ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధర్మపోరాటం

ABN, First Publish Date - 2023-05-31T01:38:20+05:30

మహిళారెజ్లర్లు ఆఖరునిముషంలో వెనక్కుతగ్గారు కానీ, లేకుంటే ఈ పాటికి పతకాలతో పాటు దేశం పరువు కూడా గంగపాలయ్యేది. అంతర్జాతీయ వేదికలమీద నిలిచి గెలిచిన పతకాలను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహిళారెజ్లర్లు ఆఖరునిముషంలో వెనక్కుతగ్గారు కానీ, లేకుంటే ఈ పాటికి పతకాలతో పాటు దేశం పరువు కూడా గంగపాలయ్యేది. అంతర్జాతీయ వేదికలమీద నిలిచి గెలిచిన పతకాలను గంగలో ముంచాలన్న ఆలోచన వారి ఆవేదన, ఆగ్రహం, అవమానం కలగలసిన స్థితికి నిదర్శనం. ఎంత నిరాశలో ఉన్నప్పటికీ, అంత కష్టపడి గెలుచుకున్న పతకాలను చేజేతులా నీళ్ళపాలు చేస్తారా? అన్న స్థానికుల ఓదార్పు, కొందరు రైతునాయకుల ధైర్యవచనాలు ప్రస్తుతానికి వారి మనసు మార్చివుండవచ్చు. ఇన్నినెలలుగా మొండికేసిన బీజేపీ ప్రభుత్వం, ఈ కొత్త ఐదురోజుల గడువులో దిగివస్తుందన్న భ్రమలు ఎవరికీ ఉండనక్కరలేదు.

‘తొలిరోజే సెంగోలు వంగింది’ అంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆదివారం చేసిన వ్యాఖ్య పలువురికి ఆగ్రహం కలిగించింది. కొత్తపార్లమెంటు భవనంలోపల అత్యాచార నిందితుడు ఆసీనుడై ఆరంభోత్సవ వేడుకలు తిలకిస్తూవుంటే, కూతవేటుదూరంలో అతడి బాధితులంతా పోలీసు దెబ్బలు తింటున్న దృశ్యం చూసినప్పుడు చాలామందికి ఇదే భావన కలిగివుంటుంది. మఠాధిపతులు అందించిన ధర్మదండం ప్రధాని చేతికి వచ్చిన సమయంలోనే, బయట ధర్మం కోసం పోరాడుతున్నవారికి దండన దక్కింది. పతకాలను చేజేతులా నీటపడవేయలేక హరిద్వార్‌లో వీరంతా కన్నీటిపర్యంతమైన దృశ్యం కదల్చివేస్తున్నది. ఆ కన్నీళ్ళు నెలల తరబడి వరదలుగా పారుతున్నాయి. ఒక మైనర్‌ సహా ఏడుగురు రెజ్లర్లపై అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ అరెస్టు కోసం జంతర్‌మంతర్‌ దీక్షలు నిరవధికంగా కొనసాగుతున్నాయే తప్ప పాలకుల మనసుకరగడం లేదు. ఒలింపిక్‌ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేసినా, క్రీడల మంత్రికి మొరబెట్టుకున్నా, న్యాయస్థానాలు జోక్యం చేసుకున్నా, సదరు ఎంపీ మీద ఈగ వాలలేదు. తమపై అఘాయిత్యంచేసిన వ్యక్తిమీద ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేయించడానికే బాధితులు కోర్టుల చుట్టూ తిరగాల్సివచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు తమ ఫిర్యాదు రికార్డులకు ఎక్కిందన్న సంతోషం తప్ప అక్కడకూడా వారికి పూర్తి న్యాయమేమీ దక్కలేదు. ఏడుగురు మహిళలు ఆక్రోశిస్తున్నా, ముప్పైమంది రెజ్లర్లు నెలల తరబడి రోడ్డునపడ్డా ఆ ఎంపీ పదవులు, హోదాలు, గౌరవాలకు అధికారపక్షం ఏ లోటూ రానివ్వడం లేదు. మోదీని ఒక్కమాట చెప్పమనండి, తప్పుకుంటాను అని అతను అంత ధైర్యంగా అంటున్నాడంటే, ఆ మాటచెప్పే ధైర్యం ఎదుటివారికి లేదన్న ధైర్యం కాబోలు. పైగా, సెంగోల్‌ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఆయనలో కొత్త స్ఫూర్తి రగిలించినట్టుంది. మఠాధిపతుల సారథ్యంలో ప్రభుత్వంమీద ఒత్తిడి తెచ్చి పోస్కో చట్టాన్ని మార్చేస్తానని నిర్లజ్జగా ప్రకటించాడు. తనపై రెండు ఎఫ్‌ఐఆర్‌లు ఉన్నా, పోస్కో కేసు ఉన్నా కాస్కో అనగలుగుతున్నాడు. అరెస్టుకు ఏ న్యాయస్థానమూ అడ్డుచెప్పకున్నా ఎవరూ తనను కన్నెత్తిచూడరన్న ధైర్యం ఏకంగా చట్టాన్నే తిరగరాయించగలనన్న నమ్మకాన్ని కలిగిస్తున్నది.

ఒలింపిక్‌ విజేతల ఆక్రందనలే పాలకులకు పట్టనప్పుడు ఇక గ్రామీణ మహిళలకు దిక్కెవరు? అంటూ ఆదివారం బాధితులు వాపోయారు. వెలుగుజిలుగుల కొత్తపార్లమెంటు భవనంవైపు చూస్తూ, పోలీసు వ్యాన్‌లో తరలిపోతున్న బాధితులు ‘నయా దేశ్‌ ముబారక్‌’ అంటూ చేసిన వ్యాఖ్య అభినందనో, అభిశంసనో తెలియదు. వాళ్ళు ఇంకా పోరాడుతున్నారంటే, కన్నీళ్ళు పెట్టుకుంటున్నారంటే ఈ దేశంలోని ప్రజలమీద ఎంతో కొంత నమ్మకం మిగిలి ఉన్నందునే. వారి వాదనలను, వేదనలను విని ఊరుకోవడమా, కాస్తంత చేయూతనిచ్చి కన్నీళ్ళు తుడవడమా అన్నది మనమే నిర్ణయించుకోవాలి. మహిళారెజ్లర్ల సంఘటిత శక్తి, పోరాటపటిమ అమోఘమైనది. న్యాయాన్ని సాధించే క్రమంలో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నా, అవమానాలు ఎదురవుతున్నా వారు పాలకుల శక్తికి తలొగ్గలేదు, లక్ష్యంలో రాజీపడలేదు. కష్టపడి సాధించిన పతకాలను నిరాశతో నీటముంచడం కంటే ఎదుటివారి మెడలు వంచేదిశగా పోరాటాన్ని పతాకస్థాయికి తీసుకుపోవాలన్న వారి సంకల్పం ప్రశంసనీయమైనది. ఎంతదూరమైన సాగి అంతిమ విజయం సాధించగలమన్న వారి నమ్మకం వమ్ముకాకూడదని కోరుకుందాం.

Updated Date - 2023-05-31T01:38:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising