ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పతనారంభం

ABN, First Publish Date - 2023-03-24T01:19:41+05:30

ఒకరికి దెబ్బ మీద దెబ్బ అయితే, మరొకరికి విజయం మీద విజయం. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయనడానికి నిదర్శనంగా, గురువారం నాడు జరిగిన శాసనమండలి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఒకరికి దెబ్బ మీద దెబ్బ అయితే, మరొకరికి విజయం మీద విజయం. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయనడానికి నిదర్శనంగా, గురువారం నాడు జరిగిన శాసనమండలి ఎన్నికలలో ఒక తెలుగుదేశం అభ్యర్థి అదనపు ఓట్లను పొంది మరీ విజయం సాధించారు. పట్టభద్ర నియోజకవర్గాల నుంచి ఈ మధ్యే జరిగిన శాసనమండలి సభ్యుల ఎన్నికలలో వైసిపి పొందిన దారుణమైన ఓటమికి తోడు ఇది రోకటిపోటు. దుష్పరిపాలనకు ఎంతటి ఉచిత సంక్షేమాల పూతలు పూసినా, ప్రజలను ఎల్లకాలం మభ్యపెట్టలేమని, ఓపిక నశించినప్పుడు వారు తీవ్రమైన నిర్ణయాలు తీసుకోగలరని పాలకపక్షం తెలుసుకోవాలి. తప్పులు తెలుసుకుని దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే, వచ్చే ఏడాది ఘోరపరాభవానికి సిద్ధపడాలని రాష్ట్రప్రజలు ఈ ఫలితాల ద్వారా చేసిన హెచ్చరికను గమనించాలి.

శాసనసభ్యులే ఓటర్లుగా ఏడు శాసనమండలి స్థానాలకు గురువారం నాడు జరిగిన ఎన్నికలలో ఆరుగురు వైసీపీ అభ్యర్థులు, ఒక తెలుగుదేశం అభ్యర్థి విజయం సాధించారు. 2019 ఎన్నికలలో తెలుగుదేశం తరఫున 23 మంది గెలిచినప్పటికీ, అందులో నలుగురు వైసిపి పక్షంతో కలసిపోయారు. పందొమ్మిది మంది శాసనసభ్యులు మాత్రమే తెలుగుదేశం పార్టీతో ఉన్నారు. గెలవడానికి 22 స్థానాలు కావాలి. తెలుగుదేశం అభ్యర్థి పంచుమర్తి అనురాధకు 23 ఓట్లు లభించాయి. అదనంగా వచ్చిన నాలుగు ఓట్లు ఎవరు వేశారనే చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఉభయపక్షాలూ సాంకేతికంగా తమతో ఉన్న శాసనసభ్యులకు విప్ జారీ చేశాయి. ఈ మధ్య కాలంలో వైసిపితో విసిగిపోయి విముఖతను వ్యక్తం చేస్తున్న ఇద్దరు శాసనసభ్యులు తెలుగుదేశానికే ఖాయంగా వేశారని చెప్పలేము. ఒకవేళ వేశారనుకున్నా మరో ఇద్దరు ఎవరన్న ప్రశ్న మిగిలే ఉంటుంది. మొత్తానికి, కొందరు కట్లు తెంచుకున్నారన్నది సారాంశం. ఒకసారి తెగింపు మొదలయితే, అది ఎందరికో ధైర్యం ఇస్తుంది.

పట్టభద్ర నియోజకవర్గాలు మూడిటికి మూడూ తెలుగుదేశం పార్టీ గెలుచుకోవడం వైసిపిని పెద్ద దెబ్బతీసింది. తెచ్చిపెట్టుకున్న గాంభీర్యం కూడా ఎంతో సేపు నిలవలేదు. కలవరమై, అసహనమై, దౌర్జన్యమై విరుచుకుపడింది. దెబ్బకు దెబ్బతీయాలన్న కసితో, తెలుగుదేశం అభ్యర్థిని గెలవనీయకుండా చేయాలని వైసిపి నాయకత్వం విశ్వప్రయత్నాలు చేసింది. ప్రజలలో ఆగ్రహం కట్టలు తెంచుకున్నదని, మార్పు కోసం తహతహ వ్యక్తమవుతున్నదని పట్టభద్ర ఎన్నికలు నిరూపించడంతో, శాసనసభ్యుల కోటా ఎన్నికలలో అధికారపక్షం ఆటలు సాగలేదు. ప్రజలు తాము ఇవ్వదలచుకున్న సందేశం ఇచ్చేశారు.

సంక్షేమం పేరుతో పందేరాలను చేసినంత మాత్రాన ప్రజలు పడి ఉంటారనుకోవడం భ్రమ. ప్రజలకు అభివృద్ధి కూడా కావాలి. అభివృద్ధి ఫలితాలలో తమకు భాగం దక్కేదాకా సంక్షేమం కూడా కావాలి. రెంటి సమతూకం కావాలి. పరిపాలనలో వారికి కూడా ఏదో స్థాయిలో భాగస్వామ్యం కావాలి. రాజధాని విషయంలో అనిశ్చిత పరిస్థితిని ఒక పదవీకాలమంతా కొనసాగించి, రోజుకొక తీరుగా మాట్లాడే ముఖ్యమంత్రి మీద ప్రజలకు ఏమి గౌరవం ఉంటుంది? దర్యాప్తు సంస్థల నుంచి కేసుల నుంచి రక్షణల కోసం ఢిల్లీ పెద్దలకు కట్టే కప్పాలను ప్రజలను గమనించలేదనుకోవద్దు. బడా కార్పొరేట్లకు అప్పనంగా భూములను, ప్రాథమిక వ్యవస్థలను అప్పగించడం ఒకటయితే, ప్రజల నెత్తురుతో ఏర్పడిన విశాఖ ఉక్కును ఇతరులకు ధారాదత్తం చేస్తున్నా కిమ్మనలేని పరాధీనత ఈ ప్రభుత్వానిది. ఇంతకాలం అధికారంలో ఉండి ఏమి సాధించినట్టు? ఒక్క చాన్స్ అంటూ దేబిరించి, ఆ తరువాత ఏమి ఉద్ధరించినట్టు? మరోసారి ఎన్నికలకు ఏ ముఖం పెట్టుకుని వచ్చేటట్టు?

ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయమే కీలకం. జనం తమతో ఉన్నారన్న ధీమాయే అధికార లాలసులకు నియంతృత్వ లక్షణాలను కలిగిస్తుంది. ఏ ప్రజలు తమకు పునాదిగా ఉన్నారో, వారిమీదే దాష్టీకాన్ని ప్రయోగించడానికి, ప్రతిపక్షం మీద చెలరేగిపోవడానికి బరితెగింపును ఇస్తుంది. పొరపాటునో, నమ్మకంతోనో, ఆశతోనో తమను గద్దెనెక్కించినవారే, తలచుకుంటే పతనం చేయగలరన్న వివేకం పాలకులకు లోపిస్తుంది. సరిగ్గా, ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విషయంలో జరుగుతోంది. ప్రతిపక్షాలను విభజించి పాలించడం, ప్రత్యర్థుల మీద దుర్భాషలాడడం, ప్రజల హక్కులను అణగార్చడం వంటి కుతంత్రాలన్నీ చెల్లనిరోజులు వస్తున్నాయి. దుష్పరిపాలనను ఎట్లా తొలగించాలో వారికి తెలుసు. వారి సంకల్పం ఈ తీరుగా వ్యక్తమవుతే, కావలసిన సానుకూలతలు అవే వస్తాయి. ప్రజలు తమ అభీష్టాన్ని తామే నెరవేర్చుకుంటారు.

మొత్తానికి ప్రజలలో ముందే మెలకువ వచ్చింది. తమకు అందుబాటులో ఉన్న పద్ధతిలో ఒక నిరసన జెండా ఎగురవేశారు. ప్రజలనుంచి వ్యక్తమవుతున్న సానుకూలతను ప్రతిపక్షాలు ఎట్లా దృఢపరచుకుంటారో చూడాలి. మారుమనసుతో మంచిదారిని నడవడానికి లభించిన చివరి అవకాశాన్ని పాలకపక్షం ఎట్లా వినియోగించుకుంటుందో గమనించాలి.

Updated Date - 2023-03-24T01:19:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising