భద్రతలేని ప్రయాణాలు
ABN, First Publish Date - 2023-11-02T01:59:16+05:30
విజయనగరం జిల్లా కంటకాపల్లి–అలమండ స్టేషన్ల మధ్య రెండురైళ్ళు ఢీకొని పదమూడుమంది మరణానికి కారణమైన దుర్ఘటనకు మానవ తప్పిదం కారణమని రైల్వే అధికారులు...
విజయనగరం జిల్లా కంటకాపల్లి–అలమండ స్టేషన్ల మధ్య రెండురైళ్ళు ఢీకొని పదమూడుమంది మరణానికి కారణమైన దుర్ఘటనకు మానవ తప్పిదం కారణమని రైల్వే అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ రెండు స్టేషన్ల మధ్యా ఒక రైలు ప్రవేశించిన తరువాత రెండు వైపులా రెడ్ సిగ్నలే పడింది కనుక, ఇది ఆటో సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం వల్ల జరిగింది కాదని నిర్థారించారు. ఐదునెలల క్రితం ఒడిశాలో మూడురైళ్ళు ఒకదానిమీదకు మరొకటి వేగంగా వచ్చిపడి 275మంది ప్రాణాలు తీసిన ఘోర ప్రమాదం ఈ సందర్భంగా చాలామందికి గుర్తుకు వచ్చింది. ఈ రెండు ప్రమాదాలూ సిగ్నలింగ్ వ్యవస్థతో ముడిపడినవే. కాకపోతే, అది సాంకేతిక లోపంతో జరిగితే, ఇప్పటిది సిగ్నల్ జంప్ వల్ల సంభవించింది.
సాంకేతిక వ్యవస్థలన్నీ సక్రమంగానే ఉన్నాయని, వ్యక్తుల కారణంగానే ప్రమాదం సంభవించిందని తేల్చడానికి ఈ మానవ తప్పిదం అన్నమాట వాడుతూంటారు. కానీ, రైల్వే వ్యవస్థ గతంలో కంటే ఎంతో మెరుగుపడిందని, అధునాతన హంగులతో మరింత వేగంగా పరుగులు తీస్తోందని పాలకులు వాదిస్తున్న కాలం కనుక, ఈ రెండు ప్రమాదాలు తీవ్రమైన హెచ్చరికలే. తాజా ఘటనలో మొదటి రైలు ఆ తరువాత ఎందుకు నెమ్మదించింది, రెండోరైలు రైలు అంతవేగంగా ఎలా రాగలిగిందన్న ప్రశ్నలతో పాటు, రెండు ఆటోమేటిక్ సిగ్నల్ పోస్టుల్లో ఉదయంనుంచి బ్లాంక్స్ వస్తున్నందున స్టేషన్ మాస్టరే స్వయంగా వైర్‌లెస్ సెట్‌తో హెచ్చరికలు చేసినట్టుగా వార్తలు కూడా వచ్చాయి. దర్యాప్తులో మరిన్ని విషయాలు తెలియవచ్చును కానీ, మొదటిరైలుకు విద్యుత్ సరఫరా అందక నిలిచిపోవడం, వెనుకవచ్చిన రైలు రెండు రెడ్‌సిగ్నల్స్‌ని దాటి, వేగపరిమితులకు ఏ మాత్రం కట్టుబడకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందన్నది సారాంశం.
‘కవచ్’ అనే స్వదేశీసాంకేతిక పరిజ్ఞానాన్ని గత ఏడాది మార్చిలో సికింద్రాబాద్ సమీపంలోనే రైల్వేమంత్రి స్వయంగా పరీక్షించి చూసి, అనతికాలంలోనే దీనిని అన్ని రైళ్ళలోనూ ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు. రైలు ప్రమాదాలను నివారించే విషయంలో పాలకులు, అధికారులు చెబుతున్నమాటలను జనం నమ్మడం మానేసిన నేపథ్యంలో, కొత్తగా వచ్చిన ఈ చవుకయిన, ఉత్తమమైన వ్యవస్థయినా తమను కాపాడుతుందని ప్రజలు నమ్మారు. ఇప్పుడు ప్రమాదం జరిగిన రెండురైళ్ళలోనూ ఈ వ్యవస్థ లేదు. కూలీలు, పేదలు అధికంగా ప్రయాణించే ప్యాసింజరు రైళ్ళు కనుక వీటికి ఈ రక్షణ కవచం అక్కరలేదని పాలకులు అనుకొని ఉంటారు. ఏ ప్రాతిపాదికలమీద, ఎటువంటి ప్రమాదాలను నివారించడానికి కవచ్ అభివృద్ధి జరిగిందో అటువంటి ప్రమాదమే ఒడిశాలో కవచ్ లేనికారణంగా జరిగిన తరువాతయినా తీరు మారాలి కదా? కానీ, ఆ దుర్ఘటన మన కళ్ళను ఏ మాత్రం తెరిపించలేకపోయింది. కవచ్ ఇంకా కొన్ని విలువైన రూట్లకు మాత్రమే పరిమితమైపోయింది. రెండుశాతం రైళ్ళకు కూడా ఈ రక్షణకవచం లేనిస్థితి.
ప్రతీ వందేభారత్ రైలుకూ స్వయంగా నరేంద్రమోదీయే పచ్చజెండా ఊపుతున్న దృశ్యాన్ని చూస్తున్నాం. వాటిలో సౌకర్యాల గురించి, వేగం గురించి మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతూ, మరోపక్క బుల్లెట్ రైళ్ళ ప్రతిపాదనలు, ఒప్పందాల గురించి వింటూ ఉంటే ఈ దేశ రైల్వేవ్యవస్థ ఇంతగా మారిందా? అన్న అనుమానం కలుగుతూంటుంది. కానీ, సాధారణ ప్రజలు ప్రయాణించే రైళ్ళు నానాటికీ కుంచించుకుపోతుంటాయి. కరోనా కాలంలో అవసరార్థం తీసుకున్న కొన్ని నిర్ణయాలను అనంతరకాలంలో సడలించకుండా పాలకులు వదిలేశారు. బోగీల సంఖ్య తగ్గించడం, ప్యాసెంజర్ రైళ్ళను ఎక్స్‌ప్రెస్‌గా మార్చడం, జనరల్ బోగీలు ఎత్తివేయడం, కొన్ని స్టాప్‌లు రద్దుచేయడం, రాయితీలు ఎగవేయడం వంటివి అనేకం చూస్తున్నాం. దీనికితోడు, సిగ్నలింగ్, కమ్యూనికేషన్స్ వ్యవస్థలను మెరుగుపరచడం, తగినంతమంది సిబ్బందిని భర్తీచేయడం ఇత్యాది విషయాల్లో ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం అనేక ప్రమాదాలకు దారితీసి, ప్రయాణీకుల భద్రతను ప్రమాదంలో పడవేస్తున్నది. మానవ తప్పిదాన్ని సాధ్యమైనంత పరిమితం చేసే విధంగా సమస్త వ్యవస్థలను ఆధునికీక రించడం, ప్రమాద తీవ్రతను తట్టుకొని నిలిచే బోగీలను ప్రవేశపెట్టడం వంటి చర్యలు సత్వరం జరిగినప్పుడే ప్రయాణీకుల భద్రత సాధ్యం.
Updated Date - 2023-11-02T01:59:16+05:30 IST