ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘స్వేచ్ఛాజీవుల’ విషాదం

ABN, First Publish Date - 2023-08-04T02:21:53+05:30

‘ప్రాజెక్ట్‌ చీతా’లో భాగంగా ఆఫ్రికానుంచి మధ్యప్రదేశ్‌ కూనో అభయారణ్యంలోకి తరలించిన ఇరవై చీతాల్లో, ఇప్పటికి తొమ్మిది మరణించాయి...

‘ప్రాజెక్ట్‌ చీతా’లో భాగంగా ఆఫ్రికానుంచి మధ్యప్రదేశ్‌ కూనో అభయారణ్యంలోకి తరలించిన ఇరవై చీతాల్లో, ఇప్పటికి తొమ్మిది మరణించాయి. కేవలం ఐదునెలల్లో ప్రాణాలు వదిలేసిన చీతాల జాబితాలోకి బుధవారం మరణించిన ఆడచీతా ధాత్రి చేరింది. విశాలమైన ఆఫ్రికా అడవుల్లో స్వేచ్ఛగా సంచరిస్తూ, హాయిగా బతుకుతున్న చీతాలను ఒక అభయారణ్యంలో ఉంచితే అవి మనుగడసాగించలేకపోవచ్చునని గత ఏడాది సెప్టెంబరులో నమీబియానుంచి ఎనిమిది చీతాలను తరలించినప్పుడే కొందరు నిపుణులు సందేహం వెలిబుచ్చారు. కానీ, దేశంలో అవి అంతరించిపోయిన డెబ్బైయ్యేళ్ళ తరువాత తిరిగి కాలూనుతున్న సంరంభంలో వారి మాటలు ఎవరికీ పట్టలేదు. పైగా, ప్రధానమంత్రి పుట్టినరోజుతో ముడిపడిన కార్యక్రమం కనుక, చీతాలమధ్యనే ఆయన ఆ వేడుకను జరుపుకుంటున్నందున, ఎక్కువమంది తమ అభ్యంతరాలు వెలిబుచ్చేందుకు సందేహించి ఉండవచ్చు కూడా.

చీతాలు అత్యంత చురుకైన స్వేచ్ఛాజీవులు. పరిధికి కట్టుబడే స్వభావం లేనందువల్ల కూనో అభయారణ్యంలో ప్రవేశపెడితే అవి తీవ్ర మానసిక ఒత్తిడికి లోనుకావచ్చునని, హద్దులు దాటిపోయి మరణించే ప్రమాదం కూడా ఉన్నదని కొందరు వ్యాఖ్యానించారు. వారి అనుమానాలు ఇప్పుడు క్రమంగా నిజమవుతున్నాయి. ప్రాజెక్ట్‌ చీతాలో భాగంగా, గత ఏడాది సెప్టెంబరులోనూ, ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ మన దేశానికి వచ్చిన చీతాల్లో ఇప్పటికి ఆరు పెద్దచీతాలు, మూడు కూనలు మరణించాయి. అవి వరుసపెట్టి మరణించడానికి అధికారులు చూపుతున్న కారణాలమీద కూడా విభేదాలు, అనుమానాలు ఉన్నాయి. దశలవారీ నిర్బంధం తరువాత, చాలా చీతాలను స్వేచ్ఛగా వదిలేసినా కూడా స్వజాతిపోరాటాల్లో గాయపడటం, అభయారణ్యాన్ని దాటిపోవడం ఇత్యాది సమస్యలతో వాటిని తిరిగి పట్టితేవలసి వస్తున్నది. ‘రేడియోకాలర్‌’ ఇన్ఫెక్షన్‌ వల్లనే తేజస్‌, సూరజ్‌ అనే రెండుచీతాలు కన్నుమూశాయని నిపుణులు నిర్థారించిన తరువాత, మెడమీద ఆ భారాన్ని మోస్తున్నవాటిని వెనక్కుతెచ్చి కాలర్‌ తొలగించాల్సి వస్తున్నది. 2019లో గిర్‌ అడవుల్లోని దాదాపు 90 ఆసియా సింహాలకు ఈ కాలర్‌ తొడిగిన తరువాత వాటిలో దాదాపు నాలుగోవంతు అనతికాలంలోనే మరణించాయి. కేజీన్నర బరువున్న ఈ రేడియో కాలర్‌ను భరించడం, సహించడం ఈ స్వేచ్ఛాజీవులకు నరకం. ఆ పరికరాన్ని పీకిపారేయడానికి అవి నిరంతరం అసహనంతో చేస్తున్న ప్రయత్నంతో గాయాలవుతాయి, ఇన్ఫెక్షన్‌తో మరణాలూ సంభవిస్తాయి. ముఖ్యంగా వర్షాలు అధికంగా కురుస్తున్నప్పుడు కాలర్‌ చేసే కీడు అధికం. చీతాల కదలికలను గుర్తించడం, ఆరోగ్యాన్ని గమనించడం అటవీశాఖ అధికారులకు కాలర్‌తో సులభమే కానీ, వాటివాడకం చీతాల ప్రశాంతతను భగ్నం చేస్తుంది, తద్వారా జతకట్టడాన్ని కూడా ప్రభావితం చేస్తుందన్నది నిపుణుల మాట. అలాగే, ఈ ఏడాది మే నెలలో, ఐదు చదరపు కిలోమీటర్ల ఆవరణలో నిర్బంధంలో ఉన్న దక్ష అనే ఆడచీతాను రెండు మగచీతాలతో జతకలిపే ప్రయత్నం చేసినప్పుడు అది తీవ్రంగా గాయాలపాలై మరణించింది.


గతంలో చీతాలున్న మనదేశంలో ఆ జాతిని పునరుద్ధరించుకోవాలన్న సత్సంకల్పంతో ‘ప్రాజెక్ట్‌ చీతా’ ఆరంభమైంది. తోటి పులిజాతులతో పోల్చితే సాత్వికమైనవి కావడంతో అనేక కారణాలవల్ల అవి ఈ దేశంలో అతివేగంగా అంతరించిపోయాయి. 1947లో ప్రస్తుతం చత్తీస్‌గఢ్ లో అంతర్భాగమైన ఓ చిన్నరాజ్యాధిపతి మహారాజా రామానుజ ప్రతాప్ సింగ్ దేవ్ దేశంలోని చివరి మూడు చీతాలను వేటాడటంతో భారతదేశంలో వాటి కథ ముగిసిపోయింది. ఆ తరువాత ఇతర దేశాలనుంచి ఖండాలనుంచి వాటిని తెచ్చి పెంచుకొనే ప్రయత్నాలు కొన్ని జరిగినా అవి సఫలం కాలేదు. చీతాలను దేశంలో ప్రవేశపెట్టడంలోని సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయమమంటూ 2009లో వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాను సంబంధిత మంత్రిత్వశాఖ ఆదేశించడంతో మళ్ళీ కథమొదలై, 2018లో కూనో నేషనల్ పార్కు వాటికి సరైనదని నిర్ణయించాక, గత ఏడాది నమీబియా చీతాల ప్రవేశంతో ఈ ప్రాజెక్టు ఆరంభమైంది. ఇప్పుడు కిడ్నీవైఫల్యం నుంచి రేడియోకాలర్‌ వరకూ ఏదో ఒక సమస్యతో చీతాలు మరణిస్తూండటం ప్రాజెక్టుకు శోభనివ్వదు. అలాగే, భారతీయ అటవీ అధికారులకు శాస్త్రీయ శిక్షణలేదని, మానిటరింగ్‌ కమిటీలో ఉన్న తమను సమావేశాలకు పిలవడంలేదని, సరైన సమయంలో తమను సంప్రదించనందునే మరిన్ని చీతాలు మరణిస్తున్నాయనీ దక్షిణాఫ్రికా నిపుణుల నుంచి ఫిర్యాదులు రావడం సరికాదు. వారితో సంప్రదింపులు జరపడం, ఇటీవల వారు సమర్పించిన నివేదికను అమలుచేయడం ప్రాజెక్ట్‌ చీతా విజయవంతం కావడానికి ఉపకరిస్తాయి.

Updated Date - 2023-08-04T02:21:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising