ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుణపాఠమే కష్టకాలంలో గురువు!

ABN, First Publish Date - 2023-03-16T01:50:54+05:30

జాలిపడవలసిన సందర్భంలో జాలి పడడమే ధర్మం. కష్టం వచ్చినప్పుడు, పాతచిట్టాలను విప్పి పుండు మీద కారం చల్లడం న్యాయం కాదు. ‘‘ఆ నాడే హెచ్చరించాను, విన్నావా, ఇప్పుడు ఈ స్థితి వచ్చింది చూడు...’’

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

జాలిపడవలసిన సందర్భంలో జాలి పడడమే ధర్మం. కష్టం వచ్చినప్పుడు, పాతచిట్టాలను విప్పి పుండు మీద కారం చల్లడం న్యాయం కాదు. ‘‘ఆ నాడే హెచ్చరించాను, విన్నావా, ఇప్పుడు ఈ స్థితి వచ్చింది చూడు...’’ అని సాధించడం ఏమంత మంచి సంస్కారం కాదు. ఎవరు చేసిన పనుల పర్యవసానాలు వారు అనుభవించక తప్పదన్న వేదాంతం వల్లించడం ఇంకా దుర్మార్గం.

కానీ, సమస్య ఏమిటంటే, సంక్షోభం వచ్చినప్పుడు, అందులో ఉక్కిరిబిక్కిరిగా ఉంటారు కాబట్టి, హితబోధలు, ఫ్లాష్ బ్యాక్‌లు అసందర్భం అంటారు. ఏ కష్టమూ లేని కాలంలోనేమో మంచిమాటలు విననవసరం లేదన్న బేఖాతరులో ఉంటారు. మరి, దిద్దుబాటు ఎట్లా? గుణపాఠాలు ఎట్లా? భవిష్యత్ లోకి మెరుగైన ప్రయాణం ఎట్లా?

‘‘చెప్పంగ వినకపోతే చెడంగ చూడవలసివస్తుంద’’ని ఒక సామెత. మరీ కటువుగా ఉన్నది కదా? పోగాలము వచ్చినవారు ఆప్తవాక్యాన్ని వినరని విష్ణుశర్మా, చిన్నయసూరీ కలిసి చెప్పారు. ఇది కూడా ఏదో శాపనార్థం పెట్టినట్టున్నది. మానవానుభవం పదే పదే ధ్రువపరుస్తూ వచ్చినా, మానవచాపల్యం మాత్రం వివేకాన్ని ఎడం పెడుతూనే వస్తోంది. అధికారం, విపరీతమైన అధికారం, ఎప్పుడూ తన ప్రాభవం శాశ్వతం అనుకుంటూ సత్యాలను ఆలకించదు. ఫలితం, కాలిన చేతులను చలువపరచడానికి మహారణ్యాలే ఆకులు రాలిన అడవులయ్యాయి.

అందుకే, వీళ్లతో సంభాషించాలంటే, నొవ్వకుండా చెవులు కుట్టే విద్య ఏదో కావాలి. అభిమానశల్యాన్ని కలవరపెట్టకుండా, పూర్వాపరాల విచికిత్స ఏమైనా చేయగలమేమో చూడాలి.

ముందొక విషయం స్పష్టం చేయాలి. తప్పొప్పులతో నిమిత్తం లేకుండా, ఘర్షణలో ఉన్న ఇద్దరిలో బలహీనుల వైపున నిలబడడం ప్రాథమికంగా న్యాయం. ఈ సందర్భంలో అయితే, బలవంతుడికీ నైతికత లేదు. బలహీన పక్షానికీ నైతికత లేదు. ఇద్దరి నీతులూ కొట్టుడు పొయ్యాక, మిగిలింది బలాబలాలే. బక్కవాడి మీద బాహుబలి దౌర్జన్యం అన్యాయం కదా! పైగా ఈ మహాబలుడు తన బలాన్ని మరింత మరింత పెంచుకోవడానికి, బక్కవాళ్ల తప్పులు వెదికి వెదికి మరీ దౌర్జన్యం చేస్తూ పోతున్నాడు.

కల్వకుంట్ల కవిత విషయంలో ఈడీ, సిబిఐ వగైరా కేంద్ర ఏజెన్సీలు చేస్తున్న హడావిడి, కెసిఆర్ మీద గురిపెట్టిన అస్త్రమే తప్ప మరొకటి కాదు. కవిత ఒక సులభ లక్ష్యం. అందుకు ఆమెనే అవకాశం ఇచ్చారు, నిజమే. ఒకవేళ, ఆమె జాగ్రత్త పడి ఉంటే, మరొకరెవరో లక్ష్యం అయి ఉండేవారు. తెలంగాణ రాష్ట్రంలో తనకి గట్టి ఉనికి ఏర్పడి ఉండకపోయి ఉంటే, రాష్ట్రాన్ని ఏకమొత్తంగా స్వాధీనం చేసుకోవాలనే ఆశ బిజెపికి కలిగేది కాదు. కెసిఆర్ రాజీపడితే, ఒక సయోధ్య కొనసాగేది. కెసిఆర్ రాజీ ఎరుగని మహావీరుడని చెప్పడానికి లేదు. ప్రస్తుత సంక్షోభంలో కూడా, కనీసం పుత్రికా ప్రేమతో అయినా, ఆయన ఏదో మధ్యేమార్గం కోసం ప్రయత్నించి ఉండే అవకాశం ఉంది. కానీ, రాష్ట్రమే తమ పరం కావాలన్నది బిజెపి లక్ష్యం కావడంతో, ఆ దారి మూసుకుపోయింది. ఇష్టంతోనో, లేకుండానో ఇప్పుడు కెసిఆర్ యుద్ధం చేయక తప్పదు.

తాను అధికారంలో లేని ప్రతి రాష్ట్రంలోనూ బిజెపి ఏదో ఒక వ్యూహంతో అనుకూల పరిస్థితులు సృష్టించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఆ ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల నుంచి, కొన్ని చోట్ల గవర్నర్ల నుంచి సహాయసహకారాలు అందుతున్నాయి. ప్రభుత్వాలన్నాక, అధికార పార్టీలన్నాక, అనేక రాజకీయ, అభివృద్ధి ఆదాయమార్గాలుంటాయనేది కొత్త విషయం కాదు. తాజాగా దొరికితే సరే, లేకపోతే, పాతవన్నీ తవ్వితీసి, కాటికి కాళ్లు చాపి కూర్చున్న నాయకులను కూడా జైళ్లలో నెట్టడం, కోర్టులకు తిప్పడం, కేంద్రప్రభుత్వం ఒక విధానంగా సాగిస్తోంది. కక్ష పూరితంగా చేసే మాట నిజమే కానీ, ఈ తరహా కేసులలో వాస్తవం లేకుండా పోలేదు. ప్రజాస్వామిక కార్యకర్తల మీద, నిరసనకారుల మీద పెట్టే కేసులు మాత్రమే కూటసృష్టితో కూడి ఉంటున్నాయి కానీ, రాజకీయనేతల మీద కేసులు నిప్పు లేని పొగలు కావు. హజారేతో కలిసి అవినీతి ఉద్యమం చేసి తాను గద్దెనెక్కడంలో పరోక్షంగా సహకరించిన అరవింద్ కేజ్రీవాల్ మీద ఏ మాత్రం కృతజ్ఞత లేకుండా బిజెపి యుద్ధం ప్రకటించింది. ఢిల్లీ తన చేతికి రావాలన్నదే అక్కడ లక్ష్యం. లిక్కర్ కుంభకోణం అనువుగా దొరికింది. కెసిఆర్‌ను ఇబ్బంది పెట్టగల ఆయుధమూ దొరికింది.

లిక్కర్ కుంభకోణంలో నిజంగా కుంభకోణం ఉందా, ఉంటే అందులో కల్వకుంట్ల కవిత నిజంగా పాలుపంచుకున్నారా వంటి ప్రశ్నలు ఎవరూ వేయడం లేదు. ఆ ప్రశ్నలకు ఏ సమాధానం వచ్చినా, ఎవరికీ పెద్దగా అభ్యంతరం ఉన్నట్టు లేదు. కవిత కూడా తన ప్రమేయం గురించిన వివరాలను ప్రస్తావించి, వాటికి ఖండనలు ఇవ్వడం లేదు. కేంద్రప్రభుత్వం రాజకీయ దురుద్దేశం మాత్రమే ఇక్కడ బోనులో ఉన్నది తప్ప, భారత రాష్ట్రసమితి నాయకులపై అవినీతి ఆరోపణలు కావు. అమిత్ షాకు స్వాగతం చెప్పిన ‘వాషింగ్ పౌడర్ నిర్మా’ హోర్డింగ్ ఇచ్చే సందేశం కూడా అదే. బిజెపిలో చేరితే పాపాలన్నీ ప్రక్షాళన అవుతాయి, లేకపోతే దాడులు జరుగుతాయి. అసలు పాపమో, లోపమో జరిగిందా లేదా అన్న చర్చ లేదు. కేంద్రప్రభుత్వం కనుక, బిజెపికి చెందిన అవినీతిపరులపై కూడా ఏజెన్సీల ద్వారా దర్యాప్తులు చేయించి ఉంటే, రాష్ట్రాల మీద పెత్తనం కోసం పెడమార్గాలు తొక్కకుండా ఉండి ఉంటే, దాని నైతిక శక్తి ఉన్నతంగా ఉండేది. అప్పుడు పరిస్థితి భిన్నంగా ఉండి ఉండేది. కేంద్రంలో ఉన్నది పరమాధికారం కదా, అంతటి ఓపిక ఉండదు.

ఈ సన్నివేశం గురించి కొద్దిగా ముందే ఊహించగలిగిన కెసిఆర్ కొన్ని విరుగుడు మంత్రాలు జపించారు. ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నాన్ని పసిగట్టి, దానినొక పెద్ద అంశంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. ఇది బిజెపిని బాగానే ఇబ్బంది పెట్టింది. ఈడీ అడుగులు ముందుకు పడుతున్నప్పుడు కెసిఆర్ కొద్దిగా ఉదాసీనంగా ఉండిపోయారు. కాస్త ఆలస్యంగా మహిళా రిజర్వేషన్ల అస్త్రాన్ని కుమార్తె చేతికి ఇచ్చారు. ఇది హాస్యాస్పదంగా కనిపించిందని అనలేము కానీ, చాలామంది నొసళ్లు ఎగిరాయి. ఇక్కడే కెసిఆర్ అలక్ష్యాలు, నిర్లక్ష్యాలు తిరిగి చర్చకు వస్తున్నాయి.

మహిళా ప్రాతినిధ్యం అన్నది కెసిఆర్‌కు అభిమానపాత్రమైన అంశం కాదు. వారసత్వ, బంధుత్వ రాజకీయాలు సహజమేనని భావించే కెసిఆర్, కుమార్తె విషయంలో మాత్రం ఇవ్వగలిగినంత ప్రాధాన్యం ఇచ్చారని అనిపించదు. ఇక, మొదటి అధికారకాలంలో రాష్ట్ర కేబినెట్‌లో ఒక్క మహిళామంత్రీ లేరు. కోర్టు ఆదేశిస్తే తప్ప మహిళాకమిషన్ చైర్‌పర్సన్ నియామకం చేయలేదు. ఆయన ఏ విషయాన్ని అప్రధానం అనుకున్నారో ఇప్పుడు అదే ఆపద్ధర్మం అయింది. కవిత విషయంలో బండి సంజయ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వెంటనే మహిళా కమిషన్ స్పందించవలసి వచ్చింది. వరంగల్ జిల్లాకు చెందిన ఒక మాజీమంత్రి విషయంలో ఆ స్పందన ఎంతవరకు వచ్చిందో ఇంకా తెలియలేదు. వ్యవస్థలను వాటి దారిన వాటిని పనిచేయనిస్తే, ఇటువంటి సందర్భాలలో అవి కల్పించుకుంటే ఎంతో సహజంగాను, అర్థవంతంగానూ ఉండేది. అవసరార్థం మాత్రమే ఒక ఉద్యమాంశాన్ని, ఒక సంస్థను ఉపయోగించుకుంటే, అందుకు ఏమంత గౌరవం సమకూరదు. అందుకే, పార్టీ ప్రాయోజిత సంరంభం తప్ప, కవితకు అనుకూలంగా జరిగిన ఆందోళనల్లో సాధారణ ప్రజల భాగస్వామ్యం కనిపించడం లేదు.

ఈ మధ్యకాలంలో, ఉద్యమకాలం నాటి సహచరులకు, కార్యకర్తలకు కెసిఆర్ ప్రాధాన్యం ఇవ్వడం మొదలుపెట్టారు. ఇప్పటికైనా గుర్తించినందుకు సంతోషించవలసిందే. కానీ, ఆ ఆలస్యం ఖరీదు చాలా ఎక్కువ. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ప్రభ బాగా తగ్గిపోయిన తరువాత, కెసిఆర్ జనాకర్షణ కూడా నిద్రాణపరిపాలన వల్ల క్షీణిస్తూ వస్తున్నప్పుడు ఇట్లా ఆకులు పట్టుకోవలసి వచ్చింది. అయినప్పటికీ, ప్రస్తుత సన్నివేశంలో కెసిఆర్‌కు సానుకూల వాతావరణం కనిపిస్తున్నదంటే అందుకు కారణం, ప్రత్యర్థుల బలహీనతలే తప్ప సొంత బలం కాదు! ప్రత్యర్థులు ఎప్పుడూ బలహీనంగా మిగలకపోవచ్చు మరి!

ఉద్యమపార్టీగా ఉండకుండా తానే నిరోధించుకున్నారు. ప్రాంతీయపార్టీగా కూడా మిగలకుండా తనను తానే బలహీనపరచుకున్నారు. అధికార కేంద్రీకరణ కెసిఆర్ విచక్షణను ప్రభావితం చేస్తూ వచ్చింది. కేంద్రం నుంచి వస్తున్న ప్రమాదం ఆయనలో తడబాటును పెంచుతోంది. పరిపాలన, అభివృద్ధి, సంక్షేమం అన్నీ మునుపటివలె శక్తిమంతంగా లేవు. కేంద్రీకృత అవినీతి జనానుభవంలోకి వచ్చేది కాదు కాబట్టి, దాని తీవ్రత తెలియదు కానీ, క్షేత్రస్థాయిలో అవినీతి ప్రజలను బాగా బాధిస్తున్నది, శాసనసభ్యుల పేర్లు, మంత్రుల పేర్లు కూడా గొప్పగా వినిపిస్తున్నాయి. ఈడీలు, ఐటీలు ఏ నాయకులనైనా పలకరించినప్పుడు, ప్రజలు ఏమంత ఆశ్చర్యపోవడం లేదు. కవిత విషయంలో ఈడీ దర్యాప్తును మాత్రం, ఆమె ముఖ్యమంత్రి కుమార్తె కనుక, రాజకీయ దాడిగా పరిగణిస్తున్నారు. బలహీనపక్షంపై ఏర్పడే సహజసానుభూతి ఇక్కడే బిఆర్ఎస్‌కు రాజకీయంగా కలసివస్తోంది. అయినా, కేంద్రం అడుగు ముందుకే పడవచ్చు!

ప్రస్తుత పరిణామాలు కెసిఆర్ స్వయంకృతాలని అనలేము కానీ, తెలంగాణ ఉద్యమం ఆశించిన రీతిలో ఆయన పరిపాలన సాగి ఉంటే, ఈ సమస్యలు ఇంతగా బాధించేవి కావు. బాధించినా ప్రజల అండదండల పూచీ ఉండేది. ఇప్పుడు జనాదరణ నుంచి కాక, అన్నిటినీ, వ్యూహరచన నుంచి చక్కబెట్టుకోవలసి వస్తోంది. నవ్వేవాళ్ల ముందు బోర్లబొక్కల పడవద్దని కెసిఆరే ఒక సందర్భంలో సహచరులకు హితవు చెప్పారు. నవ్వులను నియంత్రించడం కంటె, అడుగులను సవరించుకోవడమే చేయవలసిన పని. పెడచెవిన పెట్టిన పాత హెచ్చరికల పునశ్చరణ ఎందుకు కానీ, రేపటి కోసం వర్తమానం చెబుతున్న కొత్త జాగ్రత్తలను ఆలకించగలిగితే చాలు.

కె. శ్రీనివాస్

Updated Date - 2023-03-16T01:50:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising