ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆయుధ మైత్రి!

ABN, First Publish Date - 2023-09-14T01:17:07+05:30

ఏమాత్రం అనుమానాలక్కరలేదు, రష్యా–ఉత్తరకొరియా అధ్యక్షులు తమ మనసులో ఉన్నది చెప్పేశారు. ధర్మపోరాటంలో మిత్రుడిపక్షాన నిలుస్తానని...

ఏమాత్రం అనుమానాలక్కరలేదు, రష్యా–ఉత్తరకొరియా అధ్యక్షులు తమ మనసులో ఉన్నది చెప్పేశారు. ధర్మపోరాటంలో మిత్రుడిపక్షాన నిలుస్తానని, ఎటువంటి సందిగ్ధాలకు తావులేని, షరతులు వర్తించని పూర్తిస్థాయి మద్దతు రష్యాకు ఉంటుందని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ ప్రకటించారు. తమ భాగస్వామ్యంలో సైనిక సహకారం కూడా ఒక అంశమని రష్యా అధ్యక్షుడు నర్మగర్భవ్యాఖ్య చేశారు. బుల్లెట్‌ ప్రూఫ్‌ రైలులో రెండురోజుల పాటు ప్రయాణించి, ఎవరూ ఊహించని వాస్తోచ్నీ కాస్మోడ్రోమ్‌లో నాలుగైదుగంటలపాటు రష్యా అధ్యక్షుడితో చర్చలు జరిపి, తిరిగి స్వదేశానికి పయనమైన కిమ్‌ పర్యటన ఉక్రెయిన్‌ యుద్ధాన్ని మాత్రమే కాదు, యావత్‌ ప్రపంచాన్ని ప్రభావితం చేసేదే.

ఉత్తరకొరియా రెండు ఖండాంతర క్షిపణుల పరీక్షలు జరిపిన కొద్దిగంటల్లోనే ఇరుదేశాధినేతల భేటీ జరిగింది. జపాన్‌ ప్రత్యేక ఆర్థిక మండలికి అత్యంత చేరువలో ఈ క్షిపణులు రెండూ సముద్రంలో పడ్డాయి. కిమ్‌ దేశంలో లేనప్పుడు జరిగిన తొలి ప్రయోగం ఇదే కావచ్చును కానీ, ఇటువంటి చరిత్రాత్మకమైన సందర్భాలను క్షిపణిప్రయోగాలతో ముడిపెట్టడం, వేడుక చేయడం ఆయనకు అలవాటు. ఈ ఒక్క ఏడాదే వందకుపైగా క్షిపణులను ఉత్తరకొరియా పరీక్షించింది. మొన్న ఆగస్టులో రెండింటిని పరీక్షించి భవిష్యత్తులో దక్షిణకొరియామీద అణ్వస్త్ర దాడిచేయాల్సివస్తే ఉపకరిస్తాయని చెప్పుకుంది. వారం క్రితం టాక్టికల్‌ నూక్లియర్‌ ఎటాక్‌ సబ్‌మెరైన్‌ను సైతం ఆవిష్కరించిన ఉత్తరకొరియా, రెండు గూఢచర్య ఉపగ్రహాలను అంతరిక్ష కక్ష్యలో ప్రవేశపెట్టే విషయంలో మాత్రం విఫలం చెందింది. పేరుకు ఐక్యరాజ్యసమితి ఆంక్షలున్నా ఉత్తరకొరియా తనపని తాను చేసుకుపోతున్నది. అణ్వస్త్రాలతో సహా అత్యంత అధునాతమైన ఆయుధాలన్నీ దాని దగ్గర విపరీతంగా పోగుబడివున్న తరుణంలో ఇప్పుడు రష్యాతో ఆయుధమైత్రి పాశ్చాత్యదేశాలను భయపెట్టడం సహజం.

రెండుదేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న స్నేహసంబంధాలు, సోవియట్‌ యూనియన్‌ కాలంనుంచి మూడుతరాలుగా ఉత్తరకొరియా పాలకులకు లభిస్తున్న అండదండలు తెలిసినవే. నాలుగేళ్ళక్రితం కూడా ఉత్తరకొరియా, రష్యా అధ్యక్షుల మధ్య భేటీ జరిగింది. అమెరికాతో చర్చలు విఫలమైన నేపథ్యంలో, ఒత్తిడిపెంచే వ్యూహంతో జరిపిన పర్యటన అది. కానీ, ఇప్పుడు ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో పరోక్ష సహకారం ప్రత్యక్ష కార్యాచరణలోకి వచ్చిందని ఇరుదేశాధినేతలు చేసిన వ్యాఖ్యలే చెబుతున్నాయి. రష్యా ప్రతీచర్యనూ, నిర్ణయాన్ని తాను సమర్థిస్తానని, రష్యామీద కక్షకట్టిన, దాని సార్వభౌమత్వాన్ని ప్రమాదంలో పడవేస్తున్న సామ్రాజ్యవాదదేశాలతో పోరాడక తప్పదని కిమ్‌ స్పష్టంచేశారు. ఉపరితలంలో అంతరిక్షసహకారమో, ఆహార, ఆర్థికసాయమో, మరొకటో కావచ్చుగానీ, తన మిత్రుడికి యుద్ధంలో అండగా నిలవడాన్ని మించి ఈ పర్యటన లక్ష్యం మరేమీ కాదన్నది సుస్పష్టం.


ఒకదశలో ఉత్తరకొరియాను నియంత్రించలేక, భద్రతామండలిలో ఆంక్షలను అనుమతించలేక చైనా, రష్యాలు ఇబ్బందిపడ్డ వాతావరణం చూశాం. కిమ్‌ దూకుడుమీద చైనా కఠినంగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. పైకి అంటీముట్టనట్టుగా ఉండే ఈ వాతావరణాన్ని ఉక్రెయిన్‌ యుద్ధం పూర్తిగా మార్చేసింది. మరిన్ని ఆంక్షలతో ఉత్తరకొరియాను నలిపేయాలన్న అమెరికా ప్రయత్నానికి గత ఏడాది రష్యా, చైనాలు అడ్డుతగిలాయి. కొద్దినెలల క్రితం రష్యా రక్షణమంత్రి ఉత్తరకొరియాలో పర్యటించి దాని ఆయుధశక్తిని స్వయంగా తెలుసుకొని వచ్చారు. ఇచ్చిపుచ్చుకోవడాలు ఏ స్థాయిలో ఉంటాయన్నది వేరే విషయం కానీ, యుద్ధంలో అంతిమ విజయం ముఖ్యం కనుక, అవి ఏ రూపంలో, ఏ మార్గంలోనైనా జరగవచ్చు. అధికారికంగా కాకున్నా, రహస్యంగా చైనా ఇప్పటికే రష్యాకు సహకరిస్తున్నదని పాశ్చాత్యదేశాలు నమ్ముతున్న తరుణంలో, మరో విశ్వసనీయమైన మిత్రుడినుంచి ఈ కష్టకాలంలో సహకారం అందుకొని విజయం సాధించడం రష్యాకు ముఖ్యం. ఆంక్షలతో రష్యా, ఉత్తరకొరియాను అడ్డుకోలేమన్న విషయం ఇప్పటికే రుజువైంది. అంతర్జాతీయ నియమనిబంధనలను ఉల్లంఘించి ఉక్రెయిన్‌కు నేరుగానో, అడ్డుతోవల్లోనో అమెరికా, దాని మిత్రదేశాలు మారణాయుధాలను సరఫరా చేస్తున్నట్టుగానే, ఇప్పుడు ఉత్తరకొరియా చేయూతతో యుద్ధం మరింత తీవ్రమై, కూటముల మధ్య వైషమ్యాలు ఇంకా హెచ్చి, చర్చలకు ఏ మాత్రం తావులేని వాతావరణంతో అది సరిహద్దులు దాటిపోయే ప్రమాదం మాత్రం కనిపిస్తున్నది.

Updated Date - 2023-09-14T01:17:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising