ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పుతిన్‌ స్వయంకృతం

ABN, First Publish Date - 2023-06-28T01:53:23+05:30

రష్యాకిరాయి సైన్యం ‘వాగ్నర్‌’ ఎంత భయంకరమైనదో ఉక్రెయిన్‌ యుద్ధంలో అత్యంత కీలకమైన బఖ్మూత్‌ నగరాన్ని అది స్వాధీనం చేసుకున్నప్పుడు ప్రపంచానికి తెలిసింది. ప్రాణాలకు తెగించి పోరాడటమే కాక...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రష్యాకిరాయి సైన్యం ‘వాగ్నర్‌’ ఎంత భయంకరమైనదో ఉక్రెయిన్‌ యుద్ధంలో అత్యంత కీలకమైన బఖ్మూత్‌ నగరాన్ని అది స్వాధీనం చేసుకున్నప్పుడు ప్రపంచానికి తెలిసింది. ప్రాణాలకు తెగించి పోరాడటమే కాక, వాగ్నర్‌‌ సృష్టించిన విధ్వంసం, అరాచకాలు అంతా ఇంతా కాదు. ఒక్క వాగ్నర్‌‌ సైనికుడు పదిమంది రష్యన్‌ సైనికుల పెట్టు అన్న వ్యాఖ్యలు కూడా అప్పట్లో వినబడ్డాయి. వాగ్నర్‌ అధినేత ప్రిగోజిన్‌ తిరుగుబాటు సందర్భంలో రష్యా అధ్యక్షుడు తన ప్రసంగంతోనూ వ్యాఖ్యలతోనూ స్వయంగా ఆ ప్రైవేటు సైన్యం శక్తిని మరింత స్పష్టం చేశారు. వందలకిలోమీటర్ల దూరంనుంచి ఓ పాతికవేలమంది తరలివస్తుంటే, అత్యంత శక్తిమంతమైన సైన్యం తన గుప్పిట్లో ఉన్న దేశాధ్యక్షుడు మాస్కోలో ఇంతగా వొణికిపోతున్నారేమిటి? అని ఆశ్చర్యపోయేట్టుగా ఉంది పుతిన్‌ ప్రవర్తన. మాస్కోను ప్రిగోజిన్‌ స్వాధీనం చేసుకోవడం ఎంతోదూరంలో లేదని, పుతిన్‌ పని అయిపోయిందని పాశ్చాత్యదేశాల సంతోషం ఎక్కువకాలం నిలవలేదు. కొద్దిగంటల్లోనే వాగ్నర్‌‌ సైనికులు వెనక్కుపోయారు. ఈ వ్యవహారంలో పుతిన్‌ ఓడినట్టా, గెలిచినట్టా అన్నది అటుంచితే, వాగ్నర్‌‌ అధినేత ఏ కారణం వల్లనో ఉపశమించారు, పుతిన్‌ సన్నిహిత పాలకుడున్న బెలరూస్‌లో ప్రస్తుతానికి నిక్షేపంగా ఉన్నారు.

రష్యాను ఢీకొట్టగలిగే శక్తి తనకు ఉందని వాగ్నర్‌ అధినేత నిజంగానే నమ్మారా, పుతిన్‌ను దించి, అధికారాన్ని స్వాధీనం చేసుకోవడం అంత సులువైన విషయమా అన్న ప్రశ్నలకు ఎవరికి నచ్చిన సమాధానం వారు చెప్పుకోవచ్చు. కానీ, ఈ కష్టకాలంలో చైనా, ఉత్తరకొరియా వంటివి రష్యా అధినేతకు బాహాటంగానే బాసటగా నిలబడిన నేపథ్యంలో, తన ఆగ్రహావేశాలు నిరుపయోగమైనవని ప్రిగోజిన్‌ గ్రహించివుంటారు. తిరుగుబాటును అంతే వేగంగా చల్లార్చడానికి రష్యా తెరవెనుక ప్రయత్నాలు ఉపకరించాయి. ప్రిగోజిన్‌ మీద రష్యా రక్షణమంత్రి కక్షకట్టారని, తమకు సకాలంలో ఆయుధాలు చేరకుండా నష్టం చేకూర్చిన ఆయన ఇప్పుడు ఏకంగా మిసైల్‌ దాడితో రెండువేలమందిని బలితీసుకున్నారని ఆగ్రహిస్తున్న వాగ్నర్‌‌ను ఉపశమింపచేయడానికి రష్యా అధినేతనుంచి నిర్దిష్టమైన హామీలు లభించాయి. దేశద్రోహులు, వెన్నుపోటుదారులు అంటూ తీవ్రాతితీవ్రమైన విమర్శలు చేసినవారిపై పుతిన్‌ అన్ని కేసులూ ఎత్తివేసి, వారిని బహుమానాలతో సత్కరించాలని నిర్ణయించారు. సైనిక తిరుగుబాటుకు పాల్పడ్డాడన్న ఆరోపణపై ఇరవైయేళ్ళకుపైగా రష్యా జైళ్ళలో మగ్గవలసిన ప్రిగోజిన్‌ బెలరూస్‌ అధ్యక్షుడు లుకషెంకో అతిథ్యంలో సేదదీరుతున్నారు. తన వైరం రష్యన్‌ సైన్యంతోనే కానీ, పుతిన్‌ను గద్దెదించాలన్న ఆలోచన తనకు లేదని చెబుతున్నాడు. గతంలో పుతిన్‌ పక్షాన బెలరూస్‌ను ముప్పుతిప్పలు పెట్టిన వాగ్నర్‌ ఇకపై అక్కడనుంచి కూడా కార్యకలపాలు నిర్వహించే అనుమతులు సంపాదించుకుంది. పుతిన్‌కు బెలరూస్‌ అధ్యక్షుడు లుకషెంకో అత్యంత సన్నిహితుడు. రష్యా తన కీలకమైన అణ్వాయుధాలను అక్కడకు తరలించేస్థాయిలో ఈ సాన్నిహిత్యం ఉన్నది. పుతిన్‌మీద తిరుగుబాటు తనకు, తనదేశానికి కూడా ప్రమాదమే కనుక, అది పాశ్చాత్యదేశాల దురాక్రమణలకు మరింత అవకాశం ఇస్తుంది కనుక పుతిన్‌ పక్షాన లుకషెంకో రంగప్రవేశం చేసి పరిస్థితులను చక్కదిద్దారు.

ప్రిగోజిన్‌ తిరుగుబాటు ఆదిలోనే ఆగిపోయినా పుతిన్‌కు ఇది మాయనిమచ్చ. సైన్యం చేతుల్లో భద్రంగా ఉండాల్సిన శక్తిమంతమైన ఆయుధాలను కిరాయిమూకలకు ఇచ్చి మరొకదేశంమీదకు ఎగదోసిన ఫలితం ఇది. క్షిపణులతో సహా ప్రమాదకరమైన ఆయుధాలు చేబూనిన ఆ కిరాయిమనుషులు తన శత్రువులను ఊచకోతకోసినప్పుడు సంతోషించిన పుతిన్‌, తనపైనే ఎదురుతిరిగేసరికి వొణికిపోవలసి వచ్చింది. వ్యూహాల్లోనూ, తెగింపులోనూ, దాడి తీరులోనూ తమ సైనికులను మించిపోయినవారు దారిమధ్యలో ఎటువంటి ప్రతిఘటనా లేకుండా ఒక్కొక్కనగరాన్ని సునాయాసంగా దాటివస్తుంటే భయంతో కంపించిపోవలసివచ్చింది. వరుస పరాజయాల తరువాత తనకు బఖ్మూత్‌ విజయాన్ని సమకూర్చిపెట్టినవారిని ఇకపై నమ్మలేని, ఉక్రెయిన్‌పై యుద్ధానికి వాడుకోలేని స్థితిలోకి పుతిన్‌ జారుకున్నారు. కేవలం కొద్దిగంటల ప్రిగోజిన్‌ తిరుగుబాటు పుతిన్‌ సహా దేశ సైనికరంగంలోని బలహీనతలను బట్టబయలు చేసింది. ఉక్రెయిన్‌ యుద్ధం సృష్టిస్తున్న అనేక విపత్కరపరిణామాల్లో ఇదీ ఒకటి. యుద్ధంలో పైచేయి సాధించడానికి ఉభయపక్షాలూ అడ్డదారులు తొక్కుతున్న తరుణంలో దానికి సత్వరమే స్వస్తిపలకడం అవసరం.

Updated Date - 2023-06-28T01:53:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising