ప్రతిష్ఠకు మెరుగులుదిద్దే పాదయాత్రలు!
ABN, First Publish Date - 2023-01-26T00:46:20+05:30
‘భారత్ జోడో’ యాత్ర ముగింపునకు వచ్చింది. దాని ప్రకటిత లక్ష్యాన్ని ఎంతవరకు సాధించిందో కానీ, ఆశించిన ప్రయోజనాన్ని...
‘భారత్ జోడో’ యాత్ర ముగింపునకు వచ్చింది. దాని ప్రకటిత లక్ష్యాన్ని ఎంతవరకు సాధించిందో కానీ, ఆశించిన ప్రయోజనాన్ని మాత్రం సమకూర్చినట్టే ఉంది. ప్రత్యర్థులు ప్రచారంలో పెట్టిన రాహుల్ గాంధీ వ్యక్తిత్వానికి సాధ్యమైనంత మరమ్మత్తు జరిగినట్టే కనిపిస్తోంది. కాంగ్రెస్ నాయకులే కాదు, విమర్శకులు, పత్రికా వ్యాఖ్యాతలు కూడా ఆ విషయాన్ని నిర్ధారిస్తున్నారు. రాహుల్‌పై జనాభిప్రాయంలో మార్పు కేవలం వీధులలో, జనంలో నడవడం వల్ల రాలేదు. పాదయాత్రను రూపొందించిన, నిర్వహించిన తీరు వల్ల వచ్చింది. జనంతో సంబంధం పెట్టుకోవడం ద్వారా రాజకీయ, సామాజిక లక్ష్యాలు సాధించాలనుకుని సంకల్పబలంతో, లక్ష్యశుద్ధితో ప్రయత్నించినవారెవరూ చరిత్రలో విఫలం కాలేదు.
పాదయాత్ర సాధించగల ప్రయోజనమేమిటో, ఇప్పటి నాయకులలో జగన్మోహన్ రెడ్డికి తెలిసినట్టు మరెవరికీ తెలిసే అవకాశం లేదు. ప్రజలతో సంబంధాలను ఏర్పరచుకోగల పర్యటనలన్నీ ప్రభావవంతమైనవే కానీ, వాటిల్లో కాలినడక యాత్రల శక్తి వేరు. తన తండ్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి ‘ప్రజాప్రస్థానం’ పేరుతో చేసిన పాదయాత్ర, కలహాల కాంగ్రెస్‌లో ఆయననొక జనాకర్షక నాయకుడిని చేయడమే కాక, ఎన్నికలలో ఘనవిజయాన్ని సాధించి పెట్టింది. ఓదార్పు యాత్రలు చేసి, ఎన్నికల యాత్రలు చేసి, తాను జైలులో ఉన్న కాలంలో సోదరి చేత యాత్రలు చేయించి, మొదట అపజయం ఎదురైనా అలసిపోకుండా కాలికి బలపం పట్టుకుని తిరిగి తిరిగీ జగన్మోహనరెడ్డి తన కల నెరవేర్చుకున్నారు. ఆ నడకలోని, జనస్పర్శలోని కిటుకు తెలిసినందువల్లనే, ప్రతిపక్ష నాయకులు యాత్రలు చేస్తుంటే జగన్‌కు ఉలికిపాటు కలుగుతోంది.
రాజకీయ సమీకరణల్లో, జనసమ్మర్దంలో తొక్కిసలాటలు, విషాదాలు జరుగుతుంటే, ప్రభుత్వం ఏమి చేయాలి? ఆ రాజకీయ పార్టీని పిలిచి మాట్లాడాలి. అన్ని పార్టీల విషయంలోనూ అట్లా జరిగే అవకాశం ఉంది కాబట్టి, అఖిలపక్ష సమావేశం జరిపి, రాజకీయ సభలు, రోడ్ షోలు నిర్వహించేటప్పుడు పాటించవలసిన విధివిధానాలపై ఒక ఏకాభిప్రాయాన్ని సాధించి, అధికారపార్టీ కూడా దానికి కట్టుబడి ఉండాలి. లేదా, అన్ని రాజకీయ సభలలో తొక్కిడి లేకుండా పోలీసు యంత్రాంగం గట్టి పర్యవేక్షణ అందించాలి. మరి, జగన్ ప్రభుత్వం అట్లా చేసిందా?
చంద్రబాబు నాయుడు పర్యటనలను అడ్డుకోవడానికి ఒక కారణం దొరికిందే చాలునని, తాతల నాటి చట్టాన్ని ఒకదాన్ని తవ్వితీసి రాజకీయ కార్యకలాపాలమీదనే ఉక్కుపాదం మోపింది. ఇప్పుడు చంద్రబాబు తనయుడు, తెలుగుదేశం పార్టీ యువనాయకుడు నారా లోకేశ్ తలపెట్టిన పాదయాత్రకు అడుగడుగునా అగడ్తలు తవ్వుతోంది. ఇటువంటి ప్రవర్తన వెనుక ఉన్నదేమిటి? భయం. జనంతో సన్నిహితంగా మెలిగే కార్యక్రమం ప్రతిపక్షం తీసుకోవడం వల్ల, ఇప్పటికే ప్రతిష్ఠ దిగజారిన అధికారపక్షానికి తన జనామోదం మరింత క్షీణిస్తుందన్న కలవరం.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి, తెలుగుదేశం పార్టీ యువనాయకుడు నారా లోకేశ్‌కు అనుభవంలోను, వయసులోను, రాజకీయ స్థాయిలోను ఏ విధంగానూ పోలిక లేదు. వారిద్దరికి ఉన్న ఒకే ఒక్క సామ్యం, ఇద్దరినీ ప్రత్యర్థులు ఒకే పదంతో హేళన చేశారు. అనుభవరాహిత్యం, అసమర్థత, అర్భకత్వం అనే అర్థాలున్న ఆ పదాన్ని, ప్రత్యర్థులు మౌఖికంగానూ, సామాజిక మాధ్యమాలలోనూ విస్తృతంగా ప్రచారం చేశారు. వారి వ్యక్తిత్వాలలో కానీ, వ్యవహారంలో కానీ ఏవో కొన్ని లక్షణాలు అటువంటి వెక్కిరింతలకు ఆస్కారం ఇచ్చి ఉంటాయి, అట్లా లేకున్నా కూడా, కేవలం ప్రచారయంత్రాంగంతో మనుషులపై తప్పుడు అభిప్రాయాలు కల్పించగల కాలం ఇది. రాహుల్ గాంధీ, తన పాదయాత్ర ద్వారా, తన మీద పడిన ముద్రను దాదాపుగా తొలగించుకోగలిగారు. ఆయన ఒక పరిపక్వత కలిగిన, కష్టనష్టాలకు ఓర్చుకోగలిగిన శక్తీ, సమర్థత కలిగిన నాయకుడిగా తనను తాను నిలబెట్టుకోగలిగారు. మరి నారా లోకేశ్ తన పాదయాత్ర ద్వారా ఆ ఫలితాన్ని సాధించగలరా? అందుకు తగినట్టుగా ఆయన తన పాదయాత్రను రూపొందించుకుంటున్నారా?
ఈ పాదయాత్ర నారా లోకేశ్‌కు చాలా అవసరం. ప్రత్యక్ష ఎన్నికలలో ఆయన ఓటమి చెందడం, సభా ముఖంగా మాట్లాడేటప్పుడు తడబాటు, అనుభవరాహిత్యం ప్రస్ఫుటంగా వ్యక్తం కావడం వంటివి ఆయన గురించి ఒక అభిప్రాయాన్ని నిర్మించడానికి ఆస్కారం ఇచ్చాయి. అవేవీ అధిగమించలేని లోపాలు కావు. జనం మధ్య ఆత్మీయంగా మెలగుతూ తనను ప్రజానాయకుడిగా నిరూపించుకోవడం ఆయనకు ఇప్పుడు అవసరం. సుదీర్ఘ అనుభవం ఉన్న పార్టీ యంత్రాంగం ఆయనకు అండగా ఉంటుంది కానీ, లోకేశ్ వ్యవహారసరళి, మాటతీరు ఎట్లా ఉన్నాయన్నది మిత్రులు, శత్రువులు వేయి కళ్లతో కనిపెడుతూ ఉంటారు. జనాభిప్రాయానికి మరమ్మత్తు సాధించడంలో రాహుల్ గాంధీ అనుసరించిన పద్ధతులు ఏమిటో తెలుసుకోవడం లోకేశ్‌కు కూడా ఉపయోగపడవచ్చు. పాదయాత్రకు, రాజకీయసభలకు ఉండే తేడా అందరికీ తెలిసిందే. స్థానికమయిన సమస్యల ప్రస్తావన, బాధిత ప్రజలకు ఆశ్వాసనలు, శ్రద్ధగా ఆలకించడం, జనంతో సన్నిహితంగా మెలగడం ఇవన్నీ అవసరం, ప్రత్యర్థులపై విమర్శల కంటె, నిర్మాణాత్మక ప్రస్తావనలే జనానికి నచ్చవచ్చు. ఏవో వివాదాల్లోకి, తగాదాల్లోకి లాగడానికి ప్రత్యర్థులు ప్రయత్నిస్తూనే ఉంటారు. దేనికీ చలించకపోవడం, దారిమళ్లకపోవడం ముఖ్యం.
నిజానికి, ఈ యాత్ర నారా లోకేశ్ కంటె తెలుగుదేశం పార్టీకి ఎక్కువ అవసరం. కుటుంబస్వామ్యం, వారసత్వం వాంఛనీయాలా అంటే, ప్రాంతీయ పార్టీలు అట్లాగే పరిణమించాయి, ఆ ధోరణినేమీ ఇప్పుడు మార్చలేము. జాతీయపార్టీ కాంగ్రెస్ దగ్గర నుంచి ప్రాంతీయ పార్టీల దాకా, రాజకీయసంస్థలు వారసత్వ రాజకీయాలమీదనే ఆధారపడి ఉన్నాయి. చంద్రబాబు పాదయాత్ర చేయగలిగితే దాని ప్రభావస్థాయి వేరుగా ఉండేది కానీ, ఈ వయసులో అంత బాధ్యత ఆయన తీసుకోవడంలో సమస్యలుంటాయి. పైగా, ఆయన నాయకత్వాన్ని కొత్తగా స్థిరపరచవలసిన అవసరం లేదు. కావలసింది భవిష్యత్తుకు భరోసా. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబునాయుడుకు ఒక కొనసాగింపు ఉంటుందన్న ధీమా కోసం లోకేశ్‌కు జనామోదం అవసరం. పార్టీ నిరంతరాయంగా కొనసాగుతుందన్న సూచన అనేక ప్రతికూల అంశాలకు విరుగుడుగా పనిచేస్తుంది. వచ్చే ఎన్నికలలో కనుక తెలుగుదేశం పార్టీ ఓడిపోతే, చంద్రబాబు వయోభారం కారణంగా ఆ పార్టీ క్షీణించిపోతుందని వైసిపి ఆశిస్తున్నది. భారతీయ జనతాపార్టీ ఆలోచనా విధానంలో కూడా ఈ అంశానికి ప్రాధాన్యం ఉన్నది. క్షీణించిపోతూ ఉన్న తెలుగుదేశం అట్లాగే అణగారిపోవడమే తమకు మంచిదని అనుకుంటూ ఉండవచ్చు. ఇటువంటి ఆలోచనలను నారా లోకేశ్ నాయకత్వ స్థిరీకరణ పూర్వపక్షం చేస్తుంది. కలసి నడవడం విషయంలో ఇంకా ఊగిసలాటలో ఉన్న పవన్ కళ్యాణ్‌కు ఒక స్పష్టత ఇస్తుంది.
పవన్ కళ్యాణ్ కూడా తన రాజకీయ ప్రతిష్ఠకు మరమ్మత్తులు చేసుకోవడం అవసరం. యాత్రలకు ప్రభుత్వ అవరోధాలను ఆయన కూడా ఎదుర్కొన్నారు. అటువంటి నిర్బంధం ప్రభుత్వ బలహీనతకే నిదర్శనం. ఆంధ్రప్రదేశ్‌లో ఎంతో అవసరం ఉన్న సమయంలో ఆయన తెలంగాణలో ఎందుకు పర్యటిస్తున్నారో, ఆయన ఎంచుకున్న ఆహార్యం ఏమిటో అర్థం కావడం లేదు. సీరియస్ రాజకీయనేతగా, నిరంతరం ప్రజాసమస్యలపై స్పందించగల ఫుల్ టైమ్ నాయకుడిగా, నిలకడైన విధానాలున్న వ్యక్తిగా ఆయనను చూడాలని ఆంధ్రప్రదేశ్‌లోని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఆయన పాదయాత్రల వంటివి చేపట్టడం కష్టమేమో కానీ, ఏవో దిద్దుబాటు చర్యలు అయితే తీసుకోవాలి. తాము నోటికొచ్చినట్టు దూషించే, తేలికగా తీసిపారేసే నాయకులు జనం దగ్గరికి వెడితేనే ప్రభుత్వ పెద్దలు గజగజలాడుతున్నారంటే, ప్రతిపక్షానికి ఆంధ్రప్రదేశ్‌లో ఎంత సానుకూల పరిస్థితి ఉన్నదో తెలుస్తుంది. దీన్ని సద్వినియోగం చేసుకోకపోతే, తమలోని లోపాలను దిద్దుకుని ప్రత్యామ్నయంగా నిలవలేకపోతే, అది స్వయంకృతాపరాధమే అవుతుంది.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జనజీవనం ఇంతగా సంక్షుభితం కావడానికి నూటికి తొంభై శాతం జగన్ పరిపాలనే కారణమనుకున్నా, తక్కిన పదిశాతం కారణం ఆ ప్రభుత్వానికి కొండంత అండగా ఉన్న కేంద్ర ప్రభుత్వం అన్న అభిప్రాయం జనంలో విస్తృతంగా ఉన్నది. ప్రత్యేక హోదా విషయంలో జరిగిన అన్యాయం కూడా ప్రజల మనస్సులోనుంచి పోలేదు. ఏ రాజకీయ పార్టీ కూడా కేంద్రాన్ని పల్లెత్తు మాట అనలేని విచిత్ర పరిస్థితి అక్కడ నెలకొని ఉన్నది. రాజధాని సమస్య దగ్గర నుంచి అనేక అంశాలలో స్పష్టమైన వైఖరి తీసుకోగలిగే స్థితిలో ప్రతిపక్షాలే కాదు, ప్రజాసంఘాలు కూడా లేవు. వామపక్షాలు సరేసరి. పౌరసమాజం అత్యంత బలహీనంగా ఉన్నది. విభజనానంతరం ఆంధ్రప్రదేశ్ అనేక విధాలుగా దయనీయస్థితిలో ఉన్నదన్న వేదన సర్వత్రా వ్యక్తమవుతున్నది. ఈ పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని ఉద్ధరించి, కాసిని స్వేచ్ఛలను అనుమతించి, అసభ్య దుర్భాషల నుంచి రాజకీయ సంవాదాన్ని విముక్తి చేసి, రాష్ట్రప్రజల సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రణాళికాబద్ధంగా పాటుపడతామన్న ఒక చిన్న వాగ్దానం కోసం ఓటర్లు ఎదురుచూస్తున్నారు. అది దొరకనప్పుడు, విదిలింపులతోనో చదివింపులతోనో మాత్రమే సంతృప్తి పడకతప్పని పరిస్థితి ప్రజలది!
కె. శ్రీనివాస్
Updated Date - 2023-03-06T09:02:22+05:30 IST