ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గోప్యత గోల్‌మాల్‌

ABN, First Publish Date - 2023-06-14T00:29:48+05:30

అభివృద్ధి చెందిన దేశాల్లో ఇంత పెద్ద డేటా లీక్‌ కనుక జరిగివుంటే, అక్కడి ప్రభుత్వం బతికి బట్టకట్టేది కాదు అని నిపుణులు వ్యాఖ్యానిస్తుంటే, మన ప్రభుత్వం మాత్రం లీకేజీ లేదని ఓ నామమాత్ర వివరణతో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అభివృద్ధి చెందిన దేశాల్లో ఇంత పెద్ద డేటా లీక్‌ కనుక జరిగివుంటే, అక్కడి ప్రభుత్వం బతికి బట్టకట్టేది కాదు అని నిపుణులు వ్యాఖ్యానిస్తుంటే, మన ప్రభుత్వం మాత్రం లీకేజీ లేదని ఓ నామమాత్ర వివరణతో సరిపెట్టింది. కొవిడ్‌ వాక్సినేషన్‌కు ఉద్దేశించిన కొవిన్‌ పోర్టల్‌లోని సమస్త సమాచారం బయటకు వచ్చిందన్న వార్తలు నిజమైన పక్షంలో, దేశచరిత్రలోనే అది అతిపెద్ద డేటా లీక్‌ అవుతుంది. వాక్సినేషన్‌ కోసం ప్రభుత్వం ప్రత్యేక పోర్టల్‌ తెచ్చినప్పుడు, ఫోన్‌ నెంబర్‌తోపాటు అతిముఖ్యంగా ఆధార్‌ సంఖ్యతోనూ ప్రజలు వాక్సిన్‌ తీసుకోవలసి వచ్చింది. వ్యక్తుల పేర్లు, వారి ఆధార్‌ వివరాలు, ఫోన్‌ నెంబర్లు ఇత్యాది సమస్త సమాచారం ఇప్పుడు ఒక మెసెంజర్‌ యాప్‌లో ప్రత్యక్షమైనాయి. టెలిగ్రామ్‌లోని ఒక బాట్‌లో ఫోన్‌, ఆధార్‌ నంబర్లలో దేనిని ఎంటర్‌ చేసినా, సంబంధిత వ్యక్తుల వివరాలు వెలుగుచూశాయి. విదేశాలకు వెళ్ళేందుకు అనేకమంది తమ పాస్‌పోర్టు వివరాలను కూడా నమోదు చేసుకున్నందున వారి మరింత సమాచారం బయటకు వచ్చింది. ఓటీపీతో మాత్రమే కొవిన్‌లో వివరాలు చూడవచ్చునన్న మాట నిజమే అయినప్పుడు, అటువంటిదేమీ లేకుండానే వాక్సినేషన్‌ తేదీలు, ఆస్పత్రుల వివరాలతో సహా అంతా కళ్ళముందు ఎలా కనిపించిందో ప్రభుత్వం వివరించి వుంటే బాగుండేది.

వందకోట్లకు పైబడిన జనంతో ముడిపడిన ఈ వ్యవహారంలో, ఇది కొవిన్‌ పోర్టల్‌ డేటా కాదనీ, ఎక్కడినుంచో, ఎప్పుడో లీకైన సమాచారం కావచ్చునన్న ప్రభుత్వ వాదన అంత బలంగా లేదు. లీకైన డేటా ద్వారా ప్రభుత్వ ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు, సినీప్రముఖులూ ఇలా చాలా రంగాలవారి వివరాలు బయటకు వచ్చినందుకేమో, ప్రభుత్వం ఈ మాత్రమైనా స్పందించింది. కొవిన్‌ పోర్టల్‌ ఎంత సురక్షితమైనదో, ఎన్ని అంచెల్లో, ఎంత బ్రహ్మాండమైన భద్రతావలయంలో ఈ సమాచారం దాగివున్నదో వివరించింది. ఓటీపీ అథెంటికేషన్‌తో మాత్రమే ఈ పోర్టల్‌లో ఉన్న సమాచారం చూడగలమనీ, ఓటీపీ లేకుండా సమాచారాన్ని షేర్‌ చేయడం కూడా అసాధ్యమని స్పష్టం చేసింది. లీక్‌ వార్తలను ముందుగా కొట్టిపారేస్తూనే, కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీం (సీఈఆర్‌టీ)ని ఓ నివేదిక సమర్పించమని ఆదేశించడం అర్థంకాని విషయం.

ప్రభుత్వం ఇచ్చిన వివరణ ఉపశమనం కంటే అనుమానాలనే అధికంగా మిగల్చింది. వినియోగదారుడు, వాక్సినేటర్‌ మాత్రమే యాక్సెస్‌ చేయగలిగే స్థాయి భద్రత పోర్టల్‌లోని సమాచారానికి ఉన్నప్పుడు, ఒక ఫోన్‌ నెంబరుతో ఈ టెలిగ్రామ్‌ బాట్‌ ద్వారా వినియోగదారుడి ఇతరత్రా సమాచారంతో పాటు, కొవిన్‌లో మాత్రమే ఉండాల్సిన వాక్సినేషన్‌ తేదీ, ఆస్పత్రి వంటి వివరాలు ఎలా బయటకు పొక్కాయన్నది ప్రశ్న. ఇది కొవిన్‌ డేటా కాదన్న వాదనే నిజమనుకున్నా, మరి ఇది ఎక్కడి సమాచారం, ఎప్పటి సమాచారం అన్న ప్రశ్నలు ఉండనే ఉంటాయి. ఇక, ఆధార్‌ డేటా లీకైందన్న వాదనలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తున్న విషయం తెలిసిందే. వందకోట్ల ప్రయత్నాలతో కూడా ఆధార్‌ డేటాను ఎవరూ హ్యాక్‌ చేయలేరు అంటూ పాలకులు గర్వంగా చెబుతున్న తరుణంలో, ఆధార్‌ నెంబరుతో ముడిపడిన వివరాలను కూడా ఈ బాట్‌ ఎలా ప్రదర్శించగలిగిందో తెలియదు. వెలుగుచూసిన సమాచారం ఇప్పటిది కాదు, ఎప్పటిదో అన్నమాటలు ఆత్మరక్షణకు తాత్కాలికంగా ఉపకరిస్తాయేమో కానీ, మరిన్ని అనుమానాలు, భయాలు రెకెత్తిస్తాయి. పౌరుడి ఆధార్‌ సంఖ్యను స్టోర్‌ చేయకూడదన్న ఆధార్‌ చట్టం నియమం కూడా ఇక్కడ ఉల్లంఘనకు గురైంది. వాక్సినేషన్‌ నిమిత్తం ప్రభుత్వం కొవిన్‌ పోర్టల్‌ ఏర్పాటు చేసినప్పుడు చాలామంది నిపుణులు ఒకేమారు పౌరుల కీలకమైన వివరాలన్నీ సేకరించడం మీద అభ్యంతరం వెలిబుచ్చితే ప్రభుత్వం తీసిపారేసింది. మీ డేటాకు వచ్చిన నష్టం ఏమీ లేదని, భద్రంగా ఉంటుందని ప్రభుత్వంతో పాటు కొవిన్‌ పోర్టల్‌ సైతం హామీ పడింది. అది జరగకపోగా, కొవిన్‌ అవసరం తీరిన తరువాత కూడా దానిని ఇంకా కొనసాగించాల్సిన అవసరాన్ని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. అందులోని డేటాను ప్రభుత్వమే ఇతరత్రా ప్రయోజనాలకు వాడుకోదల్చుకున్నదా అని ప్రశ్నిస్తున్నారు. తమ అవసరం తీరిపోయాక సమాచారాన్ని డిలీట్‌ చేసే హక్కు ప్రజలకు ఉంటే తప్ప, ప్రభుత్వం తనకు తానుగా డేటాను రక్షించలేదని వరుస లీకేజీలు స్పష్టంచేస్తున్నాయి.

Updated Date - 2023-06-14T00:29:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising