బాధ్యత వహించండి
ABN, First Publish Date - 2023-06-06T01:05:46+05:30
ఒరిస్సాలోని బలాసోర్ జిల్లా బహనగ దగ్గర దారుణ, హృదయవిదారక రైలు ప్రమాదం జరిగి మూడు రోజులు దాటింది. ఆ మృత్యువాతావరణం నుంచి దేశం ఇంకా కోలుకోలేదు. గుర్తింపు లేక,...
ఒరిస్సాలోని బలాసోర్ జిల్లా బహనగ దగ్గర దారుణ, హృదయవిదారక రైలు ప్రమాదం జరిగి మూడు రోజులు దాటింది. ఆ మృత్యువాతావరణం నుంచి దేశం ఇంకా కోలుకోలేదు. గుర్తింపు లేక, బంధువులకు తెలియక, తెలిసినా రాలేక, ఇంకా అనేక మృతదేహాలు తమ తమ కుటుంబాలకు చేరనేలేదు. వెళ్లకూడని పట్టాల పైకి వెళ్లి నిలిచి ఉన్న గుడ్స్‌ని ఢీకొని, మరో పక్క నుంచి వస్తున్న మరో రైలు చివరిపెట్టెలతో గుద్దుకుని గత శుక్రవారం అక్కడ జరిగిన మృత్యు బీభత్సంలో మూడు వందల మందికి పైనే మరణించారు. తొమ్మిది వందల మంది క్షతగాత్రులయ్యారు.
భారత రైల్వేలు ప్రపంచంలోనే పెద్ద ప్రజారవాణా వ్యవస్థ. మనుషులను, మానవావసర ద్రవ్యాలను చేరవేస్తూ భారతదేశాన్ని అనుసంధానం చేస్తున్న అతి గొప్ప వ్యవస్థ. అనుక్షణం అప్రమత్తతతో ఉంటూ, ఈ వ్యవస్థను నిర్వహిస్తున్నది రైల్వే కార్మికులు, సిబ్బంది. చీకటి పడే వేళ ప్రమాదం జరిగినప్పటి నుంచి, అక్కడ సహాయం అందించడానికి, గాయపడినవారిని, మృతులను వెలికి తీయడానికి, రైలు మార్గాన్ని మరమ్మత్తు చేయడానికి శ్రమిస్తున్నదంతా రైల్వే కార్మికులే. అయితే, దురదృష్టవశాత్తు ఈ విషాదానికి కారణం కూడా రైల్వే నిర్వహణ వ్యవస్థే. అంతిమంగా, ఆ వ్యవస్థను ప్రమాదరహితంగా నిర్వహించడానికి కావలసిన వనరులను, రాజకీయ నిర్ణయాలను తీసుకోవలసిన కేంద్రప్రభుత్వందే ప్రధాన బాధ్యత. చిన్న తప్పు కాదు. మానవ తప్పిదమా, సాంకేతిక తప్పిదమా అన్న ప్రశ్న ఒకటి, వ్యక్తుల నేరమా, వ్యవస్థాగత లోపమా అన్న మరొక ప్రశ్న. ఈ కుతూహల ప్రశ్నల కంటె కీలకమయిన ప్రశ్న, బాధ్యులు బాధ్యత వహిస్తారా లేదా అన్నదే! మరోమారు ఇటువంటివి జరగకుండా ఏమన్నా పాఠాలు తీసుకుంటారా? నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని రైల్వే మంత్రి అన్నారు, ఆ నిర్లక్ష్యంలో రైల్వేశాఖ అలక్ష్యం భాగమే కదా?
ఇటువంటివి జరిగినప్పుడు రాజకీయాలు రావడం సహజం. రైల్వే మంత్రి రాజీనామా చేయాలని అడుగుతారు. ఇప్పుడా ఆనవాయితీ లేదు కాబట్టి, అటువంటివేమీ జరగకపోవచ్చు. జరిగినా, శాఖల మార్పు లాంటిదేదో జరగవచ్చు. ప్రజల నుంచి, ప్రతిపక్షాల నుంచి వచ్చే డిమాండ్లను వేటినీ మన్నించకూడదన్న ధోరణి నడుస్తోంది కాబట్టి, ఆ విషయం మీద పెద్ద పట్టింపు పెట్టుకోగూడదు. మీ హయాంలో ఎన్ని ప్రమాదాలు జరిగాయి, మా హయాంలో ఎన్నిజరిగాయి వంటి లెక్కలు తీస్తూ అధికార, ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుకుంటున్నాయి. వాటిని వినడానికి, చదవడానికి అసహ్యంగా ఉన్నది.
ఈ ప్రమాదం మన రాజకీయ, సామాజికార్థిక వ్యవస్థలో ఉన్న అనేక రుగ్మతలను బయటపెడుతున్నది. బులెట్ రైళ్లు, వందే భారత్‌ల మీద, ఆర్భాటపు ప్రచారాల మీద దృష్టి పెట్టే కేంద్ర ప్రభుత్వం, దాని అధినేత, జనరవాణా భద్రత మీద కనీస శ్రద్ధ పెట్టకపోవడం ఎట్లా అర్థం చేసుకోవాలి? రైళ్లకు జెండా ఊపి ప్రారంభించడానికి పనికిరాని రైల్వే మంత్రి, ప్రమాదానికి బాధ్యత వహించి ఎందుకు రాజీనామా చేయాలి? ఎవరు తమ వ్యక్తిగత ప్రచారానికి రైల్వేలను ఉపయోగించుకుంటున్నారో వాళ్లు కదా బాధ్యత వహించాలి? ఇదంతా కేంద్ర అధికార పార్టీ ప్రతిష్ఠను ఎక్కడ దెబ్బతీస్తుందోనని, అసత్యాల ఫ్యాక్టరీ వేగంగా పనిచేయడం మొదలుపెట్టింది. ఇందులో ఏదో విద్రోహం ఉన్నదని, మైనారిటీలు బాధ్యులని, స్టేషన్ మాష్టర్ ఫలానా మతస్థుడని, పట్టాల పక్కన ఒక ప్రార్థనాస్థలమున్నదని ప్రచారంలోకి వచ్చినదంతా పచ్చి అబద్ధం. రేపు దర్యాప్తు జరిగి దోషులుగా ఎవరైనా బయటపడవచ్చు, ఏ మతస్థుడైనా బాధ్యుడై ఉండవచ్చు. మూలకారణాల కోసం ప్రయత్నం మొదలుకాకుండానే కల్లోల లాభం పొందాలన్న ప్రయత్నం కొందరిది. ఎంత కలుషితం అయింది మన సమాజం? ఈ అసత్యప్రచారకులది ఎంతటి హీనత్వం?
సిగ్నలింగ్, పట్టాల మార్పిడి వ్యవస్థ వంటి సాంకేతిక అంశాలనే కాదు, ఇతర అంశాలను కూడా పట్టించుకోవాలి. రిజర్వుడు కంపార్ట్‌మెంట్‌లలో ప్రయాణించినవారి చిరునామాలో, ఫోన్ నెంబర్లో ఏవో దాదాపుగా అందుబాటులో ఉన్నాయి. గుర్తింపు లేక, బంధువులకు తెలియక చావు తరువాత కూడా నిరీక్షణలో మిగిలిన దేహాలు అన్నీ జనరల్ కంపార్ట్‌మెంటుల్లోనివి. మొదటి మరణాలు పేదలకు, అనామకులకే రిజర్వు చేసిన ఘనత మన రైల్వే వ్యవస్థది. మృతులలో అధికులు బెంగాల్ నుంచి దక్షిణాదికి బతుకు తెరువు కోసం వస్తున్న కార్మికులు. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ గ్రామీణ బెంగాల్ పాలిట వలసల రైలు. ఈ దేశం రక్తప్రసార వ్యవస్థలో అంతా వలసకార్మికుల నెత్తురూ చెమటా మాత్రమే ప్రవహిస్తున్నాయని వెల్లడించి కోవిడ్ కాలపు సన్నివేశం మన కళ్లు తెరిపించింది. బెంగాల్ పల్లెలు ఎందుకు మనుగడల సంక్షోభంలో ఉన్నాయో, ఎందుకు చెన్నైకు, ఆంధ్ర పట్టణాలకు, బెంగుళూరుకు వస్తేనే కాసింత ఉపాధి దొరుకుతున్నదో పాలకులు ఒకసారి ఆలోచించాలి. అంతోఇంతో గడించి ఇచ్చే మగదిక్కు ఇట్లా అన్యాయపు మరణం పాలయితే, ఆ కుటుంబం ఎట్లా బతుకుతుంది? ఎంత పరిహారమిస్తే, వారి చితికిపోయిన భవిష్యత్తు కోలుకుంటుంది?
Updated Date - 2023-06-06T01:05:46+05:30 IST