రాజస్థాన్ రాజకీయం!
ABN, First Publish Date - 2023-06-02T00:55:53+05:30
కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడిన పక్షంరోజుల్లోనే ప్రధాని నరేంద్రమోదీ మళ్ళీ ఎన్నికల ప్రచారంలో పడ్డారు. బుధవారం రాజస్థాన్ అజ్మీర్ సభలో ఆయన కాంగ్రెస్ పార్టీని ఘాటుగా...
కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడిన పక్షంరోజుల్లోనే ప్రధాని నరేంద్రమోదీ మళ్ళీ ఎన్నికల ప్రచారంలో పడ్డారు. బుధవారం రాజస్థాన్ అజ్మీర్ సభలో ఆయన కాంగ్రెస్ పార్టీని ఘాటుగా విమర్శించడం వెనుక కర్ణాటకను కోల్పోయిన బాధ కూడా పనిచేసినట్టుంది. గత ఐదునెలలకాలంలో ఐదుసార్లు, కేవలం మూడువారాల్లోనే రెండోసారి ఆయన రాజస్థాన్‌లో పర్యటించడాన్ని బట్టి ఆ రాష్ట్రాన్ని తిరిగిస్వాధీనం చేసుకోవడానికి బీజేపీ ఎంతగా శ్రమిస్తున్నదో తెలుస్తుంది. మోదీ తొమ్మిదేళ్ళపాలన పూర్తయిన సందర్భంలో పార్టీ ఆరంభించిన నెలరోజుల ‘మహాజనసంపర్క’ యాత్రతో అజ్మీర్ ర్యాలీ ముడిపడివుండవచ్చును కానీ, రాజస్థాన్‌నుంచే దానిని ఆరంభించడం ‘పీఎం వర్సెస్ సీఎం’ యుద్ధంలో భాగంగానే అనేకులు చూస్తున్నారు. కేవలం మూడుగంటలు మాత్రమే ఉన్నా, ముందుగానే రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించడానికి, మరీ ముఖ్యంగా స్థానిక నాయకత్వ సమస్యను పరిష్కరించడానికి మోదీ రాక బాగా ఉపకరించిందని అంటారు.
కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన ఐదుగ్యారంటీలు అక్కడ తన ఓటమికి ప్రధాన కారణమని బీజేపీ నమ్మకం. అలా గ్యారంటీలు ఇవ్వడం ఎంత ప్రమాదకరమో మోదీ తన ప్రసంగంలో వివరిస్తూ, ఈ గ్యారంటీలను అమలు చేస్తే దేశం దివాలా తీస్తుందని హెచ్చరించారు. తన ప్రభుత్వం ఇటువంటి మాటలేమీ లేకుండానే, సుపరిపాలనతోనూ, సంక్షేమంతోనూ పేదలకు ఎంతో మేలు చేసిందని వివరంగా చెప్పుకొచ్చారు. అంతర్గతయుద్ధాలతో, వెన్నుపోట్లతో, అవినీతితో రాష్ట్రంలో ఒక అరాచకస్థితిని కాంగ్రెస్ తీసుకొచ్చినందున, డబుల్ ఇంజన్ సర్కార్ మాత్రమే రాష్ట్రాన్ని తిరిగిగాడినపెట్టగలుగుతుందని ప్రజలకు భరోసా ఇచ్చారు. అశోక్‌గెహ్లాట్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమపథకాల వల్ల అంతర్గతపోరునూ, ప్రభుత్వ వ్యతిరేకతను కూడా అధిగమించగలనని కాంగ్రెస్ నమ్ముతూ, వాటినే విస్తృతంగా ప్రచారంలో పెడుతున్నస్థితిలో మోదీ ఆ విధానాలను తప్పుబట్టారు. రాజస్థాన్ ప్రభుత్వం తెచ్చిన ఆరోగ్యహక్కు చట్టం, వృద్ధాప్యపింఛన్లు వంటివి కూడా ఆయన వ్యాఖ్యల వెనుక పనిచేసివుంటాయి.
స్థానిక నాయకత్వం అంశాన్ని కూడా ప్రధాని ఈ సభలో పరిష్కరించేశారని కొందరి నమ్మకం. ముఖ్యమంత్రి పదవికోసం వసుంధరరాజే, కేంద్రమంత్రులు గజేంద్రసింగ్ చౌహాన్, అశ్విన్ వైష్ణవ్, స్పీకర్ ఓంబిర్లా పోటీపడుతున్న నేపథ్యంలో, వసుంధరరాజేకు అజ్మీర్ సభలో అమిత ప్రాధాన్యం దక్కింది. ప్రధాని ఆమెతో ప్రత్యేకంగా సంభాషించడం, వేదికమీద పక్కనే కూచోబెట్టుకోవడం, వేదిక వెనుక ఆమె చిత్రమే ప్రధానంగా కనిపించడం ఈ వాదనకు కారణం కావచ్చు. రాష్ట్రాల ఎన్నికల్లో స్థానిక నాయకత్వానికి ఏ మాత్రం ప్రాధాన్యం లేకుండా మోదీనే ముందుపెట్టి కథనడిపించే బీజేపీ బహుశా కర్ణాటక ఫలితాలతో పాఠం నేర్చుకొని ఉంటుంది. రాజస్థాన్ బీజేపీలో ఈ అంతర్గత పోరు కారణంగా నాలుగేళ్ళుగా ఒక్క నిరసన కానీ, ర్యాలీ కానీ పార్టీ నిర్వహించలేదు. చివరకు స్థానిక ఎన్నికల్లో సైతం బీజేపీ ఓడినస్థితిలో, ఏ అధికారిక పదవీ లేకుండా అనేక సంవత్సరాలుగా పార్టీతో అంటీముట్టనట్టు ఉంటున్న వసుంధరను బీజేపీ తిరిగి తెరమీదకు తెస్తున్నది. మోదీ ఎంతగా చక్రం తిప్పినా బలమైన స్థానిక నాయకత్వంలేనిదే రాజస్థాన్‌లో నెగ్గుకురావడం కష్టమని, అక్కడ కూడా ఓడితే సార్వత్రక ఎన్నికలమీద విశేషమైన ప్రభావం ఉంటుందన్న భయం బీజేపీకి కలిగి ఉంటుంది.
రాష్ట్ర కాంగ్రెస్‌లోనూ ఇటీవల పరివర్తన కనిపిస్తోంది. అధికారప్రతినిధి వేణుగోపాల్ మధ్యవర్తిత్వంతో అశోక్ గెహ్లోత్, సచిన్ పైలట్ మధ్య సయోధ్య కుదర్చడంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్‌ఖర్గే విజయం సాధించారని వార్తలు వస్తున్నాయి. కత్తులు దూసుకుంటున్న ఇద్దరూ మీడియా ముందుకు వచ్చి పార్టీ విజయం కోసం సంఘటితంగా పోరాడతామని ప్రకటించడం, ఒకరి గురించి మరొకరు నాలుగు మంచిమాటలు అనడం చెప్పుకోదగ్గ మార్పే. తనకు పదవీకాంక్షలేదని గెహ్లోత్ ఎందుకో పలుమార్లు మీడియాతో చెప్పుకున్నారు. సీఎం కావాలని కోరుకుంటున్న సచిన్ పైలట్‌కు రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగించడమో, ఢిల్లీ తెచ్చి దేశవ్యాప్త బాధ్యతలు అప్పగించడమో జరగవచ్చునట. స్థానిక నాయకత్వాన్ని సృష్టించేపనిలో బీజేపీ ఉంటే, సమస్యగా మారిన నాయకత్వ సమస్యను సున్నితంగా పరిష్కరించుకొనే పనిలో కాంగ్రెస్ ఉంది.
Updated Date - 2023-06-02T00:55:53+05:30 IST