మాటరాని, మనసులేని...!
ABN, First Publish Date - 2023-07-26T01:11:59+05:30
ఢిల్లీ మహిళాకమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ మణిపూర్‌లో మే 4వతేదీ ఘటనలో బాధితులైన ఇద్దరు మహిళల కుటుంబీకులను...
ఢిల్లీ మహిళాకమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ మణిపూర్‌లో మే 4వతేదీ ఘటనలో బాధితులైన ఇద్దరు మహిళల కుటుంబీకులను పరామర్శించారు. తమను ఓదార్చేందుకు ఇప్పటివరకూ ఒక్కరు కూడా రాలేదని వారు చెబుతుంటే గుండెలు పిండేసినట్టు అనిపించిందని , ఒక సైనికుడి భార్య కన్నీటిపర్యంతమైన దృశ్యం తనను కలిచివేసిందని మలివాల్ చెప్పుకొచ్చారు. పరామర్శకు వెళ్ళింది ఢిల్లీ మహిళాకమిషన్ చీఫ్ కనుక ఇదంతా రాజకీయం అన్న వ్యాఖ్యలు, విమర్శలు సహజం. కానీ, కష్టాల్లో ఉన్నవారికి పరామర్శ కాస్తంత ఉపశమనాన్ని ఇస్తుంది. తమకు అన్యాయం జరగడంతో పాటు, న్యాయం కూడా దక్కదన్న నిరాశానిస్పృహల్లో బాధితులు ఉన్నప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదన్న బాధ గుండెలను మరింత పిండేస్తుంది. అటువంటి స్థితిలో ఎవరు వచ్చి ఓదార్చినా కన్నీళ్ళు వర్షిస్తాయి.
ఏమీ చేయలేనప్పుడు, చేతకానప్పుడు ఆ పదవిలో ఉండటం దండుగ అంటూ జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖాశర్మను నిందించి మరీ మలివాల్ మణిపూర్ పర్యటనకు బయలుదేరారు. ఇప్పుడు జాతీయ మహిళా కమిషన్ బృందం కూడా హింసకు గురైన మహిళలను పరామర్శించేందుకు మణిపూర్‌లో కాలూనింది. సరిగ్గా నాలుగురోజుల క్రితం తాను ఏ బృందాన్ని మణిపూర్ పంపలేదని రేఖాశర్మ ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆ అమానవీయమైన విడియో వెలుగుచూడటానికి నెలరోజుల ముందే, ఆ ఘాతుకం సహా మహిళలపై చాలా దారుణాలు జరుగుతున్నాయంటూ కమిషన్‌కు ఫిర్యాదులు అందాయి. తెగలమధ్య యుద్ధంలో అత్యధికసంఖ్యలో మహిళలు బలైపోతున్నారని, పోటాపోటీగా వారిపై లైంగికదాడులు జరుగుతున్నాయని క్షేత్రస్థాయిలో పర్యటించిన ఇద్దరు కార్యకర్తలు రేఖాశర్మకు పలు మెయిల్స్ పంపారు. వ్యవస్థలన్నీ కలసికట్టుగా, నిర్లిప్తంగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో, మహిళలపై సాగుతున్న దాడులు వెలుగుచూడటం లేదన్నారు. బాధితులతో మాట్లాడి ఆరు అత్యాచార ఘటనలను తెలియచేయడంతో పాటు, అనేకమంది యువతులు ఇతరత్రా ఎదుర్కొంటున్న వేధింపులు, బెదిరింపులను కూడా వారు రికార్డు చేశారు.
ఆ విడియో వెలుగుచూసిన తరువాత పాలకుల మాదిరిగానే రేఖాశర్మ కూడా నామమాత్రంగానైనా స్పందించకతప్పలేదు. మొన్న మీడియాతో ఆమె మాట్లాడినది విన్నతరువాత, పార్లమెంటు వెలుపల మోదీ చేసిన తడిలేని వ్యాఖ్యలే చాలామందికి గుర్తుకువచ్చాయి. అంతవరకూ ఫిర్యాదులన్నింటినీ బేఖాతరుచేసి, ఓ ముప్పై సెకన్ల విడియో వెలుగులోకి వచ్చి దేశాన్ని కుదిపేయడంతో, విధిలేక ఆదేశించిన విచారణను ఆమె స్వచ్ఛందంగా చేపట్టిన చర్య అంటున్నారు. ప్రెస్‌కాన్ఫరెన్సులో ఆమెనుంచి ప్రధానగా ‘ఫార్వర్డ్’ చేశాను అన్న ముక్క ఒక్కటే పలుమార్లు వినిపించింది. ఫిర్యాదులు వచ్చిపడుతూంటే వాటిని రాష్ట్రప్రభుత్వానికి పంపి, జవాబులేకపోయినా నిమ్మకునీరెత్తినట్టు ఊరుకున్నారు. బృందాన్ని పంపడానికి కానీ, స్పందించని అధికారులను ఢిల్లీ పిలిపించడానికి కానీ ఆమెకు మనసురాలేదు. అటువంటివి చేస్తే, అసలే కష్టాల్లో ఉన్న రాష్ట్ర పాలకులకు, అధికారులకు కొత్తగా మరిన్ని ఇబ్బందులు సృష్టించి, పరిస్థితులు మరింత దిగజారిపోవడానికి కారకురాలిని అవుతానని ఆమెకు అనిపించింది. ప్రతీ ఫిర్యాదును తీవ్రంగా తీసుకొని అధికారులను పరుగులెత్తించాల్సిన కమిషన్ ఇలా అడ్డగోలువాదనలతో నిస్సిగ్గుగా తన నిష్క్రియాపరత్వాన్ని సమర్థించుకుంది. కేంద్రపాలకుల మాదిరిగానే మణిపూర్ గురించి నోరువిప్పడానికి కాని, ఫిర్యాదులపై స్పందించడానికి కాని మహిళా కమిషన్‌కు మనసురాలేదు. బుల్‌డోజర్ ప్రభుత్వం ఉన్నందున అక్కడి ఆర్తనాదాలు వినదల్చుకోలేదు. అక్కడ అడుగుపెట్టి తనను నియమించినవారికి అన్యాయం చేయదల్చుకోలేదు. విషయం తెలియగానే ఒక బృందాన్ని వెంటనే పంపివుంటే, అది అక్కడే ఉంటూ పరిస్థితులను సమీక్షిస్తూ ప్రతీ ఫిర్యాదుపై తక్షణచర్యలకు ఆదేశించివుంటే ఎంతోమంది అమాయక మహిళలను రక్షించగలిగి ఉండేది. వరుస అత్యాచారాలకు అడ్డుకట్టపడేది. మహిళా కమిషన్ ఉనికి బాధితులకు భౌతికంగానూ, మానసికంగానూ ఎంతో ఉపకరించేది.
జాతిహననాలు, మారణకాండలూ సాగుతున్న ఇటువంటి సందర్భాల్లోనూ కమిషన్లు రాజకీయమే చేస్తుంటే దేశానికి అంతకంటే అవమానం లేదు. రాజ్యాంగపరమైన విస్తృత అధికారాలతో, భారీ వేతనాలతో, అనేకమంది సభ్యులతో అవి ఎంతగా వెలుగుతున్నా ఆపదలో ఉపకరించనప్పుడు నిరర్థకం. బాధితులను ఆదుకోనప్పుడు అవి ఉన్నా లేకున్నా ఒక్కటే.
Updated Date - 2023-07-26T01:11:59+05:30 IST