ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

తెగదెంపుల రాజకీయం

ABN, First Publish Date - 2023-09-27T01:42:47+05:30

భారతీయ జనతాపార్టీతో తెగదెంపులు చేసుకుంటున్నట్టు, నేషనల్‌ డెమోక్రాటిక్‌ అలయెన్స్‌ నుంచి వైదొలుగుతున్నట్టు అన్నాడీఎంకె అధికారికంగా ప్రకటించింది...

భారతీయ జనతాపార్టీతో తెగదెంపులు చేసుకుంటున్నట్టు, నేషనల్‌ డెమోక్రాటిక్‌ అలయెన్స్‌ నుంచి వైదొలుగుతున్నట్టు అన్నాడీఎంకె అధికారికంగా ప్రకటించింది. సోమవారం చెన్నైలోని పార్టీ కార్యాలయంలో తమ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా శాఖల అధ్యక్షులతో సహా అందరూ హాజరైన విస్తృత సమావేశంలో, ఈ తీర్మానాన్ని పార్టీ ఏకకంఠంతో ఆమోదించింది. ప్రకటన వెలువడగానే పార్టీ కార్యకర్తలంతా టపాసులు పేల్చి, డాన్సులు చేసి సంబరాలు చేసుకున్నారట. జూలై 17, 18 తేదీల్లో కాంగ్రెస్‌ తన 26 మిత్రపక్షాలతో బెంగుళూరులో సమావేశమవుతున్నప్పుడు, దానికి పోటీగా దేశరాజధానిలో 38 ఎన్డీయే మిత్రపక్షాలతో బీజేపీ జరిపిన భేటీలో అన్నాడీఎంకె పాల్గొంది. ముందువరుసలో ప్రధాని నరేంద్రమోదీ, ఆయనకు కుడివైపున బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఎడమవైపున ఎడప్పాడి పళనిస్వామి మాత్రమే ఉంటూ, మిగతాపార్టీల అధినేతలంతా వెనుకగా నిలబడి ఉన్న ఆ దృశ్యం మరిచిపోగలిగేదికాదు. రెండు నెలల్లోనే అంతసాన్నిహిత్యమూ కరిగిపోయి, ఏకంగా చెదిరిపోవడం కచ్చితంగా ఆశ్చర్యం కలిగించేదే.

అసలు విలన్‌ బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షుడేనని అన్నాడీఎంకె అంటోంది. అన్నాదురై, జయలలిత సహా ఎవరినీ విడిచిపెట్టకుండా అన్నామలై చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు తమను ఈ నిర్ణయానికి పురిగొల్పినట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. అన్నామలైకి ముకుతాడువేయమని, ఆయన స్థానంలో మరొకరిని నియమించమని పళనిపార్టీ నాయకులంతా కోరితే, అన్నామలై కారణంగానే తమిళనాడులో బీజేపీ బలపడిందని, మార్చేది లేదని బీజేపీ అధిష్ఠానం తేల్చేసిందట. పదవిలోకి వచ్చినప్పటినుంచీ అన్నామలై అదేరీతిన మాట్లాడుతున్నప్పటికీ, ఇంతకాలమూ భరిస్తూ వచ్చిన అన్నాడీఎంకె సార్వత్రక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకుంది. బీజేపీని, దాని సిద్ధాంతాన్ని, విధానాలను, అధినాయకులను పల్లెత్తుమాట అనకుండా, దశాబ్దాల చరిత్ర ఉన్న ఓ ప్రాంతీయ పార్టీ ఒక చిన్నస్థాయి వ్యక్తిని దుష్టశక్తిగా చిత్రీకరిస్తూ కూటమినుంచి వైదొలగడం విచిత్రమైన విషయమే. తమిళనాడులో ఏమి జరుగుతోందో, తమ రాష్ట్రశాఖ అధ్యక్షుడు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో బీజేపీ పెద్దలకు తెలియకుండా ఉండదు. వారి ప్రోత్సాహం లేకుండా అన్నామలై అంత దూకుడు ప్రదర్శించేవారు కాదు. అలిగి అన్నాడీఎంకే పోయినపక్షంలో మరింత ప్రయోజనం ఉంటుందని, తృతీయశక్తిగా ఇంకా బలపడవచ్చునని బీజేపీ పెద్దలూ భావించివుండవచ్చు.


కానీ, జయలలిత కాలంలో 45 శాతం ఓటు వాటా ఉన్న అన్నాడీఎంకె ప్రస్తుత పరిస్థితి పూర్తిగా వేరు. జయలలిత మృతదేహానికి నివాళులు ఘటిస్తున్న సందర్భంలో ప్రధాని నరేంద్రమోదీ శశికళ తలనిమిరి ఓదార్చిన క్షణంనుంచి అన్నాడీఎంకె వరుస కల్లోలాలతో పతనం కావడం ఆరంభించింది. శశికళ జైలు, పన్నీరు తిరుగుబాటు, పళని అధికారం, ఇద్దరి మధ్యా బీజేపీ బలవంతపు సయోధ్య, దానితో ఎన్నికల పొత్తు, రెండు గ్రూపులూ ఒక్కటై శశికళను పార్టీనుంచి సస్పెండ్‌చేయడం వంటివి తెలిసినవే. సుదీర్ఘకాలం న్యాయస్థానాల్లోనూ, ఎన్నికల సంఘంలోనూ కొనసాగిన ఈపీఎస్‌–ఓపీఎస్‌ యుద్ధంలో అంతిమంగా పళనిస్వామి నిలదొక్కుకున్నా, బీజేపీ నడిపిన ఈ జగన్నాటకంతో జయలలితపార్టీ క్రమంగా బలహీనపడుతూవచ్చి లోక్‌సభ ఎన్నికల్లో చావుదెబ్బతిని, అనంతరం అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా అధికారాన్ని కోల్పోవలసి వచ్చింది. ఆ తరువాత జరిగిన వివిధ ఉప ఎన్నికల్లోనూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అధికార డీఎంకెకు ధీటుగా నిలవలేకపోయింది. బీజేపీతో స్నేహం తన సైద్ధాంతిక మూలాలను, ఓటుబ్యాంకును దెబ్బతీస్తున్నదని, ద్రవిడరాజకీయాల్లో తనస్థానం కుదించుకుపోతూ, మైనారిటీ ఓటుబ్యాంకు యావత్తూ డీఎంకెకు తరలిపోతున్నదని ఆ పార్టీకి ఇప్పుడు గుర్తుకువచ్చినట్టుంది. ప్రధానప్రతిపక్షంగా డీఎంకెతో పోరాడే విషయంలోనూ పళనిస్వామి చొరవచూపకుండా ఆ పాత్రను బీజేపీకి అప్పగించి దానిని క్షేత్రస్థాయిలోనూ బలోపేతం చేశారని అంటారు. తనపై ఉన్న కేసుల కారణంగానో, ఈడీ సీబీఐ భయంతోనో కేంద్రపాలకుల ఆదేశానుసారం నడుచుకున్న పళనిస్వామి ఇప్పుడు ఎన్నికలముందు వేరుపడటం కూడా ఒప్పందంలో భాగమేనని, మరో ఎన్నికల నాటకమేనని ప్రజలు నమ్ముతున్నదీ లేనిదీ కొద్దినెలల్లో తేలుతుంది. కోల్పోయిన విశ్వసనీయతను ఈ తెగదెంపుల విన్యాసం ఏ మేరకు పునరుద్ధరించగలదో చూడాలి.

Updated Date - 2023-09-27T01:42:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising