మతాతీతమే లౌకికత గమ్యం
ABN, First Publish Date - 2023-10-26T01:07:14+05:30
అధిక సంఖ్యాకుల మతోన్మాదం– జాతీయవాదం పేరిట, అల్ప సంఖ్యాకుల మతోన్మాదం– లౌకికవాదం పేరిట చెలామణి అవుతున్నాయి. సరిగా పరిశీలిస్తే ఈ రెండిటి మధ్య ఎటువంటి తేడాలేదు...
అధిక సంఖ్యాకుల మతోన్మాదం– జాతీయవాదం పేరిట, అల్ప సంఖ్యాకుల మతోన్మాదం– లౌకికవాదం పేరిట చెలామణి అవుతున్నాయి. సరిగా పరిశీలిస్తే ఈ రెండిటి మధ్య ఎటువంటి తేడాలేదు. మతోన్మాదం ఏ రూపంలో ఉన్నా అది మనిషిలోని మానవీయకోణాన్ని చంపేస్తుంది. అభౌతికమైన, అగోచరమైన దైవమనే భావంతో సాటి మనుషులను చంపడానికి కారణమయ్యే మతాలు మనిషికి అవసరమా? ఆధ్యాత్మికమైన భావోన్నతి కలిగించే మార్గంగా ఉన్నంత వరకు మతంతో పేచీ లేదు. అలా కాకుండా మనుషులను వర్గాలుగా విభజించే సామాజిక సూత్రంగా మతం మారినప్పుడు, మతం ఒక దురాచారం అనడంలో తప్పేమీ లేదు.
మన దేశంలో కాంగ్రెస్, వామపక్షాలు లౌకిక పార్టీలమంటూ అల్ప సంఖ్యాకుల మతోన్మాదాన్ని ఉపేక్షించి, లౌకికవాదాన్ని అభాసుపాలు చేశాయి. దాంతో హిందుత్వ పేట్రేగిపోయింది. మన గతమెంతో ఘనమంటూ ఈ దేశంలో తలెత్తిన అనర్థాలకు విదేశీయుల పాలనే కారణమంటూ హిందుత్వ సిద్ధాంతం ప్రజలను భ్రమింపజేస్తుంది. మతమనే మత్తుమందును జాతీయవాదం పేరుతో జనాలపై చల్లి, తమ రోజువారీ సమస్యలకు కారణాలేమిటో, కారకులెవరో తెలుసుకోలేనంతగా ప్రజలను చైతన్యవిహీనులను చేస్తున్నాయి మతాలు.
మందిరం కోసం జరిగిన మారణకాండను ఖండించే ఈ దేశ లౌకికపార్టీలు, పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధ మేఘాలకు కూడా అదే తరహా మతోన్మాదమే కారణమని గుర్తించి ఖండించవు. వందల సంవత్సరాల క్రిందటి విజయనగర విధ్వంస గాథను విని ఆవేశంతో ఊగిపోయే మన దేశభక్తులు, అదే కాలంలో పోర్చుగీసు గవర్నరైన ఆల్బకర్క్ గోవాలో ముస్లిం మహిళా శిశు వృద్ధాదులను ఊచకోత కోసినపుడు రాయలు ప్రకటించిన హర్షామోదాలను గమనించరు. పైన పేర్కొన్న రెండు అంశాలూ మన దేశపు లౌకికవాద, జాతీయవాదాల్లో ఉన్న డొల్లతనాన్ని బయటపెడుతున్నాయి.
సమాజం మొత్తానికి చెందాల్సిన ఆర్థిక వనరులను అక్రమ మార్గాల్లో తమ స్వాధీనం చేసుకుంటున్న గుత్త పెట్టుబడిదారులు, ప్రజల్లో ప్రశ్నించే తత్వాన్ని, చైతన్యాన్ని నీరుగార్చే రాజకీయ శక్తులను ఎందుకు బలపరుస్తారో విడమరచి వేరే చెప్పనక్కరలేదు. ప్రజలు చైతన్యవంతులై ప్రశ్నించడం మొదలెడితే నియంతృత్వ దోపిడీశక్తుల పునాదులు కదిలిపోతాయి.
మన దేశంలో హేతువాద ఉద్యమకారులు దేవుడిని, మతాలను తూలనాడడం పైన, జ్యోతిష్యాన్ని, వాస్తును తిట్టిపోయడం పైన మాత్రమే దృష్టి సారిస్తారు. సామ్యవాద ఉద్యమకారులు సహితం ఆర్థిక అసమానతలను కనిష్ఠ స్థాయికి తగ్గించడం పైన కన్నా లౌకికవాదం పేరిట అధిక సంఖ్యాకుల మతాన్ని విమర్శించడం పైనే దృష్టి సారించడం వల్ల హిందుత్వ బలపడింది. నిజానికి బలపడడం ఆందోళనకరమైన విషయం కానేకాదు. సమాజ సంపదను కొల్లగొడుతున్న గుత్తపెట్టుబడిదారులకు, అధికారమే పరమావధిగా బతికే నియంతలకు హిందుత్వ పనిముట్టుగా మారడమే ఆందోళనకరం.
సామాజికంగా ప్రజలను, తద్వారా రాజ్యాన్ని మతానికి అతీతం చేయడమే లౌకికత గమ్యం. ప్రజలలో హేతుబద్ధమైన ఆలోచనలతో కూడిన సామాజిక దృక్పథం అలవడినపుడే అది సాధ్యం. అప్పుడు దోపిడీ సమాజానికి కూడా బీటలు వారడం ఖాయం.
గౌరాబత్తిన కుమార్ బాబు
కార్యదర్శి, సర్వోదయ సమాజం
Updated Date - 2023-10-26T01:07:14+05:30 IST