నవ్విపోదురుగాక...
ABN, First Publish Date - 2023-03-08T01:16:54+05:30
పార్టీపేరు, గుర్తు కోల్పోయిన కోపంలో కూడా ఉన్నారేమో, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మంగళవారం కేంద్రహోంమంత్రి అమిత్ షాను ఘాటుగా దులిపేశారు...
పార్టీపేరు, గుర్తు కోల్పోయిన కోపంలో కూడా ఉన్నారేమో, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మంగళవారం కేంద్రహోంమంత్రి అమిత్ షాను ఘాటుగా దులిపేశారు. ముఖ్యమంత్రి కావడంకోసం నేను కాంగ్రెస్, ఎన్సీపీ ముందు సాగిలబడ్డాననీ, బూట్లు నాకానని అమిత్ షా అప్పట్లో తీవ్రమైన విమర్శలు చేశారు. ఇప్పుడు మేఘాలయలో మీరు చేసిందేమిటి, ఏ మాత్రమైనా సిగ్గు, విలువలు ఉన్నాయా?’ అని ప్రశ్నించారు ఠాక్రే. కాన్రాడ్ సంగ్మా నాయకత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పిపి) మీద ఎన్నికల ముందు బీజేపీ పెద్దలు తీవ్రమైన అవినీతి ఆరోపణలతో విరుచుకుపడ్డారు. మేఘాలయను సంగ్మా దోచుకుతింటున్నారనీ, పేదల కడుపుకొట్టి కోట్లుకూడబెట్టుకున్నారనీ, మేఘాలయ దేశంలోనే అత్యంత అవినీతి మయమైన రాష్ట్రమని అమిత్‌షా చేసిన విమర్శలను ఠాక్రే ఇప్పుడు గుర్తుచేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్దిగంటల్లోనే ప్రధాని నరేంద్రమోదీ సంగ్మాకు మద్దతు ప్రకటించి, ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా మారిపోయిన విషయం తెలిసిందే. మోదీ, అమిత్ షా, నడ్డా ఇత్యాది బీజేపీ పెద్దల సమక్షంలో మంగళవారం కాన్రాడ్ సంగ్మా రెండోసారి మేఘాలయ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. పదకొండు మంత్రిపదవుల్లో బీజేపీకి ఒకటి దక్కింది కూడా.
మొన్నటివరకూ సంగ్మా ఏలుబడిలో పాపపంకిలమైపోయిన మేఘాలయ ఇకపై ఆయన పాలనలోనే అద్భుతమైన ప్రగతి సాధించగలదని బీజేపీ నాయకులు విశ్వసించడం ఆరంభించారు. మేఘాలయ మరింత ఎదిగిపోవాలని మోదీ ట్వీట్ చేశారు. మోదీ మార్గదర్శకత్వంలో, సంగ్మా సమర్థనాయకత్వంలో ఆ రాష్ట్రం ఉన్నతశిఖరాలు అందుకుంటుందని నడ్డా వ్యాఖ్యానించారు. ఎన్నికలముందు మిమ్మల్ని అత్యంత అవినీతిపరుడనీ, మేఘాలయను నాశనం చేశారనీ విమర్శించిన బీజేపీతో ఈ అనంతర పొత్తేమిటని ప్రశ్నించినప్పుడు, మిత్రపక్షాలన్నాక అభిప్రాయభేదాలు సహజం, వాటిని సరైనరీతిలో పరిష్కరించుకోవాలి అన్నారు కొత్తముఖ్యమంత్రి సంగ్మా. ఇందుకు అధికారంలో వాటాలు పదవుల్లో కోటాలు ఇవ్వడం కంటే మంచి మార్గం ఇంకేముంటుంది?. ఆరవై స్థానాలున్న మేఘాలయలో సంగ్మాపార్టీకి ౨6సీట్లు వచ్చాయి. రెండోమారు అధికారంలోకి రావడానికి మరో ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరమైన కాన్రాడ్ సంగ్మా పక్షాన అసోం ముఖ్యమంత్రి, బీజేపీ ఈశాన్య ప్రయోజనాల పరిరక్షకుడు హిమంత బిశ్వశర్మ రంగంలోకి దిగారు. మోదీ ఆశీస్సులు, బీజేపీ పెద్దల రంగప్రవేశంతో ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు అందింది. దీనితో సంగ్మా పని మరింత సులభమైపోయింది. అప్పటివరకూ కాదూకూడదూ అన్న పార్టీలన్నీ దారికొచ్చేశాయి. నీతిసూత్రాలన్నీ గాలికి ఎగిరిపోయాయి. ఇప్పుడు కాన్రాడ్‌కు అవసరమైనకంటే పదమూడు మంది బలం అధికంగా ఉంది. కాంగ్రెస్ నుంచి తృణమూల్‌లో చేరి ఐదుస్థానాలు గెలుచుకున్న ముకుల్ సంగ్మా కాంగ్రెస్‌లోనే ఉండివుంటే, ఆయనకు ఈ దుస్థితి వచ్చేది కాదనీ, ఆ పార్టీ కూడా మరింత బలంగా ఉండేదని అంటారు.
ఐదేళ్ళక్రితం కాంగ్రెస్ కంటే రెండుస్థానాలు తక్కువ తెచ్చుకొని కూడా బీజేపీతో చేతులు కలపడం ద్వారా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగలిగిన సంగ్మా ఇప్పుడు మరో ఏడుస్థానాలు ఎక్కువ సాధించి బలపడ్డారు. ఎన్నికలముందు వైరం ప్రకటించి, అరవైస్థానాల్లోనూ పోటీచేసిన బీజేపీ చివరకు రెండుస్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఎన్నికల ప్రచారంలో పరస్పరం తిట్టిదిగబారబోసుకున్న ఉభయులూ ఎన్నికల అనంతరం క్షణాల్లో చేతులు కలిపి ప్రజలను మోసం చేశారనీ, విలువలు ఊడదీశారని ఠాక్రే వంటివారికి కోపం రావచ్చు. కానీ, అధికారంలోకి రావాలన్న లక్ష్యం మాత్రం బీజేపీ–ఎన్‌పిపిలు అంతిమంగా నెరవేర్చుకున్నాయి. కొన్నేళ్ళక్రితం వరకూ ఈశాన్యంలో ఓట్లుకూడా లేని బీజేపీ ఇప్పుడు అక్కడి రాష్ట్రాల్లో తిరుగులేని శక్తిగా నిలవడం చిన్న విషయమేమీ కాదు. గత ఎనిమిదేళ్ళకాలంలో యాభైసార్లు నరేంద్రమోదీ, నాలుగువందలసార్లు ఆయన మంత్రివర్గ సహచరులు పర్యటించి ఈశాన్యాన్ని దారికి తెచ్చుకున్నారు. మొన్న ఎన్నికలు జరిగిన మూడురాష్ట్రాల్లో రెండింట్లో సొంతంగా అధికారంలోకి వచ్చి, మూడోదానిని పరోక్షంగా చేజిక్కించుకోగలిగారు.
Updated Date - 2023-03-08T01:16:54+05:30 IST