మణిపూర్ మంటలు
ABN, First Publish Date - 2023-05-09T02:10:51+05:30
‘డబుల్ ఇంజన్’ సర్కారుతోనే ప్రజలకు శాంతి సౌభాగ్యాలు, రాష్ట్రానికి బోలెడు అభివృద్ధి అని బీజేపీ ఊదరగొడుతున్న తరుణంలో, మణిపూర్ తగలబడుతోంది. జరుగుతున్న హింసలో...
‘డబుల్ ఇంజన్’ సర్కారుతోనే ప్రజలకు శాంతి సౌభాగ్యాలు, రాష్ట్రానికి బోలెడు అభివృద్ధి అని బీజేపీ ఊదరగొడుతున్న తరుణంలో, మణిపూర్ తగలబడుతోంది. జరుగుతున్న హింసలో ఎన్ని ప్రాణాలు పోయాయో స్పష్టంగా తెలియదు కానీ, అధికారిక లెక్కల ప్రకారం ఓ అరవైమంది మరణించారు. ఇరవైవేలమంది నిరాశ్రయులైనారు. ఇంత ఘోరకలి మరో విపక్షపాలిత రాష్ట్రంలో జరిగివుంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా? రాష్ట్రపతి పాలనతో తన అధీనంలోకి తెచ్చుకోగలిగే అయాచిత అవకాశాన్ని జారవిడుచుకుంటుందా? మణిపూర్‌లో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే కనుక, తమ ఎజెండా అమలులో భాగంగానే ఆ రాష్ట్రం మండుతున్నది కనుక, ఈ ఈశాన్య రాష్ట్రంలో హింస కట్టుతప్పి, శాంతిభద్రతలు చేజారిపోతున్నా అక్కడి లెక్కవేరు.
మణిపూర్‌ను శాంతింపచేయడానికి కేంద్రబలగాలు వరుసకడుతున్నాయి. రాష్ట్రపతి పాలన లేదు కానీ, రాజ్యాంగంలోని 355వ అధికరణం మాత్రం అక్కడ అనధికారికంగా అమలవుతోంది. శాంతిభద్రతల పరిరక్షణ కేంద్రం అధీనంలోకి వచ్చింది. విదేశీ చొరబాట్లనుంచి, అంతర్గత కల్లోలాల నుంచి రాష్ట్రాలను కాపాడాల్సిన అంతిమ బాధ్యత కేంద్రానిదేనని చెబుతున్న 355వ అధికరణ రాష్ట్రంలో అమలవుతున్నట్టుగా ఆ రాష్ట్ర నాయకులే కాదు, చివరకు పోలీసు ఉన్నతాధికారులు కూడా భావిస్తున్నారట. ఈ అధికరణ వాడలేదని కేంద్రం అంటున్నప్పటికీ, బీజేపీ ఎమ్మెల్యేలు కొందరు రాష్ట్రంలో 355 అమల్లో ఉందనీ, కేంద్రం చూసుకుంటున్నది కనుక ప్రజలు నిర్భయంగా ఉండాలని ట్వీట్లు చేస్తున్నారట. బితుకుబితుకుమంటున్న ప్రజలకు భరోసా ఇవ్వడానికి, ఈ 355తో పాటు, ముఖ్యమంత్రి భద్రతా సలహాదారుగా కుల్దీప్‌సింగ్ అనే సీఆర్పీఎఫ్ మాజీ చీఫ్‌ను కేంద్రం నియమించిన విషయాన్ని కూడా పోలీసులు తరచుగా మీడియా ముందు ప్రస్తావించడం రాష్ట్రంలో పరిస్థితి ఎంత దిగజారిందో తెలియచెబుతోంది. రాష్ట్రపతి పాలన (ఆర్టికల్ 356)కు ముందు ఉపయోగించే 355 గురించి ఇంతగా మాట్లాడుతున్నారంటేనే, పరిస్థితులు రాష్ట్రపతి పాలనకు పూర్తియోగ్యంగా ఉన్నాయని అర్థం.
కేవలం చారిత్రక విద్వేషంతో ఒక్కసారిగా ఇంత హింసరేగదు. పాలకులమీద అపనమ్మకం తోడైనప్పుడు మాత్రమే ప్రతీ విషయం అనుమానాన్ని, అగ్రహాన్ని కలిగిస్తుంది. మెజారిటీ మీతీలకు ఎస్టీ హోదా ఇవ్వాలన్న ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించా లంటూ హైకోర్టు తీర్పుచెప్పడంతో, ఆ ఆదేశాన్ని నిరసిస్తూ ఎస్టీ హోదా ఉన్న కుకీ, నాగా తెగలవారు చేపట్టిన ర్యాలీ తీవ్ర హింసకు దారితీసింది. మీతీలమీదా, బీజేపీ నాయకులమీదా దాడులు జరిగాయి. మీతీ ప్రజలపట్ల ఆదివాసుల్లో ఉన్న అనుమానాలే ఇందుకు కారణమని ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్ ఓ మాట అన్నారు. మరోపక్క ఆయనే అన్ని జాతులవారూ చారిత్రకంగా కలిసిమెలిసి వున్నారని కూడా చెబుతున్నారు. అనాదిగా ఉన్న సయోధ్య కేవలం కోర్టు ఆదేశంతో విద్వేషంగా పరిణమించదు. జనాభాలో 60 శాతంగా ఉంటూ, మైదాన ప్రాంతానికి చెందిన హిందూ మీతీలను బీజేపీ తన ప్రధాన ఓటుబ్యాంకుగా పరిగణించడం, అటవీ పరిరక్షణ చట్టాలపేరిట, ఇతరత్రా మతపరమైన చర్యలతోనూ నాగా, కుకీలను దెబ్బ తీయాలని ప్రయత్నిస్తూండటం ఈ విధ్వంసానికి మూల కారణమని విశ్లేషకుల వాదన. ఇప్పటికే మీతీలకు శాసనసభలోనూ, ఇతరత్రా సంస్థల్లోనూ అధిక ప్రాతినిధ్యం ఉంది. వారికి ఎస్టీ హోదా కల్పించే విషయంలో బీజేపీ చురుకుగా వ్యవహరిస్తున్నది. అన్ని విధాలా ముందంజలో ఉన్న మీతీలు ఎస్టీ గుర్తింపు పొందినట్టయితే తమ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయన్న స్థానిక ఆదివాసీ తెగలవారి భయం సముచితమైనది. ఇంతవరకూ ఓబీసీలుగా ఉన్న మీతీలు ఎస్టీలుగా గుర్తింపు పొందితే, కుకీ, నాగాల అధీనంలో ఉన్న అటవీ భూములు కొనుగోలు చేయగలిగే అవకాశం దక్కుతుందని, శతాబ్దాలుగా ప్రత్యేక ఆదివాసీ రక్షణల మధ్య ఉన్న భూములు వారి అధీనంలోకి పోతాయన్నది మరో భయం. అన్ని జాతులనూ, తెగలనూ సమదృష్టితో చూస్తూ పాలన సాగించే సద్బుద్ధి కొరవడినప్పుడు అగ్గి ఇలాగే రాజుకుంటుంది. మయన్మార్‌తో సరిహద్దులు పంచుకొనే రాష్ట్రం ఇలా అదుపుతప్పి, దీర్ఘకాలం కార్చిచ్చులో కొనసాగడం ప్రమాదకరం. పొరుగుదేశంలో ఉన్న అంతర్యుద్ధ పరిస్థితులతో వలస వచ్చేవారు ఒకపక్క, అటూ ఇటూ అనేక మిలిటెంట్ సంస్థలు మరొకపక్క ఉండగా, కేంద్రం రాజకీయ కారణాలతో ఆ రాష్ట్రాన్ని వదిలివేయడం క్షేమకరం కాదు.
Updated Date - 2023-05-09T02:10:51+05:30 IST