లైంగికత సరిహద్దులు
ABN, First Publish Date - 2023-10-18T03:50:36+05:30
స్త్రీ పురుషుల మధ్య మాత్రమే దాంపత్య, లైంగిక సంబంధాలను సహజమైనవిగా, ఆమోదనీయమైనవిగా పరిగణించడం ప్రపంచవ్యాప్తంగా అనేక సమాజాలలో, సంస్కృతులలో ఉన్నది. భిన్న లైంగికతలు...
స్త్రీ పురుషుల మధ్య మాత్రమే దాంపత్య, లైంగిక సంబంధాలను సహజమైనవిగా, ఆమోదనీయమైనవిగా పరిగణించడం ప్రపంచవ్యాప్తంగా అనేక సమాజాలలో, సంస్కృతులలో ఉన్నది. భిన్న లైంగికతలు కలిగిన వారు తమ వైఖరుల గురించి న్యూన, అపరాధ భావాలతో ఉండడం, బయటకు చెప్పుకోలేక గోప్యత పాటించడం చూస్తాము. స్త్రీపురుష లైంగికత ఏకైకం కాదని, ఒకానొక పద్ధతి మాత్రమేనని, ఇతర లైంగికతలు కూడా ప్రాకృతిమైనవేననే స్పృహ క్రమంగా పెరుగుతున్నది. స్త్రీ స్వలింగ సంపర్కులు, పురుష స్వలింగ సంపర్కులు, లైంగికత మార్పిడిదశలో ఉన్న వారు, రెండు రకాల లైంగికతలు కలిగినవారు, ఇట్లా అనేక రకాల లైంగిక వ్యక్తిత్వాలు ప్రపంచమంతటా తమ అస్తిత్వానికి ఆత్మగౌరవభావనను జోడించి, హక్కుల కోసం చట్టబద్ధమైన గుర్తింపుల కోసం పోరాడుతున్నాయి. మంగళవారం నాడు భారత అత్యున్నత న్యాయస్థానం ప్రకటించిన తీర్పు కూడా ఆయా శ్రేణుల సామాజిక, న్యాయ పోరాటంలో ఒక మజిలీయే. విభిన్న లైంగికతలు కలిగినవారి మధ్య వివాహాలకు చట్టబద్ధత కల్పించడానికి, పిల్లలను దత్తత తీసుకోవడానికి ఆ జంటలను అనుమతించడానికి సుప్రీంకోర్టు మెజారిటీ తీర్పు అంగీకరించలేదు కానీ, బంతిని పార్లమెంటు గోదాలోకి బదిలీ చేసింది. తీర్పును వెలువరించే క్రమంలో ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్‌తో సహా ధర్మాసనంలోని తక్కిన నలుగురు న్యాయమూర్తులు అనేక ఆసక్తికరమైన, ఆలోచనాత్మకమైన వ్యాఖ్యలు చేశారు.
1954 నాటి ప్రత్యేక వివాహాల చట్టంలోని సెక్షన్ 4 ఎవరెవరి మధ్య వివాహానికి చట్టబద్ధమైన అనుమతి ఉంటుందో నిర్వచించింది. దత్తతలను నియంత్రించే ‘కారా’ నియమావళిలోని 5(3) పిల్లలను పెంపకానికి తీసుకోవడానికి ఎవరెవరు అర్హులో చెబుతుంది. ప్రత్యేక లైంగికతలు కలిగినవారు వారు తమ భాగస్వామిని ఎంచుకున్నప్పుడు, ఆ జంటకు కూడా ఒక కుటుంబంగా చట్టబద్ధమైన గుర్తింపు, దానితో పాటు అనేక పౌరసదుపాయాలు సమకూరాలి. ఆ వివాహాన్నే చట్టం గుర్తించనప్పుడు వారికి రేషన్ కార్డు, ఆస్తి భాగస్వామ్యాలు, వారసత్వాలు ఎలా సమకూరతాయి? అటువంటి జంటల మీద వివక్ష చూపడం న్యాయమైనా? వారికి దత్తత తీసుకునే హక్కు లేకపోవడం అన్యాయం కదా? ఈ ప్రశ్నలతోనే ఎల్జీబీటీక్యూ (స్త్రీపురుష లైంగికతకు భిన్నమైన లైంగికతలు కలిగినవారిని ఉద్దేశించే సాముదాయిక పదం) ఉద్యమకారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
కేంద్రప్రభుత్వం ఆ అభ్యర్థనలను తిరస్కరించింది. ఈ భిన్న లైంగికతలన్నీ పట్టణ ప్రాంతాలకో, ఉన్నతవర్గాలకో చెందిన ధోరణులని వ్యాఖ్యానించింది. మంగళవారం నాడు మైనారిటీ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులలో ఒకరైన చంద్రచూడ్, ప్రభుత్వ వాదనను నిరాకరించారు. ‘‘భిన్న లైంగికతలు కలిగినవారు ఆంగ్లం మాట్లాడే పురుష ఉద్యోగి అయినా కావచ్చు, పల్లెల్లో వ్యవసాయ పనులు చేస్తున్న మహిళ అయినా అయి ఉండవచ్చు’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఏ ఇద్దరైనా సన్నిహితంగా జీవించదలచుకున్నప్పుడు, వారి మధ్య సంబంధానికి చట్టబద్ధత అనే కవచాన్ని కల్పించకపోతే, ఆ జంటలోని బలహీనులకు రక్షణ లేకుండా పోతుందని కూడా చంద్రచూడ్ హెచ్చరించారు. వీరికి న్యాయం చేయడం కోసం ప్రత్యేక వివాహాల చట్టాన్నే కొట్టివేస్తే, దేశం స్వాతంత్ర్యానికి పూర్వదశలోకి తిరోగమిస్తుందని, అట్లాగని, వివాహార్హతలను నిర్వచిస్తున్న నిబంధనకు కొత్త అన్వయాలను ఇస్తే, చట్టసభలు చేయవలసిన పనిని తామే చేసినట్టవుతుందని తమ ధర్మసంకటాన్ని వివరించారు. ప్రధానన్యాయమూర్తితో పాటు, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, విభిన్న లైంగికతలు కలిగిన జంటల సంబంధానికి చట్టబద్ధమైన గుర్తింపు కోసం స్పష్టమైన అభిప్రాయాన్ని చెప్పారు, ఆ జంటలు పిల్లలను దత్తత తీసుకోకుండా నిరోధించడం ‘కారా’ తన పరిధిని అతిక్రమించడమేనని కూడా వ్యాఖ్యానించారు. తక్కిన న్యాయమూర్తులు ఈ ఇద్దరితో ఏకీభవించలేదు. ఐదుగురు న్యాయమూర్తులు వెలువరించిన నాలుగు వేరు వేరు తీర్పులు అనేక విషయాలలో ఏకీభవించాయి, కొన్ని అంశాలలో విభేదించాయి.
చట్టబద్ధత లేకపోయినా, విభిన్న లైంగికత కలిగినవారు తాము కోరుకున్న వ్యక్తితో సంబంధంలో ఉండడానికి, సహజీవనం చేయడానికి ఏ అవరోధమూ ఉండదని న్యాయమూర్తులందరూ అభిప్రాయపడ్డారు. వ్యక్తులుగా వారికి ఉండే అన్ని హక్కులూ సమకూరతాయి. వారి ప్రాథమిక హక్కులకు చట్టం రక్షణ ఇస్తుంది. జంటలుగా హక్కులు కావాలంటే మాత్రం దానికి శాసన నిర్మాణం కావాలి. విభిన్న లైంగికతలు కలిగిన జంటల సమస్యల మీద అధ్యయనం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడానికి కేంద్రప్రభుత్వం ఈ విచారణల సందర్భంగా అంగీకరించింది.
చట్టాలను చేసే పని పార్లమెంటుదే, కోర్టులది కాదు అని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. స్త్రీపురుష ద్వంద్వం చుట్టూ మన సామాజిక విలువలు ఇంతకాలంగా పరిభ్రమిస్తున్నాయి కాబట్టి, ప్రజా ప్రతినిధులలో, విధాన నిర్ణేతలలో, ముఖ్యంగా సంస్కృతికి సంప్రదాయాలకు తనదైన తీరులో భాష్యం చెప్పే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంలో మార్పు రావడం అంత సులువు కాదు, అంత తొందరగా జరిగేదీ కాదు. సామాజికమైన హేళనలనుంచి, సంక్షేమ అభివృద్ధి పథకాలలో వివక్ష నుంచి విభిన్న లైంగికతలతో ఉన్నవారికి రక్షణ కల్పించడానికి ఏ చట్టపరిమితులూ లేవు కాబట్టి, ప్రభుత్వం వాటి మీద దృష్టి పెట్టాలి. ఎల్జీబీటీక్యూ సమూహాలతో సంభాషిస్తూ, వారి ఆకాంక్షలను, అవసరాలను గుర్తిస్తూ, స్త్రీపురుష దాంపత్యాల మాదిరిగా వారి సంబంధాలకు కూడా సమాన గౌరవాన్ని, ప్రతిపత్తిని అందించే దిశగా విధాన ప్రయాణం జరగాలి. సుప్రీంకోర్టు తీర్పులోని ‘నిరాకరణ’ అంశాన్ని కాక, చట్టసభల మీద పెట్టిన బాధ్యతను ప్రధానమైనదిగా గ్రహించి కేంద్రప్రభుత్వం స్పందిస్తుందని ఆశిద్దాము.
Updated Date - 2023-10-18T03:50:36+05:30 IST