ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాలిక్‌ ‘మన్‌ కీ బాత్‌’

ABN, First Publish Date - 2023-04-19T03:03:09+05:30

జమ్మూకశ్మీర్‌ మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ ‘ద వైర్‌’ ఇంటర్వ్యూలో పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా అగ్గిరాజేయడమే కాక, దేశప్రజలకు కూడా విస్మయాన్ని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జమ్మూకశ్మీర్‌ మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ ‘ద వైర్‌’ ఇంటర్వ్యూలో పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా అగ్గిరాజేయడమే కాక, దేశప్రజలకు కూడా విస్మయాన్ని కలిగించాయి. పాత్రికేయుడు కరణ్‌థాపర్‌ సంధించిన ప్రశ్నలకు ఏ మాత్రం సంశయించకుండా, తాను గవర్నర్‌గా ఉన్నకాలంలో జరిగిన పుల్వామా దాడినుంచి జమ్మూకశ్మీర్‌ స్వతంత్ర ప్రతిపత్తి రద్దు నిర్ణయం వరకూ అనేక పరిణామాలపై కుండబద్దలు కొట్టినట్టు మాలిక్‌ మాట్లాడారు. 2019లో నలభైమంది సైనికుల మరణానికి కారణమైన ఉగ్రదాడి విషయంలో మన వ్యవస్థల వైఫల్యాన్ని ప్రస్తావించడంతోపాటు, ఆ విషయాలు ఎక్కడా మాట్లాడకుండా తనను ప్రధాని మోదీ, దేశభద్రతా సలహాదారు డోభాల్‌ అప్పట్లో నోరుమూయించేశారంటూ ఆరోపించారు. పుల్వామా దాడి విషయంలో అనంతరకాలంలో అడపాదడపా అనుమానాలు వెలిబుచ్చి, అధికారపక్షం నుంచి దేశద్రోహులుగా విమర్శలు ఎదుర్కొన్న విపక్షాలకు మాలిక్‌ వ్యాఖ్యలు ఇప్పుడు కొత్తశక్తినిచ్చాయి. 2019సార్వత్రక ఎన్నికల్లో ఘనవిజయానికి ఈ దాడిని వాడుకున్నారా? అని ఠాక్రే పార్టీ నిలదీస్తోంది. శ్వేతపత్రం విడుదలచేసి దేశప్రజలకు వాస్తవాలు తెలియచేయమని కాంగ్రెస్‌ విజ్ఞప్తిచేస్తోంది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని మమతా బెనర్జీ అంటున్నారు. బీజేపీ ప్రభుత్వం ఆ ఘాతుకాన్ని నివారించకపోగా, ఎన్నికలముందు మోదీ తన ప్రతిష్ఠ పెంచుకోవడానికి వాడుకున్నారన్నది విపక్షాల వాదన.

అతి ముఖ్యుడినోటనుంచే లోగుట్టు బయటపడటంతో మాజీ సైన్యాధ్యక్షుడు శంకర్‌రాయ్‌ చౌదరి సైతం పాలకులను బలంగా నిలదీయగలుగుతున్నారు. నిఘావ్యవస్థల వైఫల్యం స్పష్టంగా ఉన్నందున సైనికుల దారుణమరణానికి మోదీ, ఢోబాల్‌ బాధ్యత వహించాలని అంటున్నారు. నిజానికి, ఇప్పుడు మాలిక్‌, శంకర్‌రాయ్‌ వంటివారు చెప్పిన విషయాల్లో అత్యధికం గతంలో సంఘటన జరిగిన వెనువెంటనే చర్చకు వచ్చాయి. జమ్మునుంచి కశ్మీర్‌కు రోడ్డుమార్గాన సైనికులను తరలించడం ప్రమాదం కనుక ఐదు విమానాలు ఇవ్వమని కేంద్రహోంశాఖను సీఆర్పీఎఫ్‌ అభ్యర్థిస్తే కాదుపొమ్మన్నందువల్లనే ఈ ఘోరం జరిగిందన్నది వాస్తవం. సైనికులకు ఎయిర్‌ఫోర్స్‌, బిఎస్‌ఎఫ్‌ విమానాలు కానీ, ఒక పౌరవిమానాన్ని కానీ సమకూర్చలేని స్థితిలో కేంద్రప్రభుత్వం ఉన్నదా? అన్న ప్రశ్న సముచితమైనదే. అలాగే, ఈ ఘోరం జరగడానికి ముందు కనీసం పదిరోజుల పాటు పేలుడుపదార్థాలతో నిండిన స్కార్పియో జమ్మూకశ్మీర్‌లో తిరుగుతున్నా భద్రతావ్యవస్థలు ఎందుకు గుర్తించలేకపోయాయని దిగ్విజయ్‌ సింగ్‌ వంటివారు మొన్న జనవరిలో కూడా ప్రశ్నించారు. విమానాలద్వారా సైనికుల తరలింపు జరిగివున్నా, ఆర్డీఎక్స్‌ దట్టించిన వాహనాన్ని నిఘావ్యవస్థలు ముందే గుర్తించినా, వాహనాలు ప్రయాణించే మార్గాన్ని క్షుణ్ణంగా వడబోసినా ఈ నలభైమంది సైనికులు క్షేమంగా బ్యారెక్స్‌ చేరగలిగేవారు.

సత్యపాల్‌ మాలిక్‌ నిలకడైన మనిషి కాదని నిరూపించేందుకు బీజేపీ నేతలు శ్రమపడుతున్నారు. ఆయన వ్యాఖ్యల్లో దుర్బుద్ధి ఉన్నదా, రాజకీయం ఉన్నదా అన్నది అప్రస్తుతం. పుల్వామా ఘటన జరిగినప్పుడు గవర్నర్‌గా ఉన్న వ్యక్తే ఈ ఘటనకు మనవైఫల్యమే కారణమని అంటున్నారు. ఆ విషయం చెప్పబోతే మోదీ, ఢోబాల్‌ తనను నోరువిప్పవద్దని హెచ్చరించడం ద్వారా పాకిస్థాన్‌మీద విరుచుకుపడే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తనకు అర్థమైందని అంటున్నారు. తదనుగుణంగానే పుల్వామాకు ప్రతీకారంగా మోదీ ప్రభుత్వం బాల్‌కోట్‌ దాడులు చేపట్టింది. పెద్దనోట్ల రద్దువంటి నిర్ణయాలతో దేశప్రజలను ముప్పుతిప్పలు పెట్టి, ఉపాధి అవకాశాలను పెద్ద ఎత్తున దెబ్బతీసిన మోదీ ప్రభుత్వం మీద ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారని భావిస్తున్న తరుణంలో, సరిగ్గా ఎన్నికల ముందు సంభవించిన ఈ వరుస పరిణామాలను విపక్షాలు అనాదిగా అనుమానిస్తునే ఉన్నాయి. చైనా చొరబాట్లనుంచి అదానీ వ్యవహారం వరకూ ప్రతీ అంశాన్నీ జాతీయతతోనో, దేశభక్తితోనో ముడిపెట్టి ఎదుటివారి నోరుమూయించే కేంద్రపెద్దలు దేశభద్రతకు సంబంధించి మాలిక్‌ చేసిన ఆరోపణల్లో నిజం లేదంటే ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అలాగే, ఎన్నికల్లో లబ్ధికే పుల్వామా ఉగ్రదాడి, ప్రతీకార బాలాకోట్‌ దాడులు జరిగాయన్న విమర్శలకు అనుమానాలకు ఇప్పటికైనా స్వస్తిచెప్పేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో దర్యాప్తు జరగాలి.

Updated Date - 2023-04-19T03:03:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising