ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మండుతూనే ఉంది!

ABN, First Publish Date - 2023-09-28T00:54:20+05:30

పరిస్థితిలో మర్పువచ్చింది, శాంతిభద్రతలు మెరుగుపడుతున్నాయి అంటూ ఐదునెలలపాటు ఇంటర్నెట్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసిన మణిపూర్‌ ప్రభుత్వం, కేవలం నలభై ఎనిమిదిగంటల్లో...

పరిస్థితిలో మర్పువచ్చింది, శాంతిభద్రతలు మెరుగుపడుతున్నాయి అంటూ ఐదునెలలపాటు ఇంటర్నెట్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసిన మణిపూర్‌ ప్రభుత్వం, కేవలం నలభై ఎనిమిదిగంటల్లో దానిని తిరిగి విధించింది. క్షేత్రస్థాయి ఉద్రిక్తతలు, పరిస్థితులమీద రాష్ట్ర పాలకులకు నిజంగా అవగాహనలేదా లేక అంతా ప్రశాంతం అంటూ మరోమారు మభ్యపెట్టేందుకు ప్రయత్నించారా?. కశ్మీర్‌ తరువాత అత్యధికకాలం ఇంటర్నెట్‌మీద నిషేధం విధించిన రికార్డు ప్రస్తుతానికి ఈ రాష్ట్రానిదే. మే 3వతేదీన కుకీల ర్యాలీ ఆధారంగా హింస రేగడంతో, తప్పుడు సమాచారవ్యాప్తితో శాంతిభద్రతలను నియంత్రించడం సాధ్యం కావడం లేదంటూ ప్రభుత్వం ఈ నిషేధాన్ని విధించింది. కానీ, దాని అసలు లక్ష్యం రాష్ట్రంలో కొనసాగుతున్న మారణకాండ మిగతా ప్రపంచానికి తెలియనివ్వకుండా నిరోధించడమేనని అనంతర పరిణామాలు రుజువుచేశాయి. అంతేకాదు, అధికారిక సమాచారం లేకపోవడం పుకార్ల వ్యాప్తికి మరింత దోహదం చేసింది. ఇప్పుడు, జూలై నుంచి కనిపించకుండాపోయిన ఇద్దరు మీతీ యువకుల మృతదేహాలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావడంతో నిరసనలు, విధ్వంసం రేగాయి. ప్రభుత్వం ఇంటర్నెట్‌ నిషేధంతో పాటు, విద్యాసంస్థలు మూసేసింది, ఇంఫాల్‌ లోయలోని కొన్ని ప్రాంతాలు మినహా యావత్‌ రాష్ట్రాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించి, సాయుధదళాల ప్రత్యేకాధికారాల చట్టం అమలును మరో ఆరునెలల పాటు పొడిగించింది. బీరేన్‌సింగ్‌ ప్రభుత్వాన్ని ఇప్పటికైనా రద్దుచేస్తారా, నూటయాభైరోజులుగా ఆ రాష్ట్రం మండుతున్నా అక్కడ కాలూనని ప్రధాని నరేంద్రమోదీ ఒకసారి వెళ్లి కాస్తంత ఓదార్చివస్తారా? అని కాంగ్రెస్‌ పార్టీ అడుగుతోంది.

నెలల తరబడి ఏమాత్రం మార్పుసాధించని, పరోక్షంగా పరిస్థితులకు ప్రధానకారకుడు అయిన బీరేన్‌ సింగ్‌ కేంద్రపాలకులు కేవలం తమ రాజకీయ ప్రయోజనాలకోసం కాపాడుకొస్తున్నారు. ముఖ్యమంత్రిగా అందరివాడు కావాల్సిన ఆయన మీతీల పక్షం వహిస్తున్నందున కుకీలు ప్రభుత్వ వ్యవస్థలనే విశ్వసించడం మానేశారు. పోలీసులు, ప్రభుత్వయంత్రాంగం కుకీల నమ్మకాన్ని కోల్పోయాయి. అలాగే, అసోం రైఫిల్స్‌ వంటివి కుకీలపక్షాన నిలుస్తున్నాయంటూ మీతీలు వాటితో ఘర్షణపడుతున్నారు. కేంద్రబలగాలను అడ్డుకొనేందుకు, వాటినుంచి తమవారిని రక్షించుకొనేందుకు మీతీ మహిళలు హింసకు పాల్పడుతున్న ఘట్టాలు అనేకం చూస్తున్నాం. మీతీలు, కుకీల మధ్య వైరమే తప్ప సయోధ్యకు ఏమాత్రం తావులేని వాతావరణంలో, ఎవరికి వారు అడ్డుగోడలు కట్టుకుంటూ, తమ తమ ప్రాంతాలను రక్షించుకుంటున్నారు. నిత్యావసరాల సరఫరాకు కూడా తీవ్ర ఆటంకం వాటిల్లుతున్నందున ధరలు పెరిగి పేదలు ప్రధానంగా ఇబ్బందిపడుతున్నారు. కొన్ని నెలలపాటు ఉధృతంగా సాగిన హింసాకాండ ఇప్పుడు తగ్గుముఖం పట్టిందన్న ప్రభుత్వవాదన నిజమే అనుకున్నా, అడపాదడపా సాగుతున్న పరస్పర కాల్పులు, దాడుల ఘటనలు తిరిగి విద్వేషాన్ని రాజేస్తున్నాయి. పోలీసుల చేతుల్లోనుంచి మాయమైన వేలాది తుపాకులు హింస నిరవధికంగా సాగడానికి ఉపకరిస్తున్నాయి.


పౌరసమాజం కూడా నిలువునా చీలిన స్థితిలో పరస్పర విశ్వాసాన్ని పెంపొదించాల్సిన కేంద్రప్రభుత్వం క్రియాశీలకంగా వ్యవహరించకుండా రాష్ట్రాన్ని బీరేన్‌సింగ్‌కు పూర్తిగా వదిలేసింది. ప్రజాసమూహాల మధ్య సయోధ్య సాధించనంతవరకూ చిన్న నిప్పురవ్వ కూడా దావానలంగా మారుతుంది. నమ్మకాన్ని పెంచే, గాయాలు మాన్పేదిశగా ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా కేవలం ఇంటర్నెట్‌ నిషేధంతోనో, సాయుధచట్టాన్ని ప్రయోగించడం ద్వారానో పరిస్థితులను దారికితేవడం అసాధ్యం. ఆ దిశగా అడుగుపడాలంటే, ముఖ్యమంత్రిగా ఉండే నైతిక అర్హత కోల్పోయిన బీరేన్‌ సింగ్‌ స్థానంలోకి మరొకరు రావడం అవసరం. రాష్ట్రప్రభుత్వం తమకు పూర్తిగా సహకరిస్తున్నన్నదని, ముఖ్యమంత్రిని మార్చేది లేదని గతంలో ప్రకటించి, అరవైవేలమంది కేంద్రబలగాలతో శాంతిభద్రతల నిర్వహణను పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్న హోంమంత్రి అమిత్‌ షా పరిస్థితులను ఏమాత్రం చక్కదిద్దలేకపోవడం ఆశ్చర్యకరం. నెలలతరబడి మణిపూర్‌ అలా మండుతూనే ఉండటం వెనుక మన ఊహకు అందని భారీ కుట్ర ఏదో ఇంకా మిగిలే ఉందని అనిపిస్తోంది.

Updated Date - 2023-09-28T00:54:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising