పొరుగు విజయం చెబుతున్న పాఠాలు!
ABN, First Publish Date - 2023-05-18T00:53:56+05:30
ఎంతమృదు మధురంగా ఉన్నది ఈ కర్ణాటక సంగీతం! అంటూ పారవశ్యంతో ఫేస్‌బుక్ పోస్ట్ పెట్టాడు ఆధునిక, అభ్యుదయ, సాహిత్యసంస్కారం ఉన్న ఒక మిత్రుడు. పోయిన శనివారం నాడు...
ఎంతమృదు మధురంగా ఉన్నది ఈ కర్ణాటక సంగీతం! అంటూ పారవశ్యంతో ఫేస్‌బుక్ పోస్ట్ పెట్టాడు ఆధునిక, అభ్యుదయ, సాహిత్యసంస్కారం ఉన్న ఒక మిత్రుడు. పోయిన శనివారం నాడు కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నప్పుడు, భారతదేశం గుండెల మీద పుట్టగొడుగులా మొలిచిన ఏకఛత్రం చిల్లులు పడుతున్నప్పుడు, ఆయనకు ఆ ఆనందం కలిగింది. జీవితంలో కాంగ్రెస్‌ను ఏనాడూ ప్రేమించని వారు, ఏనాడూ ఎంచుకోని వారు, పాలక రాజకీయాలను ఇష్టపడనివారు, ఎన్నికలను గౌరవించనివారు ఆ రోజు కర్ణాటక ప్రజలు వినిపించిన మధుర సంగీతంలో ఊరట పొందారు, నిట్టూర్పు విడిచారు, ఆశలకు చిగుళ్లు తొడిగారు. గెలిచినవారెవరన్నది కాదు, ఓడిందెవరన్నదే వార్త అయింది. అజేయులు, అప్రతిహతులు అనుకున్నవారు, అసాధ్యులేమీ కాదు, ఓడించగలిగినవారే అని తెలిసినప్పుడు కలిగే విజయగర్వం ఏదో, దేశమంతటా కుంగుబాటులో ఉన్న అనేక జనవర్గాలలో వ్యాపించింది.
ఫలితాలు వస్తున్న సమయంలోనే రకరకాల వ్యాఖ్యానాలు రూపొందసాగాయి. తామే గెలిస్తే ఘనతను అంతా మోదీ ఖాతాలో వేసి ఉండే భారతీయ జనతాపార్టీ, అపజయ బాధ్యతను స్థానిక సమస్యలకు, నాయకత్వానికి ఆపాదించడం మొదలుపెట్టింది. తమ ఓటమి స్థానికం మాత్రమేనని, దేశమంతటికీ అది వ్యాపించదని చెబుతూ, ప్రభావానికి సరిహద్దులను నిర్ణయించింది. మరోవైపు, భారత జాతీయ కాంగ్రెస్, కర్ణాటక విజయాన్ని మొత్తంగా సోనియా, రాహుల్, ప్రియాంక కుటుంబం ఘనతగా చెప్పుకోవాలని అనుకున్నప్పటికీ, ప్రస్తుతం అది ఉన్న ప్రత్యేక పరిస్థితులలో రాష్ట్ర నాయకత్వానికి, కార్యకర్తలకు కూడా భాగం పంచింది. కర్ణాటకలో ఓటింగ్ సరళి దేశవ్యాప్తం అవుతుందని చెప్పుకోవడం కాంగ్రెస్‌కు రేపటి అవసరం. వాస్తవానికి, ఓటమిలో మోదీ పాత్రా ఉన్నది, గెలుపులో రాహుల్ పాత్రా ఉన్నది. బొమ్మై బృందం బాధ్యతా ఉన్నది, సిద్ధరామయ్య-, శివకుమార్ల ఘనతా ఉన్నది. మతతత్వాన్ని రాజకీయ ఉధృతిలో భాగం చేయడానికి అనేక అనుబంధ, ఆకతాయి సంస్థలు పనిచేసినట్టే, ప్రజలలో సామరస్యాన్ని, ఐక్యభావాన్ని రాజకీయ ఎంపికలో మిళితం చేయడానికి వందలాది పౌర, ప్రజా, స్వచ్ఛంద సంస్థలు శ్రమించాయి. మతజాతీయత, స్థానిక భావనలపై ఉత్తరాది ఆధిక్యం ఈ రెండూ ఈ ఎన్నికలలో ఓడిపోయాయి. ప్రజల తీర్పులో కనిపించే స్పష్టమైన సంకేతాలు అవి.
ఈ ఏడాది చివర్లో జరిగే అనేక రాష్ట్ర అసెంబ్లీల ఎన్నికలను, వచ్చే ఏడాది జరిగే సార్వత్రక ఎన్నికలను ఎదుర్కొనవలసిన ప్రతిపక్షాలకు కర్ణాటక ఫలితాలు మనోబలాన్ని ఇస్తున్న మాట నిజమే కానీ, అదొక్కటే సరిపోదు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప్రత్యేక వ్యూహం రూపొందించుకోవాలి, అన్ని చోట్లా కఠోర పరిశ్రమ కావాలి. జాతీయ ఎన్నికల కోసం ఒక కలసికట్టు మంత్రాంగం కావాలి. ఒక రాష్ట్రంలో గెలిచాను కదా, డిసెంబర్‌లో జరిగే ఎన్నికలలో ఒకటో రెండో గెలుచుకోగలను కదా అన్న ధీమాతో, తన నాయకత్వాన్ని అందరిమీదా విధించే అత్యుత్సాహాన్ని కాంగ్రెస్ మానుకోవాలి. ప్రతిపక్షాలలో ఒక ఐక్యత వస్తే, ప్రజలు ప్రత్యామ్నాయాన్నే ఎంచుకుంటే, అంతిమంగా ఆ సమీకరణంలో కాంగ్రెసే పెద్ద పార్టీ అవుతుంది. అలాగే, అనేక ప్రాంతీయ పార్టీలు కూడా తొమ్మిదేండ్లలో తమ స్వానుభవం నుంచి తమకు ఏది దీర్ఘకాలికంగా ప్రయోజనకరమో గుర్తించి, ప్రస్తుతం లభించిన ధైర్యం నుంచి నిర్ణయం తీసుకోవాలి.
మరి బిజెపి మాత్రం కర్ణాటక నుంచి పాఠం తీసుకోదా? తీసుకుంటుంది. మున్ముందు నష్టాలను తగ్గించుకోవడానికి వీలుగా ప్రయాణమార్గాన్ని మార్చుకోదా? వారి దగ్గర అపర చాణక్యుడు ఉన్నాడు కాబట్టి మార్చుకోవచ్చు. అయితే, తిరుగులేని అధికారం చెలాయిస్తున్న క్రమంలో, ఏలికలు క్షేత్రస్థాయి వాస్తవికతకు దూరం అవుతారు. వాస్తవ అంచనాలు విశ్వసించకుండా అహంకారంతోనే ముందుకు పోతారు. ఈ తొమ్మిదేండ్ల అప్రతిహత జైత్రయాత్రలో బిజెపిలో కూడా ఆ అవలక్షణాలు ఏర్పడే ఉంటాయి. కర్ణాటక ఫలితాల తరువాత తెలంగాణ బిజెపి తన వైఖరి మార్చుకోవాలనే డిమాండ్ లోపలినుంచే వస్తున్నదని, ముస్లిమ్ వ్యతిరేకతను వీడి ప్రజాసమస్యలు, దుష్పరిపాలన వంటి అంశాల మీద రాజకీయ పోరాటం చేయాలని ఇతర పార్టీల నుంచి వచ్చి చేరినవారు కోరుతున్నట్టుగా మీడియా కథనాలు వస్తున్నాయి. ఏ దారిలో వెడితే తమకు ప్రయోజనకరమో బిజెపి ఆచరణాత్మక దృష్టితో తేల్చుకుంటే వారికే మంచిది.
2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కూడా టిఆర్ఎస్‌కు కాంగ్రెసే ప్రధాన ప్రత్యర్థి. ఈ అయిదేండ్ల కాలంలో అనేక కారణాల వల్ల భారతీయ జనతాపార్టీ ప్రాబల్యం పెరిగింది. తమ శక్తికి మించిన ధ్వని కూడా ఆ పార్టీ కార్యక్రమాలు సృష్టించాయి. రాష్ట్ర కాంగ్రెస్‌లోని కలహాలు నాయకత్వానికి ఊపిరాడనివ్వడం లేదు, ప్రభుత్వం మీద నిలకడైన పోరాటానికీ ఆస్కారం ఇవ్వడం లేదు. ఈ గందరగోళంలో కర్ణాటక ఫలితాలు కాంగ్రెస్‌కు ఒక కొత్త ఆశను, బలాన్ని అందించాయి. పొరుగురాష్ట్రం కాబట్టి, పాత హైదరాబాద్ రాజ్య కర్ణాటకలో కాంగ్రెస్ అనుకూల ఫలితాలు వచ్చాయి కాబట్టి, తెలంగాణలో కూడా అదే ధోరణి ఉంటుందని చెప్పుకోవడం విశ్వాసకల్పనకు అవసరమే కావచ్చు కానీ, విజయం అంత అవలీలగా వచ్చేది కాదు. ఏదో గాలివాటుగానో, జనాకర్షణ ప్రభంజనంలోనో వచ్చిన గెలుపు కాదు కర్ణాటకది, విజయం అంటువ్యాధి కాదు వ్యాపించడానికి. కర్ణాటక విజయం వెనుక ఎంతో పరిశ్రమ ఉన్నది, పట్టుదలతో కూర్చుకున్న ఐక్యత ఉన్నది. అన్నిటికి మించి, ఎన్నికలకు కావలసిన రాజకీయ వాదనలను నిర్మించుకోగలిగిన దృష్టి కూడా ఉన్నది. తెలంగాణలో అవన్నీ ఉన్నాయా?
కర్ణాటక ఫలితాలు వచ్చిన వెంటనే, తెలంగాణ కాంగ్రెస్ నాయకులందరూ, అంటే ఒకరి కాళ్ల కింద మరొకరు గోతులు తీసుకునేవారందరూ, చేతులు కలుపుకుని, తాము కూడా కలసికట్టుగా పనిచేసి రాష్ట్రంలో విజయాన్ని సాధిస్తామని ఒక ఉమ్మడి ప్రకటన చేసి ఉండవలసింది. నాయకత్వంలో ఉన్నవారికి వ్యతిరేకంగా పనిచేయబోమని చెప్పి ఉండవలసింది. కర్ణాటకలో మాత్రం అనైక్యత లేదా అంటే, ముఖ్యమంత్రి పదవి కోసం రెండు శిబిరాలు పోటీపడుతున్నమాట నిజం. అర్హులైన ఇద్దరిలో, ఒకరిని నాయకుడిగా ఎంచుకోవడంలో సంప్రదింపుల, మధ్యవర్తిత్వ ప్రక్రియలు ప్రజాస్వామ్యంలో భాగమే. సంస్థనే పనిచేయనివ్వని రీతిలో కలహించుకోవడం మాత్రం ప్రజాస్వామ్యం కాదు.
కర్ణాటకలో కాంగ్రెస్ విజయానికి ఎందరో ఎన్నో కారణాలు చెబుతున్నారు, వేరు వేరు కోణాలనుంచి అవన్నీ కూడా నిజమే కావచ్చు. కానీ, తెలంగాణ కాంగ్రెస్ గమనించదగ్గ, నేర్చుకోదగ్గ పాఠాలు మాత్రం మూడు ఉన్నాయి. ఒకటి– ఐక్యత, రెండు– ప్రాంతీయ, స్థానికతా భావాలను అలవరచుకోవడం, మూడు– పౌర ప్రజాస్వామిక సంఘాలతో సమన్వయం చేసుకోవడం.
మొదటి అంశం తెలంగాణ కాంగ్రెస్‌కు జీవన్మరణ సమస్య. ఐక్యత సాధ్యం కాకపోతే, ఇంకేమి చేసినా ఫలితం ఉండదు. పార్టీ శ్రేణులు ఏకలక్ష్యంతో పనిచేయాలన్నా, తటస్థుల చేరికతో పార్టీ బలపడాలన్నా ఐకమత్యం ఒక ముందస్తు షరతు. ప్రస్తుతం, తెలంగాణలో బిజెపి ప్రాంగణంలోకి చేరి, అక్కడ సరైన భాగస్వామ్యం దొరకనివారికి, భారత రాష్ట్రసమితి నుంచి బయటకు వచ్చి మరో ఆశ్రయాన్ని వెదుక్కోవడానికి ప్రయత్నిస్తున్నవారికి కర్ణాటక ఫలితాలు ఎంపికను సులభం చేశాయి.
రెండో అంశం కీలకమయినది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ కన్నడిగుల ఆకాంక్షలకు, మనోభావాలకు ప్రతినిధిగా వ్యవహరించింది. బిజెపి బయటి శక్తులకు, బయటి భాషలకు, బయటి వ్యాపార ప్రయోజనాలకు సంకేతంగా కనిపించింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రసాధనలో ‘ప్రధాన’ పాత్ర పోషించింది కానీ, ఉద్యమంలో ప్రధాన పాత్రలో లేదు. తెలంగాణ వాదానికి కూడా కాంగ్రెస్ ఏమంత ప్రాధాన్యం ఇవ్వలేదు. భారత రాష్ట్రసమితి తన తెలంగాణ ప్రత్యేకతను స్వచ్ఛందంగా వదులుకున్నప్పుడు, తెలంగాణవాదులు, ఉద్యమకారులు, ఉద్యమ లక్ష్యాల సాధన విషయమై నిరాశలో ఉన్నవారు అందరూ కాంగ్రెస్ మీద ఆశ పెట్టుకుంటున్నారు. తనకు విశ్వసనీయతను, ఆమోదనీయతను కలిగించే ఒక ప్రధాన ప్రజావర్గాన్ని, సైద్ధాంతిక అంశాన్ని పట్టించుకుంటే కాంగ్రెస్‌కే లాభం. తాము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తామని రాహుల్ గాంధీ ఈ మధ్య అన్నారు. ఇప్పట్లో పునరుజ్జీవానికి ఆస్కారం లేని రాష్ట్రం విషయంలోనే ప్రాంతీయ అస్తిత్వ సమస్యను ఆయన ప్రస్తావించారు. ఆ స్ఫూర్తి తెలంగాణ కాంగ్రెస్ కూడా అలవరచుకోవాలి.
మూడోది, పౌర, ప్రజాసంఘాలతో సమన్వయం. వైఎస్ రాజశేఖరరెడ్డి విజయానికి నేపథ్యంలో అనేక ప్రజా, సామాజిక సంఘాల సమీకరణ గుర్తుకు తెచ్చుకోవాలి. దానితో పోలిక అక్కరలేదు కానీ, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో, తెలంగాణతో సహా ప్రతిచోటా పౌరసమాజంలో క్రియాశీలంగా ఉన్న సంస్థలతో, సంఘాలతో, వ్యక్తులతో సంభాషిస్తూ వెళ్లారు. కర్ణాటకలో సామాజిక వాతావరణం ఉద్రిక్తంగానూ, విషపూరితంగానూ మారుతుండడం వల్ల అక్కడి ఉదార, ప్రజాస్వామిక, ప్రగతిశీల సంస్థలు, సంఘాలు మతతత్వాన్ని ఓడించమని విస్తృతంగా ప్రచారం చేశాయి. కర్ణాటకలో ఉన్నట్టుగా తెలంగాణలో బిజెపి ప్రభుత్వం లేదు కాబట్టి, సామాజిక వాతావరణానికి సంబంధించిన ఆత్రుత, కానీ, అత్యవసర పరిస్థితి కానీ లేదు. తెలంగాణలో రాష్ట్రప్రభుత్వం పనితీరు మీద అసంతృప్తితో ఉన్న పౌరసమాజం కూడా ప్రభావశీలమైనది. అది మతతత్వాన్ని కూడా సమానంగా వ్యతిరేకిస్తుంది. ప్రజలకు సెక్యులర్ చైతన్యాన్ని అందిస్తుంది. ప్రత్యామ్నాయాన్ని అందించాలని చూసే వారు తమ దారితో కలసివచ్చే అన్ని పాయలను సమన్వయం చేసుకోవాలి.
ప్రజలలో విభజన ఆధారంగానే ముందుకు వెడదామని తెలంగాణ బిజెపి అనుకుంటే, దాని గురించి కాంగ్రెస్ కానీ, బిఆర్‌ఎస్ కానీ పట్టించుకోవలసిన అవసరమే ఉండదు. అట్లా కాక, ప్రజాసమస్యల మీద మాత్రమే పనిచేయాలని నిర్ణయించుకుంటే, ఆ పార్టీ ఒక ముఖ్యమైన పక్షంగా రంగంలో నిలబడుతుంది.
కె. శ్రీనివాస్
Updated Date - 2023-05-18T00:53:56+05:30 IST