విషయం తెలిసిందే.
అట్లాగే, హిజాబ్ వివాదం సమీక్ష కానీ, పాఠ్యపుస్తకాలలో చేసిన మార్పుల సమీక్ష కానీ కర్ణాటక సమాజాన్ని తిరిగి గాడిలో పడవేయడానికి అవసరమైనవే. అదే సమయంలో కర్ణాటక ప్రభుత్వం నూతన ఉత్సాహంలో కొత్త వివాదాలు కొనితెచ్చుకోదని ఆశించాలి. కర్ణాటకలో ఏమిజరుగుతున్నదన్న దాని ప్రభావం తక్కిన దేశమంతా ఉంటుందని, వచ్చే ఏడు సార్వత్రక ఎన్నికలున్నాయని కర్ణాటక కాంగ్రెస్ నేతలు మరచిపోగూడదు. ఎన్నికలలో బిజెపి ఓడిపోయినా, దాని ఓటర్ల సంఖ్య తగ్గలేదని, ప్రజలలో ఆ మేరకు ప్రభావం ఉంటుందని గుర్తు పెట్టుకోవాలి. విధాన నిర్ణయాలను తారుమారు చేయడం సరే, ప్రజలలో పొరపాటు, తప్పుడు అభిప్రాయాలు ఏర్పడి ఉంటే వాటిని మార్చడానికి తగిన ప్రచార కృషి కూడా జరగడం అవసరం.
Updated Date - 2023-06-08T00:33:58+05:30 IST