ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాధితులతో కుస్తీ

ABN, First Publish Date - 2023-06-07T01:30:17+05:30

ప్రభుత్వాల పట్టింపులు చాలా సార్లు బాధాకరమైన ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ప్రతిపక్షాలు అడిగాయని కొన్ని సార్లు, ప్రజలు ఉద్యమిస్తున్నారని మరి కొన్ని మార్లు, న్యాయమైన పనులను కూడా చేయకుండా పాలకులు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రభుత్వాల పట్టింపులు చాలా సార్లు బాధాకరమైన ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ప్రతిపక్షాలు అడిగాయని కొన్ని సార్లు, ప్రజలు ఉద్యమిస్తున్నారని మరి కొన్ని మార్లు, న్యాయమైన పనులను కూడా చేయకుండా పాలకులు భీష్మించుకుంటున్నారు. అడిగితే ఎందుకు చేయాలనా? ఒత్తిడికి లొంగినట్టు అవుతుందనా? తమ అధికారాన్ని ప్రదర్శించాలనా? తెలియదు. ప్రజలు ప్రభుత్వాన్నే కదా అడగవలసింది? ప్రజల ఒత్తిడికి లొంగడంలోనే కదా రాజకీయ పక్షాల ప్రజాస్వామికత తెలిసేది? ప్రజలు ఇచ్చిన అధికారమే కదా, దాన్ని వారి మీదనే ప్రదర్శించేదేమిటి?

మహిళా మల్లయోధుల సాహసోపేత, దీన పోరాటాన్ని చూడండి. ఆదివారం నాడు ఫిర్యాదుదారులు కేంద్ర హోంమంత్రిని కలిశారు. వారెప్పటినుంచో కేంద్రప్రభుత్వంలో కీలకవ్యక్తులను కలుసుకోవాలని అనుకుని, ప్రయత్నించి ఉంటారు. చివరకు, ప్రభుత్వమే ఏ కారణం చేతనో, వారిని పిలిపించుకుని మాట్లాడవలసి వచ్చింది. ఏం మాట్లాడుకున్నారో ప్రభుత్వం నుంచి ఏ ప్రకటనా రాలేదు కానీ, మహిళా మల్లయోధులు ఎంతో నిస్పృహతో వివరాలు చెప్పారు. అమిత్ షా దగ్గర నుంచి మాకే ఆశ్వాసన లభించలేదు, అంతా చట్టం ప్రకారమే జరుగుతుంది, చట్టం తన పని తాను చేసుకుపోతుంది వంటి మాటలేవో మాట్లాడారట. సరే, వీరు ఆశించినట్టే పాలకులు మాట్లాడాలని లేదు కానీ, తమమీద ఒకరు దౌర్జన్యం చేశారు, అతనిని శిక్షించండి అని వేడుకోవడానికి వచ్చిన బాధితులను ఓదార్చడానికి, నొప్పిని పంచుకోవడానికి ప్రజానాయకులు ప్రయత్నించాలి. మరీ ముఖ్యంగా, ఆ నిందితుడు అధికారపార్టీ పార్లమెంటు సభ్యుడై ఉన్నప్పుడు, ప్రభుత్వం అతనిని రక్షిస్తోందని సమాజంలో గట్టి అనుమానం ఉన్నప్పుడు, కేంద్ర హోంమంత్రి మరింత మెరుగుగా స్పందించి ఉంటే బాగుండేది.

ఆ మరునాడే, ఉద్యమకారులలో కొందరు, తిరిగి తమ ఉద్యోగాలలో చేరారు. ఇక అయిపోయింది, పోరాటం ముగిసిపోయింది అన్న ప్రచారం మొదలయింది. కేంద్ర ప్రభుత్వం ఏదో హామీ ఇస్తే, దాన్ని వీరు నమ్మి విరమించుకున్నారంటే వేరు. అక్కడేమీ ఒక భరోసా దొరకకుండానే, వీరు ఉద్యమం నుంచి ఉద్యోగాలకు మళ్లారన్న వార్త, సహజంగానే, అంతా నీరుగారిపోయిందన్న అభిప్రాయాన్ని కలిగిస్తుంది. ఎవరో వ్యాఖ్యానించినట్టు, మహిళా మల్లయోధుల పోరాటం, దేశరాజధాని మధ్యతరగతి, ఉన్నత మధ్యతరగతి శ్రేణులలో నిర్భయ ఉదంతం సందర్భంలో కలిగినంత ఉద్వేగాన్ని కలిగిస్తున్నది. ఈ పోరాటం అణగారిపోయినా, ఓడిపోయినా అనేక మనోభావాలు కుంగిపోతాయి. ఉద్యోగాలలో చేరినంత మాత్రాన ఉద్యమాన్ని విరమించబోవడం లేదు అని ఉద్యమకారులు ప్రత్యేకంగా వివరణ ఇవ్వవలసి వచ్చింది. ఇంకో పక్కన సామాజిక మాధ్యమాలలో మరో రకం ప్రచారం మొదలయింది. భేటీలో అమిత్ షా మల్లయోధులను తీవ్రంగా హెచ్చరించారని, దానితో వారు తోకముడిచారని కథనాలు రాసాగాయి.

ఐదు నెలల నుంచి ఏటికి ఎదురీదుతున్నట్టు ఉద్యమిస్తున్న మహిళలు, వారెంత మల్లయోధులే అయినా, ఒకే నిబ్బరంతో కొనసాగడం కష్టమే. వారి శ్రేయోభిలాషులు కూడా వారికి మంచి చెడ్డలు చెబుతారు. హరిద్వార్ దగ్గర గంగానదిలో పతకాలను విసర్జించాలన్న సంకల్పాన్ని, అటువంటి సలహాల కారణంగానే వారు విరమించుకున్నారు. నిందితుడు బ్రిజ్ భూషణ్‌ను ఇంతగా బిజెపి ప్రభుత్వం వెనకేసుకువస్తున్నా, అయోధ్యలో సాధువులతో తనకు మద్దతుగా ర్యాలీ నిర్వహించాలనుకున్న ప్రయత్నాన్ని నిరోధించింది. మంగళవారంనాడు పోలీసులు ఉత్తరప్రదేశ్‌లోని బ్రిజ్ భూషణ్ స్వగృహానికి వెళ్లి ఆయన సన్నిహితులను విచారించారు కూడా. ఈ మొత్తం ఉదంతం ప్రపంచవ్యాప్తంగా అపకీర్తి తెస్తున్నదన్న స్పృహ కేంద్రప్రభుత్వానికి లేకపోలేదు. కాకపోతే, పట్టింపు, బ్రిజ్ భూషణ్ ప్రభావం ఏడెనిమిది నియోజకవర్గాలలో ఉండడం, రాబోయే ఎన్నికలలో ప్రతి సీటు, ప్రతి ఓటూ ముఖ్యమయ్యే పరిస్థితి ఉండడం బిజెపి ఉదాసీనతకు కారణాలని అంటున్నారు.

మొత్తం ఏడుగురు ఫిర్యాదుదారులలో ఒక మైనర్ ఉన్నారు. మైనర్‌పై వేధింపులు బెయిల్ ఇవ్వడానికి వీలులేని నేరం కిందికి వస్తాయి. అయినా ఇప్పటి వరకు బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయలేదు. ఆ మైనర్ బాలిక తన ఫిర్యాదును ఉపసంహరించుకున్నట్టు సోమవారం నాడు ప్రచారం జరిగింది. ఒక జాతీయ దినపత్రికలో ఆ సూచన వెలువడింది. అంటే, బ్రిజ్ భూషణ్ పక్షంలో ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయన్న మాట. ఇంతకాలం, ఫిర్యాదుదారుల మీద, సాక్షుల మీద బెదిరింపులు, కొన్నిసార్లు భౌతిక దాడి యత్నాలు కూడా జరిగాయి.

ఇదంతా కూడా దేశరాజధానిలో, కేంద్రప్రభుత్వం నీడలో, అధికారపక్ష ఎంపీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉండడం ఈ దేశం చేసుకున్న దురదృష్టం.

Updated Date - 2023-06-07T01:30:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising