ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘రామప్పకు’ సింగరేణి భయాన్ని తొలగించాలి

ABN, First Publish Date - 2023-01-04T03:11:42+05:30

ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందక ముందు, తర్వాత ‘రామప్ప’ను ఏదో ఒక ముప్పు వెంటాడుతూనే ఉన్నది. ఆ ముప్పుల గురించి ప్రసారమాధ్యమాలు ముందస్తుగా హెచ్చరించినా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందక ముందు, తర్వాత ‘రామప్ప’ను ఏదో ఒక ముప్పు వెంటాడుతూనే ఉన్నది. ఆ ముప్పుల గురించి ప్రసారమాధ్యమాలు ముందస్తుగా హెచ్చరించినా ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ఉలుకూ పలుకూ లేకుండా ఉన్నారు. దీనికి కారణం ముప్పు తలపెట్టే విధ్వంసకర సంస్థలిచ్చే ముడుపులకు ఆశపడే అధికారులు, నాయకులు ఉండటం. 2010 సంవత్సరంలో కోస్టల్ కంపెనీ దేవాదుల సొరంగం తవ్వకాలు చేపట్టినప్పుడు అది పేల్చిన బాంబుల కారణంగా రామప్ప గుడి గోడలు బీటలు వారిన విషయం విశదమే. ఈ విధ్వంసాన్ని పలు పత్రికలు ప్రపంచానికి తేటతెల్లం చేసినా, రాష్ట్ర పురావస్తుశాఖ ‘మన్ను దిన్న మంజెర గున్నలాగ’ పడి ఉన్నది. ఇదే విషయంపై తల్లడిల్లిన కవులు, కళాకారులు, రచయితలు, ప్రజాసంఘాలు, సామాజిక ఉద్యమకారులు ‘రామప్ప పరిరక్షణ కమిటీ’గా ఏర్పడి చేపట్టిన ఉద్యమాల ఫలితమే కోస్టల్ కోరల్లో నుంచి రామప్ప గుడి బయటపడింది. ఆ తర్వాత మళ్ళీ రామప్ప గుడి పరిసర గ్రామాలైన వెంకటాపురం, నల్లగుంట, పెద్దాపురం తదితర పది ఇరవై కిలోమీటర్ల దూరంలో ఓపెన్ కాస్టు తవ్వకాలు జరపడానికి సంవత్సరానికి మూడు పంటలు పండే పంట పొలాలు సర్వే చేశారు. వాటిని స్వాధీనం చేసుకునే దశలో ఉండగా, ఆందోళన చెందిన కమిటీ మేల్కొని స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చింది. వారు సింగరేణి అధికారులతో మాట్లాడి అప్పటికప్పుడు సద్దుమణగ చేశారు. ఆ తర్వాత వరంగల్‌కు చెందిన ప్రముఖ పర్యాటకప్రియుల ఎనలేని కృషి మేరకు యునెస్కో స్పందించి రామప్పకు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు ఇవ్వడంతో యావత్ తెలంగాణ ప్రజానీకం హర్షించింది.

ఇదే క్రమంలో రామప్పకు కావలసిన వసతుల రూపకల్పన, తదితర పనుల్లో జిల్లా యంత్రాంగం నిమగ్నమై ఉండగా సంవత్సరం క్రితం ‘మళ్ళీ ఓపెన్ కాస్టు తవ్వకాలు ప్రారంభం’ అనే వార్తలు చూసి స్పందించిన రామప్ప పరిరక్షణ కమిటీ ‘ముంచుకు వచ్చే సింగరేణి ముప్పునాపండి’ అని గొంతెత్తి నినదించగా, రామప్ప గుడి పరిసరాల్లో ఓపెన్ కాస్టులు తవ్వబోమని సింగరేణి కంపెనీ యాజమాన్యం పత్రికల ద్వారా హామీ ఇచ్చింది. సింగరేణి గనుక పట్టుబట్టి ఓపెన్ కాస్టు గనుల తవ్వకం చేపడితే సుమారు వేయి సంవత్సరాల అద్భుతమైన శిల్పకళాఖండం నేలకూలి కాలగర్భంలో కలిసిపోతుంది.

వాస్తవంగా ప్రపంచ వారసత్వ సంపదలుగా గుర్తించిన కట్టడాలకు యాభై కిలోమీటర్ల పరిధిలో ఎటువంటి బ్లాస్టింగులు, కట్టడాలు జరపరాదని యునెస్కో నిబంధనావళి తెలియజేస్తున్నది. ప్రస్తుతం రామప్ప గుడి, పరిసర ఆలయాలు, స్థలాలు, తదితరాల అభివృద్ధికి నిధులు కేటాయించబడి శంఖుస్థాపనలకు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో మళ్ళీ పరిసర గ్రామాల్లో సింగరేణి అధికారులు ఓపెన్ కాస్టుకు సంబంధించిన సర్వేలు స్థానిక సర్పంచులకే తెలియకుండా కొనసాగించడం వెలుగు చూసింది. ఏదేమైనా సింగరేణి డేగ కన్ను రామప్ప గుడిపై పడి మహా విధ్వంసానికి దారితీస్తుందేమోనన్న భయాందోళన యావత్ తెలంగాణ ప్రజల్లో ఉన్నది. ఈ భయాందోళనను తొలగించవలసిన బాధ్యత స్థానిక పార్లమెంట్, శాసనసభ్యులదే. తద్వారా రామప్పకు ముప్పు తొలగి మరెన్నో శతాబ్దాల పాటు విరాజిల్లుతుందనటంలో సందేహం లేదు. ఇప్పటికైనా ములుగు జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై ‘రామప్ప గుడి’కి యాభై కిలోమీటర్ల పరిధిలో ఎటువంటి బ్లాస్టింగులు, తవ్వకాలు, నిర్మాణాలు జరపరాదని ఉత్తర్వులు జారీ చేయించాలి. భవిష్యత్తులో మరోమారు సింగరేణి ఓపెన్ కాస్టు మహా విధ్వంసానికి ఒడిగట్టకుండా పకడ్బందీ చర్యలు కొనసాగినప్పుడే తెలంగాణ ప్రజాజీవనంలో ప్రశాంతత నెలకొంటుంది. మా మహా శిల్పకళాఖండం మా ముందు సజీవంగా నిలబడి ఉన్నదనే భరోసా కలుగుతుంది.

రామప్ప పరిరక్షణ కమిటీ

(జయధీర్ తిరుమలరావు, వేదకుమార్, నల్లెల్ల రాజయ్య, గాజోజు నాగభూషణం,

సంకేపల్లి నాగేంద్ర శర్మ, పుల్లూరి సుధాకర్, పొట్లపల్లి శ్రీనివాసరావు,

ఆకిరెడ్డి రామ్మోహన్ రావు, గుండవరం వేణు, బి.రమాదేవి, బోనగిరి రాములు)

Updated Date - 2023-01-04T03:11:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising