ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నివేదిక–హెచ్చరిక

ABN, First Publish Date - 2023-03-10T01:28:21+05:30

ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం హరించుకుపోతున్నదని ఆవేదన చెందుతూ, నియంతృత్వ తరహా పాలనలోకి పోతున్న నలభైరెండు దేశాల జాబితాను స్వీడెన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ గోతెన్‌బర్గ్‌కు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం హరించుకుపోతున్నదని ఆవేదన చెందుతూ, నియంతృత్వ తరహా పాలనలోకి పోతున్న నలభైరెండు దేశాల జాబితాను స్వీడెన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ గోతెన్‌బర్గ్‌కు చెందిన ‘వెరైటీస్‌ ఆఫ్‌ డెమోక్రసీ (వి–డెమ్‌) ఇనిస్టిట్యూట్‌’ తన తాజా నివేదికలో ప్రకటించింది. భావప్రకటనాస్వేచ్ఛ, మీడియా స్వతంత్రత, ఎన్నికలు జరిగే తీరు, రాజ్యాంగసంస్థల బలాబలాలు, పౌర ప్రజాస్వామిక హక్కుల విషయంలో పాలకుల వైఖరి ఇత్యాది అనేకానేక ప్రాతిపదికలమీద ఈ నివేదిక తయారవుతుంది. ఈ నలభై రెండుదేశాల్లో భారతదేశం తొలిపదిర్యాంకుల్లో ఉంది. గతదశాబ్దకాలంలో భారతదేశంలో ప్రజాస్వామిక, మేథోపరమైన స్వేచ్ఛ గణనీయంగా తగ్గిందని, ప్రజాస్వామిక లక్షణాలు క్షీణిస్తూ, నియంతృత్వ తరహా ధోరణులు హెచ్చుతున్నాయని వి–డెమ్‌ విశ్లేషించింది.

ఈ నివేదిక ప్రకారం, 2022 నాటికి మొత్తం ప్రపంచజనాభాలో డెబ్బయ్‌రెండు శాతం నియంతృత్వ దేశాల్లోనే ఉన్నారు. పదమూడుశాతం మాత్రమే స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యదేశాల్లో నివసిస్తున్నారు. నియంతృత్వదిశగా శీఘ్రప్రయాణం చేస్తున్న దేశాల్లో, గతంలో ఉన్న ప్రజాస్వామిక భావనలు కూడా తుడిచిపెట్టుకుపోయాయనీ, ఆయా దేశాల్లోని పాలకుల విధానాలవల్ల ఆ కాస్త సానుకూల మార్పుకూడా లేకుండాపోయిందని నివేదిక వ్యాఖ్యానించింది. 35దేశాల్లో వాక్‌స్వేచ్ఛ క్షీణిస్తే, 45దేశాల్లో మీడియా సెన్సార్‌షిప్‌ పెరిగింది. కరోనా కాలంలో అనేక దేశాల ప్రభుత్వాలు అన్ని వ్యవస్థలనీ తమ గుప్పిట్లో బంధించాయి, పౌరహక్కులనీ, స్వేచ్ఛనీ బలహీనపరచే చట్టాలు చేసుకున్నాయి. ఆరోగ్య అత్యయికస్థితి ముసుగులో జవాబుదారీతనాన్ని వదిలేసి, ప్రశ్నించే వాతావరణాన్ని నాశనం చేశాయి.

భారత్‌ ఇక ఎంతమాత్రం ఉదారవాద దేశం కాదని, ఎన్నికలున్న నియంతృత్వదేశమని గతనివేదికలోనే ఈ సంస్థ మనను రష్యాతో పోల్చింది. వాక్‌స్వేచ్ఛ లేకపోవడం, మీడియామీదా, పౌరహక్కుల కార్యకర్తలమీదా, ప్రజాస్వామిక వాదులపైనా నియంత్రణలు, నిఘా హెచ్చడం వంటివి భారత్‌లో అత్యధికంగా ఉన్నాయని నివేదిక అంటున్నది. భారతదేశం పటిష్ఠ ప్రజాస్వామ్యమేమీ కాదు. ఆ మాటకొస్తే, ఏ ప్రజాస్వామ్యమూ పరిపూర్ణమైనది కాదు. కానీ, గత పదేళ్ళకాలంలో దేశ ప్రజాస్వామిక వాతావరణంలోనూ, అన్ని రంగాల్లోనూ, వ్యవస్థల్లోనూ సంభవించిన పతనం అంతర్జాతీయ నివేదికల్లో ప్రతిఫలించడం సహజం. ఫ్రీడమ్‌ హౌస్‌ నుంచి వి–డెమ్‌ వరకూ చాలా సంస్థలు తమ ప్రజాస్వామ్య సూచీల్లో మన స్థానాన్ని జాబితా చివరకు నెట్టేస్తూనే ఉన్నాయి. భారతదేశంలో ప్రజాస్వామ్యం బలహీనపడుతోందనీ, పొరుగుదేశాలైన శ్రీలంక, నేపాల్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌లకంటే నియంతగా మారిందని అంటూ వెనుకస్థానాలే కట్టబెడుతున్నాయి. ఈ కొత్త నివేదికలో దేశం ఉదారవాద ప్రజాస్వామ్య సూచీలో 97వ స్థానంలో ఉంది. భారత్‌కంటే, టాంజానియా, మెక్సికో, నైజీరియా వంటిదేశాల్లోనే పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయి. పటిష్టమైన రాజ్యాంగం, బలమైన ప్రజాస్వామిక పునాదులున్న ఈ దేశం ఎన్నటికీ నియంతృత్వంలోకి జారిపోదన్న భ్రమలు క్రమంగా వీడిపోతున్నాయి.

విమర్శలను సహించకపోవడం, నివేదికలను భరించకపోవడం మన పాలకులకు అలవాటుగా మారింది. నాలుగువందల రకాల సూచికల ఆధారంగా, వేలాదిమంది నిపుణులు అందించిన సమాచారాన్ని క్రోడీకరించి దీనిని తయారుచేశామని ఆ సంస్థ చెబుతున్నప్పటికీ, ఓ అంతర్జాతీయ కుట్రగా దీనిని కూడా కొట్టిపారేయడం సహజం. మన మార్కెట్‌ కోసమో, మనం కొనే ఆయుధాల కోసమో నాలుగుమంచిమాటలు చెప్పి ఒప్పందాలు చేసుకుపోయేవారే పాలకులకు నచ్చుతారు. ప్రజాశ్రేయస్సుకోసం, సంక్షేమంకోసం, బడుగుల బతుకుతెరువుకోసం మాట్లాడేవారంతా అర్బన్‌నక్సలైట్లుగా ముద్రపడతారు. స్వతంత్ర వ్యవస్థలను దారికితెచ్చుకోవడం, పౌరసమాజాన్ని, ప్రతిపక్షాలనూ సన్నగిల్లచేయడం, ప్రశ్నించేవారిని దేశద్రోహులుగా చిత్రీకరించడం కంటికి కనబడుతున్నదే. ఒకపక్క అన్ని విలువలనూ భూస్థాపితం చేస్తూ, ప్రజాస్వామ్య సూచీలను, అంతర్జాతీయ నివేదికలనూ విమర్శించడం వల్ల ప్రయోజనం లేదు. వివిధ దేశాలతో కూటములు కడుతూ, విలువలు పంచుకుంటామని హామీ ఇస్తున్నప్పుడు హక్కులు, చట్టబద్ధత, ప్రజాస్వామిక వ్యవస్థల పరిరక్షణ విషయంలో కట్టుబాటు ప్రదర్శించాలి. అంతర్జాతీయ సమాజం ముందు తలవంపులు రాకుండా చూసుకోవాలి.

Updated Date - 2023-03-10T01:28:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising