ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహాప్రతిమ

ABN, First Publish Date - 2023-04-14T02:07:30+05:30

తమకోసం అష్టకష్టాలకు బలి అవుతున్న సహోదరుడు ‘కలడంబేత్కరు’, అతనిని దర్శించి వెళ్లమని గబ్బిలానికి చెబుతాడు తన కావ్యంలో మహాకవి జాషువా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

తమకోసం అష్టకష్టాలకు బలి అవుతున్న సహోదరుడు ‘కలడంబేత్కరు’, అతనిని దర్శించి వెళ్లమని గబ్బిలానికి చెబుతాడు తన కావ్యంలో మహాకవి జాషువా. ‘యావద్భారత భూమి కంపిలగ శంఖారావములు జేసి’ వీరావేశాన్ని సృష్టించి నిష్క్రమించిన అంబేడ్కర్ ప్రభావం వల్ల దళితులను ‘యావద్దేవత లాలయంబులకు నాహ్వానిం’చారని బాబాసాహెబ్ అస్తమించినప్పుడు జాషువా నివాళులర్పిస్తారు.

దేవతల పేరు చెప్పి, మనుషుల మధ్య తారతమ్యాలను, అస్పృశ్యతలను విధించిన సామాజిక వ్యవస్థలో, కేవలం ఆలయ ప్రవేశాలు సాధించినంత మాత్రాన సాంఘిక విప్లవకారులు కాలేరు. భీమ్‌రావ్‌ అంబేడ్కర్ చేసింది అంతమాత్రమే కాదు. ఆయన జీవితాంతం పోరాడింది మనుషుల చుట్టూ గీసిన అనేక గిరులను విశాలం చేయడానికి, హెచ్చుతగ్గులను చదును చేయడానికి, తలుపులు బిగించుకుని కూర్చున్న రకరకాల గర్భగుడులలోకి నిషిద్ధ మానవులను అందరినీ నడిపించుకువెళ్లడానికి. సాటి మనిషిని హీనంగా చూసే అనైతికత నుంచి యావత్ సమాజాన్ని ఉద్ధరించడానికి.

ఆయన దళితుల నాయకుడో, మరో అభాగ్య వర్గం నాయకుడో కాదు. మొత్తం దేశానికి తోవ చూపినవాడు. ప్రపంచానికే ఆశ్చర్యమూ ఆదర్శమూ అయినవాడు. దళితులను సాధికారతా ప్రయాణంలోకి రమ్మన్నాడు. అగ్రకులాలను అమానవీయత నుంచి బయటపడమన్నాడు. ఒక మనిషి ఒక విలువ అని ఆయన చేసిన సద్ధర్మ బోధ అర్థం అయితే, ఆధిపత్యంతోనో బానిసత్వంతోనో రోగగ్రస్తులయినవారందరికీ చికిత్స జరుగుతుంది.

ఆధునికతా ప్రయాణంలో ఓనమాల దగ్గరే ఉన్న ఒక దేశానికి ఆయన ఉన్నతమైన రాజ్యాంగాన్ని ఇచ్చారు. స్వేచ్ఛలను, పరస్పర బాధ్యతలను ఎప్పటికప్పుడు పునర్ నిర్వచించుకుంటూ, విశాలం చేసుకుంటూ, మరింత మానవీయంగా మార్చుకుంటూ ప్రయాణించడానికి కావలసిన ప్రాతిపదికలన్నీ భారత రాజ్యాంగంలో పొందుపరిచారు. అంబేడ్కర్ అంటే ఆయన జ్ఞానం, ఆయన పంచిన చైతన్యం, ఆయన విశ్వసించిన విలువలు, ఆయన అందించిన రాజ్యాంగ స్ఫూర్తి.

విగ్రహారాధన మంచిదా కాదా అన్న చర్చ ఎప్పటినుంచో ఉన్నది. మూర్తి కంటె స్ఫూర్తి ఎప్పటికీ గొప్పదే. కానీ స్ఫూర్తి ఇచ్చేందుకు ఒక్కొకసారి మూర్తులు కూడా కావలసి ఉంటుంది. ఒక రూపం ఏ సారం లేకుండా మారిపోతే, ప్రభావరహితం అయిపోతుంది నిజమే. కానీ, సారమే శతసూర్యప్రభలతో వెలిగిపోతుంటే, రూపం ఒక ఆలంబన అవుతుంది, ఒక ఆదర్శానికి భౌతిక అనువాదం అవుతుంది.

ఏ స్ఫూర్తినీ ఇవ్వని, ఏ చారిత్రక ప్రాసంగికత లేని ఎన్నో విగ్రహాలను వీధి కూడళ్లలో చూస్తుంటాము. వాడ అంచున నిలబెట్టినా, అంబేడ్కర్ మాత్రం వెలిగిపోతుంటారు. అందుకే, మనుధర్మ వారసులు, ఆధిపత్య శక్తులు అంబేడ్కర్ విగ్రహాలపై దాడులు చేస్తుంటారు. ఊరి నడిబొడ్డులోకి విగ్రహస్ఫూర్తి రాకుండా అడ్డుకుంటుంటారు. విగ్రహాగ్రహ సందర్భాలలో ఒక్కసారిగా మన సమాజం మేడిపండు పొట్ట విచ్చుకుపోతుంది.

హైదరాబాద్ మహానగరం నడిబొడ్డున అంబేడ్కర్ మహా ప్రతిమ ఆవిష్కృతం అవుతున్నది. ఇది ఒక వైచిత్రి. ఒక సంకేతాత్మక ప్రకటన. అణగారి ఉన్న ప్రజావర్గాలకు, ప్రజాస్వామిక వాదులకు, రాజ్యాంగ ప్రేమికులకు ఇది ఒక పండుగ. ఒక సాధికారతా సందర్భం. రేపటిలోకి నడవడానికి ఆశను అందించే దీపస్తంభం. అంబేడ్కర్ మహా విగ్రహాల పరంపరలో ఇది మొట్టమొదటది. రాజ్యాంగ నిర్మాత కల్పించిన వెసులుబాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అవతరణకు కీలకదోహదం అందించడం ఈ విగ్రహస్థాపనకు ఒకానొక ప్రేరణ అయి ఉండవచ్చు. అంబేడ్కర్ సమగ్ర వ్యక్తిత్వమే ఇందుకు ప్రేరణ అయి ఉంటే కనుక అది మరింత సంతోషకరం.

మహనీయుల విగ్రహాలను, స్మారకాలను పాలకులు ఏ కారణంతో నిర్మించినా, ప్రజలు వాటి నుంచి తమకు కావలసిన పత్రహరితాన్ని పొందవచ్చు. అంబేడ్కర్ మహా ప్రతిమ ప్రభుత్వాల ఔదార్యంతో లభిస్తున్న వరం కాదు. ప్రజలలోని చైతన్యానికి, ఆకాంక్షలకు తప్పనిసరిగా ఇవ్వవలసి వస్తున్న గుర్తింపు. చాలా కాలంగా నెరవేరని హక్కు ఇది.

మరి ఇప్పుడేమి చేయాలి? ఈ సందర్భం గడిచాక, భక్తిపారవశ్యాలు మందగించాక, ఆయన అభిమానులు, అనుచరులు అంతా, ఆయన సారాన్ని గ్రహించే ప్రయత్నం చేయాలి. అంబేడ్కర్ రచనలను చదవాలి, చర్చించాలి. రాజ్యాంగ రచనా ప్రక్రియ గురించి అధ్యయనం చేయాలి. రాజ్యాంగం మౌలికతను కాపాడుకోవడం కోసం తపన పడాలి. అంబేడ్కర్ పేరు జపించే వ్యక్తులు, శక్తులు ఎంతవరకు ఆయన సిద్ధాంతాలను అర్థం చేసుకున్నారో, ఆచరిస్తున్నారో బేరీజు వేసుకోవాలి. ఆయన కుడిచేతి చూపుడు వేలు దృక్పథం అయితే, ఎడమచేతితో పట్టుకున్న భారత రాజ్యాంగం ప్రజలకు అందిస్తున్న ఆయుధం.

ఆకాశాన్నంటే ఎంతటి స్మారకమయినా, ప్రజలు స్ఫూర్తి పొంది చైతన్యం నింపుకున్నప్పుడే జీవకళతో తొణికిసలాడుతుంది.

Updated Date - 2023-04-14T02:07:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising