ప్రజల గొంతు వినండి!
ABN, First Publish Date - 2023-08-26T03:47:03+05:30
భారతదేశం అధ్యక్షతన వచ్చేనెల 9, 10 తేదీల్లో జరగబోయే జి20 సదస్సుకు ఏర్పాట్లు జోరందుకున్నాయి. విస్తృతమైన భద్రతా ఏర్పాట్లతో సెప్టెంబర్ 7నుంచే ఓ నాలుగురోజుల పాటు...
భారతదేశం అధ్యక్షతన వచ్చేనెల 9, 10 తేదీల్లో జరగబోయే జి20 సదస్సుకు ఏర్పాట్లు జోరందుకున్నాయి. విస్తృతమైన భద్రతా ఏర్పాట్లతో సెప్టెంబర్ 7నుంచే ఓ నాలుగురోజుల పాటు దేశరాజధాని దాదాపుగా లాక్‌డౌన్ వాతావరణాన్ని చవిచూడబోతున్నది. రొటేషన్ పద్ధతిలో లభించే అధ్యక్షస్థానమైనప్పటికీ, తన హయాంలో జరుగుతున్న ఈ సదస్సును నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో భారీ ఖర్చుతో వివిధ స్థాయిల్లో, వేర్వేరు రూపాల్లో అనుబంధ సదస్సులు, చర్చలు చాలాకాలంగా సాగుతూనే ఉన్నాయి. అమృతకాలంలో అందివచ్చిన అద్భుతవరంగా ఈ సదస్సును అభివర్ణిస్తూ, గత ఏడాది నవంబరులో మోదీ విడుదల చేసిన లోగో, థీమ్ ‘వసుదైవ కుటుంబకం’ భావనను, సుస్థిర, సంపూర్ణ, బాధ్యతాయుత సమ్మిళితవృద్ధి ఆశయాన్ని ఘనంగా చాటిచెప్పాయి. ఈ మహత్తర కర్తవ్యసాధనలో ప్రపంచాధినేతలకు ప్రజల ఆకాంక్షలు తెలియాల్సిన అవసరాన్ని, ప్రజాభాగస్వామ్యం ప్రాధాన్యతను తత్సంబంధిత వెబ్‌సైట్ విస్తృతంగా వివరించింది. లక్ష్యాల సాధనలో పౌరసమాజం పాత్రను, ఆయా సంస్థలు, సంఘాల భాగస్వామ్యం ప్రాధాన్యాన్ని ఎంతగానో కీర్తించిన ఈ వెబ్‌సైట్ చూసి మిగతా ప్రపంచం కూడా ముచ్చటపడి ఉంటుంది. ఆ స్ఫూర్తికి పూర్తిభిన్నంగా ఈ జి20 సదస్సును పురస్కరించుకొనే ఇటీవల డెబ్బయ్‌కి పైగా వివిధ ప్రజా, కార్మిక, పౌరసంఘాలు దేశరాజధానిలో నిర్వహించిన ఓ సదస్సును మోదీ ప్రభుత్వం ఎంత అమానుషంగా అణచివేసిందో కూడా ప్రపంచం గమనించే ఉంటుంది.
మార్కెట్ శక్తుల ప్రయోజనాలకే పరిమితం కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సామాన్య ప్రజల సమస్యలమీద కూడా జి20దేశాధినేతలు చర్చించాలని, ప్రజల గొంతువినాలని, వారి కష్టనష్టాలు పట్టించుకోవాలన్నది ఈ ‘వుయ్–20’ పీపుల్స్ సమ్మిట్ ప్రధానోద్దేశం. ఇది బహిరంగ సభకాదు. ఢిల్లీలోని హరికిషన్‌సింగ్ సుర్జీత్ భవనంలో ఆగస్టు 18న ప్రజాసంఘాల వేదిక ఆధ్వర్యంలో మూడు రోజుల సదస్సు ఆరంభమైంది. దేశంలోని వేర్వేరు ప్రాంతాలనుంచి వివిధరంగాలకు చెందిన మేధావులు, ఆర్థికవేత్తలు, కొందరు రాజకీయనాయకులు, పాత్రికేయులు పాల్గొని ప్రత్యామ్నాయ అభివృద్ధి విధానాలపై చర్చించారు. శుక్రవారం సభ సజావుగానే సాగింది. శనివారం సభ ఆరంభమైన కొద్దిసేపట్లోనే కేంద్రప్రభుత్వం అధీనంలో ఉన్న ఢిల్లీ పోలీసులు ఒక మిలటరీ ఆపరేషన్ స్థాయిలో భవనంమీద విరుచుకుపడ్డారు. ప్రాంగణం మొత్తాన్ని బారికేడ్లతో మూసివేసి, గేట్లకు, ప్రధాన ద్వారానికీ తాళాలు వేసి, లోపల ఉన్నవారిని నిర్బంధించారు. బయట ఉన్నవారిని లోపలకు పోనివ్వకుండా అడ్డుపడ్డారు. ఏడువందలమంది డెలిగేట్లను ఇలా అటూ ఇటూ గంటలపాటు నిర్బంధించడంతో సుదూరప్రాంతాలనుంచి వచ్చినవారు చాలా ఇబ్బందులు పడ్డారు. తాగడానికి నీరు లేక, ఎండ భరించలేక, బాత్రూమ్ సౌకర్యం లేక నరకం చూడాల్సివచ్చింది. తమ అవసరాలకు అనుమతించమని లోపలివారూ, బయటివారూ పోలీసులను బతిమాలుకున్నా ఫలితం లేకపోయింది.
బహిరంగసభ కాకున్నా అనుమతి లేదన్న వాదనతో పోలీసులు దీనిని భగ్నం చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. నాలుగుగోడల మధ్య జరిగే సమావేశానికి కూడా అనుమతులు ఉండాలన్న నిబంధన ఢిల్లీ పోలీసు చట్టంలో, వెబ్‌సైట్‌లో ఎంతవెదికినా కనిపించదు. అలాగే, వచ్చేనెలలో జరగబోయే జి20 సదస్సుకు ఈ సమావేశ స్థలం ఉన్న దీన్‌దయాళ్ ఉపాధ్యాయ మార్గం కీలకమైనది కనుక, ఇరవైరోజుల ముందు జరుగుతున్న ఈ సమావేశానికి కూడా ముందస్తు అనుమతి ఉండాలన్న పోలీసుల వాదన అర్థంలేనిది. నిరసనలు, ప్రదర్శనల వంటివి లేకుండా ప్రశాంతంగా సాగుతున్న చర్చలను కూడా అడ్డుకోవడానికి పాలకులు సిద్ధపడటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
నాలుగుగోడల మధ్యన కూడా ఈ దేశంలో ప్రజాస్వామ్యం గురించి, ప్రజలు, పర్యావరణం ఇత్యాది అంశాలపైనా మాట్లాడుకోవడానికి అనుమతిలేదన్నది ఈ దాడిసారాంశం. అక్కడ చేరినవారంతా ప్రస్తుత పాలకుల దృష్టిలో ‘అర్బన్‌నక్సలైట్లు’ కావచ్చును గానీ, ఈ ‘వుయ్20’ పీపుల్స్ సమ్మిట్ ప్రజా ఆకాంక్షలను, సమస్యలను చక్కగా ఎత్తిపట్టింది. ప్రజాశ్రేయస్సుకు సంబంధించిన ఎజెండా అంటూ లేకుండా, ప్రపంచబ్యాంక్, ఐఎంఎఫ్ పెంచిపోషిస్తున్న ఉదారవాద విధానాలనే జి20 ముందుకు తెస్తున్నదని, ఇది సమాజంలో అసమానతలకు, సంక్షోభాలకు కారణమవుతున్నదని ప్రకటించింది. ప్రజల ఆహారం, జీవనోపాధి సమస్యల పరిష్కారం నుంచి, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పుల వరకూ సామాన్యుడి శ్రేయస్సే లక్ష్యంగా పరిష్కారాలు ఉండాలని దేశాధినేతలను అభ్యర్థించడం మన పాలకులకు రుచించకపోవడం విషాదం.
Updated Date - 2023-08-26T03:47:03+05:30 IST