బొంత పురుగు: ఒక వింతసిద్ధాంతం!
ABN, First Publish Date - 2023-05-11T01:48:10+05:30
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో, మందకృష్ణ మాదిగ బీజేపీ వేదికల మీద కనిపించడం చాలా మందికి మింగుడు పడలేదు. కొందరు ఆశ్చర్యపోయారు, కొందరు ఆగ్రహం ప్రకటించారు, కొందరు నిరాశపడ్డారు...
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో, మందకృష్ణ మాదిగ బీజేపీ వేదికల మీద కనిపించడం చాలా మందికి మింగుడు పడలేదు. కొందరు ఆశ్చర్యపోయారు, కొందరు ఆగ్రహం ప్రకటించారు, కొందరు నిరాశపడ్డారు. వీరిలో ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు కూడా లేకపోలేదు. రకరకాల కారణాలతో మందకృష్ణను వ్యతిరేకించేవారు ఇదే అదనుగా సామాజిక మాధ్యమాలలో విమర్శలు గుప్పించారు. మందకృష్ణ సంస్థలలోని గట్టి విధేయులు, అనుచరులు అందుకు దీటైన ప్రతివాదనలను కూడా ప్రయోగించారు. వాటిలో ముఖ్యమైనది కేసీఆర్ సుప్రసిద్ధ ‘బొంతపురుగు సిద్ధాంతం’.
తెలంగాణ అనే ఆశయసాధన కోసం బొంతపురుగునైనా ముద్దు పెట్టుకుంటానని ఉద్యమకాలంలో కేసీఆర్ పదే పదే అనేవారు. దానికి తోడు కుష్ఠురోగినైనా కౌగిలించుకుంటాను అని కూడా అనేవారు కానీ, అదేమంత సంస్కారయుతమైన వ్యక్తీకరణ కాకపోవడంతో అది ఈ సిద్ధాంతంలో భాగం కాలేకపోయింది.
బొంతపురుగు అలియాస్ గొంగళిపురుగు నిత్యజీవితంలో అందరికీ తారసపడేదే. అదంటే పిల్లలకు బాగా కుతూహలం. చూడడానికి వికారంగా ఉండడమే కాదు, గొంగళిపురుగు ఒంటి మీద పాకితే దద్దుర్లు వస్తాయి. జీవశాస్త్రం పుస్తకాలలో క్రిమికీటకాల దశలను నేర్చుకోవడానికి అది ఒక పాఠం మాత్రమే తప్ప, దానికో సిద్ధాంతస్థాయి ఉన్నదని కేసీఆర్ ఉపయోగించేవరకు తెలియదు.
ఉద్యమాలు, పోరాటాల ద్వారా కంటె, లాబీయింగ్ ద్వారా కావలసిన పనిని సాధించుకోవడం మీదనే కేసీఆర్‌కు, కనీసం తెలంగాణ ప్రయాణపు తొలిసంవత్సరాలలో, ఎక్కువ గురి ఉండేది. రాజకీయ ఎత్తుగడలలో భాగంగా చాలా విన్యాసాలు చేయవలసి వచ్చేది. తొలి అడుగులలోనే భౌగోళిక తెలంగాణ అన్న స్పష్టత ఇచ్చేశారు కాబట్టి, దాన్ని సాధించుకునే క్రమంలో మరే ఇతర సైద్ధాంతిక ఝంఝాటానికి తావు లేకుండా ఉండడానికి కేసీఆర్ బొంతపురుగు సిద్ధాంతాన్ని ఒక ఆయుధంగా రూపొందించారు. లక్ష్యం మీద తప్ప పక్కనున్న కొమ్మరెమ్మలను కూడా చూడని అర్జునుడి వలె, ఆయన ప్రత్యేక తెలంగాణ అనే దాని మీద గురిపెట్టి, ఇతర పరిగణనలన్నిటినీ తోసిపుచ్చారు. ఫలితంగా, ఉద్యమకాలంలో, కమ్యూనిస్టు విప్లవ సంస్థల దగ్గర నుంచి బీజేపీ, జమాతే ఇస్లామీ దాకా సమస్త వేదికల నుంచి మద్దతును తీసుకోవడానికి ఏ ఆటంకమూ లేకపోయింది. ఒకసారి కాంగ్రెస్‌తో మరొకసారి టీడీపీతో ఎన్నికల పొత్తులు పెట్టుకోగలిగారు. 2009లో కేంద్రంలో బీజేపీ గెలుస్తుందనుకుని అత్యుత్సాహంతో ముందే స్నేహహస్తం చాచారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌లో పార్టీని విలీనం చేస్తానన్నారు, తెలంగాణ వస్తే దళితుడినే ముఖ్యమంత్రిని చేస్తానన్నారు. రాష్ట్రసాధన కోసం ఏం చేసినా, ఏం మాట్లాడినా బొంతపురుగువాదం ద్వారా ‘‘బారా ఖూన్ మాఫ్’’.
ప్రధానలక్ష్యాన్ని చేరుకోవడానికి అప్రధాన కర్తవ్యాలను పక్కనపెట్టడం మునుపటి నుంచి ఉన్నదే. కానీ, తాత్కాలిక ఎత్తుగడలు శాశ్వత లక్ష్యానికి, రాజకీయాల స్వభావానికి వ్యతిరేకమైనవైనపుడే దిగ్భ్రాంతులు కలుగుతాయి. అటువంటి రిస్కులు తీసుకోవడానికి ఆధునిక రాజకీయవాదులు సిద్ధపడుతున్నారు. కార్యసాధన పేరుతో ఉదారంగా మద్దతులు ఇస్తున్నారు. తప్పుకదా అని అడిగినవారికి ఆపద్ధర్మ, వ్యూహాత్మక ప్రయోజనాలని చెబుతున్నారు. రాజ్యాధికారం కోసం ఎవరితోనైనా కలసి పనిచేస్తామని, తమకు అస్పృశ్య రాజకీయపార్టీలేవీ లేవని బహుజన సమాజ్ పార్టీ 90లలో ప్రకటించి, బీజేపీ భాగస్వామ్యంతో ఉత్తరప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చినప్పుడు చాలా ఆశ్చర్యాలు వ్యక్తమయ్యాయి. దళితులకు, బహుజనులకు సంబంధించి కాంగ్రెస్, బీజేపీ, మరో సవర్ణ పార్టీ ఏదైనా ఒకటేనని, ఒకరిని ఓడించి మరొకరిని గెలిపించడానికి తామెందుకు పనిచేయాలని, తమ బలాన్ని పెంచుకోవడానికి ఏది ముఖ్యమో ఆ మార్గం అనుసరిస్తామని కాన్షీరామ్ కుండబద్దలు కొట్టారు. రాజకీయ నైతికత పునాదులనే కుదిపివేసిన వాదన అది. కాన్షీరామ్ వాదనలో న్యాయముంది. బహుజన రాజకీయాల ప్రత్యామ్నాయ నైతికతను నిర్మించే క్రమంలో భాగంగా ఆయన ఆ చర్చ చేశారు తప్ప, ఏ విచక్షణా లేని కూటములే సరైనవని ఆయన చెప్పలేదు.
బహుజనవాదం ఒక్కటే కాదు, అస్తిత్వవాదాలుగా గత మూడు దశాబ్దాలుగా ముందుకు వచ్చిన అన్నిటిలోను, తమ సొంత లక్ష్యసాధనకు ఏమి చేసినా సరైనదేనన్న ధోరణి పెరిగింది. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజల ప్రయోజనాల కోసం తక్కిన సమాజప్రయోజనాలను, దీర్ఘకాలిక లాభనష్టాలను పరిగణనలోకి తీసుకోనవసరం లేదన్న వాదనా ముందుకు వచ్చింది. తక్కిన సమాజం తమ గురించి పట్టించుకోనప్పుడు పరస్పరత ఎందుకు చూపించాలన్న ప్రశ్నను కొట్టివేయలేము. అయితే, ఈ విచక్షణ, వాదన నిజంగానే తమ ప్రజాశ్రేణులకు లబ్ధి చేకూర్చడానికే ముందుకు వస్తున్నాయా లేక, నిలకడ లోపించిన నిర్ణయాలకు తేలికపాటి సమర్థనలుగా పరిణమించాయా? ఆరంభదశలో, ఆయా రాజకీయాదర్శాలు బలంగా ఉన్న ఉద్యమదశలో సరే, కానీ, తరువాత కాలంలో, ఎన్నికల రాజకీయాల సంస్కృతి క్రమంగా ఉద్యమసంస్కృతిని కబళించే దశకు చేరుకున్నాక, ఈ ధోరణి తరచు అవకాశవాదంగా కూడా మారుతూ వచ్చింది. ఏది ఏదో తేల్చుకోవడం కష్టంగా మారిపోయింది. బొంతపురుగును ముద్దుపెట్టుకోవడంలో తక్షణమో లేక దీర్ఘకాలికమో ఏదో ఒక ప్రయోజనం ఉన్నదని తమ వెంట ఉన్న ప్రజల ముందు నిరూపించుకోవలసిన బాధ్యత కూడా లేకుండా పోయింది.
ప్రధానమైన లక్ష్యం కోసం అప్రధానమైన అంశాలలో రాజీపడే వైఖరి మీద జాతీయోద్యమం కాలం నుంచి చర్చ జరుగుతున్నది. 1885లో కాంగ్రెస్ స్థాపితమయిన తరువాత సుమారు పాతికేళ్ల పాటు, తొలితరం కాంగ్రెస్ వాదులు మొదట సాంఘిక సంస్కరణ, ఆ తరువాతే రాజకీయ డిమాండ్లు అన్న వైఖరితో కొనసాగారు. సంస్కర్తలు అనేకులు బ్రిటిష్ బొంతపురుగును గాఢంగా ప్రేమించారు. గాంధీ రంగప్రవేశం చేసిన తరువాత కానీ నికరమైన బహిరంగ రాజకీయ కార్యాచరణ, ప్రజాభాగస్వామ్యం పెరగలేదు. ఉధృత జాతీయోద్యమంలోనూ కొన్ని స్రవంతులు కాంగ్రెస్‌తో కాక, విడిగా ఉండడానికి, ఒక్కొక్కసారి బ్రిటిష్ ప్రభుత్వంతో సన్నిహితంగా మెలగడానికి వెనుకాడలేదు. గమ్యం ఎంత ముఖ్యమో మార్గమూ అంత ముఖ్యమని గాంధీ పదే పదే అనేవారు కానీ, మిలిటెంట్ ఉద్యమాలను నైతికంగా ఎదుర్కొనడానికే ఆ వాదం అధికంగా ఉపయోగపడింది. లక్ష్యసాధనకు అనుసరించే మార్గాలు కూడా పవిత్రంగా ఉండాలన్న విలువను గాంధీ కూడా అన్నివేళలా పాటించారని చెప్పలేము.
బ్రిటిష్ వారిని తరమాలంటే, జపాన్‌తోను, జర్మనీతోనూ చేయి కలపాలని నేతాజీ అనుకున్నారంటే, స్వాతంత్ర్య సాధన అన్న మహా లక్ష్యం కోసం బొంతపురుగే కాదు, పెనుభూతం పంచన చేరడంకూడా ఆయనకు సబబే అనిపించిందన్న మాట. తన దేశాన్ని యుద్ధ ప్రమాదం నుంచి రక్షించుకోవడానికి మొదట సోవియట్ యూనియన్ జర్మనీతో ఒప్పందానికి దిగింది. ఆ మేరకు స్టాలిన్‌ది జాతీయ అవకాశవాదమే. ప్రపంచం ఏమైపోయినా పరవాలేదు, తన దేశాన్ని రక్షించుకోవాలనుకున్న బొంతపురుగు వాదమే. అయితే, ఆ దేశమే ఆ తరువాత ప్రపంచానికి ఫాసిస్టు పీడ లేకుండా చేయడానికి తన శక్తికి మించిన త్యాగం చేసింది. జర్మనీని ఓడించే ఏకైక లక్ష్యం కోసం అమెరికా, బ్రిటన్ కమ్యూనిస్టు రష్యా బొంతపురుగుతో కలవాల్సి వచ్చింది. ఈ ఉదాహరణలన్నీ ఆపద్ధర్మ మైత్రి సందర్భాలను, పెద్ద లక్ష్యం కోసం చిన్న విధానాల విషయంలో రాజీలను సూచిస్తాయి. అనివార్యమైన, న్యాయమైన రాజీలేవో అనంతర చరిత్ర బేరీజు వేస్తుంది.
ఇంతకీ కేసీఆర్ కానీ, మరొకరు కానీ చెబుతున్న బొంతపురుగులు ఎవరు? సాధారణంగా అయితే, ఎవరితో అయితే ఏ వ్యవహారమూ చేయడానికి సాంఘిక, రాజకీయ నైతికత అనుమతించదో వారే బొంతపురుగులు. భారత అధికార రాజకీయాలలో ఆరంభదశలో కాంగ్రెస్ ఒక వైపునా, రకరకాల ప్రతిపక్షాలు చెల్లాచెదురుగానూ ఉండేవి. తరువాతి దశలో స్థూలంగా వామపక్షాలూ, మధ్యేవాదులూ ఒక వైపునా, మిత మతవాదులు మరో వైపునా అన్నట్టుగా అమరికలు మారిపోయాయి. రెండు దశల మధ్యలో సంధిదశ మరొకటి ఉన్నది. అది కాంగ్రెస్ వ్యతిరేక సకలపక్ష సమ్మేళన ప్రయత్నం. జనతా ప్రయోగం సందర్భంగా పాత జనసంఘం వారిని కొత్త జనతాపార్టీలో భాగస్వాములు చేసుకోవడంలో సమస్యలు వచ్చాయి. ఆర్ఎస్ఎస్ సభ్యత్వాలు వదులుకుంటేనే కలిసిపోతామని ఇతర పార్టీలు అన్నాయి. అప్పుడు ఇందిరను, అత్యవసర పరిస్థితిని ఓడించడం తక్షణ అవసరం. చివరకు ఏ అవగాహన కుదిరిందో అంతా కలసిపోయారు. ప్రభుత్వ నిర్వహణలో ద్వంద్వ సభ్యత్వ సమస్య మళ్లీ బయటకు వచ్చింది. అదే అంశం మీద ప్రభుత్వం కూలిపోయింది. అప్పుడు బొంతపురుగుగా ఉన్న ఆర్ఎస్ఎస్‌తో ఆపద్ధర్మ స్నేహం తరువాత విరిగిపోయింది. మరో పదేళ్లకు 1989లో బీజేపీ బొంతపురుగు పరిగణన ఉన్నప్పటికీ, కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడడం ప్రధానమైపోయింది. వామపక్షాలు ఒకవైపున, బీజేపీ మరోవైపున కాపు కాసి, నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పరిచాయి. సాంకేతికంగా మాత్రం బొంతపురుగుతో ముద్దులాట జరగలేదు. ఇక ఆ తరువాత, రథయాత్ర, బాబ్రీ మసీదు ధ్వంసం జరిగిపోయి, బీజేపీకి పూర్తిస్థాయి బొంతపురుగు హోదా వచ్చింది. జాతీయపార్టీలకు, వామపక్షాలకు మాత్రమే నియమం మిగిలింది. ప్రాంతీయపార్టీలు వంతులవారీగా బీజేపీతో చెలిమి చేస్తూ వచ్చాయి. డిఎంకె మొదటిసారిగా ఎన్‌డిఎ ప్రభుత్వంలో చేరినప్పుడు అభిమానుల నుంచి, పార్టీ శ్రేణుల నుంచి కూడా విమర్శలు వచ్చాయి. మనుగడ కోసం తప్పలేదని కరుణానిధి సంజాయిషీలు ఇచ్చుకోవలసివచ్చింది.
మరి బీజేపీ దృష్టిలో మాత్రం బొంత పురుగులు ఉండరా? 2014 తరువాత వివిధ రాష్ట్రాల్లో ఇతర పార్టీలలో నుంచి అవినీతిపరులైన కొందరు ఎంపీలను తమ వైపు తిప్పుకున్నందుకు, బీజేపీ అభిమానులు ఒక సమర్థన రూపొందించి సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేస్తున్నారు. ‘ఆర్టికల్ 370 వంటి కీలకమైన, దేశభక్తియుతమైన చర్యలు చేపట్టడానికి పార్లమెంటులో, ముఖ్యంగా రాజ్యసభలో ఎంత ఎక్కువ బలం ఉంటే అంతమంచిది. అందుకోసం అటువంటి ఎంపీలను చేర్చుకున్నాం’.. అన్నది ఆ వాదన సారాంశం. దేశం కోసం, ధర్మం కోసం బొంతపురుగును ముద్దుపెట్టుకుంటే తప్పేమిటి? జగన్మోహన్‌రెడ్డి మీద ఈడీని ప్రయోగించకుండా కాపాడుతున్నారేమిటి అని బీజేపీ పెద్దలను అడిగామనుకోండి, వాళ్లేమి చెబుతారు? ముందు చంద్రబాబును రాజకీయంగా ఫినిష్ చేయాలి, ఆ తరువాత జగన్‌ను చేస్తాం, ఈ లోగా, ఆయన్ని మోయక తప్పదు! ఈ సమీకరణంలో బొంతపురుగు ఎవరో తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు.
బొంతపురుగు సిద్ధాంతాన్ని కేసీఆర్ కనిపెట్టారని చెప్పుకుంటున్నాము కానీ, ఇది మన పురాణాలలో ఎప్పుడో ఉన్నది. వసుదేవుడంతటి వాడు గాడిద కాళ్లు పట్టుకున్నాడన్న వాడుక ఉన్నదే కదా? జైలు నుంచి లార్డ్ క్రిష్ణాను తప్పించే పనిలో ఉన్నప్పుడు, గాడిద అరవకుండా ఆపడమే ముఖ్యం.
పురాణాలు ఒక్కటే మన జ్ఞానానికి సరిపోవు కదా, సైన్సు కూడా కావాలి! నేటి గొంగళిపురుగులే రేపటి సీతాకోకచిలుకలు అన్న గ్రహింపు కూడా రాజకీయాలలో అవసరం!
కె. శ్రీనివాస్
Updated Date - 2023-05-11T01:48:10+05:30 IST