మీకు మాత్రం ఇంత కక్కుర్తి ఎందుకు?
ABN, First Publish Date - 2023-04-13T01:53:15+05:30
పరీక్ష–2024 ప్రశ్నపత్రాల్లో కనీసం ఒకటి లీక్ అయిపోయింది. టిక్కు పెట్టుకోవలసిన ప్రశ్నలు తెలిసిపోయాయి. ‘అవినీతి ప్రతిపక్షాలన్నీ ముఠా కట్టాయి. దొంగతిండి తినకుండా అడ్డుపడుతున్నానని...
పరీక్ష–2024 ప్రశ్నపత్రాల్లో కనీసం ఒకటి లీక్ అయిపోయింది. టిక్కు పెట్టుకోవలసిన ప్రశ్నలు తెలిసిపోయాయి. ‘అవినీతి ప్రతిపక్షాలన్నీ ముఠా కట్టాయి. దొంగతిండి తినకుండా అడ్డుపడుతున్నానని వాళ్లకు నేనంటే కక్ష. సిబిఐలు ఈడీల చుట్టూ తిరిగే ఈ పార్టీలన్నీ కుటుంబ పార్టీలు. స్వార్థం తప్ప మరో పరమార్థం లేదు. ప్రజల కోసం కేంద్రం సమకూర్చిన డబ్బులన్నీ వీళ్లు మధ్యలో మింగి కుటుంబసభ్యుల ఆస్తులు పెంచుకుంటారు. నన్ను పదవి నుంచి దించాలని ఈ పరివార్ వాదులందరూ ప్రయత్నిస్తున్నారు. జైలుకు పంపాలని కూడా చూస్తున్నారు. వీళ్లకు నీతి లేదు దేశభక్తి లేదు. విదేశాల దగ్గరకు వెళ్లి మన గురించి చెడ్డగా చెబుతారు. మన వ్యవహారాల్లో జోక్యం చేసుకొమ్మని అడుక్కుంటారు. అదానీకి మేలు చేశామని, చేస్తున్నామని నన్ను అంటారు కానీ, వీళ్ల అవినీతిచిట్టాలకు అంతం లేదు..’ భారత ప్రధాని, భారతీయ జనతాపార్టీ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ నరేంద్రమోదీ స్వయంగా ఈ మాటలన్నీ మాట్లాడుతున్నారు. ఆ మధ్య మరో సందర్భంలో కూడా ఇటువంటి మాటలే మాట్లాడారు కానీ, హైదరాబాద్ పర్యటనలో మరింత స్పష్టత ధ్వనించింది. ప్రతిపక్షాలు 2024 పరీక్షలో జవాబివ్వవలసిన కంపల్సరీ ప్రశ్న ఇదే.
ప్రత్యర్థులందరి మీద అవినీతిపరులని ముద్ర వేసి, వారి మీదకు దర్యాప్తు సంస్థలను ఉసికొల్పి, కేసుల్లో బోనుల్లో జైళ్లలో ప్రవేశపెట్టి, ఆ తరువాత, చూశారా ప్రతిపక్షాలే కదా దొంగలంతా అని జనానికి ఫిర్యాదుచేయడం ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అతి పెద్ద చమత్కారం, అంతేకాదు, జాతీయ అధికారపార్టీ పన్నుతున్న అతి పెద్ద చక్రవ్యూహం. సత్యానంతర కాలమని ఇప్పుడేవో కొత్త సిద్ధాంతాలు చెప్పుకుంటున్నాము కానీ, గొర్రెపిల్లా కుక్కపిల్లా కథ ఎప్పటి నుంచో ఉన్నదే. ఒక విషయాన్ని పదే పదే వక్కాణిస్తూ ఉంటే అది సత్యమౌతుందని గోబెల్స్ కూడా అన్నాడు.
పరివారవాదమా? సంఘ పరివారవాదమా? అనేదే సమస్య. రెండో దాని కంటె మొదటిదే మేలని అనుకునేవారు తక్కువేమీ లేరు. ఒకటి ఆర్థిక అవినీతి, మరొకటి సాంఘిక నియంతృత్వం అన్నది వారి ఉద్దేశ్యం. సంఘ పరివారం సంగతి పక్కన బెడితే, బిజెపిలో మాత్రం పరివారవాదం లేదా? అన్నది కీలకమయిన ప్రశ్న. నెహ్రూ దగ్గర నుంచి ప్రస్తుతం కాంగ్రెస్‌లో ప్రధాని అభ్యర్థి కాగలిగిన రాహుల్ గాంధీ వరకు ఒక పరంపర కనిపిస్తున్న మాట నిజమే. ప్రాంతీయ పార్టీలు అవతరించిన తరువాత, జనాకర్షక రాజకీయాలు, వారసత్వ రాజకీయాలు మరింత విస్తృతం అయ్యాయి. వారసత్వం, కుటుంబ పాలన అన్న అంశాలను ప్రభుత్వాలకు, పార్టీలకు అధినాయకత్వం విషయంలోనే పరిగణించాలా? అనంతర నాయకశ్రేణిలో పరంపరాగత నాయకత్వం ఎంత అన్నది లెక్కలు తీస్తే బయటపడే సత్యం ఏమిటి? కాంగ్రెస్ పార్టీ నుంచి తన వైపుకు తరలించుకున్న జితేంద్ర ప్రసాద, జ్యోతిరాదిత్య సింధియా, కిరణ్ కుమార్ రెడ్డి, అనిల్ ఆంటోనీ, తృణమూల్ కాంగ్రెస్ నుంచి తీసుకున్న సువేందు అధికారి రాజకీయ కుటుంబాల నుంచి వచ్చినవారు కాదా? బిజెపిలోని పియూష్ గోయెల్, అనురాగ్ ఠాకూర్, నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్ రాజకీయ నేపథ్యాలు, కుటుంబ పెద్దలు ఉన్నవారు. కర్ణాటకలో యడ్యూరప్ప, తేజస్వి సూర్య, జగదీశ్ షెట్టర్ మొదలు గాలి జనార్దనరెడ్డి, శ్రీరాములు కుటుంబాల నుంచి బహుళ సంఖ్యలో రాజకీయ నేతలు ఉన్నారని జనతాదళ్ ఎస్ నాయకుడు కుమారస్వామి గౌడ బిజెపి మీద ఎదురువిమర్శ చేశారు. దేశంలో రాజకీయ నాయకత్వం అత్యల్ప సంఖ్యాకులైన సామాజిక ప్రాబల్య వర్గాల నుంచి వస్తున్నదనే కదా, ప్రాంతీయ పార్టీలు, సామాజిక న్యాయపార్టీలు వేదిక మీదకు వచ్చింది? కొందరి చేతిలో అధికారం కేంద్రీకృతం కావడాన్ని వ్యతిరేకించడం అంటే, మొత్తంగా కొన్ని సామాజిక, ఆర్థిక ప్రాబల్య వర్గాలు రాజకీయగుత్తాధికారాన్ని చెలాయించడాన్ని వ్యతిరేకించాలి. ఇప్పటికి బ్రాహ్మణ వాద పార్టీగా, బనియా పార్టీగా, గంగా పరీవాహ ప్రాంతంలో ఠాకూర్‌లు, జాట్‌ల పార్టీగా పేరు పొందిన బిజెపి పరివారవాదం గురించి మాట్లాడడాన్ని ఏమనాలి?
ప్రాంతీయ పార్టీల కారణంగా, కుటుంబ పాలన వచ్చిందనేది నిజమే కావచ్చును కానీ, అభివృద్ధి వికేంద్రీకరణ జరిగిందన్నది కూడా కాదనలేని వాస్తవం. జాతీయస్థాయిలో గుత్తాధిపత్య శక్తులను ఫెడరల్ పార్టీలు బలహీనపరిచాయి. ప్రాంతీయ, స్థానిక పార్టీలకు కూడా ‘‘అభివృద్ధి’’ నిర్ణయాధికారాలు ఎంతో కొంత రావడంతో పాటు, ఆశ్రిత పోషణ, లావాదేవీల లాభాపేక్ష వచ్చిన మాట నిజం. ఆర్థిక, అవినీతి నేరాల దర్యాప్తులను గుప్పిట్లో పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం, ప్రాంతీయ శక్తులను బెదిరించి దారిలో పెట్టుకుంటున్నది. భ్రష్ఠాచార్‌కు వ్యతిరేకంగా మోదీ చేస్తున్న పోరాటంలో పెద్ద అవినీతి వ్యతిరేక ఆదర్శాలేమీ లేవు. కేంద్ర ప్రభుత్వంలో కానీ, అనేక రాష్ట్రాలలో రాజ్యం ఏలుతున్న బిజెపి ప్రభుత్వాలు కానీ, అవినీతికి దూరంగా ఉన్నాయని ఎవరైనా నమ్మితే అది వారి అమాయకత్వమే. ప్రస్తుతమున్న రాజకీయ వ్యవస్థ నిర్మితిలోను, పనితీరులోను, అవకాశాలలోను, అవినీతి, అక్రమం అన్నవి అంతర్భాగాలు. బిజెపి అధికారంలో ఉన్న ప్రతి రాష్ట్రంలోనూ లెక్కలేనన్ని అవినీతి కుంభకోణాలున్నాయి. కానీ, కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల దృష్టి వాటి మీద పడదు. యోగీ ఆదిత్యనాథ్ తీసుకుంటాడా, మోదీ తీసుకుంటాడా అన్నవి కాదు ప్రశ్నలు. అదానీలు, అంబానీలు లాభపడుతున్నారా లేదా? సన్యాసులైనంత మాత్రాన, అవివాహితులైనంత మాత్రాన అవినీతిరహితులని చెప్పడానికి ఏముంది? ఏ కుటుంబమున్నదని మాయావతిని, జయలలితను నిందించారు. ఇప్పుడు మమతను ఆరోపిస్తున్నారు?
అవినీతి అంటే, మద్యం విక్రయదారులకు అధిక లాభం వచ్చేట్టు ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేయడం, ఉద్యోగాలకు బదులు పొలాలు స్థలాలు తీసుకోవడం వంటివి మాత్రమే కాదు, కోట్ల ఆస్తులను పదీ పరకకూ అమ్మడం, ఒకటి రెండు కంపెనీలకే లాభాలు వచ్చేట్లు విధాన వాతావరణం కల్పించడం, ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రజాధనాన్ని అక్రమార్జనపరులకు పెట్టుబడులుగా సమర్పించడం కూడా అవినీతే. నిజానికి రెండో రకానివే పెద్ద అవినీతి, ప్రజలను భారీగా నష్టపరిచే అవినీతి.
సరే, ఇవన్నీ చర్చించుకుని, ఇప్పుడు మనం ప్రాంతీయ పార్టీల అవినీతిని సమర్థించాలా? గొప్ప గొప్ప ఆదర్శాల మీద ప్రయాణించి, ఉద్యమాలను నిర్వహించి, ఇప్పుడు మూతులు బిగియగట్టి, ప్రజాధనం అనే పాడియావును పిండుకుంటుంటే, దానికి జేజేలు కొట్టాలా? సంఘపరివార వాదం నెగ్గితే, సమాజంలో అశాంతి, పరస్పర ద్వేషం, అవిద్య, అజ్ఞానం పెరుగుతాయని చెప్పి, పరివారవాదాన్ని నెత్తికెత్తుకోవాలా? కేంద్రం కక్ష కొద్దీ మిమ్ములను వెంటాడుతున్నది, నిజమే. కానీ, అందుకు అవకాశం ఇచ్చింది మీరే కదా? ప్రాజెక్టులన్నీ ఎటీఎమ్‌లు అయ్యాయని, మరేమీ దొరకనట్టు మద్యం వ్యాపారంలో మునిగిపోయారని బిజెపి విమర్శిస్తుంటే, అందులో నిజమేముందని నిలదీయగలిగిన నైతికత లోపించడం కనిపిస్తూనే ఉంది కదా? నూతన ఆర్థిక విధానాల పుణ్యమా అని, మౌలిక వసతుల ప్రాజెక్టులు, కాంట్రాక్టులు, సమీకరణ అడ్వాన్సులు, క్యాష్ బ్యాక్‌లు ప్రాంతీయ ప్రభువులకు కూడా అందుబాటులోకి వచ్చాయి. కేంద్రీకృత అవినీతి గుడ్డిలో మెల్ల. చెల్లింపులు, వాటాలు ఒక స్థాయిలో జరుగుతాయి. ఆ జేబుల్లోకి పోయేది సాధారణ ప్రజల సొమ్మే అయినా, అవినీతికి సంబంధించిన హింస జనం దాకా వెళ్లదు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. కేంద్రీకృత అవినీతిలో పంపకాలు సరిపోక, రెండోశ్రేణి మూడో శ్రేణి నాయకులకు అసంతృప్తి పెరుగుతోంది. వారిని ఉపశమింపజేయడానికి, చిన్నతరహా అవినీతి ప్రాజెక్టులను అనుమతించవలసి వస్తోంది. ఉదాహరణకు, తెలంగాణలోనే ప్రతి చిన్నా పెద్దా వాణిజ్య, వ్యాపార సంస్థ నుంచి కప్పం వసూళ్లే. ప్రతి భూవివాదం నుంచీ మధ్యవర్తిత్వ రుసుములే. ఇక స్వయంగా ప్రజాప్రతినిధులు చేసే భూరాజసూయాలు అనేకం. ఎందుకు జనం మిమ్మల్ని అభిమానించాలి? సంఘపరివార వాదం ప్రమాదం కాబట్టి, తక్కువ ప్రమాదమైన పరివారవాదాన్ని స్వీకరించాలని జనం ఎందుకు అనుకోవాలి?
ఓటర్లు, ఒక ప్రజాసముదాయంగా ఒకే రకంగా ఆలోచిస్తారో లేదో తెలియదు కానీ, కొన్ని కొన్ని సాధారణ, మౌలిక అంశాలు ప్రజాభిమతాన్ని ప్రభావితం చేస్తాయి. కళ్లు నెత్తికెక్కిన అహంకారం, వెకిలి, అసభ్య అవినీతి, విపరీతంగా డబ్బు పోగేసుకునే యావ జనం మనస్సుల్లో ముద్రవేసుకుంటాయి. ఒకే కుటుంబం అన్నీ తామై చేయడం, అన్నీ తామై అనుభవించడం కూడా జనం గమనిస్తూనే ఉంటారు. అనేక తారతమ్యాలు, వివేచనలు పనిచేస్తాయి కానీ, ఏ వ్యవహారసరళికి జనం ఎప్పుడు బుద్ధి చెబుతారో ఊహించలేము. కాబట్టి, నరేంద్రమోదీ హెచ్చరికలకు గురి అవుతున్న ప్రాంతీయ నాయకులు, ఎదురు దాడులు చేయడంతో సరిపెట్టుకోకుండా కొంత ఆత్మపరిశీలన చేసుకోవాలి. నిజంగా ఇంతగా కళ్లు మిరుమిట్లు గొలిపేంత సంపాదించుకోవడం అవసరమా? జనాభిమానాన్ని ఇంతగా సొమ్ము చేసుకోవాలా? భూమి మీద ఇంత వ్యామోహం అవసరమా? కుటుంబంతో మాత్రమే అన్నీ పంచుకోవాలా? సమాజమే కుటుంబం అని పెద్ద మాటలు చెప్పేవారు, ఆచరణలో తమ విశాల కుటుంబాన్ని ప్రదర్శించవచ్చును కదా?
చాలా మంది పెద్దలు ఎంతో డబ్బు సంపాదిస్తారు. కానీ, కీర్తి వారికి అందని ద్రాక్ష అవుతుంది. కానీ, ఉద్యమ నాయకులుగా, ప్రాంతీయ వాద ప్రతినిధులుగా ఎంతో కీర్తి సమకూర్చుకున్నవారు, ధనార్జనలో పడి, అపకీర్తిని మూటగట్టుకోవడం బాధ కలిగిస్తుంది.
కె. శ్రీనివాస్
Updated Date - 2023-04-13T01:53:15+05:30 IST