గెలిచిన తెలుగుపాట
ABN, First Publish Date - 2023-03-14T00:55:59+05:30
గొప్ప విజయం. తెలుగు సినిమాకే కాదు, భారతీయ సినిమాకే సార్థకతా సందర్భం. హాలీవుడ్ చుట్టూ పరిభ్రమిస్తూ వచ్చిన ఆస్కార్, నాటుపాటను వరించింది...
గొప్ప విజయం. తెలుగు సినిమాకే కాదు, భారతీయ సినిమాకే సార్థకతా సందర్భం. హాలీవుడ్ చుట్టూ పరిభ్రమిస్తూ వచ్చిన ఆస్కార్, నాటుపాటను వరించింది. అక్కడ ఆదివారం రాత్రి, ఇక్కడ సోమవారం తెల్లవారుజామున, తీపికబురు గుప్పుమంది. ఉత్కంఠ, ఉద్వేగం, ఉత్సాహం పరవళ్లు తొక్కాయి. కేవలం కళాసాంస్కృతిక రంగాలకు చెందిన పారవశ్యం కాదిది. అస్తిత్వాల ఆత్మాభిమానాల ఉత్సవం! ప్రతి ప్రేక్షకుడికీ పండుగ! దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, ఆయన బృందం నిర్మించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని పాట (నాటు నాటు)కు ఒరిజినల్ మ్యూజిక్ స్కోర్ విభాగంలో ఆస్కార్ లభించింది. నామినేట్ అయినప్పటినుంచి ఈ విజయాన్ని ఆశావాదులు ఊహిస్తూ ఉన్నప్పటికీ, కల నిజమైన కలకలమే వేరు!. కార్తికీ గోన్సాల్వేస్ దర్శకత్వంలో రూపొందిన ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ఆస్కార్ సొంతం చేసుకోవడం మరో విశేషం. ఏనుగులు, వాటి సంరక్షకుల మధ్యన ఉండే ఆత్మీయ అనుబంధాన్ని ఎంతో చక్కగా తెలియచెప్పిన డాక్యుమెంటరీ ఇది.
నాటు నాటు పాటే ఒక యుద్ధం. ఒక గోండువీరుడి బతుకు పోరాటం. అవమానించిన, అవహేళన చేసిన బ్రిటిష్ దొరలను తమ ఆట, మాట, పాటతో సవాలు చేసిన సందర్భం. పాట చిత్రీకరణకోసం వాడిన వేదిక కూడా అనంతరకాలంలో రణక్షేత్రంగానే పరిణమించింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ మన స్వాతంత్ర్యపూర్వ పరిస్థితులకు అతకడం పాటను అద్భుత దృశ్య కావ్యంగానూ నిలబెట్టింది. ఆస్కార్ బరిలోకి ఎనభైపాటలు అడుగుపెడితే, చివరకు ఐదుపాటలు పోటీలో నిలిస్తే, లేడిగాగా, రిహాన్నా, టేలర్ స్విఫ్ట్ ఇత్యాది ప్రపంచస్థాయి గాయకులను వెనక్కునెట్టి, తెలుగుపాట ఆస్కార్ వేదికమీద నిలిచి గెలిచింది. ఇప్పటివరకూ ఏ ఆసియా పాటకూ దక్కనన్ని ప్రపంచస్థాయి పురస్కారాలు, గుర్తింపులు వచ్చినప్పుడే మన నాటు పాట ఆస్కార్‌కు అడుగుదూరంలో ఉన్న విషయం తేలిపోయింది.
అంతర్జాతీయ పురస్కారం దక్కినందుకు తెలుగుభాషా ప్రేమికులు మరొకందుకు కూడా సంతోషిస్తున్నారు. భాషలోని నాటునీ ఘాటునీ దట్టించి, పొలంగట్లు, పోట్లగిత్తలు, కిర్రుచెప్పులు, మర్రిచెట్లు, కర్రసాములు, కుర్రగుంపులు, ఎర్రజొన్నలు, విచ్చుకత్తులు, మిరపతొక్కులు ఇత్యాది వందలాది పదాలతో రచయిత దీనిని రంగరించారు. తెలుగుదనాన్ని, వీరత్వాన్ని దట్టించారు. కీసుపిట్టలు, కాలుసిందులు వంటి మాటలతో పాట తాను ఊగుతూ ప్రేక్షకులను ఉర్రూతలిగిస్తుంది. వీర, ఊర, వెర్రి వంటి మాటలతో పాటయావత్తూ తెలుగుపల్లెల్లోని జీవన సౌందర్యాన్ని, గ్రామీణ పలుకుబడులకు అద్దం పడుతుంది. అణువణువునా మట్టివాసన ఉన్న ఈ రెండు కాళ్ళ నాటుపాట బీటు పాటలను కాదుపొమ్మన్నది.
ఆస్కార్ భారతీయులకు అందనిదేమీ కాదు. ఉత్తమ సినిమా కొరత ఇప్పటికీ తీరకున్నా, కొన్ని కేటగిరీల్లో మనకు అవార్డులు వచ్చాయి. వంద సినిమాలకు పనిచేసిన భాను అతయా 1983లోనే ‘గాంధీ’ చిత్రానికి బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ అవార్డు అందుకున్నారు. సత్యజిత్ రే ఆస్కార్ లైఫ్ టైమ్ ఎచీవ్‌మెంట్ గౌరవాన్ని పొందారు. బ్రిటిష్ దర్శకుడు డానీ బోయెల్ తీసిన స్లమ్ డాగ్ మిలియనీర్ లోని జయహో పాట సంగీతదర్శకుడు ఎఆర్ రహ్మాన్‌కు, పాట రచయిత గుల్జార్‌కు, సౌండ్ ఇంజనీర్ రసూల్ పూకుట్టికి ఆస్కార్ అందించింది. విదేశీ నిర్మాతలు, దర్శకుల చేతుల్లో తయారైన చిత్రాలే అయినా వీటి నేపథ్యం భారతీయమే. ఇప్పుడు పూర్తి స్వదేశీ తయారీ చిత్రంలోని ఓ దేశవాళీ పాటకు అవార్డు రావడం మరింత గర్వించదగ్గ సందర్భం. సామాన్యుల నుంచి సినీ రాజకీయప్రముఖుల వరకూ అంతా చిత్రబృందాన్ని అభినందనల్లో ముంచెత్తుతున్నారు. ప్రధాని నరేంద్రమోదీ వరుస ట్వీట్లతో ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోపక్క, భారత ప్రభుత్వం ఆర్‌ఆర్‌ఆర్‌ను కాక, గుజరాతీ చిత్రం ‘ఛెల్లో షో’ను నామినేట్ చేసినందుకు తెలుగువారిపై వివక్షపేరిట రాజకీయ విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి.
పాటకు సంగీతం సమకూర్చిన ఎం.ఎం. కీరవాణి, గీతాన్ని రచించిన చంద్రబోస్, పాడిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, నృత్యరచన చేసిన ప్రేమ్‌రక్షిత్ వీరందరూ కలసి ఈ పాటకు ప్రాణం పోశారు. చలనచిత్ర నటులు జూనియర్ ఎన్టీయార్, రామ్ చరణ్ నాటుపాటకు నడకలు కూర్చి ప్రేక్షకులను రంజింపజేశారు. భారతీయులకు, తెలుగువారికి ఇంతటి గొప్ప విజయానందాన్ని అందించినందుకు వీరందరినీ అభినందిస్తున్నాము. ఈ పురస్కారం తెలుగు చిత్రరంగం మరింత ఉన్నతస్థానానికి తీసుకువెడుతుందని, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ పరిశ్రమ ఉదాత్తమైన వినోదాన్ని అందిస్తుందని ఆశిస్తున్నాము.
Updated Date - 2023-03-14T00:55:59+05:30 IST