ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘కాగ్‌’ రేపిన చిచ్చు

ABN, First Publish Date - 2023-08-18T03:39:48+05:30

‘గతంలో కాగ్‌ నివేదికలు వెలువడగానే టెలివిజన్‌ యాంకర్లు తెరమీద ఆగ్రహావేశాలతో ఊగిపోతూ, చిత్తంవచ్చిన ప్రశ్నలతో ఎదుటివారిని ముంచెత్తుతూ తోచినరీతిలో చర్చోపచర్చలు నిర్వహించిన...

‘గతంలో కాగ్‌ నివేదికలు వెలువడగానే టెలివిజన్‌ యాంకర్లు తెరమీద ఆగ్రహావేశాలతో ఊగిపోతూ, చిత్తంవచ్చిన ప్రశ్నలతో ఎదుటివారిని ముంచెత్తుతూ తోచినరీతిలో చర్చోపచర్చలు నిర్వహించిన సందర్భాలు కోకొల్లలు. ఇప్పుడు అదే మీడియా మోదీ తప్పులు చేయరుగాక చేయరు అన్న నమ్మకంతో ఉన్నట్టు కనిపిస్తోంది’ అన్నది కాంగ్రెస్‌ ప్రతినిధి సుప్రియా శ్రీనతే బుధవారం చేసిన వ్యాఖ్యల సారాంశం. ఇటీవల ‘కాగ్‌’ వెలుగులోకి తెచ్చిన పలు అక్రమాలమీద జాతీయ మీడియా ప్రతిస్పందన కనీసస్థాయిలో కూడా లేదన్నది ఆ పార్టీ ప్రతినిధి బాధ. ఒకటీ రెండూ కాదు, ఏకంగా ఏడు విభాగాల్లో చోటుచేసుకున్న వేలకోట్ల అవినీతిని వెలుగులోకి తెచ్చినందుకు, విదేశీ కుట్ర పేరుతో, ‘కాగ్‌’ను వెంటనే మూసేయ్యండి అంటూ ఆమె వెటకారపు వ్యాఖ్యలు అనేకం చేశారు.

ఈ ప్రజాస్వామ్య దేశంలో మీడియా సహా స్వతంత్ర వ్యవస్థలన్నీ మోదీని ప్రజలకు జవాబుదారీ చేయడంలో విఫలమవుతున్నాయన్నది కాంగ్రెస్‌ ఆవేదన కావచ్చు. పైగా, గత తొమ్మిదేళ్ళలో ఒక్క కుంభకోణమూ జరగలేదని, మోదీ అంత నిజాయితీపరుడు దేశంలో ఎవరూ లేరని బీజేపీ చెబుతూంటుంది కనుక దానిని వమ్ముచేయడం విపక్షాలకు అవసరం. దీనికిమించి, ‘కాగ్‌’తో ముడిపడిన పాతకక్షలు కూడా కాంగ్రెస్‌కు చాలానే ఉన్నాయి. మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత బ్యాంకుల బోర్డు చైర్మన్‌ సహా పలు కీలకపదవులు పొందిన వినోద్‌రాయ్‌ అప్పట్లో ఆరేళ్ళపాటు వరుస ‘కాగ్‌’ నివేదికలతో కాంగ్రెస్‌ను ఇబ్బందిపెట్టారు. మరీముఖ్యంగా, 2జి స్పెక్ట్రమ్‌ వేలంలో దేశం ఏకంగా లక్షా డెబ్బైఐదువేలకోట్లు నష్టపోయిందంటూ కాగ్‌ వేసిన ‘ఊహాత్మక అంచనా’ మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వానికి పెద్ద అవినీతి మరక అంటించింది. తరువాత ఆ కేసు న్యాయస్థానాల్లో నిలబడకున్నా, కాగ్‌ నివేదికలో మన్మోహన్‌ సింగ్‌ పేరు లేకుండా చూడమంటూ కాంగ్రెస్‌ ఎంపీ సంజయ్‌ నిరుపమ్‌ తనపై ఒత్తిడితెచ్చారంటూ సరిగ్గా సార్వత్రక ఎన్నికలముందు ప్రకటించిన వినోద్‌రాయ్‌ అనంతరకాలంలో క్షమాపణలు చెప్పినా, అప్పటికే జరగాల్సినంత నష్టం జరిగిపోయింది.


మోదీ ఏలుబడిలో కాగ్‌ నిర్వీర్యమైపోయిందని, నివేదికల తయారీ, విడుదలలో అది ఉద్దేశపూర్వక జాప్యం చేస్తున్నదని, వినోద్‌రాయ్‌ ఉన్నప్పుడు ఏటా 200లకు పైగా నివేదికలు వెలువడితే ఇప్పుడవి యాభైనుంచి వందలోపే ఉంటున్నాయని కాంగ్రెస్‌ బాధ. ఇప్పుడు కాగ్‌ చేసిన పరిశీలనలు గతంలో మాదిరిగా ‘ఊహాత్మకం’ కాకున్నా పాలకులు సరే, కనీసం మీడియా కూడా వాటిపై మాట్లాడకపోవడం దానికి ఆవేదన కలిగిస్తున్నది. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణంలో ఒక కిలోమీటరు రహదారి నిర్మాణం ఖర్చు అంచనాలకు మించి ఏకంగా 18కోట్ల రూపాయల నుంచి 256కోట్లు కావడం ఏమిటన్న ప్రశ్న సముచితమైనదే. కాగ్‌ ఈ వ్యవహారాన్ని పాక్షికంగానే పరిశీలించిందని ‘భారత్‌ మాల పరియోజన పథకం’ యావత్తూ అవినీతిమయమన్నది దాని ఆరోపణ. ఈ పథకంలో కనీసం ఏడున్నర లక్షలకోట్ల అవినీతి జరిగిందని విపక్షాలు అంటున్నాయి. కేవలం ఓ ఐదు టోల్‌ప్లాజాలను పరిశీలించి 132 కోట్ల అక్రమ వసూళ్ళను కాగ్‌ గుర్తించిన నేపథ్యంలో, దేశంలోని అన్ని టోల్‌ప్లాజాలపై విచారణ చేపడితే లక్షలకోట్ల అవినీతి బయటపడుతుందన్నదీ కొట్టిపారేయలేని వాదనే. ఆయుష్మాన్‌ భారత్‌ పథకంలో లక్షలాది పేర్లు అర్థంపర్థంలేని ఒకే మొబైల్‌సంఖ్యతో నమోదుకావడం, మరణించిన వేలాదిమంది పేరిట నిధులు విడుదల కావడం వంటివి ఒక చక్కని పథకం మీద నీలినీడలు కమ్ముకోవడమే. ఆధార్‌తో జరిగే లావాదేవీలన్నీ అవినీతికి తావులేనివని పాలకులు చెబుతున్నప్పుడు, ఈ అక్రమం ఎలా సాధ్యమైందన్నదీ, పేరూ ఊరులేని ఆస్పత్రులు జాబితాలోకి ఎలా వచ్చిచేరాయన్నదీ ముఖ్యమైన విషయాలే. పైగా, పథకంలో భాగంగా చేకూరిన డేటా యావత్తూ నికార్సయినది కాకపోతే భవిష్యత్‌ వైద్య ప్రణాళికలకు, పథకాలకు కూడా ఎదురుదెబ్బతగులుతుంది. ‘ఉడాన్‌’ సరిగ్గా ఎగరలేదన్నటువంటి ఇతర కాగ్‌ విశ్లేషణలను అటుంచినా, అక్రమాలు, అవినీతికి సంబంధించి అది లేవనెత్తిన ఏడు ప్రధాన అంశాలపై ఒక ఉన్నతస్థాయి విచారణ జరపకుండా కేవలం విమర్శలు, సమర్థనలతో సరిపెడితే, ‘నేను తినను, ఎవరినీ తిననివ్వను’ అన్న మోదీ హామీకి ఏ మాత్రం విలువలేకుండా పోతుంది.

Updated Date - 2023-08-18T03:39:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising