ఫలితాలు, హెచ్చరికలు
ABN, First Publish Date - 2023-05-16T00:56:42+05:30
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం సర్వేలు కూడా ఊహించాయి కానీ, కన్నడ ఓటర్లు ఏ మాత్రం శషభిషలులేకుండా తీర్పు విస్పష్టంగా ఇచ్చారు...
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం సర్వేలు కూడా ఊహించాయి కానీ, కన్నడ ఓటర్లు ఏ మాత్రం శషభిషలులేకుండా తీర్పు విస్పష్టంగా ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో, అన్ని వర్గాల ప్రజల్లో కాంగ్రెస్‌కు ఆదరణ లభించింది. దాని సంఖ్యాబలంలో సగం మాత్రమే బీజేపీకి దక్కింది. బీజేపి కంచుకోటలనుకున్నవి కూడా కూలిపోయాయి. కుమారస్వామి పార్టీని కూడా ఈ మారు జనం మూలకు నెట్టేశారు. హంగ్ ఏర్పడితే ఎటువంటి పరిణామాలు సంభవిస్తాయో వారికి బాగా తెలుసు కనుక, మూడోపక్షానికి చక్రం తిప్పే, ఏక్‌నాథ్ షిండేలను సృష్టించగలిగే అవకాశం ఏ మాత్రం లేకుండా చేశారు. ఈ స్థాయి సంఖ్యాబలం లేకుండా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా, ఓడినా ఒకటేనని కన్నడిగులు బాగానే గుర్తించారు.
అధికారపక్ష వ్యతిరేకత సహజమే కానీ, అది ఈ స్థాయిలో ఉండటం విశేషం. దేశప్రధాని ప్రధాన ప్రచారకర్తగా అవతారమెత్తి, 19సభలతో, అరడజను రోడ్డుయాత్రలతో రాష్ట్రాన్ని హోరెత్తించినా ఫలితం లేకపోయింది. నిజానికి, ఈ ఎన్నికలు కాస్తంత ప్రజాస్వామిక వాతావరణంలో జరిగివుంటే కాంగ్రెస్ విజయానికి అంత ప్రాధాన్యం ఉండేదికాదు. భవిష్యత్తులోనూ ఇదేవిధమైన వాతావరణంలో విపక్షాలు ఎన్నికల యుద్ధానికి సిద్ధం కావాలని కర్ణాటక హెచ్చరిస్తున్నది. ఈడీ, సీబీఐ, ఐటీ ఇతరత్రా ప్రభుత్వ వ్యవస్థల రాజకీయ దుర్వినియోగం మోదీ ఏలుబడిలో వ్యవస్థీకృతమైపోయిన స్థితిలో, విపక్షనాయకులను, వారి సన్నిహితులకు ఊపిరాడనివ్వని రీతిలో కర్ణాటక ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు సీబీఐ కొత్త డైరక్టర్ నియామకం కూడా వాతావరణంలో మార్పులేదన్న హెచ్చరికే. సర్వసత్తాక ఎన్నికల సంఘం కూడా ఈ హోరాహోరీ పోరాటంలో అన్యాయమైన పాత్రే పోషించింది. నరేంద్రమోదీ, అమిత్ షాలు నిర్భయంగా మత ఎజెండాను అమలుచేశారు. కాంగ్రెస్‌పార్టీకి టెర్రరిస్టులతో సంబంధాలున్నాయని అంటారు, అది అధికారంలోకి వస్తే మతఘర్షణలు జరుగుతాయంటారు. ప్రధాని స్వయంగా జై బజరంగ్ బలీ అంటూ నినదించి మరీ ఓటర్లను ఓటువేయమన్నారు. ఇది ఎన్నికల నిబంధనల ఉల్లంఘనంటూ కాంగ్రెస్ చేసిన ఆర్తనాదాలు ఎన్నికల సంఘం చెవికిసోకలేదు. కానీ, కర్ణాటక సార్వభౌమత్వం అంటూ సోనియా చేయని ఓ వ్యాఖ్య విషయంలో మాత్రం ఈసీ చొరవ ప్రదర్శించింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశంనుంచి కర్ణాటకను విడదీస్తుందన్న ప్రధాని వ్యాఖ్య కూడా ఈసీకి భయానకమైనదిగా అనిపించలేదు. ఎన్నికల బాండ్ల ద్వారా అధికారికంగానూ, ఆశ్రిత పెట్టుబడిదారుల ద్వారా అనధికారికంగానూ సమకూరుతున్న ధనానికి లోటులేదు కనుక కర్ణాటకలోనే కాదు, రాబోయే అన్ని ఎన్నికలను బీజేపీ బలంగా ఎదుర్కోగలుగుతుంది. ఎన్నికల నియమావళి ముందూ, తరువాతా కూడా ప్రధాని సహా కేంద్రమంత్రులంతా కోట్లాది రూపాయలు ఖర్చుతో జరిపే పర్యటనల గురించి ప్రశ్నించేవారెవ్వరూ లేరు.
కాంగ్రెస్ ముక్త్‌భారత్ అన్న నినాదం వెనుక రాజకీయలక్ష్యం కాక, వ్యక్తిగత కక్షలున్నాయని కన్నడ ఓటర్లకు అర్థమైంది. జోడోయాత్రతో వచ్చిన ఆత్మవిశ్వాసాన్ని చిదిమేసేందుకు గతకాలపు కేసును తిరిగితవ్వి రాహుల్‌గాంధీని పార్లమెంటునుంచి గెంటేసిన తీరును, డబుల్ ఇంజన్ సర్కారుతోనే ప్రజాసంక్షేమం అని చెబుతున్న పార్టీ తమ ఫార్టీపర్సంట్ సర్కారు అవినీతి గురించి మాట్లాడకపోవడం వారు బాగానే గమనించారు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చేముందు నాలుగుశాతం ముస్లిం రిజర్వేషన్లను బలమైన రెండు కులాలకు పంచడం వెనుక ఉద్ధరణ కాక, కుత్సితత్వం ఉన్నదని గమనించారు. టిప్పుసుల్తాన్, హిజాబ్, హలాల్, లవ్‌జిహాద్, చివరకు కేరళస్టోరీ సహా సమస్త అస్త్రాలనూ ప్రయోగించినా, ‘నందిని’ అవమానమే కన్నడిగుల్లో మనసులో మిగిలిపోయింది. స్థానిక సమస్యలు, బతుకుబాధలు, ఉపాధి, సాధికారత, సంక్షేమం గురించి మాత్రమే మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తాను ఇచ్చిన హామీలను అమలుచేయడం అంత సులభం కాదు. పైగా చాలా హామీలకు నిర్దిష్టమైన కాలపరిమితిని కూడా ప్రకటించింది. ఎనిమిది పదుల వయసులో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్‌ఖర్గే స్వరాష్ట్రంలో తన పార్టీ సాధించిన ఈ విజయాన్ని అంతర్గత కుమ్ములాటలకు బలిపెట్టకుండా ప్రజాసంక్షేమానికి కృషిచేస్తే సంతోషం.
Updated Date - 2023-05-16T00:56:42+05:30 IST