ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ట్రంప్‌ తెంపరితనం

ABN, First Publish Date - 2023-06-13T02:24:02+05:30

రాజ్యాంగం, చట్టం, న్యాయం, ప్రజాస్వామ్యం వంటి మాటలంటే అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు మా చెడ్డ చిరాకు. ప్రజలు తనను ఓడించారన్న వాస్తవాన్ని కూడా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజ్యాంగం, చట్టం, న్యాయం, ప్రజాస్వామ్యం వంటి మాటలంటే అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు మా చెడ్డ చిరాకు. ప్రజలు తనను ఓడించారన్న వాస్తవాన్ని కూడా అంగీకరించకుండా, మూడేళ్ళక్రితం ఎన్నికల ఫలితాలని సైతం ఆయన తిరస్కరించాడు. పార్లమెంటు భవనం మీద తనవారిని దాడులకు ఉసిగొల్పి ప్రపంచవ్యాప్తంగా అమెరికా పరువుతీశాడు. ఒకవేళ ఆయన పదవినుంచి తప్పుకోకపోతే, గెలిచిన బైడెన్‌కు అధికారాన్ని అప్పగించకుంటే ఏమి చేయాలన్న విషయంలో కూడా అప్పట్లో విస్తృతమైన చర్చ జరిగింది. ఎట్టకేలకు అధ్యక్షపీఠాన్ని వదిలిపోయాడు కానీ, పోతూపోతూ చాలా అధికారపత్రాలు తనవెంట తీసుకుపోయి ఇప్పుడాయన మరోమారు దేశం పరువు తీశాడు. సీక్రెట్‌, టాప్‌ సీక్రెట్‌, కాన్ఫిడెన్షియల్‌ అంటూ పలు రకాలుగా వర్గీకరించి ఉన్న రహస్యపత్రాలను శ్వేతసౌధం నుంచి పోతూపోతూ తన ప్రైవేటు నివాసానికి తరలించుకుపోయాడు. బెడ్‌రూమ్‌ నుంచి బాత్‌రూమ్‌ వరకూ అట్టపెట్టెల్లో కుక్కి ఉంచిన ఈ రహస్యపత్రాల చిత్రాలను చూసి యావత్‌ ప్రపంచమూ నివ్వెరపోయింది.

శ్వేతసౌధం నుంచి సొంత ఎస్టేట్‌కు ఈ రహస్యపత్రాలు పొరపాటుగా తరలిపోయి ఉంటాయన్న ట్రంప్‌ బృందం వాదన ఏ మాత్రం నమ్మశక్యమైనది కాదు. ఫెడరల్‌ ప్రభుత్వం రంగంలోకి దిగి వాటిని తిరిగి అప్పగించే విషయంలో ఎంత ఒత్తిడి తెచ్చినా ట్రంప్‌ స్పందించలేదు కనుకనే, ఎఫ్‌బీఐ అధికారులు ట్రంప్‌ ఎస్టేట్‌లో సోదాలు నిర్వహించవలసి వచ్చింది. రెండు పర్యాయాలు ఎఫ్‌బీఐ ఆయన ఎస్టేట్‌మీద దాడులు చేసి, అనేక పెట్టెలను తరలించినప్పుడు సిగ్గుతో తలవంచుకోవాల్సిన విషయాన్ని కూడా ఆయన నిస్సిగ్గుగా రాజకీయం చేశాడు. ఒక దశలో ఆ పత్రాలను ధ్వంసం చేసే ఆలోచనలు చేశాడు. ఆ పత్రాల్లో అమెరికా అణుకార్యక్రమానికి సంబంధించిన ప్రణాళికలు, అమెరికా, దాని మిత్రదేశాలకు పొంచివున్న ముప్పు, దానిని ఎదుర్కొనే వ్యూహాలతో పాటు, వివిధ ఉగ్రవాద సంస్థల కదలికలకు సంబంధించిన సమస్తసమాచారమూ ఉందని అభియోగం. పెంటగాన్‌ సహా వివిధ భద్రతావ్యవస్థలనుంచి అధ్యక్షుడికి చేరిన కీలకసమాచారం వీటిలో ఉన్నందున ట్రంప్‌ చేసింది కేవలం తప్పిదం కాదు, ఘోరమైన నేరం. పైగా, ఇరాన్‌పై దాడికి సంబంధించిన వ్యూహాన్ని ఆయన తన గోల్ఫ్‌ క్లబ్‌ మిత్రులతో పంచుకున్నాడనీ, అమెరికా సైనికస్థావరాలకు సంబంధించిన మ్యాప్‌ను కూడా ఎవరికో ఇచ్చాడని అభియోగాలు ఉన్నందున, ట్రంప్‌ నిర్లక్ష్యం, వదరుబోతుతనం తెలిసిందే కనుక ఆయన కచ్చితంగా దేశ రహస్యాలు ఇతరులతో పంచుకొనే ఉంటాడని అమెరికా మీడియా సైతం నమ్ముతోంది. ట్రంప్‌ ఆదేశాల మేరకు ఆయన వ్యక్తిగత సిబ్బంది ఉద్దేశపూర్వకంగానే ఈ పత్రాలను మార్‌–ఎ–లాగో ఎస్టేట్‌కు తరలించారని ట్రంప్‌ ఆడియోరికార్డులు ధ్రువీకరిస్తున్నాయి.

తన దుశ్చర్యలతో ఇప్పటికే చాలా రికార్డులు సృష్టించిన ట్రంప్‌ ఇప్పుడు దేశచరిత్రలో తొలిసారిగా ఫెడరల్‌ ప్రభుత్వ అభియోగాలు ఎదుర్కొన్న మాజీ అధ్యక్షుడి రికార్డు కూడా సాధించాడు. గతంలో అశ్లీల చిత్రాల నటి స్మార్టీ డేనియల్స్‌ నోరుమూయించేందుకు అడ్డుతోవలో డబ్బులిచ్చిన వ్యవహారంలో ఆయన నేరాభియోగాలు ఎదుర్కొన్నాడు. ఈ కేసులో అరెస్టయి విడుదలైన వెంటనే, మాజీ కాలమిస్టు జీన్‌ కారోల్‌పై ట్రంప్‌ లైంగిక వేధింపులకు పాల్పడినందుకు న్యూయార్క్‌ కోర్టు భారీ జరిమానా విధించింది. ఇప్పుడు ఆయన ఏకంగా దేశరహస్యాలకు సంబంధించిన అంశంలో చిక్కుకొని ఏడురకాల నేరాలను ఎదుర్కొంటున్నారు.

దేనినైనా తేలికగా తీసివేయడం, నిస్సిగ్గుగా ఎదురుతిరగడం ట్రంప్‌ ప్రత్యేకత. తనమీద వచ్చిన ఆరోపణలన్నింటినీ ఆయన రాజకీయకుట్రగా కొట్టిపారేస్తున్నాడు. న్యాయస్థానాలను, న్యాయమూర్తులను దూషిస్తున్నాడు. తాను ప్రజలపక్షాన ఉద్యమిస్తుంటే, అన్ని వ్యవస్థలు కలిసి తనను వేధిస్తున్నట్టుగా అభివర్ణిస్తున్నాడు. అధికారికపత్రాల దొంగతనం కేసులో శిక్షపడినా, అధ్యక్ష ఎన్నికల్లో పోటీనుంచి తప్పుకొనేది లేదని ప్రకటించాడు. ఎంత అప్రదిష్టపాలైనా ట్రంప్‌ పక్షాన నిలుస్తున్నవారి సంఖ్య అమెరికాలో తక్కువేమీ లేదు. ఇప్పటికైతే, వచ్చే ఏడాది అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా ఆయనకే నామినేషన్‌ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయనను కాదనగలిగే స్థితిలో ఆ పార్టీ కూడా లేదు. ఈ వరుస కేసులు, అభియోగాల ప్రభావం ఓటర్లమీద ఏ మేరకు ఉంటుందో తెలియదు కానీ, ప్రజాస్వామ్యం పట్లా, ప్రపంచ భద్రతతోనూ ముడిపడిన అంశాల విషయంలోనూ ట్రంప్‌ ప్రదర్శించే నిర్లక్ష్యవైఖరి ప్రమాదకరమైనది, సహించరానిది.

Updated Date - 2023-06-13T02:24:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising