పవార్ కొత్త అస్త్రం
ABN, First Publish Date - 2023-05-03T00:38:43+05:30
పాతికేళ్ళక్రితం కాంగ్రెస్‌పార్టీనుంచి సస్పెండ్ అయి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) పేరిట వేరుకుంపటి పెట్టుకొని, దానికి అధ్యక్షుడుగా కొనసాగిన శరద్‌పవార్ ఆ పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా...
పాతికేళ్ళక్రితం కాంగ్రెస్‌పార్టీనుంచి సస్పెండ్ అయి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) పేరిట వేరుకుంపటి పెట్టుకొని, దానికి అధ్యక్షుడుగా కొనసాగిన శరద్‌పవార్ ఆ పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించడం పార్టీ శ్రేణులను ఆవేదనలో ముంచెత్తింది. తండ్రిని ఒప్పించాల్సిందిగా కుమార్తె సుప్రియాసూలేను పార్టీ నాయకులు వేడుకుంటున్నప్పుడు అజిత్ పవార్ ఆగ్రహించారట. పవార్ తన నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవచ్చునని వార్తలు వస్తున్నప్పటికీ, ఆయన ఆ పనిచేయబోరని అజిత్ పవార్ ఢంకాబజాయించి చెబుతున్నారు. సుప్రియాసూలే, అజిత్ పవార్ మధ్య సాగుతున్న వారసత్వ పోరును పెద్దాయన ఇలా పరిష్కరిస్తున్నారా, లేక తన ఆధిపత్య ప్రదర్శనకే ఆయన ఈ ప్రకటన చేశారా అన్నది తెలియదు.
‘పెనంమీద ఉన్న చపాతీ సరైనసమయంలో తిరగవేయకపోతే మాడిపోతుంది’ అంటూ పవార్ ఈ మధ్య చేసిన నర్మగర్భమైన వ్యాఖ్య చిన్నపవార్‌ను ఉద్దేశించిందని అందరూ అనుకున్నారు కానీ, ఆయనే ఇలా అస్త్రసన్యాసం చేస్తారని ఊహించలేదు. ‘మరో పక్షం రోజుల్లో రెండు కీలకపరిణామాలు జరుగుతాయి, ఒకటి ఢిల్లీలో, మరొకటి మహారాష్ట్రలో’ అని సుప్రియాసూలే కూడా ఇటీవల ఓ మాటన్నారు. ఇప్పుడు మహారాష్ట్రలో జరిగింది కాబట్టి, ఢిల్లీలో జరగబోయే రెండోది ఏమిటన్నది ప్రశ్న. పవార్ స్థానాన్ని చేపట్టబోయేవారిని నిర్ణయించేందుకు పార్టీ ప్రముఖులతో ఒక కమిటీ ఏర్పాటైంది. అధ్యక్షస్థానం నుంచి తప్పుకున్నా, చక్రం తిప్పేది ఆయనే కనుక ఎవరిని నిర్ణయిస్తారో చూడాలి. అజిత్, సుప్రియలతో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న మరోబలమైన నాయకుడు జయంత్ పాటిల్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది.
ఏక్‌నాథ్ షిండే వర్గం ఎమ్మెల్యేల అనర్హత విషయంలో సుప్రీంకోర్టు మరో పదిహేను రోజుల్లో తీర్పు చెప్పబోతున్న నేపథ్యంలో, సీనియర్ పవార్ చేష్టలు, జూనియర్ పవార్ చర్యలు అనుమానాలకు తావిస్తున్నాయి. అదానీ వ్యవహారం విపక్షాలను ఒక్కతాటిపైకి తెచ్చి, అందరూ కలసికట్టుగా మోదీపై దుమ్మెత్తిపోస్తుంటే, శరద్ పవార్ పూర్తి భిన్నమైన వ్యాఖ్యలు చేశారు. వాటికి తోడు, తన నివాసంలో అదానీతో రెండుగంటలపాటు మంతనాలు జరపడం అనేకులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. సుప్రీంకోర్టు షిండేవర్గానికి చెందిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తే, సార్వత్రక ఎన్నికలముందు కీలకమైన మహారాష్ట్రలో అధికారాన్ని కొనసాగించుకోవడానికి బీజేపీకి ఎన్సీపీ అవసరం. ఎన్సీపీని చీల్చేందుకు, అవసరమైతే ముఖ్యమంత్రి పదవి అప్పగించేందుకు కూడా బీజేపీ వెనుకాడదు. ఇప్పటికే తనసన్నిహిత ఎమ్మెల్యేలతో సమావేశమై, అవసరమైతే పార్టీని చీల్చి బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని అజిత్ పవార్ సిద్ధపడుతున్నట్టు వార్తలు వచ్చాయి. అటువంటిదేమీ లేదని అంటూనే, వచ్చే ఏడాది ఎన్నికల వరకూ ముఖ్యమంత్రిపదవికోసం ఎన్సీపీ నిరీక్షించాల్సిన అవసరం లేదని కూడా అజిత్ అన్నారు. రాజకీయాల్లో ఒక లక్ష్యం ఉండటంలో తప్పేమీ లేదని సుప్రియ కూడా సమర్థింపు వ్యాఖ్యచేశారు.
సీనియర్ పవార్‌కు రాజకీయంగా తరతమభేదాలేమీ లేవు. 1999నుంచి ఐదేళ్లపాటు కాంగ్రెస్‌తో అధికారం పంచుకున్న ఆయన ఆ తరువాత బీజేపీతో చేతులు కలిపారు. 2019లో అజిత్‌పవార్ బీజేపీతో చేయికలిపి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పుడు తిరుగుబాటుదారులందరినీ వెనక్కు తెచ్చుకున్నారు కానీ, కుట్రకు పాల్పడిన అజిత్‌ను శిక్షించలేదు. తిరుగుబాటును నిరోధించి, మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రపతిపాలన రాకుండా నిరోధించగలిగారు కానీ, షిండే చీలికతో మూడున్నరేళ్ళలోనే అది కూలిపోయింది. హోం సహా కీలకమైన పదవులన్నీ ఎన్సీపీ చేతుల్లో ఉన్నందునే షిండే కుట్ర చివరినిముషం వరకూ ఉద్ధవ్ ఠాక్రేకు తెలియలేదని అప్పట్లో వ్యాఖ్యలు వచ్చాయి. వచ్చే ఏడాది ఎన్నికల్లో మహారాష్ట్రలో తిరిగి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పరచగలిగేశక్తి పవార్‌కు ఉన్నదా లేదా అన్నది అటుంచితే, ఇప్పుడు షిండే వర్గానికి న్యాయస్థానంలో ఎసరు వచ్చినపక్షంలో బీజేపీ చీలికవ్యూహాలను, సీబీఐ, ఈడీ దాడులను తట్టుకోవడం ఆయనకు కష్టం. ఇప్పుడాయన పార్టీ నాయకత్వానికి దూరంగా జరిగి, రాబోయే పరిణామాలతో తనకు సంబంధం లేదని చేతులు దులిపేసుకుంటున్నారో, పార్టీమీద తనపట్టును ఇలా ప్రదర్శించి చీల్చదల్చుకున్నవారిని హెచ్చరిస్తున్నారో త్వరలోనే తేలిపోతుంది.
Updated Date - 2023-05-03T00:38:43+05:30 IST