ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సాహిత్యాకాశంలోనూ ఆమె సగం!

ABN, First Publish Date - 2023-09-14T01:22:26+05:30

వర్జీనియా వుల్ఫ్ తన ‘ఏ రూమ్ ఆఫ్ ఒన్స్ ఓన్’ వ్యాసంలో ‘మీ గ్రంథాలయాలకు తాళం వేసుకోవాలంటే వేసుకోండి. కానీ మా ఊహా స్వేచ్ఛని అడ్డుకోగల గేట్లు కానీ, తాళాలు కానీ మీ వద్ద లేవు’ అంటుంది...

వర్జీనియా వుల్ఫ్ తన ‘ఏ రూమ్ ఆఫ్ ఒన్స్ ఓన్’ వ్యాసంలో ‘మీ గ్రంథాలయాలకు తాళం వేసుకోవాలంటే వేసుకోండి. కానీ మా ఊహా స్వేచ్ఛని అడ్డుకోగల గేట్లు కానీ, తాళాలు కానీ మీ వద్ద లేవు’ అంటుంది. మన దేశంలో కూడా స్త్రీల ఆలోచనలకు, ఊహలకు అడ్డుపడలేని జెండర్ భేదం, 19వ శతాబ్దం తొలినాళ్ళవరకు అక్షరం దిద్దటానికి అడ్డుపడింది. అనేక పోరాటాల అనంతరం తమ మనసులోని మాటను, తమ ఊహలోని విషయాన్ని, తమ స్వీయ కథను, తమ జాతి చరిత్రను అక్షరబద్ధం చేయటానికి స్త్రీలు సాగించిన ప్రయాణం అంత సాధారణంగా ఏమీ సాగలేదు. స్త్రీని కేవలం ఆస్తిగా, వస్తువుగా మాత్రమే చూసింది పురుష సమాజం. అక్షరాలు దిద్దితే స్త్రీలు పురుషులకు లేఖలు రాస్తారని, ఆలంకారిక జ్ఞానం అధికంగా ఉన్న స్త్రీలు తమను మించిన సృజనశీలురవుతారని అనుమానించింది, ఆక్షేపించింది. క్రమంగా స్త్రీలు తమ అస్తిత్వానికి తామే బాధ్యులమని గుర్తించి, విద్య మాత్రమే వికాసానికి దోహదం చేస్తుందని తెలుసుకున్నారు. నూట పాతిక సంవత్సరాల ప్రస్థానంలో కథ, కవిత్వం, నవల, వ్యాసం, విమర్శ, అనువాదం, పరిశోధన, ఆత్మకథ, జీవితచరిత్ర ఇలా అన్ని ప్రక్రియలలో బహుళ అస్తిత్వాలను పొరలుపొరలుగా ఆవిష్కరించారు. సమకాలీన సామాజిక చలనాన్ని ప్రతిఫలిస్తూ, తమపై సాగుతున్న అణచివేతను ప్రశ్నించినందుకు మరింత అణచివేతకు గురైనా వెరవకుండా మరిన్ని ప్రశ్నలను లేవనెత్తుతూ, లోతైన చర్చలకు ఆస్కారమిస్తూ రచనా ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు.

తెలుగు కథకు తొలి వెలుగులు అందించి, జాతీయోద్యమ భావాల స్ఫూర్తిని తమ కథల ద్వారా అందించిన తొలితరం స్త్రీ రచయితలు ముందు తరాలవారికి ఒక దార్శనిక దృక్పథాన్ని అందించారు. ఏదైనా విషయంలో స్త్రీలు ముందడుగు వేసినా, ప్రశ్నించినా సమాజం లైంగిక దాడి చేయడం ద్వారా వారిని అదుపులో పెట్టాలని చూస్తుందని ముప్పయ్యవ దశకంలోని కథల్లోనే రచయిత్రులు ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా ఆయా సందర్భాలలో స్త్రీలు ప్రశ్నలు లేవనెత్తిన ప్రతిసారీ వారిని సరైన సమాధానాలతో, వాదనలతో ఎదుర్కోవటం చేతకాని సమాజాలు ఎంచుకునే ఏకైక మార్గం లైంగిక దాడి. ఈ విషయాన్ని కథావస్తువుగా ఆనాటి రచయిత్రులు చర్చకు పెట్టడం, భవిష్యత్తులో స్త్రీ సమాజం ఎదుర్కోబోయే అమానవీయ దుష్పరిణామాలకు హెచ్చరిక.

స్వాతంత్ర్యానంతర దశకాల్లో రచయిత్రులు కుటుంబ సంబంధాలను, మానవ సంబంధాలను, వాటిలోని ఘర్షణను తమ రచనలకు ప్రధాన వస్తువుగా ఎంచుకుని రాశారు. ఈ సాహిత్యం మహిళా పాఠకుల సంఖ్యను కూడా విశేషంగా పెంచటమే కాక 60, 70 దశకాలలో రచయిత్రుల ఆధిపత్యం మొదలైంది. ఒకవైపు సామాజిక, ఆర్థిక, రాజకీయ చైతన్యంతో, మరోవైపు కుటుంబ సంబంధాల్లోని ఆధిపత్య భావజాలాన్ని చర్చకు పెడుతూ, ఇంకొకవైపు మధ్యతరగతి సామాజిక జీవనచిత్రణకు, ప్రాంతీయ స్పృహ, తెలంగాణ భాష సాంస్కృతిక అస్తిత్వాలకు భూమికను ఏర్పరిచారు. 1975 సంవత్సరం అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా ప్రకటించబడిన సందర్భంగా దాని చారిత్రక ప్రాధాన్యత గురించి, ప్రపంచవ్యాప్తంగా స్త్రీలు ఎదుర్కొంటున్న వివక్ష, హింస, స్త్రీల హక్కులు మానవహక్కులనే విషయాలు విస్తృతంగా చర్చకు వచ్చాయి.


తెలుగు సాహిత్యంలో 80, 90 దశకాలు ఒక ఉద్వేగపూరితమైన వాతావరణాన్ని సృష్టించాయి. స్త్రీ వాదం వైయక్తిక అనుభూతులకు, అనుభవాల ప్రకటనకు ప్రాధాన్యతనిస్తూనే పితృస్వామ్య భావజాలంపై, జెండర్ స్టీరియోటైపింగ్‌పై తీవ్రంగా స్పందించాయి. ఈ స్పందనకు అనువైన ప్రక్రియగా కవిత్వాన్ని వాహికగా చేసుకుని స్త్రీవాదులు వచ్చారు. ఈ కవిత్వంపై అనేక వివాదాలు చెలరేగి కవయిత్రులపై తోటి కవులు నిందలు, నిష్టూరాలు, అపవాదులతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో స్త్రీలలోని అన్ని వర్గాలు సమానం కాదని, దళిత స్త్రీలు కుల, లింగ, వర్గపరమైన అణచివేతకు గురవుతారని, బహుముఖ ఆధిపత్యంపై వారు చేస్తున్న పోరాటాన్ని దళిత స్త్రీల వాస్తవ స్థితిని రచయిత్రులు కథలుగా, నవలలుగా వెలువరించారు. అదే క్రమంలో మైనారిటీ స్త్రీవాదం, బహుజన స్త్రీవాదం, గిరిజన అస్తిత్వం, ఆదివాసీ జీవితం పొరలు పొరలుగా బహుళ అస్తిత్వాలుగా తెలుగు సాహిత్యంలో ఆవిష్కృతమయ్యాయి.

ఆధునిక తరం కవయిత్రులు, రచయిత్రులు కొత్త భావచిత్రాలతో, భిన్న ప్రతీకలతో, వ్యక్తీకరణ వైవిధ్యంతో జెండర్ అస్తిత్వానికి కూడా ప్రాధాన్యతను కల్పిస్తూ సమకాలీన వస్తువును ఎంచుకుని తమదైన డిక్షన్‍లో రచనలు చేస్తున్నారు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం, స్వానుభవాలను తమ రచనల ద్వారా పాఠకుల ముందుంచి, పాఠకులు తమని తాము ఐడెంటిఫై చేసుకునేలా రాయటం ఈ కొత్త స్వరాల సృజనాత్మక ఎజెండా. గత శతాబ్దకాలంగా స్త్రీలు కేవలం సృజన సాహిత్యానికే పరిమితం కాక పరిశోధన, విమర్శ రంగాలలో కూడా విశేషమైన కృషి చేస్తున్నారు. తెలుగు సాహితీ సింగిడిలో మరో వర్ణమైన అనువాద విభాగంలో కూడా రచయిత్రులు చేస్తున్న ప్రయత్నం వలన ఎన్నో ఇతర భాషల రచనలు తెలుగులోకి, తెలుగు భాష నుండి ఇతర ప్రాపంచిక భాషలలోకి అనువాదమవుతున్నాయి. కొత్తగా భాషలను నేర్చుకుంటూ, ఆయా రచనలలోని భౌగోళిక, భాషా, సాంస్కృతిక వైవిధ్యాన్ని అనువాదాల ద్వారా దేశి పాఠకులకు అందిస్తున్న రచయిత్రులు బహుధా ప్రశంసనీయులు.

‘ఆకాశంలో సగమ’నే అరిగిపోయినమాటను పట్టుకుని ఇంకా ఎన్నాళ్లు వేళ్ళాడుతాం. సాహిత్యాకాశమంతా ఆవరించిన రచయిత్రుల భావావరణ ప్రభావాన్ని సమగ్రంగా విశ్లేషించుకోవలసిన అనివార్య సందర్భమిది. స్త్రీల రచనలపై సమగ్రమైన విమర్శ విస్మరణకు గురవుతున్న స్థితిని కూడా ఎదుర్కోవలసిన అవసరం ఉంది. సాహిత్యంలో ఏర్పడిన ఈ ఖాళీలను పూరించుకోవలసిన బాధ్యత, మనల్ని మనం నిష్పక్షపాతంగా మూల్యాంకనం చేసుకోవలసిన అవసరం మన మీదే ఉంది.

జె. నీరజ

(నేడు, రేపు హైదరాబాద్‌ సిటీ కళాశాలలో

‘స్త్రీల రచనలు – విభిన్న దృక్పథాలు: సమాలోచన’ జాతీయ సదస్సు)

Updated Date - 2023-09-14T01:22:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising