ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆచరణలో చూపండి!

ABN, First Publish Date - 2023-08-15T02:29:41+05:30

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతీ ఇంటిముందూ మువ్వన్నెల జెండాను ఎగురవేయండి, జెండాతో సెల్ఫీలు దిగండి అని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ‘హర్‌ఘర్‌ తిరంగా’ను...

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతీ ఇంటిముందూ మువ్వన్నెల జెండాను ఎగురవేయండి, జెండాతో సెల్ఫీలు దిగండి అని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ‘హర్‌ఘర్‌ తిరంగా’ను విజయవంతం చేయడానికి సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా పోటీపడుతున్నారు. ఇంటిమీద జెండా ఎగురవేసి, ఒంటిమీద ధరించి చిరునవ్వులు చిందించే, అమితంగా గర్వించే సందర్భం ఇది.

గతంలో ప్రధానులు ఇలా పిలుపునివ్వనందుకే ప్రజలు కూడా స్వాతంత్ర్యదినోత్సంతో అంతగా మమేకం కాలేదని, మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత జెండాపట్లా దేశం పట్లా జనంలో గౌరవాన్ని, అభిమానాన్ని పెంచారని బీజేపీ అభిమానుల వాదన. దేశమంతా జెండాలతో నిండిపోవాలన్న ప్రధాని లక్ష్యం ప్రజల్లో దేశభక్తిని పెంపొందింపచేసి దేశప్రయాణంలో వారిని భాగస్వాములను చేయడానికేనని వారంటారు. త్రివర్ణపతాకాన్ని సెల్ఫీల్లోనూ, సోషల్‌ మీడియాలో ప్రొఫైల్‌ పిక్చర్‌గానో, డిస్‌ప్లే పిక్చర్‌గానో పెట్టుకోమని మోదీ ప్రభుత్వం అమృతోత్సవం నుంచి మరింత ఎక్కువగా ప్రచారం చేస్తున్నది. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దేశభక్తి నిర్వచనాన్నే మార్చివేసి, దానిని ఆయుధంగా వాడుకుంటోందని నమ్ముతున్నవారు వీటిని తీసిపారేయడమూ జరుగుతోంది.


ఈ ఏడున్నరదశాబ్దాల్లో దేశం ఎంతో అభివృద్ధి చెందింది. తిండిగింజలు దిగుమతిచేసుకొనే దుస్థితినుంచి, మిగతా ప్రపంచానికి ఆహారధాన్యాలను ఎగుమతి చేయగలిగేస్థాయికి చేరుకుంది. శాస్త్రసాంకేతిక రంగాల్లో అద్భుతవిజయాలు సాధించింది, రక్షణరంగాన్ని బలోపేతం చేసుకుంది. కానీ, దేశంలో ఇంకా ఆకలితో ఉన్నవారూ, అక్షరాలు రానివారూ అత్యధికసంఖ్యలో ఉన్నారు. వైద్యం అందని పల్లెలు, ఖరీదైన వైద్యం అందుకోలేని సామాన్యులూ ఉన్నారు. ఎంత ప్రగతి సాధించినా, ఇంకా చేయాల్సింది, ప్రయాణించాల్సిందీ మిగిలేవుంటుంది. దేశప్రగతిలో ప్రజాభాగస్వామ్యం గురించి పాలకులు తరచుగా మాట్లాడుతూంటారు కానీ, ఆచరణలో అది మరింతగా మాయమవుతోంది. స్వాతంత్ర్యదినోత్సవం నాడు ప్రజలకు సెల్ఫీ దేశభక్తిని నేర్పాలనుకున్నవారు పాలనలో ప్రజాభాగస్వామ్యాన్ని పరిమితం చేస్తున్నారు. ప్రజాప్రతినిధుల పాత్ర ఇంకా కుంచించుకుపోయింది. బల్లలను చరిచి బిల్లులను ఆమోదించడం మాత్రమే అధికారపక్షసభ్యులకు తెలిసినవిద్య. ప్రశ్నించేవారంతా ప్రతినాయకులైపోయారు. వద్దనివారించేవారంతా దేశద్రోహులైపోతున్నారు. స్వాతంత్ర్యపోరాటంలో మహత్తరపాత్ర పోషించినవారి మధ్య కృత్రిమమైన గీతలు గీయడం, వారిని నిందించడం, గుర్తులు చెరిపివేయడానికి ప్రయత్నించడం దేశభక్తి ఉన్నవారు చేయదగినపనులు కావు.

అమృతకాలంలో మన ప్రయాణం మరింత ఉన్నతంగా, ఘనంగా జరగాలంటే సమాజంలో అసమ్మతికి అవకాశం ఉండాలి. ప్రశ్నకు వీలుండాలి. చట్టసభల్లో చర్చకు స్థానం ఉండాలి. ప్రజలు ఎన్నుకున్నవారి మాటకు విలువదక్కాలి. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిండుసభలో చక్కని చర్చతో ఆమోదించిన చట్టమంటూ లేకపోయింది. చర్చలేకుండా, స్టాండింగ్ కమిటీల ఊసులేకుండా అత్యంత తీవ్రమైన చట్టాలను సైతం ఏకపక్షంగా ఆమోదించడం, ఆ ప్రక్రియలో విపక్షాలను తూలనాడటం, అవహేళన చేయడం ఒక సంప్రదాయంగా మారిపోయింది. దేశాన్ని కుదిపేస్తున్న కుంభకోణాలకు, కుట్రలకు జవాబు లేకుండాపోయింది. ముప్పైచట్టాలను గుదిగుచ్చి తయారుచేసిన లేబర్‌ కోడ్‌, రైతు చట్టాల వంటివన్నీ ఏకపక్షంగా నెగ్గినవే. ఇప్పుడు, మారుపేర్లతో సభాప్రవేశం చేయబోతున్న పలు దేశీయ శిక్షాస్మృతులకు కూడా చివరకు అదేగతి పడుతుంది. మండిపోతున్న మణిపూర్‌ మీద చర్చ సైతం ఏడుదశాబ్దాల కాంగ్రెస్‌ పాపాలను ఏకరువుపెట్టి, విపక్ష కూటమిని జయించిన ఆనందంతో ముగిసిపోయింది తప్ప, ఏమాత్రం తడిలేదు. ప్రధాని, హోంమంత్రి అద్భుతమైన వక్తలు కావచ్చునేమో కానీ, అన్ని గంటలు మాట్లాడినా అందులో కనీస బాధ్యత, బాధితులకు ఓదార్పు కనిపించకపోతే ఎలా? సభలో చర్చలు వక్తృత్వపు పోటీలుగా పరిణమించడం, గెలుపోటములు ప్రధానం కావడం దేశానికి మంచిది కాదు. జవాబుదారీతనం ఉండాల్సిన చోట జయించాలన్నదే లక్ష్యమైనప్పుడు నిండుసభ కూడా సోషల్‌ మీడియా వేదికలాగానే మిగిలిపోతుంది.

ప్రపంచంలో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా, విశ్వగురుగా అవతరిస్తున్నామని అంటున్నప్పుడు స్వతంత్రభారతాన్ని సాధించిపెట్టి, ఒక లౌకిక ప్రజాస్వామ్య దేశంగా దానికి పునాదులు వేసినవారి కలలను కల్లలు చేయకూడదు. రాజ్యాంగ స్ఫూర్తిని నాశనం చేయకూడదు. దేశభక్తిని ప్రజలకు అలవర్చాలంటే ముందు పాలకుల మాటల్లో కాక చేతల్లో చాలా మార్పురావాలి.

Updated Date - 2023-08-15T02:29:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising