ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వంట–మంట

ABN, First Publish Date - 2023-09-01T03:18:34+05:30

ఐదురాష్ట్రాల ఎన్నికలు సమీపిస్తుండగా, ముందస్తు ముచ్చట కూడా గట్టిగా వినిపిస్తున్న తరుణంలో, వంటగ్యాస్‌ ధర బుధవారంనుంచి ఓ రెండువందలు తగ్గింది...

ఐదురాష్ట్రాల ఎన్నికలు సమీపిస్తుండగా, ముందస్తు ముచ్చట కూడా గట్టిగా వినిపిస్తున్న తరుణంలో, వంటగ్యాస్‌ ధర బుధవారంనుంచి ఓ రెండువందలు తగ్గింది. కోట్లాదిమంది అక్కాచెల్లెళ్ళకు రక్షాబంధన్‌ బహుమతిగా దీనిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభివర్ణించారు. దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజల జీవనప్రమాణాలు పెంచేందుకు తన ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తున్నదని కూడా చెప్పుకున్నారు. పాలకులు ప్రజలకు అన్నీ నిజాలే చెప్పాలన్న నియమం ఏమీ లేదు. ఏ కారణం వల్లనైతేనేమి, ఈ విస్తృత ప్రజాకర్షక నిర్ణయాన్ని తీసుకున్నందుకు ప్రభుత్వాన్ని మెచ్చుకోవలసిందే. ఇటీవలి సంవత్సరాల్లో సిలిండరు ధర ఏదో కక్షగట్టినట్టుగా పెరిగిపోతున్న నేపథ్యంలో, ఏ మాత్రం తగ్గినా అది సామాన్యుడికి పెద్ద ఉపశమనమే. ఏటా క్రమబద్ధంగా పెరుగుతూ వచ్చిన బండధర మొన్న మార్చినెలలో 1100 రూపాయల గీతదాటింది. కాంగ్రెస్‌ పార్టీ సిలిండర్‌ రాజకీయం గట్టిగానే చేస్తున్నది కనుక, అధికారంలోకి వస్తే ఐదువందలకే ఇస్తానని చెబుతున్నది కనుక, తమకూ సామాన్యుడంటే, ముఖ్యంగా మహిళలంటే ప్రేమాభిమానాలున్నాయని నిరూపించుకోవడం బీజేపీ పెద్దలకు తప్పలేదు.

రక్షాబంధనం ప్రతీ ఏటా క్రమం తప్పకుండా వస్తూనే ఉంటుంది. ఈ ఏడాది దానిని గుర్తుపెట్టుకొని మరీ ఇలా రెండువందలు తగ్గించడమే విశేషం. ఇంత తగ్గించినా రెండున్నరేళ్ళనాటి ధరకంటే మరో రెండువందల రూపాయలు ఇంకా ఎక్కువేనని చాలామంది ఆడిపోసుకుంటున్నారు. 2021 ఫిబ్రవరిలో పాతికరూపాయలతో మొదలైన ఈ విడతలవారీ పెరుగుదల ఒక దశలో యాభైకి కూడా చేరింది. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికి బండ ధర నాలుగువందల యాభై. ఏ వస్తువైనా క్రమంగా ఎంతోకొంత ధర పెరగకుండా ఉండదు. కానీ, సబ్సీడీ గ్యాస్‌ కనుక, దాని విషయంలో ప్రభుత్వం ఎంతో తెలివిగా వ్యవహారాన్ని నడిపించింది. వినియోగదారుడికి నేరుగా సబ్సిడీ ఇవ్వకుండా ఆ మొత్తాన్ని బ్యాంకు ఖాతాల్లో జమచేయడం ఆరంభించి, ఆ సబ్సిడీ మొత్తాన్ని క్రమంగా నరుక్కుంటూ వచ్చి చివరకు పూర్తిగా ఎగ్గొట్టింది. తద్వారా మార్కెట్‌ ధరతో దానిని సమం చేసింది. దీనికితోడు, పేదల మొఖం చూసి, వారికోసం స్వచ్ఛందంగా సబ్సిడీ వదులుకోమంటూ భారీ ప్రకటనలతో, సినీనటుల విన్నపాలతో ప్రజలను భావోద్వేగాలకు లోను చేసి, లక్షలాదిమంది వినియోగదారులు తమకు తాముగా సబ్సిడీ వదులుకొనేట్టు చేసింది.


ఓ రెండువందల రూపాయల సబ్సిడీ పొందుతున్న ఉజ్వల పథకం లబ్ధిదారులకు ఇప్పుడు మరింత ధర తగ్గి మేలు చేకూరుతుందన్నది నిజం. ఇంతకాలం ధర హెచ్చుతూ వచ్చిన నేపథ్యంలో లక్షలాదిమంది ఈ పథకానికి దూరమైనారని, తిరిగి సిలండర్‌ కొనలేని స్థితిలో కట్టెలపొయ్యితో సరిపెట్టుకుంటున్నారని ఈ పథకం అమలు తీరుతెన్నుల మీద అధ్యయనం చేసిన సంస్థలు అంటున్నాయి. ఇప్పుడు వారికి బండధర మొత్తంగా ఓ నాలుగువందలు తగ్గినా, ఎందరు తిరిగివస్తారో, ఇప్పుడు కొత్తగా ఇస్తామంటున్న లక్షలాది కనెక్షన్లు తీసుకోవడానికి ఎంతమంది ధైర్యం చేస్తారో చూడాలి. గతంలో సార్వత్రక ఎన్నికలకు కేవలం రెండునెలల ముందు కిసాన్‌ యోజనవంటి పథకాలను ప్రవేశపెట్టి రైతులకు ఎంతో చేస్తున్నామని చెప్పుకోగలిగినవారు, ఇప్పుడు ధరలు పెరిగిపోతున్న స్థితిలో ఈపాటి విన్యాసాలు చేయకుండా ఉంటారా?

గత ఎన్నికల ముందు ధరల పెరుగుదల కీలకమైన అంశంగా లేదు. ఇప్పుడు అన్నం ఖరీదుగా మారి ప్రజలను బాధిస్తున్నది. వర్షాభావ పరిస్థితుల విషయంలోనూ భయాలు మొదలైనాయి. బియ్యం, గోధుమ తదితర ఎగుమతులపై నిషేధాలతో, ఉల్లి, టమాటా యుద్ధాలతో తనపై ప్రజాగ్రహం రేగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు పడుతున్నా పెద్దగా ఫలితం లేకపోతున్నది. గత ఐదేళ్ళలో శ్రామికుల వేతనం నాలుగోవంతు పెరిగితే, భోజనం ఖర్చు 65శాతం మేరకు పెరిగిందట. కాయగూరలనుంచి పప్పూ ఉప్పూ వరకూ అన్నీ ఖరీదైపోయిన తరుణంలో, పొయ్యిమీద వంట విషయంలో ఏమీ చేయలేకపోయిన ప్రభుత్వం కిందన మంట విషయంలో మాత్రం జాగ్రత్తపడి, కడుపురగిలిపోతున్న ఓటరుని ఎన్నికలముందు ప్రసన్నం చేసుకొనేందుకు ప్రయత్నించింది. సామాన్యుడిపై ఆర్థికభారం పడకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం ప్రభుత్వం బాధ్యత. కానీ, ప్రజాసంక్షేమం ఓట్లతో ముడిపడిన కార్యక్రమంగా మారిపోయింది. రాజకీయాలతో, ఎన్నికల ప్రయోజనాలతో సంబంధం లేకుండా నిరంతరం కొనసాగవలసిన ఒక ప్రక్రియ కేవలం ఎన్నికలముందు ఒక ఆయుధంగా మారిపోవడం విషాదం.

Updated Date - 2023-09-01T03:18:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising