ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అలజడి సుడిలో అల్లాడిన ‘యుద్ధనౌక’

ABN, First Publish Date - 2023-08-10T03:36:37+05:30

కాంగ్రెస్ ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమని గద్దర్‌కు నమ్మకం కుదిరింది అని అన్నారు ఒక కాంగ్రెస్ పెద్ద నాయకుడు గొప్పగా. గద్దర్ కాంగ్రెస్‌కు చేరువయ్యారు అన్నది ఒక విప్లవ ప్రజాసంస్థ నిర్లిప్తంగా, విమర్శగా....

కాంగ్రెస్ ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమని గద్దర్‌కు నమ్మకం కుదిరింది అని అన్నారు ఒక కాంగ్రెస్ పెద్ద నాయకుడు గొప్పగా.

గద్దర్ కాంగ్రెస్‌కు చేరువయ్యారు అన్నది ఒక విప్లవ ప్రజాసంస్థ నిర్లిప్తంగా, విమర్శగా.

తెలంగాణలో అధికారాన్ని సాధించడానికి గట్టి శ్రమ చేయాలనుకుంటున్న కాంగ్రెస్‌కు, తాను గద్దర్‌కు చివరి ఆశ్రయంగా చెప్పుకోవడం ఒక అదనపు అస్త్రం. గద్దర్ జీవిత సాఫల్యాన్ని, సార్థకతనీ బేషరతుగా స్మరించుకోవడానికి విప్లవాభిమానులకు ఆయన ఆఖరి సంవత్సరాల ‘అన్వేషణ’ ఒక అవరోధం.

గద్దర్ కాంగ్రెస్ వైపు మొగ్గుతూ వచ్చారని ఎవరైనా అనుకోవడంలో అసహజం ఏమీ లేదు. అందుకు కొన్ని ఆధారాలను గద్దర్ అందించారు కూడా. కానీ, నిర్ధారణలకు అవి సరిపోవు. ఆయన చివరి సందేశం చూస్తే, మరణానంతర ఊహతో తను లేని లోటువల్ల సమాజానికి కలిగే కష్టానికి తనే బాధపడుతూ రాసిన గీతం వింటే, గద్దర్‌ను అర్థం చేసుకోవడానికి తెలుగు సమాజం మరి కొంత సహనం, నిగ్రహం చూపవలసి ఉన్నదని అనిపిస్తుంది. పదేళ్ల నుంచి తన కాళ్ల కింద దృఢమైన నేల కోసం గద్దర్ వెదుకుతూనే ఉన్నాడు, సంశయ లోలకంతో గుండెను బాదుకుంటూనే ఉన్నాడు.

తన అడుగులు తడబడుతుండగానే, అటూఇటూ తచ్చాడుతుండగానే గద్దర్ ఆకస్మికంగా కన్నుమూశారు. ఆయన భౌతిక దేహాన్ని జనం సందర్శించడానికి ఏర్పాట్లు చేయడం దగ్గర నుంచి అంత్యక్రియల దాకా తెలంగాణలోని రెండు ప్రధాన రాజకీయపార్టీలు పోటీపడ్డాయి. మొత్తం కార్యక్రమం అంతా వారి చేతుల్లోకి వెళ్లిపోయింది. ముఖ్యమంత్రి సంతాపం, అధికార లాంఛనాల ప్రకటన, సందర్శన అన్నీ రాజకీయ ఒత్తిడుల ఫలితంగా అనివార్యమయ్యాయని తెలుస్తూనే ఉంది. కార్యక్రమంలో తమదే పైచేయి అనిపించుకోవడానికి కాంగ్రెస్ చూపిన చొరవ కూడా రాజకీయ ప్రయోజనం కోసమేనని వేరే చెప్పనక్కరలేదు. ఈ మొత్తం హడావుడిలో గద్దర్ అభిమానులకు, ఒకనాటి సహచరులకు, ఇప్పటి సన్నిహితులకు ప్రమేయం ఎంత? తన అంతిమయాత్ర ఇట్లా జరగాలని గద్దర్ కోరుకుని ఉంటారా?


ఆరేళ్ల కిందట ఇదే కాలమ్‌లో ఇక ‘ప్రజాస్వామ్య యుద్ధనౌక’ అన్న శీర్షికతో గద్దర్ కొత్త రాజకీయ ప్రయాణం గురించి రాశాను. అప్పుడప్పుడే ఆయన విప్లవ నిర్మాణ సంస్థలతో పూర్తిగా దూరమయ్యారు. గద్దర్ వంటి వ్యక్తులు సాధారణ రాజకీయాలలో చేయగలిగిన దోహదం గురించి, వేయగలిగిన తప్పటడుగుల గురించి, అలవరచుకోవలసిన వాస్తవిక దృష్టి గురించి ఆ వ్యాసంలో హెచ్చరికలు చేశాను. తనకేమీ భ్రమలు లేవని, కాళ్లు నేల మీదనే ఉన్నాయని గద్దర్ అప్పుడు చెప్పారు కూడా. మణిపూర్‌లో సాహస ఉద్యమకారిణి ఇరోం షర్మిలకు ఎన్ని ఓట్లు వచ్చాయో ఆయనే ఉదహరించారు. కొత్తదారిలో నడవాలనుకోవడమే కానీ, ఆయనకు పూర్తి స్పష్టత ఉన్నదని నాకు అనిపించలేదు. మిత్రసమ్మితంగా చెప్పే హితవులో కుండలు పూర్తిగా బద్దలు కొట్టలేము కాబట్టి, సూచన చేసి వదిలేశాను.

అప్పటి నుంచి ఇప్పటిదాకా, గద్దర్ తాను గందరగోళంలో ఉన్నారో, తన స్పష్టత తనకున్నదో తెలియదు కానీ, జనాన్ని మాత్రం అయోమయంలో పడేశారు. గుడులకు వెళ్లడం, పూజారులకు మొక్కడం, పీఠాధిపతులను కలవడం, బిజెపి, కాంగ్రెస్ నేతలను తరచు కలవడం, చంద్రబాబు కడుపులో తలపెట్టడం, రాహుల్ గాంధీకి ముద్దు పెట్టడం.. ఇట్లా ఒకటనేమిటి, ఆయన తీరు అభిమానులను తరచు కలతపరిచింది. ఆయా కలయికలకు, చర్యలకు ఆయన దగ్గర సమర్థనలు ఉండవచ్చును కానీ, వాటిని ప్రజలతో పంచుకుని ఒప్పుదల పొందే ప్రయత్నం కూడా ఆయన చేయలేదు. సొంత పార్టీ పెట్టాలనుకోవడం కానీ, కాంగ్రెస్‌తో కలసి నడవాలనుకోవడం కానీ నిర్ధారణ కాని విషయాలు.

గద్దర్ సుదీర్ఘ ప్రజాజీవితం నుంచి ఆయనను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, కాంగ్రెస్ వంటి పార్టీతో ఆయన కలసిపోతారని అనుకోలేము. తెలంగాణలోని పాలన మీద, పాలకపార్టీ స్వభావం మీద, నాయకుని మీద గద్దర్‌కు తీవ్రమైన వ్యతిరేక భావం ఉన్నది. అట్లాగే, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ విధానాల మీద కూడా ఆయనకు అదే స్థాయిలో , లేదా అంతకన్నా ఎక్కువ సైద్ధాంతిక విరోధం ఉన్నది. ఈ రెండు కారణాల రీత్యా, గత పదేళ్లుగా ఢిల్లీలోనూ ఇక్కడా ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ మీద గద్దర్‌కు సానుభూతి ఏర్పడి ఉండవచ్చు. దేశంలోని అనేకమంది ప్రజాస్వామిక వాదులకు వలెనే రాహుల్ గాంధీ ప్రస్తుత వ్యక్తిత్వం మీద అభిమానమూ కలిగి ఉండవచ్చు. మరేదైనా వ్యక్తిగత కారణంతో కాంగ్రెస్ నాయకులతో సాన్నిహిత్యం అవసరమై ఉండవచ్చు. తెలుగు సమాజంలో, మరీ ముఖ్యంగా తెలంగాణ సమాజంలో ఉన్న అభిమానాన్ని తన ప్రజాజీవితానికి ఉపయోగకరంగా ఎట్లా ఉపయోగించుకోవాలి అన్న అంశం మీద గద్దర్ వెదుకులాట ఆగలేదు. తన చుట్టూ ఉన్నవారు చేసే చర్చలు, సూచనలు అన్నీ ఆయన వింటారు కానీ, నిర్ణయం అంత సులభం కాదు.

సులభం కాకపోవడానికి కారణం, విప్లవ రాజకీయాలతో గద్దర్‌కు ఉన్న అనుబంధమే. అది సభ్యత్వాలకు, రాజీనామాలకు మాత్రమే సంబంధించినది కాదు. ‘వాళ్లు’ తనను ఎట్లా అంచనా వేస్తారోనన్న భయం ఆయనకు ఉండింది. బహిరంగ క్షేత్రంలో తాను చేయదలచిన ఆచరణ, విప్లవ పార్టీ వైఖరి సమన్వయించగలిగితే బాగుండనని ఆయన అనుకుని ఉండవచ్చు. అందుకనే, ఆ పార్టీ నుంచి దూరం జరుగుతున్నా, సిద్ధాంత చర్చలు కొనసాగిస్తూనే వచ్చారు. గద్దర్ స్థాయి వ్యక్తి ఏ ఉద్యమంలోనైనా గట్టి శక్తి. ఆయనకు తగ్గ కార్యక్రమం ‘వాళ్లు’ ఇవ్వలేకపోయారా, ‘వాళ్ల’ పరిధికి పొసగని ఆచరణ ఈయన కోరుకున్నారా తెలియదు. మొత్తానికి తాను ‘అక్కడికే’ చెందినవాడినని, అట్లాగే తనను గుర్తించాలని ఆశించారు. కానీ, ఆశకూ వాస్తవానికీ మధ్య ‘అంతస్సంఘర్షణ’! మనిషంటే తప్పూ ఒప్పూ కదా, అన్వేషణా ఆరాటమూ కదా, అంతరాత్మ తో చేసే కుస్తీ కదా!

విప్లవ ప్రజా గాయకుడిగా గద్దర్‌కు సమకూరిన జనాదరణ సామాన్యమైనది కాదు. ఆయన చుట్టూ ఏర్పడిన కాంతివలయం, కేవలం ఆయన సొంత తేజస్సు కాదు. ప్రజా ఉద్యమాల ఉధృతిలోనుంచి ఆయన ప్రతిభ ప్రకాశించింది. అట్లాగని, గద్దర్ సొంత వ్యక్తిత్వమూ, ప్రతిభా లేవని కాదు. కీర్తి ప్రతిష్ఠల తర్కాన్ని అర్థం చేసుకోవడం సులభం కాదు. నేపథ్యాన్ని, క్షేత్రాన్ని వదిలిపెట్టిన తరువాత కూడా తేజస్సు అంతే ప్రకాశవంతంగా ఉండదు. తన ప్రతిభ, వ్యక్తిత్వాల కారణంగా తనతో పాటే మిగిలే జనాకర్షణ పెద్దదే, కానీ, ఆ కరెన్సీకి కన్వర్టబులిటీ ఉండదు.

ఎందుకంటే, గద్దర్‌కు అయినా, ఆయన కోవలోని ఉద్యమకారులెవరికైనా ఆ తేజస్సు వారి నైతిక బలం నుంచే వస్తుంది. ఆ నైతిక బలమే, గద్దర్ అనే వ్యక్తిని అంతిమ సంస్కారాల దాకా, గౌరవనీయ శక్తిగా నిలబెట్టింది. కానీ, ఆ వ్యక్తిగత తేజస్సు ఒక ఎమ్మెల్యే కావడానికి, ఎంపీ కావడానికీ చెల్లుబాటు కాదు. కానీ, వంద మంది ఎమ్మెల్యేలను కూడా నైతికంగా శాసించగలుగుతుంది. ఈ తేడాను గద్దర్ పరిగణనలోకి తీసుకున్నారా?


అన్ని విధాలుగా సరిపోయే పోలిక కాదు కానీ, ఇక్కడ కోదండరామ్‌ను ప్రస్తావిస్తాను. తెలంగాణ పల్లె పల్లెనా, ప్రతి మనిషి చేతా గౌరవం పొందే వ్యక్తి కోదండరామ్. కెసిఆర్‌కు ఆకర్షణ ఉండవచ్చును కానీ, కోదండరామ్‌కు ఉన్నంత గౌరవం రాదు. ఆ గౌరవం ఆయన నైతిక బలం నుంచి సమకూరింది. దాన్ని ఎన్నికల రాజకీయాలలో బదలాయింపు చేసుకోలేము. కోదండరామ్ తెలంగాణ ఉద్యమకారుడిగా కొనసాగితే, సమాజాన్ని మొత్తంగా ప్రభావితం చేయగలరు, ఆ ప్రభావశీలత నుంచి ప్రభుత్వ విధానాలలో ప్రజాజోక్యాన్ని పెంచగలరు. కానీ, ఆయన చుట్టూ ఉన్నవారు వినలేదు. పార్టీ పెట్టారు. పర్యవసానాలు చూశాము. ఇప్పుడు, తెలంగాణ సమాజాన్ని ఆరోగ్యకరమైన దిశలో నడిపించగలిగే, అందరికీ ఆమోదనీయమైన వ్యక్తి కోసం ఉద్యమసమాజం వెదుకవలసి వస్తున్నది. బాబా సాహెబ్ అంబేడ్కర్ ఎన్నిరంగాలలో గెలిచాడో మనకు తెలుసు. కానీ, ఎన్నికలలో ఓడిపోయారని కూడా తెలుసు. ఎన్నికలలో పోటీచేస్తే, గాంధీజీ అయినా ఎన్నికల రంగంలో నెగ్గగలిగేవాడని చెప్పలేము.

ఎన్నికలను బహిష్కరించే, మిలిటెంట్ రాజకీయాలనుంచి విరమించుకునే హక్కు గద్దర్‌కు ఉన్నది. ఆ తరహా ఆచరణ నుంచి తప్పుకుని కూడా, అవే లక్ష్యాల కోసం పనిచేసే హక్కు కూడా ఆయనకు ఉన్నది. ఆ వైరుధ్యాన్ని పరిష్కరించుకోవడానికి ఆయనకు తగిన సహాయం దొరికితే బాగుండేది. ఇప్పటి కాలంలో ప్రజాస్వామ్యాన్ని నమ్మి, దాన్ని ఉనికిలో పెట్టడానికి వ్యవస్థ మీద ఒత్తిడి తేవడం కూడా, ప్రజలకు తక్షణమూ దీర్ఘకాలికమూ అయిన ప్రయోజనాలను ఇస్తుంది. ప్రజాస్వామ్యాన్ని రాడికల్‌గా ఆచరించి, ఆచరింపజేయడం చిన్నపనీ, ప్రమాదరహితమైన పనీ కాదు. అత్యవసరమైన పని. బహిరంగ ప్రజాక్షేత్రంలో, ప్రజాస్వామ్యాన్ని దృఢపరిచే, అమలుచేయించే కార్యాచరణ ఎంచుకుని ఉంటే, గద్దర్ నైతిక శక్తి రాజకీయాలపై ప్రభావం వేయగలిగేది. మతతత్వ ప్రమాదం ఫాసిజం స్థాయికి చేరుకున్నదని, దాన్ని నిరోధించడానికి సువిశాల ప్రజా ఉద్యమం అవసరమని రకరకాల కమ్యూనిస్టులు, విప్లవ శ్రేణులు భావిస్తున్న సమయంలో గద్దర్, అటువంటి ఉద్యమానికి సాంస్కృతిక నాయకత్వం అందించగలిగి ఉండేవారు.

అస్తిత్వ ఉద్యమాలు చెప్పే సాధికారత తరచు తప్పుడు చైతన్యం కలిగించడం చూస్తున్నాము. పదవులు మాత్రమే కావు, ఉద్యమాలు కూడా సాధికారతను ఇస్తాయి. గద్దర్ సాధికారతా భ్రమల్లో పడ్డారని చెప్పలేము కానీ, తనకు తాను ప్రజారంగంలో పునరావాసం కల్పించుకోవడంలో తబ్బిబ్బుకు లోనయ్యారు. తనను కొత్త కక్ష్యలోకి ప్రవేశపెట్టుకోవడంలో తర్జన భర్జనలు పడ్డారు. తనను తాను సమాధానపరచుకోలేకపోయారు. ‘వాళ్ల’ నుంచి బయటకు రాగానే ఒంటరి అయ్యారు. లక్షలాది అభిమానులు మిగిలినా, అది సంస్థాబలానికి సమానం కాదు. బెంగుళూరు కేసు తనను బాధించింది. దాన్ని ఎదుర్కొనడానికి, దాని నుంచి ఊరట పొందడానికి తానొక్కడే ప్రయత్నాలు చేయవలసి వచ్చింది. రంగస్థలం మీద బెబ్బులిలా గర్జించిన కంఠం, కారడవులలో సైతం ప్రతిధ్వనించిన కంఠం, బేలగా ధ్వనించవలసి వచ్చింది.

ఆశయం కోసం ప్రాణమిచ్చిన వేలాది మందిని పాటలతో సజీవులను చేసిన గద్దర్‌ను, కోటి గొంతులు పెకిలించుకుని గన్ శాల్యూట్ చేయవలసిన వేళ, కొలతల తూనికల కొంచెపు తనంతో కించపరుస్తున్నామా? తప్పుకదా?

కె. శ్రీనివాస్

Updated Date - 2023-08-10T03:36:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising