ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘ఒకే ఒక్కడు’

ABN, First Publish Date - 2023-07-28T02:34:42+05:30

తాను ‘అక్రమం, చట్టవ్యతిరేకం’ అని నిర్థారించిన ఒక నియామకాన్ని తానే కొనసాగనివ్వాల్సిరావడం సుప్రీంకోర్టుకు కష్టమైన పనే. ‘అసాధారణ’ పరిస్థితులు అంటూ ...

తాను ‘అక్రమం, చట్టవ్యతిరేకం’ అని నిర్థారించిన ఒక నియామకాన్ని తానే కొనసాగనివ్వాల్సిరావడం సుప్రీంకోర్టుకు కష్టమైన పనే. ‘అసాధారణ’ పరిస్థితులు అంటూ కేంద్రం సర్వసాధారణంగా చేసే వాదనలకు లొంగి సుప్రీంకోర్టు గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్‌ (ఈడీ) డైరక్టర్‌ సంజయ్‌మిశ్రా పదవీకాలాన్ని సెప్టెంబరు 15వరకూ పొడిగించింది. గతంలో తాను నిర్ద్వంద్వంగా, విస్పష్టంగా నిర్థారించిన మిశ్రా పదవీకాలం మరో నాలుగురోజుల్లో ముగిసిపోవాల్సిన తరుణంలో, జూలై 11వతేదీ తీర్పు సందర్భంగా ఎటువంటి కొనసాగింపులను అనుమతించేది లేదన్న మాటనే మరోమారు నొక్కిచెబుతూ న్యాయస్థానం ప్రభుత్వం అడిగినకంటే కాస్తంత తక్కువ కాలాన్ని రాజీమార్గంగా ఆమోదించింది. ఈడీ డైరక్టర్‌గా మిశ్రాను కొనసాగించే విషయంలో మోదీ ప్రభుత్వం ఐదేళ్ళుగా ఎంత పట్టుదలగా ఉన్నదో, ఎందుకు ఉంటున్నదో తెలిసినదే కనుక ఈ వ్యవహారంలో కేంద్రం పంతమే నెగ్గిందో, కోర్టు మాటే నెగ్గిందో అర్థం చేసుకోవడం పెద్దకష్టమేమీ కాదు.

మిశ్రా పదవీకాలం పొడిగింపును ‘ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎఫ్‌ఏటీఎఫ్‌) సమీక్షతో కేంద్రం ముడిపెట్టడం కొత్తగా జరిగిందేమీ కాదు. మనీలాండరింగ్‌, ఆర్థిక ఉగ్రవాదాలకు అడ్డుకట్టవేసే విషయంలో మనం శ్రద్ధగా ఉన్న విషయాన్ని ఎఫ్‌ఏటీఎఫ్‌కు నివేదించాల్సి ఉన్నందున, ఆ ప్రక్రియ పూర్తయిన తరువాత నవంబరులో మిశ్రా తప్పుకుంటారని కేంద్రం గత వాదనల సందర్భంలోనే హామీ ఇచ్చింది. నవంబరులో ఆ సంస్థ ప్రతినిధిబృందం దేశాన్ని సందర్శించేలోగా వివిధ వ్యవస్థల పనితీరును సమీక్షించడం చాలా ముఖ్యం కనుక, అప్పటివరకూ వరకూ మిశ్రా ఉండటం దేశప్రయోజనాల రీత్యా అవసరమని వాదించింది. తద్వారా ప్రభుత్వం తాను గతంలో పలుమార్లు పదవీకాలం కొనసాగింపుల ద్వారా ఆయన అధికారికంగా రిటైర్‌ కావాల్సిన నవంబరు 17వరకూ నిక్షేపంగా పదవిలోనే ఉంచేందుకు శతథా ప్రయత్నించింది. అయితే, సుప్రీంకోర్టు జూలై 11వ తేదీ తీర్పులో ఆ అభ్యర్థనను తోసిపుచ్చింది. 2021నవంబరు 17 తరువాత ఆయన పదవిలో ఉండటానికి వీల్లేదని సుప్రీంకోర్టు గతంలో ‘మాండమస్‌’ జారీ చేసినందున, తదనంతరకాలంలో ఇచ్చిన కొనసాగింపులు, అనుభవించిన పదవీకాలం అక్రమమే అవుతుందని ప్రకటిస్తూ తక్షణమే ఆయన దిగిపోవాలన్నది. నవంబరు వరకూ మిశ్రాను ఉండనివ్వాలన్న అభ్యర్థనను తోసిపుచ్చుతూ కేవలం అధికారబదలాయింపు ప్రక్రియ సజావుగా సాగే పేరిట ఈ నెల చివరివరకూ మాత్రమే ఉండనిచ్చింది.


ఇప్పుడు ప్రభుత్వం తిరిగి అదేవాదన చేస్తున్నప్పుడు కోర్టుకు అందులో కొత్తగా స్వీకరించాల్సిందేమీ నిజానికి లేదు. ఎఫ్‌ఏటీఎఫ్‌తో వ్యవహారం ముఖ్యమైనదనీ, అది భారతదేశ పరువుప్రతిష్ఠలకు సంబంధించిన అంశమని ప్రభుత్వం గతంలో చేసిన వాదనల్లో ఔచిత్యం ఉన్నదని అనిపించిన పక్షంలో న్యాయస్థానం అప్పట్లోనే మిశ్రా కొనసాగింపుపై ప్రభుత్వ అభ్యర్థనను ఆమోదిస్తే సరిపోయేది. ఇప్పుడు జులై 11 నాటి తన తీర్పును న్యాయస్థానమే పునఃస్సమీక్షించుకొనేట్టు చేసి, తద్వారా తాను అనుకున్న వెసులుబాటు సాధించడంలో ప్రభుత్వం అదే వాదనతో విజయవంతమైంది. ఎఫ్‌ఏటీఎఫ్‌ ప్రక్రియలో చాలా వ్యవస్థల పాత్ర ఉన్నదని, ఈడీ వాటిలో ఒకటి మాత్రమేనని, ప్రధానంగా రెవిన్యూ సెక్రటరీయే ఈ వ్యవహారాలు చూస్తారన్నది న్యాయస్థానంలో మిగతావారి వాదన. అలాకాదు, మిశ్రాయే ముఖ్యుడని, ఆయన లేకపోతే మిగతాప్రపంచంముందు మనకు తలవంపులు తప్పవనీ, పైగా కొన్ని పొరుగుదేశాలు మనం ఎఫ్‌ఏటీఎఫ్‌ ‘గ్రేలిస్టు’లోకి జారిపోవాలని కళ్ళల్లో వత్తులు వేసుకొని మరీ ఎదురుచూస్తున్నాయని అంటున్నప్పుడు నవంబరులో రిటైరయ్యేవరకూ ఆయన ఉండటమే దేశానికి మంచిది. కానీ, అక్టోబర్‌ 15వరకూ ఉండనివ్వండి అని ప్రభుత్వం అడగడం, సుప్రీంకోర్టు దానిని సెప్టెంబరు 15తో సరిపుచ్చడం, సదరు అసాధారణ పరిస్థితులను చక్కదిద్దడానికీ, దేశప్రయోజనాలను పరిరక్షించడానికి ఏమాత్రం ఉపకరిస్తాయో తెలియదు.

ఆయన తప్ప సమర్థులు లేరని, మిగతావారంతా అసమర్థులన్న అభిప్రాయం కలిగిస్తే ఎలా? ఇది మిగతా అధికారులను, వ్యవస్థలను మానసికంగా దెబ్బతీయదా? అని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని గట్టిగానే మందలించింది. అలా అంటూనే, మరో సందర్భంలో అయితే ప్రభుత్వ అభ్యర్థనను అనుమతించకపోయేవారమని హెచ్చరిస్తూనే, ఈ ‘ఒకే ఒక్కడు’ విషయంలో ప్రభుత్వం అనాదిగా ప్రదర్శిస్తున్న పట్టుదలను నెగ్గనిచ్చింది. ప్రత్యేక చట్టసవరణలతో, ఏడాదికేడాది పొడిగింపులతో మొత్తానికి మిశ్రా కేవలం ఓ రెండునెలలు తక్కువగా తన ఐదేళ్ళపదవీకాలాన్ని విజయవంతంగా పూర్తిచేయబోతున్నారు.

Updated Date - 2023-07-28T02:34:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising